సందేహం వద్దు! ఆమెను నీవు తప్పక గెలుచుకుంటావు!
అందమైన స్త్రీలు ఎక్కడెక్కడ దొరుకుతారు, వారికి ఎలా వలవేయాలి అనే విషయాలను నా విజ్ఞానదేవత —అసమానంగా ఉన్న చక్రాలు కలిగిన తన రథం మీద తిరుగుతూ— ఇప్పటివరకు నీకు బోధించినది.
నీవు ఎంచుకున్న స్త్రీని ఎలా ఆకట్టుకోవాలి? అమెను ఎలా పట్టి నిలుపుకోవాలి? అనే విషయాలను ఇప్పుడు నేను నీకు బోధిస్తాను.
నేను చెప్పే పాఠాలన్నింటిలోకీ ఇదే అతి ముఖ్యమైనది.
దేశదేశాల్లోని ప్రేమికులారా! నేను చెప్పబోయే విషయాలను ఆసక్తితో చెవులొగ్గి ఆలకించండి. నేను మీకిచ్చిన మాటను నెరవేర్చుకోబోతున్నాను. కనుక నా యెడల సహృదయతతో ఉండండి.
అన్నింటికన్న ముందుగా అజేయురాలైన ఆడది ఎక్కడా లేదు అని మనస్పూర్తిగా విశ్వసించు, సరైన విధానంలో ప్రయత్నిస్తే ఆమెను నీవు గెలుచుకొనితీరుతావు.
వసంతకాలంలో పక్షులు కిలకిలారావాలను మానుకుంటాయేమోగానీ,
వేసవికాలంలో కీచురాళ్ళు నిశ్శబ్దంగా ఉంటాయేమోగానీ,
వేటకుక్క కుందేలును వేటాడకుండా వదిలేస్తుందేమోగానీ,
ప్రేమకొరకు తన వెంటపడే పడుచువాణ్ణి మాత్రం స్త్రీ తిరస్కరించదు:
బహుశ నీకు లొంగిపోవడానికి ఆమె ఇష్టపడటంలేదని నీవు అనుకుంటున్నావేమో!
నీ అభిప్రాయం పొరపాటు. ఆమె ఇష్టపడుతూనే ఉంటుంది...........తన హృదయపు లోలోతుల్లో.
రహస్య ప్రేమ మగవారికెంత మధురంగా ఉంటుందో, ఆడవారికి కూడా అంతే మధురంగా ఉంటుంది.
తన అంతరంగాన్ని దాయడం మగవాడికి చేతగాదు. అయితే తన కోరికను పైకి తెలియనీయకుండా ఉంచడంలో స్త్రీకి ఎంతో నైపుణ్యం ఉంటుంది.
ముందుగా చొరవ తీసుకొని స్త్రీకి తమ ప్రేమను వెల్లడించకూడదని మగవారంతా మూకుమ్మడిగా ఒక నిర్ణయానికి వస్తే, వెనువెంటనే స్త్రీలంతా మగవారి మనసు చూరగొనడానికి బానిసలవలే వారి కాళ్ళదగ్గరకు వస్తారు.
ఆహ్లాదకరమైన పచ్చికబయళ్ళలో ఆంబోతు మీద కోరికతో ఆవు ‘అంబా’ అంటుంది:
పోతుగుఱ్ఱం సమీపిస్తుంటే పెంటిగుఱ్ఱం సంతోషంతో సకిలిస్తుంది.
మనలో మోహం కొంత నెమ్మదిగా ఉంటుంది, ఇంత తీవ్రంగా ఉండదు: పురుషవాంఛకు కొన్ని న్యాయమైన హద్దులు ఉన్నాయి.
ఇవన్నీ చెప్పాలా?!
బైబ్లిస్ తన సోదరుడిమీద ధర్మవిరుద్ధమైన వాంఛతో రగిలిపోయి, తరువాత ఉరివేసుకొని తన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకుంది?
మిర్రా తన తండ్రిని ప్రేమించింది, కానీ ఒక కూతురులా కాదు. ఇప్పుడు చెట్టులా మారిపోయి తన సిగ్గును ఆ చెట్టు బెరడు మాటున దాచుకుంది: ఆమె కార్చే కన్నీరే ఆ చెట్టు బెరడు నుండి సుగంధంగా కారుతూ ఆమె పేరుమీదనే పిలువబడుతున్నది.
ఒకనాడు దట్టమైన అరణ్యం కలిగిన ఇడా పర్వతలోయ ఛాయలలో ఒక తెల్లని ఎద్దు తిరుగాడుతున్నది, అది తన మందకే తలమానికంగా ఉంది. దాని కొమ్ముల మధ్యన చిన్నదైన నల్లని మచ్చ ఒకటి ఉన్నది: ఆ ఒక్క మచ్చ తప్ప మిగతా దాని శరీరమంతా పాలవంటి తెలుపుతో ఉంది.
ఆ ప్రాంతంలోని మంచి వయసులో ఉన్న ఆవులన్నీ దానితో సంభోగించడానికి ఉవ్విళ్ళూరుతున్నాయి.
ఆ దేశపు (క్రీట్ దేశం) రాణి అయిన పసిఫె ఆ ఎద్దును మోహించింది.: అక్కడ ఉన్న అందమైన ఆవులనన్నింటినీ ఆమె ఈర్ష్యతో ద్వేషించింది.
అందరికీ బాగా తెలిసినవిషయమే నేనూ చెబుతున్నాను.: వందనగరాలు ఉన్న క్రీట్ దేశం —అది ఎంతగా అబద్దాలు చెప్పేదైనా కూడా— ఈ విషయాన్ని కాదనలేదు.
అటువంటి పనులు చేయడం అలవాటులేని తన చేతులతో పసిఫె స్వయంగా చెట్ల యొక్క లేలేత కొమ్మలను తుంచి, పచ్చికబయళ్ళలోని తీయని, మృదువైన గడ్డిని కోసి తన ప్రియమైన ఆ ఎద్దుకు పెట్టేదని చెబుతారు.
ఆ ఎద్దు ఎక్కడికి వెళ్ళినా ఆమె దానినే అనుసరించేది, తన భర్తను గురించిన ఏ ఆలోచన కూడా ఆమెను ఆపగలిగేదికాదు:
మైనస్ (ఆమె భర్త) ఒక ఎద్దు చేతిలో ఓడిపోయాడు.
నీవు ఖరీదైన వస్త్రాలను ధరించినా ఏమి ఉపయోగం పసిఫె? నీ ప్రియునికి నీ సంపద గురించి ఏమీ అర్థంకాదు.
పర్వతప్రాంతంలో సంచరించే పశువుల మంద వెంట తిరిగేటపుడు ఇక నీ చేతిలో అద్దమెందుకు?
మూర్ఖురాలా! ఎందుకు తరచూ నీ జుత్తును సరిచేసుకుంటూ ఉంటావు?
నీ అద్దంలోకి ఓ సారి చూడు! నీవు ఒక ఎద్దుకు ప్రియురాలుగా ఉండదగినదానవు (ఆవువు) కాదన్న సంగతిని అది నీకు చెబుతుంది.
నీ నుదిటిమీద కొమ్ములు మొలవాలని నీవెలా కోరుకుంటావు!
మైనస్‌కు నీ హృదయంలో ఇంకా ఏ మాత్రం చోటున్నా కూడా ఇలా వివాహేతర ప్రణయాన్ని మానుకో: ఒకవేళ నీవు నీ భర్తను మోసం చేయదలచుకుంటే కనీసం ఒక మనిషిని ప్రేమించన్నా మోసం చేయి!
ఈ మాటలేవీ అమె వినిపించుకోకుండా తన రాణివాసపు పానుపును వీడి, కామాగ్నితో దహించుకుపోతూ, పిచ్చెక్కినదానివలే అడవులవెంట తిరుగుతున్నది.
అందమైన ఆవును చూసిన ప్రతిసారీ అసూయ నిండిన కోపంతో ఆమె ఇలా అన్నది:
“ఇది ఇప్పుడు ఏవిధంగా నా ప్రియుడి మనసు చూరగొనగలుగుతున్నది? చూడు! ఆ పచ్చికలో అతని ముందు అది ఎలా గంతులిడుతున్నదో!: అలా చేస్తూ, అతడి మనసును తాను ఆకట్టుకుంటున్నానని భావిస్తున్న అది నిస్సందేహంగా మూర్ఖురాలే”.
ఆ విధంగా పలికిన పసిఫె ఆ ఆవును వెనువెంటనే మందనుండి వేరుచేయించి దానికి కాడిని మోసే పనిని అప్పగించమని ఆజ్ఞాపిస్తుంది, లేదంటే దేవతలకు బలిని సమర్పించే నెపంతో దానిని వధ్యశిలమీద వధింపచేస్తుంది. తరువాత విజయానందంతో దాని పేగులను తన చేతుల్లోకి తీసుకుంటుంది.
ఆమె తన ప్రత్యర్థిని ఈ విధంగా దేవతలకు బలి ఇచ్చిన ప్రతిసారీ దాని పేగులను పట్టుకొని "ఇప్పుడు వెళ్ళి నా ప్రియుడిని ఆకట్టుకోవే!" అని వికటంగా అంటుంది.
ఇప్పుడామె తనను ఒకోసారి (29)అయోగా, ఒక్కోసారి (30)యూరోపాగా చెప్పుకుంటున్నది. ఎందుకంటే అయో ఒక ఆవు; యూరోపా ఎద్దును తన వాహనంగా చేసుకున్నది.
ఏమైతేనేమి, ఆ మందకు ఏలికగా ఉన్న ఆ ఎద్దు (31) చెక్కతో చేయబడిన ఆవును చూచి భ్రమించి, పసిఫెతో సంభోగం నెరపింది. ఆమెకు పుట్టిన బిడ్డను చూడగానే ఆ బిడ్డకు తండ్రెవరో లోకానికి తెలిసిపోయింది.
క్రీటన్ యువతి అయిన (32)ఏరోప్ గనుక థైస్టెస్ ప్రేమను నిరాకరించినట్లైతే (అయ్యో! ఒక్క పురుషుడికి మాత్రమే పరిమితమవటం ఒక స్త్రీకి ఎంత కష్టమో కదా!) సూర్యుడు తన గుఱ్ఱాలను మార్గమధ్యంలోనే ఆపి, తన రథాన్ని వెనుకకు మళ్ళించి, తిరిగి ఉషోదయం వైపు వెళ్ళవలసిన అవసరం ఉండేదికాదు.
స్కిల్లా (33) తన తండ్రి అయిన నిసస్ తలనుండి శిరోజాలను దొంగిలించినందుకు అమె అప్పటినుండి ఆకలిగొన్న కుక్కల దాడికి గురవుతూనే ఉంది.
అగమెమ్నాన్ (34) యుద్ధక్షేత్రంలోని ప్రమాదాలను, సముద్రయానంలోని కష్టనష్టాలను తప్పింఛుకున్నప్పటికీ క్రూరురాలైన తన భార్య చేతిలో మరణించాడు.
క్రూసాను (35) దహించిన మంటలను చూచి, తన బిడ్డలనే హత్యచేసి రక్తసిక్తమైన ఆ తల్లిని చూచి ఎవరు మాత్రం విలపించరు?
అమింటర్ (36) కొడుకైన ఫినిక్స్ తన చూపులేని కళ్ళతో ఏడ్చాడు:
భయంతో విభ్రాంతి చెందిన గుఱ్ఱాలు (37) హిప్పోలైటస్‌ను తునాతునకలు చేశాయి.
ఓ ఫినియస్! (38) ఏ పాపం ఎరుగని నీ కొడుకుల కళ్ళెందుకు పీకించావు? ఆ శిక్ష తిరిగి నీ తల మీదకే వచ్చింది కదా!
ఈ విషయాలన్నింటికీ కూడా స్త్రీ యొక్క కళ్ళాలొదిలిన కామవాంఛే కారణం: అది మన వాంఛ కన్నా కూడా చాలా తీవ్రతరంగా ఉండి, అమితమైన ఉద్రేకంతో కూడుకొని ఉంటుంది.
కనుక ఉల్లాసంగా ఉండు! నీవు గెలుపొందే విషయంలో ఎన్నడూ సందేహించకు: వేయి మందిలో ఒక్క స్త్రీ కూడా నిన్ను నిజంగా తిరస్కరించదు.
ఒక సుందరాంగి తన ప్రేమను నీకు ఇచ్చినా ఇవ్వకపోయినా, నీవు దానికొరకు తన వెంట పడాలని ఆమె కోరుకుంటూనే ఉంటుంది:
ఒకవేళ నీవు తిరస్కారం పొందినా కూడా నీకెటువంటి ప్రమాదమూ జరగదు.
అయితే ఒక స్త్రీ ఎందుకు తిరస్కరిస్తుంది?,
కొత్త కొత్త ఆనందాలను అందుకోవాలనే ఆరాటాన్ని ఎవరూ అణచుకోరు.
తనదైనదాని కన్నా తనదికాని కొత్తది హృదయాన్ని ఎక్కువ ఆకట్టుకుంటుంది?
ఎవరికైనా ఎప్పుడూ ఇతరుల పొలంలోని పంటే బాగా పండినట్టు కనిపిస్తుంది, పొరుగువారి దొడ్లోని ఆవుల పొదుగులే పెద్దగా అనిపిస్తాయి.
Footnote:
(29) అయొ దేవతల రాజైన జియస్ ప్రియురాలు. ఆమెను ఈర్ష్యాళువైన తన భార్య హెరా నుండి రక్షించడానికి జియస్ ఆమెను ఒక అందమైన తెల్లని ఆవుగా మార్చాడు.
(30) యూరోపా ఫినీషియా రాకుమారి. ఆమెను దేవతలకు రాజైన జియస్ చూచి మోహించాడు. అతడు ఒక అందమైన తెల్లని ఎద్దుగా మారి ఆమెను తనపై ఎక్కించుకొని క్రీట్ దేశానికి తీసుకెళ్ళి వివాహం చేసుకున్నాడు.
(31) పసిఫె చెక్కతో ఒక ఆవుబొమ్మను చేయించి, దానిని మందలో చేర్చి, ఆ ఆవుబొమ్మ లోపల ఏర్పాటుచేసిన ఖాళీ భాగంలో దూరి, ఎద్దుతో సంభోగానికి అనువుగా ఒదిగి కూర్చుంది.
(32) ఏరోప్ అట్రియస్ భార్య. అతని తమ్ముడు థైస్టెస్. రాజ్యం కోసం థైస్టెస్ అన్న భార్య అయిన ఏరోప్‌ను లోబరుచుకుని ఆమె సహాయంతో సింహాసనాన్ని అధిష్టిస్తాడు. దేవతల రాజైన జియస్ అతడిని పదవీచ్యుతుడిని చేయడం కోసం సూర్యుడి గమనమార్గాన్ని వెనుకకు మళ్ళించి, తూర్పున అస్తమించేటట్లు చేశాడు.
(33) నిసస్ రాజ్యం మీదకు మైనస్ దండెత్తినపుడు మైనస్ ప్రేమలో పడిన నిసస్ కూతురు స్కిల్లా తమ రాజ్యాన్ని కాపాడుతున్న తన తండ్రి తలవెంట్రుకలను దొంగిలించి మైనస్‌కు అప్పగించి ద్రోహం తలపెడుతుంది. అందుకుగానూ ఆమె శాపానికి గురియై ఒక సముద్రపు ఒడ్డున శిలగా మారి సముద్రపు అలల తాకిడికి గురవుతూ ఉంది. ఘోషించే ఆ సముద్రపు అలలు ఆకలిగొన్న కుక్కల మాదిరిగా ఉన్నాయి.
(34) అగమెమ్నాన్ ట్రోజన్ యుద్ధంలో గ్రీకు సేనానాయకుడు. అతడు ఆ యుద్ధం కొరకు సముద్రయానం చేసి ట్రాయ్ వెళ్ళాడు. అతడి భార్య క్లైటెమ్నెస్ట్రా అతడు ఇంటలేని ఆ సమయంలో ఏగిస్తస్ అనే పురుషుడితో ప్రేమవ్యవహారం నడుపుతుంది. ఆయుద్ధంలో గెలుపొంది అగమెమ్నాన్ తిరిగి ఇల్లుచేరగానే క్లైటెమ్నెస్ట్రా తన ప్రియుడితో కలసి అతడిని హత్య చేస్తుంది.
(35) జాసన్ భార్య మెడియాకు మంత్రశక్తులున్నాయి. వారికి ఇద్దరు పిల్లలు. కొంత కాలం తరువాత జాసన్ కోరింత్ రాజు కూతురైన క్రూసాతో ప్రేమలోపడి, మెడియాను వదిలేసి ఆమెను వివాహం చేసుకోవాలనుకుంటాడు. దీనికి కోపించిన మెడియ క్రూసాకు మాయా వస్త్రాలను పంపుతుంది. వాటిని ధరించిన వెంటనే క్రూసా మంటలంటుకుని కాలిపోతుంది. తరువాత మెడియా జాసన్ మీద కోపంతో అతడి వలన తనకు కలిగిన తన ఇద్దరు పిల్లలను ముక్కలుముక్కలు చేసి ఏథెన్స్‌కు పారిపోతుంది.
(36) అమింటర్ కొడుకైన ఫినిక్స్ తన తండ్రి ప్రియురాలితో రమించాడు. ఆసంగతి తెలిసిన అమింటర్ కోపావేశంతో అతడిని శపించాడు. తరువాత ఫినిక్స్ గుడ్డివాడయ్యాడు.
(37) హిప్పొలైటస్ థెసియస్ కొడుకు. అతడి సవతి తల్లి ఫేడ్రా అతడిని మోహించగా, అందుకు అతడు తిరస్కరిస్తాడు. దానితో కుపితురాలైన ఫేడ్రా తనను హిప్పోలైటస్ బలత్కరించబోయాడని లేఖరాసి ఆత్మహత్యకు పాల్పడుతుంది. ఆ లేఖ నిజమని నమ్మిన థెసియస్ హిప్పోలైటస్‌ను వధించడానికి సముద్రదేవుడైన తన తండ్రి పొసీడాన్‌ను పురికొల్పగా, హిప్పోలైటస్ రథమెక్కి పారిపోతాడు. అలా పారిపోతుండగా రథానికి పూన్చిన గుఱ్ఱాలు సముద్రపు ఒడ్డు వెంట ఒక సముద్రభూతాన్ని చూచి భీతి చెంది, ఆ రథాన్ని మిక్కిలివేగంతో ఈడ్చివేస్తాయి. దానితో ఆ రథం తల్లక్రిందులైపోయి రథంతోపాటు హిప్పోలైటస్ కూడా తునాతునకలైపోతారు
(38) ఫినియస్ అర్కాడియా రాజు. అతడు తన మొదటి భార్య అయిన క్లియోపాత్రను వదిలివేసి హర్పలైస్‌ను వివాహం చేసుకుంటాడు. హర్పలైస్ ఆదేశం మేరకు ఫినియస్ తనకు క్లియోపాత్రా వలన కలిగిన కొడుకుల కళ్ళు పీకిస్తాడు. తరువాత ఆ తప్పు మూలంగా అతడు దైవాగ్రహానికి గురియై తన కళ్ళను కూడా పోగొట్టుకుంటాడు.
No comments:
Post a Comment