డైనింగ్ టేబుల్ ఉండనే ఉంది
విందులు వినోదాలు స్త్రీ మనసు చూరగొనడానికి
సులువైన దారి చూపిస్తాయి:
అక్కడ మధువు మాత్రమే కాదు, అంతకుమించినదే దొరుకుతుంది.
గులాబిరంగు చెక్కిళ్ళు కలిగిన కామదేవుడు అక్కడ
ఉండే బాకస్ యొక్క మధువు నిండిన కొమ్ము పాత్రలను తరచుగా తన సుతిమెత్తని చేతులతో నొక్కుతాడు. (25)
ఒలికిన మధువుతో కామదేవుడి రెక్కలు తడిచిపోగానే అతడు మత్తులోపడి
అక్కడనుండి కదల్లేకుండా ఉంటాడు. కానీ వెంటనే లేచి అతడు తన రెక్కల తడిని విదుల్చుకుంటాడు:
అయితే, కాముడి ఱెక్కలు విదిల్చిన
ఆ తుంపరలు తాకిన హృదయానికి మాత్రం ప్రేమగాయమౌతుంది.
మధువు హృదయాన్ని ప్రేమభరితమైన ఆలోచనలతో నింపి, ప్రేమాగ్ని రగులుకొనే విధంగా దానిని సిద్ధంచేస్తుంది:
తనివి తీరా తాగిన మధువులో కరిగిపోయి చింతలన్నీ
మాయమైపోతాయి
అది హాయిగా నవ్వే సమయం.
పేదవాడు ధైర్యం తెచ్చుకొని తనను తాను ఒక లక్షాధికారిగా
ఊహించుకుంటాడు
బాధలు, చింతలు అన్నీ దూరమైపోతాయి నుదుటిమీది ముడతలు పోతాయి, హృదయం విశాలమౌతుంది కపటం పోతుంది, అందరూ ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారు.
అటువంటి సందర్భంలో మనం తరచుగా ఒక అందమైన యువతిని
చూసి మనసు పారవేసుకుంటాం.
ప్రేమను, మధువును ఒకేచోటకు చేర్చడమంటే
అది నిజానికి అగ్నికి ఆజ్యం పోసినట్లే.
కొవ్వొత్తి వెలుతురులో ఒక స్త్రీ అందాన్ని
అంచనా వేయకు, అది నిన్ను తప్పుదారి పట్టిస్తుంది.
నీవు నిజంగా ఆమె ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటే
ఆమెను పగటి వెలుతురులో చూడు,
అది కూడా నీవు తాగకుండా ఉన్నప్పుడు చూడు.
పట్టపగటి వెలుతురులోనే, నిర్మలాకాశం క్రిందనే పారిస్ ఆ ముగ్గురు దేవతలవంకా చూచి వీనస్‌తో ‘నీవు నీ ఇద్దరు ప్రత్యర్థులకంటే అందంగా ఉన్నావు’ అని అన్నాడు.
రాత్రి అనేక లోపాలను, దోషాలను దాచివేస్తుంది ఆ సమయంలో ఏ స్త్రీ అయినా అందంగానే కనబడుతుంది.
నీవు రత్నాలను, రంగు బట్టలను చూడాలనుకున్నట్లైతే
వాటిని పగటి వెలుతురులోకి తీసుకెళ్ళు,
అలాగే ఒక స్త్రీ ముఖాన్ని, రూపాన్ని కూడా నీవు పగటివెలుతురులోనే అంచనా
వేయాలి.
Footnote:
(25) గ్రీకు, రోమన్ పురాణాలలో కామదేవుడైన
క్యుపిడ్ రెక్కలు కలిగి, చేతిలో విల్లంబు ఉండే
ఒక చిన్న పిల్లవాడు. గులాబిరంగు చెక్కిళ్ళు, సుతి మెత్తని చేతులు అని వర్ణించింది అందుకే. మధు పాత్రలోని మధువును తాగకుండా పాత్రను
నొక్కి మధువును మీద ఒలికించుకోవడం కూడా బాలుని చేష్టే. ప్రేమికుల విందు సమయంలో ఇలా
జరుగుతుందని కవి అయిన ఒవిడ్ చమత్కారంగా వర్ణించాడు.
No comments:
Post a Comment