స్నేహితుల విషయంలో జాగ్రత్తగా ఉండు!
మంచి చుట్టూ చెడు అల్లుకుపోయి ఉందని నేను విచారంతో ఎలుగెత్తి అరవనా? లేక కేవలం నిన్ను హెచ్చరించనా?
స్నేహం, విశ్వాసపాత్రత అనేవి రెండూ డొల్ల మాటలు.
నీవు గాఢంగా ప్రేమించే స్త్రీ లోని ఆకర్షణల గురించి నీ స్నేహితుడికి చెప్పటం అంత మంచిది కాదు. నీవు ఆమె గురించి చెప్పినదంతా అతడు నిజమని నమ్మిన పక్షంలో, వెంటనే అతడు నీకు ప్రత్యర్థిగా మారిపోతాడు.
అయితే నీవిలా వాదించవచ్చు:
పాట్రోక్లస్ (56) అచెల్లిస్ పానుపునెప్పుడూ మలినం చేయలేదు.
(పాట్రోక్లస్, అచెల్లిస్‌కెప్పుడూ ద్రోహం చేయలేదు)
ఫేడ్రా, పిరిథోస్ (57) విషయంలో మాత్రం ఎటువంటి తప్పూ చేయలేదు.
పైలేడ్స్, హెర్మియోన్‌ని (58) ప్రేమించాడు, అయితే అది (59) అపోలోకు ఎథీనా మీద ఉన్న ప్రేమ లాంటిది, లేదా అది కవల సోదరులైన కాస్టర్, పొల్లక్స్‌లకు తమ తోబుట్టువైన హెలెన్ మీద ఉన్న ప్రేమ లాంటిది.
అటువంటి అద్భుతాలు జరుగుతాయని నీవు ఆశిస్తుంటే, పూపొద నుండి ఆపిల్‌పళ్ళను కోయాలనీ, నదీప్రవాహం మధ్యన తేనెను సేకరించాలని కూడా ఆశించు!
చెడు అనేది మనిషిని త్వరగా ఆకర్షిస్తుంది. అలానే, ప్రతిమనిషీ తన స్వీయసంతోషాన్నే చూసుకుంటాడు. అంతేకాక మరొకరు బాధపడటం ద్వారా పొందిన సంతోషం మరింత తీయగా ఉంటుంది.
ఆ! ఎంత దిగ్భ్రాంతికరం! ప్రేమికులు ఎక్కువగా భయపడవలసినది తమ ప్రత్యర్థుల గురించి కాదు, స్నేహితుల గురించే.
కనుక ‘నమ్మదగిన మనుషులు’ అని నీవు అనుకునే వారందరికీ దూరంగా ఉంటే, నీవు సురక్షితంగా ఉంటావు!
ఈవిధంగా చుట్టం, సోదరుడు, ప్రాణమిత్రుడు లాంటి వారందరి విషయంలో జాగ్రత్తగా ఉండు! సాధారణంగా నిన్ను ఇక్కట్లపాలు చేసే వ్యక్తులు వీరే!
Footnote:
(56) పాట్రోక్లస్, అచెల్లిస్ ఇరువురూ ప్రాణస్నేహితులు
(57) పిరిథోస్, ఫేడ్రా భర్త అయిన థెసియస్‌కు మిత్రుడు
(58) పైలేడ్స్, హెర్మియోన్ భర్త అయిన ఒరెస్టెస్‌కు మిత్రుడు
(59) అపోలోకు ఎథీనా సోదరి
No comments:
Post a Comment