Thursday, March 31, 2016

ప్రేమకళ-అతడి కర్తవ్యం





ప్రేమకళ


మొదటి భాగం




అతడి కర్తవ్యం





మీలో ఎవరికైనా ప్రేమవిషయాలలో నైపుణ్యం లేకపోతే ఈ ‘ప్రేమకళ’ చదివండి; అలా చదవడం ద్వారా ప్రేమించడం ఎలాగో తెలుసుకోండి.


తెడ్లు, తెరచాపల ద్వారా నావను నడపడానికి నైపుణ్యం కావాలి;


వేగంగా కదిలే రథాన్ని నడపడానికి నైపుణ్యం కావాలి;


అలాగే ప్రేమవ్యవహారాన్ని నడిపించడానికి కూడా నైపుణ్యం కావాలి;


ఆటోమెడాన్ నైపుణ్యం కలిగిన రథచోదకుడు; అతనికి జారిపోయే పగ్గాలను ఎలా పట్టుకోవాలో తెలుసు.


టిఫిస్ అనేక ఆటంకాల నడుమ ఆర్గో నావను నడిపాడు.


ప్రేమదేవత వీనస్ తన కుమారుడైన క్యుపిడ్‌ (కాముడు) కు శిక్షకుడిగా నన్ను నియమించింది:


ఆటోమెడాన్, టిఫిస్‌లు ఎంతటివారో ప్రేమవ్యవహారాలలో నేనూ అంతటివాణ్ణని నాకు ప్రఖ్యాతి ఉంది.


నిజానికి క్యుపిడ్ మారాం చేస్తాడు, తరచూ నా మాట వినడు: ఐతే అతను పసివయసులో ఉన్నాడు కనుక సరైన దారిలో పెట్టవచ్చు.


చిరన్ యువకుడైన అచెల్లిస్‌ను (1) సారంగిని వాయించడంలో నిపుణుడిగా మలచి, స్వాంతన కలిగించే ఆ కళద్వారా అతని దుందుడుకు స్వభావం నెమ్మదించేటట్లు చేశాడు.


భవిష్యత్తులో శత్రువులను, స్నేహితులను సైతం భయకంపితులను చేయబోయే అతడు బలహీనుడైన ఆ ముసలివాడికి భయపడేవాడు.


హెక్టార్ లాంటి మహాయోధుణ్ణి మట్టి కరిపించబోయే ఆతని చేతులు తన గురువు కొట్టే బెత్తందెబ్బలకు చాచబడేవి.


చిరన్ అచెల్లిస్‌కు గురువు, అదేవిధంగా నేను క్యుపిడ్‌కు గురువును. ఇద్దరూ దుడుకు బాలురే, ఇద్దరూ దేవతలకు పుట్టినవారే.


పొగరుబోతు ఎద్దు చివరికి కాడిని మెడకెత్తుకుంటుంది,


మచ్చికకాని గుఱ్ఱం చివరికి ముకుతాడుకు లొంగుతుంది.


అలాగే క్యుపిడ్ తన బాణంతో నా హృదయాన్ని గాయపరచినా కూడా, తన మండే కాగడాని నా ముఖం మీద ఆడించినా కూడా చివరికి నాకు లోబడతాడు.


అతడు నన్ను ఎంతగా చీల్చుతాడో, ఎంతగా కాల్చుతాడో అంతగా నేను ఆ గాయాలకు ప్రతీకారం చేయగలుగుతాను.


ఓ అపోలో! నాకు ఈ కళను నీవే అనుగ్రహించావనే అబద్దాన్ని నేను చెప్పను,


ఏ దేవలోకపు పక్షి కూడా ఈ కళను నా చెవిలో గానం చేయలేదు,


నేను ఆస్క్రా లోయలలో (2) పశువులను కాస్తున్నపుడు విజ్ఞాన దేవతలైన క్లియో గానీ ఆమె సోదరీమణులుగానీ నా కంటబడలేదు:


అనుభవమే నాకీ విద్యను నేర్పింది.


ఆరితేరిన ఈ కవి మాటలను ఆలకించండి: నేనన్నీ నిజాలే చెబుతాను:


కాముడికి తల్లివైన ఓ వీనస్! ఈ కార్యాన్ని నిర్వర్తించడంలో నాకు సహకరించు!


పాదాలవరకు దుస్తులు ధరించి, నిరాడంబరంగా, పరిశుద్ధంగా ఉండాలనుకొనేవారు (కావాలంటే) దూరంగా వెళ్ళిపొండి. నేను ప్రమాదంలేని సురక్షితమైన ప్రేమ గురించే చెబుతాను, ఆమోదయోగ్యమైన కుతంత్రాల గురించే మాట్లాడతాను, నేను చెప్పేవిషయాలలో పాపంతో, నేరంతో కూడుకున్నవేవీ ఉండవు.


ప్రేమయుద్ధంలోకి కొత్తసైనికుడిగా చేరిన నీవు మొట్టమొదట చేయవలసినపని నీవు ప్రేమించాలనుకునే స్త్రీని ఎంచుకోవటం

.
నీ తరువాత పని ఆమె కూడా నిన్ను ఇష్టపడేటట్లు చేయడం:


నీ మూడవ పని మీ ప్రేమ దీర్ఘకాలం నిలిచేటట్లుగా జాగ్రత్తపడటం.


ఇదే నా పథకం, ఇదే నా పాఠ్య ప్రణాళిక.


నా రథం పరుగులు తీసే మార్గం ఇదే:



నా రథచక్రాలు శ్రమకోర్చి చేరుకునే లక్ష్యం ఇదే.




Footnote:

(1) అచెల్లిస్ గ్రీకు యువరాజు, చిరన్ అతడి గురువు.

(2) ఆస్క్రా లోయ అనేది గ్రీసు దేశంలోని ఏథెన్స్ నగరానికి సమీపాన గల సారవంతమైన భూములున్న ఒక ప్రాంతం. తన ప్రాథమిక విద్యను రోమ్ నగరంలో అభ్యసించిన ఒవిడ్ ఉన్నత విద్యాభ్యాసం కొరకు ఏథెన్స్ నగరం వెళ్ళాడు.













No comments:

Post a Comment