Thursday, March 31, 2016

ప్రేమకళ-ముందు సేవకురాలిని మచ్చిక చేసుకో!



ముందు సేవకురాలిని మచ్చిక చేసుకో!



ఇప్పుడు నీవు మొట్టమొదట చేయవలసిన పని నీవు కోరుకునే స్త్రీ సేవకురాలిని పరిచయం చేసుకోవడం.

ఆమె నీ పనిని చాలా సులువు చేస్తుంది.

ఆ సేవకురాలు తన యజమానురాలికి బాగా నమ్మకస్తురాలేనా, ఆవిడ చాటుమాటు వ్యవహారాలన్నీ దానికి తెలుసా లేదా అన్న విషయాలన్నీ ఆరాతీయి!

ఆశ చూపో, అభ్యర్థించో ఆ సేవకురాలిని మంచి చేసుకో!

ఆమె ఒకసారి నీ పక్షాన నిలిచిందీ అంటే, ఇక మిగతా పని సులువైపోతుంది.

ఒక వైద్యురాలివలే అనుకూలమైన సమయాన్ని ఆమె గమనిస్తుంది.

ఆమె ఎప్పుడు సులభంగా దారికి రాగలదో, ఆమె ఎప్పుడు ఒక ప్రేమికుడి విన్నపాలకు అనుకూలంగా స్పందించే అవకాశం ఉందో గమనించి ఆ క్షణాన్ని ఆ సేవకురాలు ఉపయోగించుకుంటుంది.

అటువంటి సమయాలలో ఆమెకు ప్రపంచమంతా అందమైన రంగులలో కనబడుతుంది,

పంటచేలో పసిడి వర్ణపు గోధుమ కంకులు నాట్యమాడినట్లుగా ఆమె కళ్ళలో ఆనందం చిందులాడుతుంది.

ఎప్పుడు హృదయం సంతోషంగా ఉంటుందో, ఎప్పుడు విచారం దానిని కమ్మేయకుండా ఉంటుందో అప్పుడు ఆ హృదయం తెరుచుకుంటుంది, విశాలమౌతుంది.

అప్పుడే దాని లోపలి పొరలలోకి ప్రేమ నెమ్మదిగా, తెలియకుండా జొరబడుతుంది.

ట్రాయ్ నగరంలో విషాదం అలుముకుని ఉన్నంత కాలం దాని యోధులు గ్రీకులను నిలువరించారు. అది ఎప్పుడైతే సంతోషంలో మునిగితేలిందో అప్పుడు సాయుధులైన సైనికులు దాగి ఉన్న వినాశకర గుఱ్ఱం దాని కోటలోనికి ప్రవేశించింది. (39)  

నీవు కోరుకునే స్త్రీ తన ప్రియుడో, భర్తో చేసిన అవమానం వలన భాధపడుతున్న సమయంలో కూడా నీకు అవకాశం దొరుకుతుంది. తన ప్రతీకారం తీర్చుకునే సాధనంగా ఆమె నిన్ను చూడనీయి.

ఉదయంపూట తలదువ్వేటపుడు సేవకురాలు ఆమె కోపాన్ని మరింత ఎగదోస్తుంది. నీ పథకానికి తన వంతు సహాయమందించడం కొరకు ఆమె ఓ నిట్టుర్పు విడిచి ఇలా గుసగుసలాడుతుంది అమ్మగారూ! అతని మీద మీరు అతని పద్దతిలోనే ఎందుకు బదులు తీర్చుకోకూడదు?”

అలా అన్న తరువాత నీగురించి మాట్లాడుతుంది.

ఆమె చాకచక్యంగా నిన్ను ప్రశంసలలో ముంచెత్తి, పాపం ఆ వెఱ్ఱివాడు నిన్ను పిచ్చిగా ప్రేమిస్తున్నాడు అని ఒట్టేసి చెబుతుంది.

అయితే సమయాన్ని ఏమాత్రం కూడా వృధా చేయకు! ఎందుకంటే గాలి తగ్గవచ్చు, తెరచాపలు వేలాడి పోవచ్చు. కరిగిపోయే మంచులాగా ఆడదాని కోపం ఎంతో సేపు నిలవదు.

ఆ సేవకురాలి సంగతేమిటి? ముందు దానినే స్వంతం చేసుకుంటే బాగుంటుందేమో?!” అని నీవు అడగవచ్చు.

అది ప్రమాదంతో కూడుకున్న పని.

ఒకసారి సుఖం అందుకున్న తరువాత ఒకరు మరింత ఉత్సాహంగా పనిచేస్తారు, మరొకరు అందుకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తారు.

ఒకరు నిన్ను తన యజమానురాలికి బహుమతిగా అందిస్తారు, మరొకరు తన స్వంతానికి పరిమితం చేసుకుంటారు. ఎలాగైనా జరగవచ్చు!

ఒకవేళ నీకు అనుకూలంగానే జరుగుతుందని అనుకున్నాకూడా నా సలహా మాత్రం అలా చేయవద్దనే!

నిట్టనిలువు వాలు ప్రాంతాలున్న ప్రమాదకరమైన అడ్డదారులను నేనెప్పుడూ ప్రయత్నించను. నీవు నన్ను అనుసరించినట్లైతే, సరైన దారిలో ఉంటావు!

అయినాకూడా సందేశాలు చేరవేస్తున్నప్పుడు ఆ సేవకురాలి ఉత్సాహమేకాక, రూపంకూడా నిన్ను ఆకట్టుకున్నట్లైతే, ముందు ఆమె యజమానురాలిని గెలిచి, ఆ తరువాత ఆమె మీద దృష్టి పెట్టు. ప్రేమను ఎప్పుడూ సేవకురాలితో ప్రారంభించకూడదు.

నా బోధన యెడల నీకు కొంచెమైనా విశ్వాసం ఉన్నట్లైతే, సముద్రపు హోరుగాలిలో నా మాటలు చెల్లాచెదురు కానట్లైతే, ఈ ఒక్క హెచ్చరికను విను:

సేవకురాలి కోసం అసలు ప్రయత్నించకు, ఒకవేళ ప్రయత్నిస్తే, దానిని పూర్తిగా స్వంతం చేసుకునే వరకూ వదలకు!

ఇక అప్పుడు, జరిగిన తప్పులో తానూ భాగస్వామి అయిపోయింది కనుక, ఆమె నీ గురించి ఎక్కడా నోరు విప్పదు.

ఉచ్చులో చిక్కుకున్న పక్షి ఎగరలేదు, బోనులో చిక్కుకున్న ఎలుగు తప్పించుకోలేదు, కానీ గాలంనుండి తప్పించుకున్న చేప మాత్రం తనజాతివారందరినీ హెచ్చరించి, వేట మొత్తాన్నీ చెడగొడుతుంది.

కనుక నీకు నా సలహా ఏమిటంటే: ఒకసారి ప్రయత్నించిన తరువాత మధ్యలో విరమించకుండా, నీ మొత్తం శక్తిని వినియోగించి, ఆమెను పూర్తిగా స్వంతం చేసుకో.

ఆవిధంగా జరిగిన నేరంలో నీతోపాటు తన పాత్ర కూడా ఉండటం వలన ఆమె నీ రహస్యం బయటకు పొక్కనీయదు.

అంతేకాక ఆమె తన యజమానురాలు ఏమి మాట్లాడినా, ఏమి చేసినా అదంతా నీకు చెబుతుంది.

అయితే గోప్యత పాటించడం అనేది చాలా ముఖ్యమైన విషయం. నీకు, ఆ సేవకురాలికి మధ్య నడుస్తున్న ఈ తతంగమంతా నీవు గనుక చీకట్లో ఉంచగలిగితే, ఆమె యజమానురాలు ఎప్పుడూ నీ నిఘాలోనే ఉంటుంది.



Footnote:



(39) ఎన్నాళ్ళు యుద్ధం చేసినా ట్రాయ్ నగరం ఇంకా సురక్షితం గానే ఉండటం వలన గ్రీకులు ఒక పథకం రచించారు. దాని ప్రకారం వారొక పెద్ద చెక్క గుఱ్ఱాన్ని తయారు చేసి, దానిలో రహస్యంగా యూలిసెస్ లాంటి గ్రీకుయోధులు కొందరు దాగి ఉండి, ఆ గుఱ్ఱాన్ని ట్రాయ్ నగరపు గోడల వెలుపల విడిచెపెట్టి, మిగతా వారు నౌకలలో దాపులలో ఉన్న ఒక ద్వీపానికి వెళ్ళి, అక్కడ పొంచి ఉన్నారు. గ్రీకులు ఓటమిని అంగీకరించి, యుద్ధాన్ని విరమించి, నౌకలలో స్వదేశానికి వెళ్ళిపోయారని భావించిన ట్రోజన్‌లు ఆనందంతో చిందులేస్తూ, విజయోత్సవాలలో మునిగి తేలారు. కొందరు ట్రోజన్‌లు గ్రీకులు వదిలి వెళ్ళిన ఆ పెద్ద చెక్కగుఱ్ఱాన్ని నగరంలోనికి ఈడ్చుకు రాగా, దానిలో దాగి ఉన్నవారు రాత్రి సమయంలో ఆ గుఱ్ఱం నుండి వెలుపలికి వచ్చి నగర ద్వారాలు తెరిచారు. ఇంతలో ఆ సమీపద్వీపం నుండి తిరిగివచ్చి వెలుపల వేచి ఉన్న మిగతా గ్రీకులు ఆ ద్వారాల గుండా లోనికి చొచ్చుకురాగా, అందరూ కలిసి ట్రోజన్‌లను ఊచకోత కోశారు.





No comments:

Post a Comment