Thursday, March 31, 2016

ప్రేమకళ- వేయి స్వభావాలకు, వేయి పథకాలు




వేయి స్వభావాలకు వేయి పథకాలు




మన మజిలీ దగ్గర పడింది. ఈలోపు నేను మీకు మరొక విషయం చెబుతాను.


స్త్రీలనేవాళ్ళు రకరకాల మనస్తత్వాలతో ఉంటారు. వేయి మనస్తత్వాలతో నీవు వేయి పద్దతులలో వ్యవహరించాలి. 


ఒకే నేలలో అన్ని పంటలూ బాగా పండవు. ఈ నేల ద్రాక్షకు తగినది, ఆ నేల ఆలివ్‌కు, ఇదిగో ఇక్కడ గోధుమ బాగా పండుతుంది.


ఎన్ని రకాల రూపాలు, ఎన్ని రకాల ముఖాలను నీవు కలుసుకుంటావో, ఈ ప్రపంచంలో అన్ని రకాల మనస్తత్వాలు ఉన్నట్లుగా నీవు గమనిస్తావు.


తెలివైనవాడు ఈ రకరకాల మనస్తత్వాలకూ, స్వభావాలకూ తగినట్లుగా తనను తాను ఎలా మలచుకోవాలో, సందర్భానికి తగినట్లుగా తన సంభాషణ ఎలా ఉండాలో తెలుసుకొని ఉంటాడు.


ప్రొటియస్ (60) ఒకసారి ఓ అందమైన నీటి అలగా, మరొకసారి ఓ సింహంగా, మరోసారి ఓ చెట్టుగా, మరోసారి గుర్రుమనే ఓ ఎలుగుబంటిగా తనను తాను మార్చుకుంటాడు.


చేపను పట్టే విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది. కొన్నింటిని బల్లెంతో గుచ్చి పట్టుకుంటావు, కొన్నింటిని గాలం వేసి పట్టుకుంటావు, మరికొన్నింటిని వలలో బంధించి పట్టుకుంటావు.  


రకరకాల మనుషులకు, రకరకాల పద్దతులు తగిన విధంగా ఉంటాయి.


నీ ప్రియురాలి వయసును బట్టి కూడా నీవు వాటిని మార్చవలసి ఉంటుంది. (61) వయసు మీరిన దుప్పి నీ కుట్రలను దూరం నుండే గ్రహిస్తుంది.

అమాయకురాలి వద్ద మితిమీరిన తెలివితేటలను, బిడియస్తురాలి వద్ద మితిమీరిన దూకుడును ప్రదర్శిస్తే, ఆమె ఆత్మవిశ్వాసం కోల్పోయి, భయంతో నీకు దూరంగా ఉండిపోతుంది.


ఈ కారణం చేతనే ఒక సంస్కారవంతుడైన పురుషుడి కౌగిలిలోకి రావడానికి భయపడిన స్త్రీ, ఒక పనికిమాలిన వెధవ చేతులలో వాలిపోవటం అనేది ఒక్కోసారి జరుగుతుంది.


నేను చేపట్టినకార్యంలో కొంత భాగం మిగిలిపోయింది, కొంత భాగం పూర్తయింది. ఇక ఇక్కడ మన నావకు (62)లంగరు వేసి, ఒకింత విశ్రాంతి తీసుకుందాం.



Footnote:


(60) గ్రీకు పురాణాలలో ప్రొటియస్ ఒక సముద్ర దేవుడు. ఇతడు తన రూపాన్ని కావలసినట్లుగా మార్చుకోగలడు.


(61) వయసు, అనుభవం ఉన్న ప్రౌఢకాంత, తనను లోబరుచుకోవడానికి నీవు వేసే ఎత్తుగడలను, సులభంగా గ్రహిస్తుందని అర్థం.


(62) ఒక ప్రేమికుడు ప్రేమవ్యవహారంలో క్రమంగా ముందుకెళ్ళడాన్నీ, తాను ‘ప్రేమకళ’ను బోధించడాన్నీ రెంటినీ ఒవిడ్ నౌకాయానంతో పోల్చాడు. ఒక్కోసారి రథయాత్రతోకూడా పోల్చాడు.





‘ప్రేమకళ’ మొదటి భాగం సమాప్తం








No comments:

Post a Comment