Thursday, March 31, 2016

ప్రేమకళ- లేదంటే వినోదమందిరం వద్ద









లేదంటే వినోదమందిరం వద్ద



మరిముఖ్యంగా నాటక ప్రదర్శనలు జరిగే చోట్ల వారి కోసం వేటాడు, అక్కడ నీ ఆశలు నెరవేరే అవకాశాలు బాగా ఉంటాయి.

అటువంటిచోట్ల నీ అభిరుచులకు తగ్గ అతివలు దొరుకుతారు,

ఒకరితో కాసేపు పరాచికాలు ఆడవచ్చు, మరొకరితో స్పర్శాసౌఖ్యాన్ని అనుభవించవచ్చు, మరొకరిని పూర్తిగా నీ స్వంతం చేసుకోవచ్చు.

సుదీర్ఘమైన చీమలబారులు ఆహారాన్ని నోటకరచుకొని తిరిగి తమ పుట్టకు వెళుతున్నట్లుగా,

తేనెటీగలు మకరందం దొరికే ప్రదేశానికి చేరుకున్నప్పుడు అక్కడ ఉన్న మొక్కల చుట్టూ, వాటి పుష్పాల చుట్టూ ఝుమ్మంటూ మూగినట్లుగా,

అందంగా ముస్తాబైన స్త్రీలు అనేకమంది గుంపులుగుంపులుగా ఆ వినోదప్రదేశాలకు వడివడిగా వస్తారు:

అంత మందిలో ఎవరిని ఎంచుకోవాలో తెలియక నేను తరచూ తికమకపడుతుంటాను.

వారు ప్రదర్శన చూడటానికి వస్తారు,

అంతకన్నా ముఖ్యంగా తమను తాము ప్రదర్శించుకోవడానికి వస్తారు:

నిరాడంబరత, పరిశుద్ధత అక్కడ చెల్లవు.

ఓ! రాములస్! వినోదమందిరాలను, ప్రేమకలాపాలను మొట్టమొదట కలగలిపింది నీవే కదా!, ఆనాడు బలాత్కరింపబడిన సబైన్ స్త్రీలంతా తోడులేని నీ సైనికులదరికీ తోడుగా నిలిచారు.

ఆనాడు పరదాలు వ్రేలాడదీసిన చలువరాతి మందిరారాలు లేవు, ఆకట్టుకునే రంగులు వేసిన వేదికలు లేవు:

ఆరోజులలో వేదికలు చెట్లకొమ్మలతో అలంకరింపబడి అందం చందం లేకుండా ఉండేవి:

ప్రేక్షకులు పిచ్చిమొక్కలు పీకి, వాటి మీదనే కూర్చున్నారు,

మాసిన వారి తలలకు నీడనిస్తూ చెట్లఆకులతో వేసిన పందిళ్ళు మాత్రమే ఉన్నాయి.

అలా కూర్చున్న తరువాత ప్రతి రోమన్ అక్కడ ఉన్న స్త్రీలందరినీ ఒకసారి పరికించి వారిలో తనకు బాగానచ్చిన మగువను ఎంచుకొని మనసులో పరిపరివిధాలా ఆలోచిస్తున్నాడు.

నాటు సన్నాయి శబ్దానికి అనుగుణంగా నాట్యం చేసే వ్యక్తి, చదును చేసిన భూమిమీద తన పాదాలను తాటించగా మిన్నుముట్టిన హర్షధ్వానాల మధ్యన (ఆ రోజులలో ప్రేక్షకుల హర్షధ్వానాలు (ఎవరి మెప్పుకోసమో కాకుండా) నిజాయితీగా ఉండేవి) ఆ స్త్రీలను బలాత్కరించవలసిందిగా (16) రాములస్ తన సైనికులకు సౌంజ్ఞ చేశాడు.

వెనువెంటనే ముందుకురికిన సైనికులు, తమ ఉద్దేశం వెల్లడయ్యేటట్లుగా కేకలు పెడుతూ, భయంతో ముడుచుకుపోతున్న ఆ స్త్రీలను ఆతురతతో చేజిక్కించుకున్నారు.

గ్రద్దను చూచి భయంతో కోడి పిల్లలన్నీ గుంపుగా పారిపోతున్నట్లుగా,

తోడేలును చూచి గొఱ్ఱె పిల్ల భయంతో వెనకడుగు వేసినట్లుగా:

ఆ సబైన్ స్త్రీలంతా తమ వైపు ఉరుకుతూ వస్తున్న న్యాయాన్యాయాలు మరచిన ఆ సైనికులను చూచి భయకంపితులైపోయారు.

ఏ ఒక్కరిలో కూడా మునుపటి తేజస్సు లేదు.

అందరూ ఒకేలా భయపడ్డారు, కానీ అది ఒక్కొకరిలో ఒక్కోవిధంగా వ్యక్తమైనది:

ఒకతె జుట్టు పీక్కుంది:

ఒకతె నిస్సత్తువతో చతికిలపడింది,

ఒకతె మౌనంగా రోదించింది,

ఒకతె తన తల్లిని వృధాగా పిలిచింది:

ఒకతె మూలిగింది,

ఒకతె దిగ్భ్రమ చెందిందింది,

ఒకతె స్థాణువులా నిలబడిపోయింది,

ఒకతె పరుగులు తీసింది:

అయినప్పటికీ రోమన్‌లు ఆ స్త్రీలను ఎత్తుకెళ్ళిపోయారు,

వారి పడకలకు మధురమైన లూటీ దొరికింది.

ఆ స్త్రీలలో అనేకమంది భయంలో మరింత అందంగా ఉన్నారు.

ఆ స్త్రీలలో ఎవరైనా తనను చేబట్టినవాడికి ఎంతకీ లొంగకుండా తిరగబడుతూ ఉంటే, అతడు ఆమెను లేపి తన హృదయానికి హత్తుకొని ఇలా అంటాడు: “కాంతులీనే నీ లేలేత చెక్కిళ్ళను కన్నీటితో ఎందుకు పాడుచేసుకుంటావు? నీ తల్లికి నీ తండ్రి ఎలానో ఇకనుండి నేను నీకు అలా”.

ఓ! రాములస్! సైనికులను ఎలా సత్కరించాలో తెలిసినవాడివి నీవొక్కడివే:

అటువంటి ప్రతిఫలం ఇస్తానంటే నేను కూడా సంతోషంగా నీ సైన్యంలో చేరిపోతాను.


ఆ ప్రాచీన సాంప్రదాయానికి కట్టుబడే నాటినుండి నేటివరకూ ఉత్సవాలు, వినోదమందిరాలు అందమైన స్త్రీలకు వలవేయడానికి తగిన ప్రదేశాలుగా కొనసాగుతున్నాయని నా భావన.








Footnote:

(16) ప్రాచీన రోమన్ గాథలప్రకారం రాములస్ రోమ్ నగారాన్ని స్థాపించినప్పుడు ఆ నగరంలో ఆడవారే లేరు. కనుక తన నగరంలోని పురుషులకు వధువులనీయమని పొరుగునగరాల వారిని రాములస్ అభ్యర్ధించగా వారు నిరాకరించారు. దానితో అతడు రోమ్‌నగరంలో పెద్ద యెత్తున ఉత్సవాలను యేర్పాటు చేసి వాటికి ఆ పొరుగునగరాల వారందరినీ ఆహ్వానించాడు. ఆ ఉత్సవాలు జరుగుతుండగా రాములస్ ఆజ్ఞమేరకు రోమన్లు ఆ పొరుగువారిలో సబైన్ తెగకు చెందిన స్త్రీలను బలవంతంగా సొంతం చేసుకున్న మీదట ఇక ఆ స్త్రీలంతా వారికి భార్యలుగా ఉండటానికి అంగీకరించారు.












No comments:

Post a Comment