Sunday, January 11, 2009

మనోబలానికి టానిక్

మనం శారీరకంగా బలహీనంగా ఉండి డాక్టర్‌ను సంప్రదిస్తే ఆయన టానిక్ రాసిస్తాడు. దానిని వాడి మనం కొంత బలాన్ని పుంజుకుంటాం. అదే మానసికంగా బలహీనంగా ఉంటే… ఏదైనా తీవ్రమైన మెంటల్ డిజార్డర్ వస్తేగానీ మనం డాక్టర్‌ను సంప్రదించం. మామూలు మానసిక బలహీనతలకు మనం ఎవరినీ సంప్రదించం. కానీ అటువంటి బలహీనతకు కూడా ఓ టానిక్ ఉంది. అదే The 48 Laws of Power అనే పుస్తకం. (ఈ పుస్తకాన్ని అదే రచయిత రాసిన మరో రెండు పుస్తకాలతో కలిపి నేను నా ‘వేణుగానం’ బ్లాగులో పరిచయం చేశాను)

చరిత్రలో వేలాది సంవత్సరాలు మన భారతజాతి బానిసత్వంలో ఉండిపోవడానికి కారణం మన మానసిక బలహీనతే అని నేను ఇదే బ్లాగులో గత టపాలో వివరించాను. దానిననుసరించి మనం ఇప్పుడు మానసికంగా బలపడటం చాలా అవసరం. అందుకు దోహదపడగలిగిన అతి ముఖ్యమైన సూచనలు, సూత్రాలు ఈ గ్రంథంలో ఉన్నాయి.

చరిత్రలో వాస్తవంగా జరిగిన సంఘటనల ఆధారంగా Robert Greene అనే అమెరికన్ రచయిత ఈ గ్రంథాన్ని రచించాడు. అనేక చరిత్ర గ్రంథాలను శోధించి, అనేక మంది చారిత్రక వ్యక్తుల జీవితచరిత్రలను పరిశోధించి, ఈ విషయం మీద గతంలో రాసిన అనేకమంది ఇతర రచయితల రచనలను కూలంకషంగా అధ్యయనం చేసిన మీదట ఈయన 48 సూత్రాలను రూపొందించాడు. ఆ 48 సూత్రాల వివరణనే The 48 Laws of Power అనే గ్రంథంగా వెలువరించాడు.

మనం ఎదుటివారి కన్నా ప్రాబల్యం సాధించడానికి, మన Upper hand నిరూపించుకోవడానికి, మనం జీవితంలో శక్తివంతులం కావడానికి, విజయం సొంతం చేసుకోవడానికి ఈ సూత్రాలు తిరుగులేకుండా ఉపయోగపడతాయి. ఈ 48 సూత్రాలను 450 పేజీలలో Robert Greene సవివరంగా విపులీకరించాడు. అయితే నేను ఆ వివరణంతా మీకు చెప్పబోవడంలేదు. కేవలం ఆ సూత్రాలను పేర్కొని, కొద్ది పాటి వివరణ (ఆయన రాసినదే) రాస్తాను. ఆసక్తి ఉన్నవారు ఈ గ్రంథాన్ని కొని చదవడానికి ప్రయత్నించండి. ఆ వివరాలు ఈ పుస్తక పరిచయంలో ఉన్నాయి.

Robert Greene ప్రతి సూత్రాన్ని ముందు తెలిపి, ఆ తరువాత Observance of the law, Transgression of the law, Interpretation, Keys to Power, Image, Authority, Reversal.. ఇలాంటి కొన్ని శీర్షికల ద్వారా ఆ సూత్రాన్ని విపులంగా వివరించాడు.

Observance of the law శీర్షిక క్రింద చరిత్రలో ఆ నియమం ఆచరించబడిన ఒకటి లేక అంతకన్న ఎక్కువ సంఘటనలను వివరిస్తాడు. Transgression of the law అనే శీర్షికతో ఆ నియమాన్ని ఉల్లంఘించి నష్టపోయిన సంఘటనలను వివరిస్తాడు. Interpretation అనే శీర్షికతో పైన వివరించిన చారిత్రక సంఘటనలలో ఆ నియమం లేక సూత్రం ఎలా పనిచేసిందో వివరిస్తాడు. Keys to Power అనే శీర్షికతో ఆ సూత్రం మొత్తాన్ని మరోసారి సమగ్రంగా సమీక్షిస్తాడు.

Image అనే శీర్షికతో ఆ నియమాన్ని మనం మన పరిసరాలలో మనకు బాగా తెలిసిన వస్తువులు లేక విషయాలలో దేనితో పోల్చవచ్చో కూడా చెబుతాడు. దానితో మనకు ఆ సూత్రం బాగా హత్తుకు పోతుంది. Authority అనే శీర్షికతో ఆ నియమానికి సంబంధించి ఓ ప్రఖ్యాత చారిత్రక రచయిత యొక్క అభిప్రాయం రెండుమూడు వాక్యాల్లో తెలుపుతాడు.

చివరగా Reversal అనే శీర్షికతో ఆ నియమానికి ఉండే పరిమితులు అంటే ఏయే సందర్భాలలో ఆ సూత్రం వర్తించదో, ఏయే సందర్భాలలో ఆ నియమం వికటిస్తుందో.. ఆ జాగ్రత్తలు కూడా చెబుతాడు.

ఈ విధంగా రచయిత ఒక్కో సూత్రాన్ని ఎంతో విపులంగా అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్లుగా వివరిస్తాడు. ప్రతి ఒక్కరూ మరిముఖ్యంగా మనలాంటి అమాయక సగటు భారతీయులు తప్పకుండా తెలుసుకోవలసిన వాస్తవాలు ఈ గ్రంథంలో చాలా ఉన్నాయి. తదుపరి టపా నుండి మీకు ఒక్కొక టపాలో ఒక్కొక సూత్రాన్ని తెలియజేస్తాను.

ధన్యవాదాలు!

(సాధారణంగా నేను నా పుస్తక పరిచయాలను నా 'వేణుగానం' బ్లాగు లోనే రాస్తాను. అయితే ఈ టపా పుస్తక పరిచయం కాదు. 'The 48 Laws of Power' గ్రంథాన్ని పైన టపాలో చెప్పినట్లుగా ఇప్పటికే పరిచయం చేశాను. అయితే ఈ గ్రంథంలోని సూత్రాలను వాటి ప్రాముఖ్యత దృష్ట్యా ప్రత్యేకంగా ఒక్కొకటి విడిగా తెలపాలనే ఉద్దేశ్యంతో అందుకు ఉపోద్ఘాతంగా మాత్రమే ఈ వ్యాసం రాశాను.)

2 comments:

  1. thanks andi ... :)manchi pustakam gurinchi vivaristunnaaru

    ReplyDelete
  2. Thanks గురూగారు తెలుగులో చాలా బాగా వివరించారు.

    English లో సరిగ్గా అర్ధం కాలేదు ఈ పుస్తకాల ఉధ్యేశం.

    మీరు చాలా బాగా వివరించారు.

    ReplyDelete