లేదంటే గుఱ్ఱపు పందేల వద్ద,
కాదంటే ద్వందయుద్ధాలు జరిగే చోట
కాదంటే ద్వందయుద్ధాలు జరిగే చోట
జాతి గుఱ్ఱాలు ఉత్సాహంతో ఉరకలెత్తుతూ గెలుపుకోసం
పరిశ్రమించే గోదాని మరువకు: ప్రేక్షకులతో కిటకిటలాడిపోయే ఆ ప్రాంగణం ప్రేమవ్యవహారాలకు బాగా అనువైనది.
వ్రేళ్ళతో రహస్య సంకేతాలిచ్చే అవసరం నీకు
గానీ, తన అంగీకారాన్ని తల ఊపుతూ తెలియజేసే అవసరం ఆమెకుగానీ అక్కడ ఉండదు:
నీవు ఆమెకు వీలైనంత దగ్గరగా కూర్చో: దానికి ఎటువంటి ఆటంకమూ ఉండదు,
రద్దీ నిన్ను ఆమెకు ఒత్తుకునేటట్లు చేస్తుంది. అటువంటి ప్రదేశాలలో అలానే జరుగుతుంది కనుక నీ అదృష్టం కొద్దీ ఆమె కూడా అభ్యంతరం చెప్పదు.
ఇక అప్పుడు నెమ్మదిగా ఏదో ఒక మిషమీద ఆమెతో మాటకలుపు,
మొదట పిచ్చాపాటీ మాట్లాడు.
కొన్ని గుఱ్ఱాలు గోదాలోకి ప్రవేసిస్తూ కనబడతాయి.
వాటి యజమాని ఎవరని ఆమెను ఆసక్తిగా అడుగు.
ఆమెకు ఏ గుఱ్ఱం నచ్చిందో చూచి నీవు కూడా దాని
పక్షానే నిలువు.
దేవతా విగ్రహాలను ఊరేగిస్తున్న జనసందోహం దారివెంట
వెళుతుంటే నీ సంరక్షకురాలైన వీనస్‌కు హృదయపూర్వక వందనాలు సమర్పించు:
ఆమె శరీరం మీద ఏదైనా ధూళి పడితే దానిని నీ
వేళ్ళతో తొలగించు,
ఒకవేళ ఏమీ పడకపోయినా కూడా పడిందన్నట్లుగా
తొలగించు:
ఆమెమీద నీ శ్రద్ధను వ్యక్తంచేయడానికి ఎటువంటి
వంకైనా పరవాలేదు.
ఆమె ధరించిన గౌను నేలమీద ఈడ్చుకొస్తుంటే మురికి
అంటకుండా దానిని జాగ్రత్తగా ఎత్తిపట్టుకో:
మరుక్షణంలోనే, నీవు చేసిన ఆ సేవకు
ప్రతిఫలంగా ఆమె తన కాళ్ళసౌందర్యాన్ని వీక్షించే భాగ్యాన్ని నీకు కలిగిస్తే కలిగించనూవచ్చు.
నీ వెనుక ఎవడు కూర్చుని ఉన్నాడో గమనించడం
మరువకు. వాడు తన మోకాలితో ఆమె మృదువైన వీపును నొక్కకుండా చూచుకో.
అల్పసంతోషులను ఆకట్టుకోవడానికి అల్పవిషయాలు
చాలు:
ఆమె కూర్చునే ప్రదేశంలో మెత్తను ఉంచడం, ఆమెకు గాలి విసరడం,
సుతిమెత్తని ఆమె పాదానికి ఆదరువుగా ముక్కాలి పీటను ఏర్పాటు చేయడంలాంటి
పనులద్వారా అనేకమంది పురుషులు స్త్రీ మనసును గెలుచుకున్నారు.
ప్రేక్షకుల గాలరీతోపాటు గ్లాడియేటర్‌ల ద్వందయుద్ధం
జరిగే ఇసుకగోదా కూడా తొలివలపుకు తోడ్పడుతుంది.
వీనస్ కొడుకైన కామదేవుడు తరచూ ఆ ఇసుకలో పోరాడతాడు,
ఆ క్రీడలో గాయపడిన వారిని తిలకించడానికి వచ్చిన
అనేకమంది పురుషులు మన్మథబాణంచే స్వయంగా తామే గాయపడతారు.
అతడు మాట్లాడేటపుడు, ఆమె చేతిని తాకేటపుడు,
ఆట గురించి అడిగేటపుడు, పందెం కాచిన మీదట ఎవరు
గెలుపొందుతారోనని ఉత్కంఠతో ఉన్నపుడు తను ఎక్కడ ఉన్నాడో అతనికి తెలిసే లోపే ఒక బాణం
అతడిని చీల్చివేస్తుంది, బాణం గుచ్చుకున్న ఆ బాధలో అతడు గట్టిగా మూలుగుతాడు,
ఆ ద్వందయుద్ధ క్రీడలో అతడు కేవలం ప్రేక్షకుడు
గానే ఉండిపోడు, పోరాటంలొ పాలుపంచుకున్నవాడివలే
గాయపడి క్రీడలో తానూ ఒక భాగమౌతాడు.
ఇటీవలి కాలంలో పర్షియన్, ఎథీనియన్ నౌకలతో సీజర్ నిర్వహించిన నౌకాయుద్ధవిన్యాసాల ప్రదర్శనలో (17)&(18) అలా జరగడం మనం చూడలేదా?
ఆ ప్రదర్శనలను తిలకించడనికి ఇరుతీరాలనుండి యువతీయువకులు
తరలిరాగా ప్రపంచంలోని ప్రజలంతా రోమ్‌నగరంలోనే ఉన్నారా అని అనిపించినది?
తన మనసు దోచుకున్న మగువ కనబడని వారు ఆ జనసందోహంలో
ఒక్కరైనా ఉండి ఉంటారా?!
అయ్యో! పరదేశపు ప్రేమ ఎందరి హృదయాలను
దహించివేసిందో కదా!
Footnote:
(17) ప్రాచీన రోమన్‌పాలకులు ప్రజలముందు ప్రదర్శించే నౌకా యుద్ధ
సన్నివేశాలను నౌమాకియా (mock sea fight) అనేవారు., ఆక్టియం యుద్ధంలో (Battle of Actium 31 B.C.) ఆంటోనీ, క్లియోపాత్రలను
అగస్టస్ ఓడించి, రోమన్‌రిపబ్లిక్‌ను, రోమన్‌సామ్రాజ్యంగా మార్చి ఆ
సామ్రాజ్యానికి మొదటి చక్రవర్తిగా సింహాసనం అధిష్ఠించాడు (27 B.C.). కొంతకాలం తరువాత (2 B.C.) ఆ యుద్ధాన్ని
స్మరించుకోవడానికి అగస్టస్ రోమ్‌నగరం గుండా ప్రవహించే టైబర్‌నది ఒడ్డున ఒక
సరస్సును తవ్వించి, ఆ యుద్ధాన్ని మరలా ఆ సరస్సులో నౌమాకియాగా ప్రజలముందు ప్రదర్శింపచేశాడు.
ఆక్టియం యుద్ధంకొరకు ఆంటోని పార్థియా లాంటి ఆసియా దేశాలనుండి, గ్రీసుదేశం నుండి
అనేక నౌకలను రప్పించాడు. కనుకనే ఆప్రదర్శనలో అతడికి చెందిన నౌకలు పార్థియా, ఎథీనియా నౌకలుగా
పేర్కొనబడ్డాయి.
(18) అగస్టస్, జూలియస్ సీజర్‌నుండి సీజర్ అనే మాటను బిరుదుగా స్వీకరించగా, ఆ తరువాత వచ్చిన
కొందరు రోమన్ చక్రవర్తులు, వారి వారసులుగా ఎంపికైన వారుకూడా ఈ బిరుదుతోనే
పిలువబడ్డారు.
విశాఖపట్టణం ఆర్కేబీచ్‌లో
మన నౌకాదళం వారు కూడా ఇటువంటి ‘మోక్ సీ ఫైట్స్’ అప్పుడప్పుడు ప్రదర్శిస్తుంటారు.
No comments:
Post a Comment