Thursday, March 31, 2016

ప్రేమకళ-ఆమె పుట్టినరోజును మరువకు!



ఆమె పుట్టినరోజును మరువకు!




కాలాలు, ఋతువుల మీద దృష్టి పెట్టవలసినది రైతులు, జాలరులు మాత్రమే అని ఎవరైనా అనుకుంటే వారు పొరబడినట్లే!

విత్తనాలు నాటడానికి తగినకాలం ఉన్నట్లుగా,

నావలో సముద్రయానం చేయడానికి తగినకాలం ఉన్నట్లుగా,

ఒక అందమైన యువతితో ప్రేమను ప్రారంభించడానికి కూడా తగినకాలం ఉంటుంది.

సరైన సమయాన్ని ఎంపిక చేసుకోవడంమీదనే విజయం తరచుగా ఆధారపడిఉంటుంది.

ఉదాహరణకు:

ఆమె పుట్టిన రోజునాడు,

మార్చినెల ఆరంభంలోనూ (40),

క్రీడాప్రాంగణంలో అసాధారణమైన ప్రదర్శనను (40A) ఏర్పాటుచేసినప్పుడు నీ పథకాన్ని ప్రారంభించకు,

అది శీతకాల సమయం.........ఆ కాలంలో తుఫానుగాలులు వీస్తుంటాయి, అప్పుడు నీవు విరమించుకోవడమే మంచిది.  

అటువంటి సమయంలో గనుక నీవు సముద్రయానాన్ని ఆరంభించినట్లైతే, నీకు అదృష్టం ఉంటే విరిగిపోయిన పడవభాగం దేన్నైనా పట్టుకొని ఒడ్డుకు కొట్టుకొస్తావు.

నీకు నిజంగా మంచి అవకాశం కావాలంటే (41) అల్లియ నదిలోని నీరు రోమన్ల రక్తంతో ఎరుపెక్కిన దుర్దినాన్ని పాటించేరోజు వరకు, లేదంటే వారానికోసారి యూదులు పనిచేయకుండా సెలవుతీసుకునే రోజు వరకు వేచి ఉండు. ఆరోజులలో దుకాణాలన్నీ మూసి ఉంటాయి.

అన్నింటికన్నా ముఖ్యంగా ఆమె పుట్టిన రోజునాడునిజానికి నీవు ఆమెకు బహుమతి ఇవ్వవలసివచ్చే ఏ రోజైనా సరేఆమె దరిదాపుల్లోకి కూడా వెళ్ళకు!

నీవెంతగా దాటవేయడానికి ప్రయత్నించినా సరే ఆమె తనకోసం నీచేత ఏదోవొకటి కొనిపిస్తుంది.

తన కోసం తపించిపోయే ప్రేమికుడిని ఎలా దోచివేయాలో ఒక స్త్రీకి బాగా తెలుసు.

ఏ తోపుడు బండి వ్యాపారో ఖచ్చితంగా కనబడతాడు. కొనడం వారందరికీ ఒక పిచ్చి కనుక, తనకు కావలసిన వస్తువులు ఆమెకు తప్పకుండా కనిపిస్తాయి. వాటినోసారి చూడమని ఆమె నిన్ను అడుగుతుంది.

ఇక ఆ తరువాత ఓ ముద్దు పెట్టి ఇలా అంటుంది  అదిగో! ఆ వస్తువు నాకు కొనిపెట్టు, అది అనేక సంవత్సరాలపాటు మన్నుతుంది, నాకు కావలసిన వస్తువు సరిగ్గా అదే, ఇంతకన్నా నాకిష్టమైన మరో వస్తువేదీ నీవు నాకు కొనిపెట్టలేవు.”

నీవు నా దగ్గర డబ్బులేదన్నా కూడా ఉపయోగమేమీ ఉండదు. నీవు గనుక అలా అంటే ఆమె చెక్కు రాసివ్వమంటుంది, దానితో నీవు వ్రాయడం నేర్చుకున్న రోజుని తిట్టుకుంటావు.

ఇలా ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆమెకు ఏదో ఒక బహుమతి ఎన్నిసార్లు ఇచ్చినాకూడా, మరలా ఆమె తనకేదైనా వస్తువు కావాలని కోరుకున్నట్లైతే, ........అలా కోరుకున్న ప్రతిసారీ ఆమెకో పుట్టినరోజు ఉంటుంది.

ఇక ఆ తరువాత ఆమె ఏదో పోగొట్టుకున్నట్లు నటిస్తూ విచారంగా వస్తుంది. ఆమె కళ్ళంతా ఎర్రబడిపోయి, ఏడుస్తూ నీ వద్దకు వచ్చి, తన ఖరీదైన చెవి రింగులలో ఒకదానిని తాను పోగొట్టుకున్నట్లు చెబుతుంది. అది వాళ్ళు వేసే ఒక చిన్న ఎత్తుగడ.

ఇక వారు తమకు కొంత డబ్బు అప్పుగా ఇవ్వమని అదేపనిగా అడుగుతారు.

ఒకసారి గనుక వాళ్ళ చేతిలో డబ్బు పడిందంటే, దానిని తిరిగి పొందే అవకాశం నీకు ఏ మాత్రం ఉంటుందో నేను చెప్పలేను.

ఇక ఆ దాని మీద నీవు ఆశలు వదులుకోవచ్చు!

వాళ్ళు ఆ మొత్తాన్ని కృతజ్ఞత రూపంలో కూడా చెల్లించరు.

నాకు పదినోళ్ళు, పది నాలుకలు ఉన్నాకూడా చెడునడత కలిగిన స్త్రీలు వేసే జిత్తులమారి ఎత్తులన్నింటినీ వర్ణించి చెప్పటానికి అవి చాలవు.


Footnote:


(40) మార్చ్ నెలకు అధిదేవుడు మార్స్, ఏప్రిల్ నెలకు అధిదేవత వీనస్ లేక ఆఫ్రోడైట్, వీరిరువురూ ప్రేమికులు. కనుకనే ప్రేమలో పడిన యువకులంతా మార్చి నెల ఆరంభంలో తమ ప్రియురాళ్ళకు కానుకలిచ్చే ఆచారం ప్రాచీనరోమన్లలో ఉండేది,

(40A)అలాగే రోమన్‌పాలకులు శత్రుదేశాలను జయించి వారినుండి స్వాధీనం చేసుకున్న సంపదను క్రీడాప్రాంగణాలలో కొద్దిరోజులు ప్రదర్శించేవారు. అప్పుడు ఆ సంపదవైభవాన్ని తిలకించే సంరంభంలో ఉన్న ప్రియురాలు తన వెంటపడుతున్న ప్రియుడిని పట్టించుకోలేని స్థితిలో ఉండే అవకాశం ఉంటుంది.

(41) 390 BC, జూలై 16న అల్లియ నది ఒడ్డున రోమన్లు గాల్‌లచేతిలో ఓడిపోయారు కనుక ప్రాచీన రోమ్‌లో ప్రతి సంవత్సరం ఆ రోజును సంతాపదినంగా పాటిస్తూ సెలవును ఇచ్చేవారు.





No comments:

Post a Comment