Thursday, March 31, 2016

ప్రేమకళ- కన్నీళ్ళు, ముద్దులతో ముందడుగు వేయి!








కన్నీళ్ళు, ముద్దులతో ముందడుగు వేయి!





ప్రేమవ్యవహారంలో కన్నీళ్ళు కూడా బాగా ఉపయోగపడతాయి. కన్నీళ్ళు కఠిన శిలను సైతం కరిగిస్తాయి.


కనుక, సాధ్యమైతే కన్నీళ్ళతో తడిచిన నీ ముఖాన్ని నీ ప్రియురాలు చూచేటట్లు చేయి! నీకు కన్నీళ్ళు రాకపోతే –సమయానికి అవి ఎప్పుడూ రావు– తడిచిన చేతితో నీ కళ్ళను తాకు!  



సుతిమెత్తని మాటలకు ముద్దులు ఎంత గొప్పగా తోడు అవుతాయో అనుభవమున్న ఏ ప్రేమికుడికి తెలియదు?!



ఆమె తనను ముద్దాడవద్దని వారిస్తున్నా కూడా ముద్దాడు!



బహుశ మొదట ఆమె పెనుగులాడుతుంది.



“అంతా తొందరే!!” అంటుంది.



ఆమె పెనుగులాడుతున్నప్పటికీ దానిలో తాను ఓడిపోవాలనే ఆమె కోరుకుంటుంది.



అయినప్పటికీ ఆమెతో మరీ మొరటుగా ప్రవర్తించకు!



ఆమె సున్నితమైన నోటికి నొప్పి కలిగించకు!



నీవొక మోటు మనిషివి అని ఆమెతో అనిపించుకోకు!



ఆమెను నీవు ముద్దాడిన తరువాత, మిగతాది పొందలేకపోతే, గెలుచుకున్న దానికి కూడా నీవు తగినవాడవుకావు.



నీ కోరికలు నెరవేరే సమయం రావడానికి ఇంకా నీకేం కావాలి?!



ఓ! ఎంత సిగ్గు చేటు!



నిన్ను నిరోధించినది నీ మర్యాద కాదు! అది నీ మూర్ఖత్వం! అది నీ విదూషకత్వం!  



‘పెనుగులాటలో ఆమెను నేను హింసించి ఉండే వాడిని’ అని నీవు అంటావా? అయితే స్త్రీలు ఆ హింసనే ఇష్టపడతారు.



వారు తాము ఇవ్వాలనుకున్నది తమనుండి దోచివేయబడాలని కోరుకుంటారు.



కోరికల తుఫానులో బలవంతంగా చేజిక్కించుకోబడ్డ ప్రతీ స్త్రీ సంతోషంలో ఓలలాడుతుంది. మరి ఏమి ఇచ్చినా కూడా ఆమెను అంతలా సంతోషపరచలేవు.



తనను బలవంతంగా లోబరుచుకునే ఒక పెనుగులాటనుండి ఏ హానీ జరగకుండా తాను బయటపడినప్పుడు పైకి ఆమె సంతోషంగా కనబడటానికి ప్రయత్నించినప్పటికీ లోలోన బాధపడుతుంది.



ఫోబే (Phoebe) బలాత్కరించబడింది, అలాగే ఆమె చెల్లెలు ఎలైరా (Elaira) కూడా బలాత్కరించబడింది.  అయినా కూడా వారు తమను బలాత్కరించిన వారిని మనస్పూర్తిగా ఇష్టపడ్డారు.



మహావీరుడైన అచెల్లిస్ మరియు స్కిరస్ యువతిల కథ బాగా తెలిసినదే. అయినా ఇప్పుడు మరోసారి చెబితే బాగుంటుంది.



ఇడా పర్వత పాదం వద్ద తనను తన ఇరువురి ప్రత్యర్థులమీద విజేతగా నిలిపినందుకు వీనస్ పారిస్‌కు (51)ప్రతిఫలాన్ని ఇచ్చివేసింది.



సుదూరాన ఉన్న దేశాన్నుండి (52)ప్రియామ్‌కు ఒక కొత్తకోడలు వచ్చింది. ట్రోజన్ గోడల మధ్యన గ్రీకు వధువు నివసిస్తున్నది.



ఆమె భర్తకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకుంటామని గ్రీకులు ప్రతిన పూనారు.  ఎందుకంటే ఒకరి అవమానం అందరికీ అవమానమే.



అయితే అచెల్లిస్ మాత్రం తన పురుషత్వాన్ని ఒక యువతి బట్టల మాటున దాచివేశాడు. తన తల్లి ప్రాధేయపడటం మూలంగా ఇలా చేశాడు కాబట్టి సరిపోయింది, లేదంటే ఇది అతడికి ఎంతో సిగ్గుచేటైన విషయం.



ఏకస్ (53) వంశంలో ప్రభవించిన ఓ! అచెల్లిస్! అక్కడ ఏం చేస్తున్నావు?



ఊలు అల్లడంలో నిమగ్నమై ఉన్నావా?



అది ఒక పురుషుడు చేయవలసిన పనేనా?



నీవు కీర్తిని ఆర్జించవలసినది ఎథీనా యొక్క (54)ఇతర విద్యలద్వారా!



అల్లిక వస్తువులుండే బుట్టతో నీకేం పని?



నీ చేతికి తగిన పని డాలును పట్టుకోవడం!



హెక్టార్ లాంటి మహాయోధుణ్ణి పడగొట్టవలసిన ఆ చేతిలోకి అల్లిక సూది ఎలా వచ్చింది?



ఆ ఊలు కండెలన్నింటినీ అవతల పారవేయి!



నీ బలిష్టమైన బాహువుతో పెలియాన్ పర్వతం నుండి తెచ్చిన బల్లాన్ని పట్టుకొని గాలిలో ఆడించు!



ఒకసారి సందర్భవశాత్తూ అచెల్లిస్ మరియు ఒక రాకుమార్తె ఒకే పడకగదిలో కలసి ఉండవలసివచ్చింది. అప్పుడు ఆమెమీద అత్యాచారం జరగడంతో వెనువెంటనే, తనతో కలసి ఉన్నది ఒక మగవాడు, అని ఆమెకు తెలిసిపోయింది. (55)



‘ఆమె నిస్సందేహంగా బలప్రయోగానికే లొంగిపోయింది’ అని మనం తప్పనిసరిగా నమ్మవలసిందే.



అయితే అందుకు ఆమెకు కనీసం కోపంకూడా రాలేదు. పైగా ఆ బలప్రయోగంద్వారానే తాను లోబరుచుకోబడాలని ఇష్టపూర్వకంగా కోరుకుంది.



అచెల్లిస్ అల్లిక సూదిని పక్కన బెట్టి, వీరోచితమైన ఆయుధాలను చేతబట్టి, వెళ్ళడానికి తొందరపడుతున్నపుడు “మరికొంత సేపు ఉండు” అని ఆమె ప్రాధేయపూర్వకంగా చాలాసార్లు అన్నది.



ఆమె మీద జరిగిన బలప్రయోగం ఇప్పుడు ఏమైపోయింది?



ఓ! డీడామియా! నీ మాన మర్యాదలను మంటగలిపినవాడినే ప్రాధేయపూర్వక స్వరంతో వెళ్ళకుండా ఆపుతున్నావు, ఎందువల్ల?



స్త్రీ ముందుగా చొరవ తీసుకోడానికి మర్యాద అంగీకరించదు అన్నది నిజం. కనుక తన ప్రేమికుడు చొరవ తీసుకున్నప్పుడు లోబడటానికి ఆమె ఇష్టపడుతుంది.



ఒక ప్రేమికుడు స్త్రీయే ముందుగా అడగాలని అనుకుంటున్నాడంటే అతడు తన రూపం గురించి మితిమీరిన విశ్వాసంతో ఉన్నట్లే.



అతడే మొదట ప్రారంభించాలి,



అతడే ఆమెను ప్రాధేయపడాలి,



అతని వేడికోళ్ళకు ఆమె చెవి ఒగ్గుతుంది.



అడుగు! దక్కించుకో!



ఆమె కేవలం నీవు అడగటం కొరకే ఎదురు చూస్తుంటుంది.



నీలో కోరిక ఎలా పుట్టిందో, ఎందుకు పుట్టిందో ఆమెతో చెప్పు!



జూపిటర్ గతకాలపు కథానాయికలను మోకాళ్ళు వంచి ప్రార్థించేవాడు. అతడెంత గొప్పవాడైనప్పటికీ వారిలో ఏ ఒక్కరు కూడా తనంతట తానుగా వచ్చి ఎప్పుడూ అతడిని వేడుకోలేదు.



ఇంత చేసినా నీకు కేవలం ఛీత్కారం మాత్రమే ఎదురైతే నీ పథకాన్ని అంతటితో విరమించుకో! ఇక ఏమాత్రం ముందుకెళ్ళకు!



చాలామంది స్త్రీలు తమకు దొరకకుండా పోయేదానినే కోరుకుంటారు, తమకు అందుబాటులోకి వచ్చిన దానిని ఇష్టపడరు.  కనుక నెమ్మదించు! తనకోసం నీవు మరీ ఎక్కువగా ప్రయత్నిస్తున్నావని ఆమె అనుకోకూడదు.



ఒక్కోసారి నీ అసలు ఉద్దేశాన్ని ముందే బయటపెట్టకూడదు. స్నేహం ముసుగులో ప్రేమ మొదలుపెట్టు. ఈ విధంగా ఒక స్త్రీ తన ప్రేమికుడిని తిరస్కరించలేని స్థితికి రావడం, స్నేహం ప్రేమగా పరిపక్వత చెందటం నేను చాలాసార్లు చూశాను. 




Footnote:


(51) జూనో (హీర), మినర్వ (పల్లాస్ లేక ఎథినా), వీనస్ (ఆఫ్రోడైట్): ఈ ముగ్గురు దేవతలలో అందగత్తె ఎవరనే విషయంలో జరిగిన పోటీకి న్యాయనిర్ణేతగా ట్రోజన్ యువరాజు పారిస్ నిలుస్తాడు. తనను విజేతగా ప్రకటిస్తే ప్రపంచంలోకెల్లా అందమైన స్త్రీ అయిన హెలెన్‌ను అతడికి కానుకగా ఇస్తానని వీనస్ అతడికి మాట ఇస్తుంది. దానితో పారిస్ వీనస్‌నే విజేతగా నిలుపుతాడు. అయితే అప్పటికే హెలెన్‌కు గ్రీసు దేశంలోని స్పార్టా ప్రాంతపు రాజైన మెనెలాస్‌తో వివాహం జరిగిపోయి ఉంటుంది. పారిస్ స్పార్టాను సందర్శించినపుడు, వీనస్ వరప్రభావంతో హెలెన్ అతడితో కలిసి ట్రాయ్ నగరానికి పారిపోతుంది. హెలెన్‌ను తిరిగి తీసుకురావడానికి మెనలాస్ సోదరుడు ఆగమెమ్నాన్ నాయకత్వంలో గ్రీకులు ట్రాయ్ నగరం మీద అనేక సంవత్సరాల పాటు గొప్పయుద్ధం చేస్తారు. అదే సుప్రసిద్ధ ట్రోజన్ యుద్ధం.

(52) ప్రియామ్ ట్రాయ్‌కు రాజు, పారిస్‌కు తండ్రి.

(53) ఏకస్ దేవతలకు రాజైన జూపిటర్ లేక జియస్‌కు కొడుకు, అచెల్లిస్‌కు తాత.

(54) ఎథీనా కళలు, చేతి వృత్తులు, విజ్ఞానం, యుద్ధం మొదలైన వాటికి అధిదేవత. అచెల్లిస్ యువతి వేషధారణలో ఉన్నపుడు ఊలు అల్లాడు. ఊలు అల్లడం ఎథీనా యొక్క విద్య. అలాగే  యుద్ధం చేయడం కూడా ఎథీనా యొక్క విద్యే. ఊలు అల్లుతున్న అచెల్లిస్‌ను ఉద్దేశించి ‘ఎథీనా యొక్క ఇతర విధ్యలద్వారా నీవు కీర్తిని ఆర్జించాలి’ అంటే ‘యుద్ధం చేయడం ద్వారా’ అని అర్థం.


(55) ట్రోజన్ యుద్ధంలో అచెల్లిస్ మరణిస్తాడని ముందే తెలుసుకున్న అతడి తల్లి అతడికి నచ్చచెప్పి ఒక యువతి వలే వేషధారణ చేసి, స్కిరస్ ద్వీపపు రాజును ఒప్పించి అతడి ఏడుగురు కుమార్తెలతో కలిపి ఉంచుతుంది. అలా ఉంటుండగా ఒక రాత్రి ఆ ఏడుగురిలో డీడామియా అనే యువతితో అచెల్లిస్ ఏకాంతంగా గడపవలసివస్తుంది. ఆ సమయంలో అచెల్లిస్ ఆమెను బలాత్కరిస్తాడు. అప్పటినుండి డీడామియా అచెల్లిస్‌తో గాఢమైన ప్రేమలో పడుతుంది. తరువాత యూలిసెస్ అనే వీరుడు అచెల్లిస్ జాడ కనుక్కొని, స్కిరస్ ద్వీపానికి వచ్చి, అతడిని యుద్ధానికి తీసుకెళతాడు. ఆ సమయంలో డీడామియా తనను వీడి వెళ్ళవద్దని అచెల్లిస్‌ను ప్రాధేయపడుతుంది.









No comments:

Post a Comment