Thursday, March 31, 2016

ప్రేమకళ- విందు సమయంలో ధైర్యం చేయి!



విందు సమయంలో ధైర్యం చేయి!




అదిగో చూడు! మధుదేవుడైన (God of Wine) బాకస్ తన కవిని (ఒవిడ్‌ను) రమ్మని పిలుస్తున్నాడు!

అతను కూడా ప్రేమికులకు సహాయం చేస్తాడు. తాను జ్వలించిపోయే అగ్నిజ్వాలలనే అతడు ఎగదోస్తాడు.

విచారంతో ఉద్వేగంగా ఉన్న అరియాడ్నే నాక్సస్‌దీవిలో అలలతాకిడికి గురైన సముద్రతీరం వెంబడి ఒంటరిగా తిరుగాడుతున్నది.

అప్పుడే నిదుర నుండి మేల్కొన్నట్లుగా వదులైన బట్టలతో, పాదరక్షలు లేని పాదాలతో, ముడివేయని కురులు భుజాలమీద కదలాడుతూ ఉన్న ఆమె తన లేలేత చెక్కిళ్ళ మీద కన్నీరు ధారగా కారుతుండగా, వినిపించుకోని ఆ సముద్రపు అలలతో మొరపెట్టుకుంటూ, థెసియస్ కొరకు రోదిస్తున్నది.

ఆమె బిగ్గరగా అరుస్తున్నది, అదే సమయంలో ఏడుస్తున్నది; అయితే రెండూ ఆమె అందాన్ని ద్విగుణీకృతం చేస్తున్నాయి.

ఆమె తన అందమైన గుండెలను అదేపనిగా బాదుకుంటూ అయ్యో! ఆ నమ్మకద్రోహి నన్ను విడిచివెళ్ళాడు!! ఇప్పుడు నాగతేంటి?! అయ్యో! ఇప్పుడు నేనేం చేయాలి?!” అని అరుస్తున్నది.

ఇంతలో హఠాత్తుగా తప్పెటలను, తాళాలను పిచ్చెత్తినట్లు వాయించిన శబ్దాలు ఆ తీరం వెంబడి ప్రతిధ్వనించాయి.

భయభీతురాలైన ఆమె తన చివరి మాటలను అస్పష్టంగా పలుకుతూ మూర్చిల్లింది. దాదాపు చనిపోయిన స్థితికి చేరుకున్న ఆమె శరీరంలో రక్తపు ఆనవాళ్ళే లేవు.

అదిగో! అలలవలే కదలాడుతున్న శిరోజాలు కలిగిన (44) మినాడ్‌లను చూడు! వేగంగా కదిలే శాటిర్‌లను చూడు! ఇటువంటి అనుచరగణంతో కూడుకున్న దేవుని ఊరేగింపు అక్కడకు చేరుకున్నది.

అదిగో! ముసలి (45 ) సైలినస్‌ను చూడు! ఎప్పటిలాగే తాగి ఊగుతున్నాడు!

మోయలేని బరువుతో సరిగా నడవలేకపోతున్న గాడిదనెక్కి సరిగా కూచుండలేక దాని మెడమీది జూలును గట్టిగా పట్టుకుని ఉన్నాడు.

అతడు తనను వెక్కిరించి పారిపోతున్న మినాడ్‌ల వెంటపడుతున్నాడు. అలా వెంటపడేటప్పుడు నైపుణ్యంలేని ఆ రౌతు తన పొడవు చెవుల గాడిదను కర్రతో అదిలించగా తల ముందుగా నేలకు గుద్దుకునేటట్లుగా దానిమీద నుండి దొర్లి కిందపడ్డాడు.

అప్పుడు శాటిర్‌లన్నీ పెద్దపెట్టున ఇలా అరిచాయి. లెమ్ము! ఓ తండ్రీ! మరలా లెమ్ము!

అంతటా ద్రాక్షతీగలతో అలంకరింపబడి ఉన్న ఎత్తైన రథం మీద నుండి ఆ దేవుడు బంగారు పగ్గాలను పట్టుకొని రథానికి పూన్చిన పులుల బృందాన్ని నిలువరించాడు.

థెసియస్‌ను పోగొట్టుకున్న ఆ యువతి భయంతో Bతన మేని ఛాయను, తన స్వరాన్ని కూడా పోగొట్టుకున్నది.

మూడుసార్లు ఆమె పారిపోవడానికి ప్రయత్నించింది. కానీ, మూడు సార్లూ ఆమె అడుగులు భయంతో స్థంభించిపోయాయి.

ఆమె పెనుగాలిలో చిగురుటాకులా వణికిపోయింది, కొలనులోని గడ్డిపోచలా కంపించిపోయింది.

"నీ భయాలన్నీ తీసి పక్కనబెట్టు" ఆ దేవుడు బిగ్గరగా పలికాడు:

నాలో ఒక సున్నితమైన, థెసియస్‌కన్నా ఎక్కువ విశ్వాసపాత్రుడైన ప్రేమికుడిని నీవు చూస్తావు, ఓ! మైనస్ ప్రియ పుత్రికా! నీవు ఈ బాకస్‌కు భార్యవవుతావు,. ఆకాశంలో నివాసాన్ని నీకు శుల్కంగా ఇస్తాను. నీవొక నూతన తార అవుతావు.  నీ ప్రకాశవంతమైన కిరీటం దారితెలియని నావికులకు దారి చూపిస్తుంది.”

ఆ విధంగా పలుకుతూ తన పులుల వలన ఆమెకు భయం కలుగకుండా రథం నుండి క్రిందకు దూకాడు.

అతని పాదల క్రింద ఉన్న ఇసుకలో (46) పచ్చదనం మొలిచింది.

మూర్ఛిల్లుతూ ప్రతిఘటించలేకుండా ఉన్న ఆమెను బాకస్ పొదివి పట్టుకొని ఎత్తుకెళ్ళిపోయాడు.

దేవుడు తాను చేయదలచుకున్నది చేసేయగలడు, ఎవరు మాత్రం అతడిని కాదనగలరు!

అప్పుడు కొందరు వివాహగీతాలను ఆలపించారు, మరికొందరు జయజయధ్వానాలు చేశారు.

వీటి మధ్యన ఆ దేవుడు, ఆ వధువు దివ్యమైన ఒక పానుపు మీద ఒక్కటవ్వడం ద్వారా తమ వివాహకార్యక్రమాన్ని పూర్తిచేశారు.

మద్యం ఏరులై ప్రవహించే విందు వినోదాలలో నీవు పాల్గొనేటప్పుడు,

ఆ సమయంలో నీచెంతనే ఒక స్త్రీ ఉన్నపుడు,

రాత్రికి మరియు రాత్రిపూట జరిగే విందువినోదాలకు అధిదేవుడైన బాకస్‌ను నీ తలకు మద్యంమత్తు మితిమీరి ఎక్కకూడదని ప్రార్థించు!

అలాగైతేనే నీవు నీ ప్రియురాలితో గూఢార్థాలతో కూడిన సంభాషణను సులభంగా నెరపగలవు. దానిని ఆమె సులువుగా అర్థం చేసుకోగలదు.

ఒక్క చుక్క మధువుతో టేబుల్ మీద తీయని ప్రేమ చిహ్నాలను నీవు గీయగలుగుతావు, వాటిని చదివిన ఆమెకు తన మీద నీకెంత ప్రేమ ఉందో తెలుస్తుంది.

నీ కళ్ళతో ఆమె కళ్ళలోకి చూస్తూనే ఉండు, అలా నీ ప్రేమ సందేశాన్ని ఆమెకు చేరవేయి. అనేకసార్లు, ఒక్క మాటకూడా పలుకకుండా కళ్ళు అద్భుతమైన సంగతులు చెప్పగలుగుతాయి.

ఆమె తాగినప్పుడు, ఆ కప్పును చేజిక్కించుకోవడంలో ముందుండి, ఆమె పెదవులు తాకిన చోట నీ పెదవులను ఒత్తిపెట్టి తాగు!

ఆమె చేతి వేళ్ళు కొంచెంగా తాకి ఉన్న ఆహార పదార్థాలను నీవు ఎంచుకో! వాటిని నీవు అందుకుంటుండగా నీ చేయి ఆమె చేతికి మృదువుగా తగలనీయి!

ఆమె భర్తతో కూడా మర్యాదగా మసలుకో! నీ ఎత్తులు నెరవేరడానికి అతని స్నేహం కన్నా ఎక్కువ ఉపయోగకరమైనది మరేది లేదు!

లాటరీ ద్వారా ఎవరెంత తాగాలో, ఎప్పుడు తాగాలో నిర్ణయించాలనుకున్నట్లైతే, అతడి వంతు ముందు వచ్చేటట్లు, అతడికి ఎక్కువ భాగం దక్కేటట్లు చూడు!

నీ తలకున్న పూలపట్టీని తీసి అతని తలకు అలంకరించు!

అతను నీతో సమానుడా, లేక నీకన్నా తక్కువవాడా అన్నది ముఖ్యం కాదు, వడ్డన ముందుగా అతడికే జరగనీయి!

నీవు చెప్పే ప్రతి విషయంలోనూ అతడిని ప్రశంసించు!

స్నేహం ముసుగులో అతడిని మోసగించడమనేది విజయం కొరకు అందరూ అనుసరించే ఒక ఖచ్చితమైన పద్దతి.

అయితే ఖచ్చితమైనదీ, అందరూ అనుసరించేదీ అయినప్పటికీ ఇది ఒక నిందార్హమైన నేరం.

ప్రేమవ్యవహారంలో ఒక్కోసారి (47) దూత చాలా దూరం వెళ్ళిపోతాడు, తనకు అప్పగించిన పనులకన్నా ఎక్కువ చేస్తాడు.

తాగడంలో నీవు మీరకూడని కొన్ని హద్దులను ఇప్పుడు నేను నీ ముందుంచుతాను.

నీ మెదడు మత్తులో మునిగేంతగా,

నీ నడక నిలకడ కోల్పోయేంతగా ఎప్పుడూ తాగకు!

తాగుడు మూలంగా తలయెత్తే తగాదాలలోకి వెళ్ళకు, కొట్లాటకు సిద్ధం కాకు!

మూర్ఖుని వలే మితిమీరితాగటం మూలంగా ప్రాణాలు కోల్పోయిన యూరిషన్‌ను నీవు అనుసరించకు!

విందు, మందు ఆనందాన్ని తగుమోతాదులోనే కలిగించాలి.

నీకు మంచి స్వరం ఉంటే పాట పాడు! నీకు ఎలా అయినా కదలగలిగిన కాళ్ళు ఉంటే డాన్స్ చేయి! ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళలో మంచి అభిప్రాయం కలిగించడానికి నీవు చేయగలిగిన ప్రతీ పనీ చేయి!

తప్పతాగడం అనేది ఒక అసహ్యకరమైన విషయం. కానీ అలా తాగినట్లు నటించడం అనేది నీకు ఉపయోగకరంగా ఉంటుంది.

దొంగనత్తితో నీ నాలుక తడబడేటట్లు చేయి! నీకు మాటలు పలకడం కష్టంగా ఉన్నట్లు నటించు! అప్పుడు నీవు కొంచెం హద్దుమీరి ఏమి చేసినా, ఏమి మాట్లాడినా కూడా, అది నీవు ఎక్కువగా తాగడం వలన అలా జరిగిందని భావించబడుతుంది.

నీ ప్రియురాలికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపు, ఆమె భర్తకు కూడా శుభాకాంక్షలు తెలుపు, కానీ మనసులో మాత్రం అతడికి అశుభం జరగాలని కోరుకో!

అథిథులు వెళ్ళడానికి లేచినిలబడినపుడు నీ ప్రియురాలికి బాగా సమీపానికి వెళ్ళడానికి నీకు మంచి అవకాశం దొరుకుతుంది. గుంపులో కలిసిపోయి, చాకచక్యంగా ఆమెకు దగ్గరగా వెళ్ళి, నీ చేతి వ్రేళ్ళు ఆమె తొడకు రుద్దుకొనేటట్లు, అలాగే నీ పాదం ఆమె పాదానికి తగిలేటట్లు చేయి!

ఇది ఆమెతో మాట్లాడే సమయం.

పనికిమాలిన బిడియాన్ని దూరంగా పారద్రోలు!

అదృష్టదేవత, ప్రేమదేవత ఇరువురూ ధైర్యవంతులకే అనుకూలంగా ఉంటారు.

ఏమి మాట్లాడాలో చెప్పమని నన్నడగవద్దు! నీవు మాట్లాడటం మొదలుపెడితే మాటలకోసం వెతుక్కోకుండా తగినంత వేగంతో వాటంతటవే వచ్చేస్తాయి.

నీవొక ప్రేమికుడి పాత్ర పోషించాలి. ఆమె కోసం నీవెంతగా వేగిపోతున్నావో ఆమెతో చెప్పు! ఆమె నమ్మకాన్ని గెలుచుకోవడానికి నీకున్న ప్రతీ నైపుణ్యాన్ని ఉపయోగించు!

ఇది కష్టమని అనుకోకు! ప్రతీ స్త్రీ తానొక కోరుకోదగిన వ్యక్తిననే భావిస్తుంది. చివరికి చాలా సాధారణంగా ఉండే స్త్రీకూడా తాను ఆకర్షణీయంగా ఉన్నట్లు భావించుకుంటుంది.

ఆరంభంలో ప్రేమను నటించినవాడు చివరికి నిజంగానే ప్రేమలో పడటం (48) ఎన్నిసార్లు జరగలేదు.

కనుక ఓ సుందరీమణులారా! ప్రేమికుడినంటూ మీ వెంటపడేవారిని దయగల దృష్టితో చూడండి! ఇప్పుడు నటించబడుతున్న ప్రేమ త్వరలోనే నిజమైన ప్రేమ కాగలదు!

నిండుగా ప్రవహించే నది దాని గట్లను నెమ్మదిగా కోతకు గురిచేసినట్లుగా, అన్యాపదేశమైన ప్రశంసలతో ఆమె హృదయంలోకి దొంగతనంగా ప్రవేశించగలవు.

ఆమె ముఖాన్ని, ఆమె శిరోజాలను, సన్నని ఆమె చేతి వ్రేళ్ళను, చిన్నగా, మృదువుగా ఉండే ఆమె పాదాలను ప్రశంసించడంలో ఎప్పుడూ అలసిపోకు!

పవిత్రమైన నడవడిక కలిగినవారు కూడా తమ అందాన్ని పొగిడినపుడు పొంగిపోతారు. పరిశుద్ధ కన్యలు కూడా తమ రూపలావణ్యాలను ఎంతో ఇష్టంగా కాపాడుకుంటారు. అలాకాకపోతే ఇడా అడవిలో తమ అందానికి బహుమతిని పొందలేకపోయినందుకు (49)జూనో, మినర్వాలు ఇప్పటికీ ఎందుకు సిగ్గుపడుతున్నారు?

అక్కడున్న మయూరాన్ని చూడు! దాని ఈకలను నీవు ప్రశంసలతో ముంచెత్తినట్లైతే, అది గర్వంతో తన పురి విప్పుతుంది. అలాకాక దాని వంక నీవు మౌనంగా చూచినట్లైతే, అది తన సంపదను ఎన్నడూ చూపించదు.

పందెపుగుఱ్ఱాలు పోటీ విరామసమయంలో తమ జూలు దువ్వబడినపుడు, తమ మెడ తట్టబడినపుడు గర్వపడతాయి.





Footnote:


(44) మినాడ్‌లు అంటే మధుదేవుడైన బాకస్‌ను అనుసరించి ఉండే స్త్రీలు, శాటిర్‌లు అంటే సగం మనిషి, సగం మేక లేక గుఱ్ఱంగా ఉండే విచిత్ర జీవులు. ఇవి కూడా బాకస్‌ను అనుసరించి ఉంటాయి.


(45) సైలినస్ బాకస్‌కు పెంపుడు తండ్రి, అనుచరుడు. శాటిర్‌లకు నాయకుడు. ఇతడు పొట్టిగా, లావుగా, బట్టతలతో ఉండే ఒక తాగుబోతు ముసలివాడు.


(46) బాకస్ మదువుతోపాటు వ్యవసాయానికి కూడా అధిదేవుడు


(47) ప్రేమలో విజయం సాధించడానికి ప్రియుడు చేసే ప్రయత్నాలను ఒవిడ్ ఇక్కడ ప్రేమదూతగా మూర్తీభవింపచేశాడు


(48) ప్రతీ స్త్రీ తానొక కోరుకోదగిన వ్యక్తిననే భావిస్తుంది కనుక ఒక పురుషుడు ఆమె ప్రేమను అభ్యర్థించినపుడు ఆ అభ్యర్థన నిజమైనదే అని ఆమె నమ్మడం అంత కష్టమేమీ కాదని పురుషులనుద్దేశించి చెప్పిన ఒవిడ్, ప్రేమను అభ్యర్థించే పురుషుడి నిజాయితీని శంకించి తిరస్కరించనవసరంలేదు. ఒకవేళ వారు ఆరంభంలో కపట ప్రేమను ప్రదర్శిస్తున్నా ఆ ప్రేమ త్వరలోనే నిజమైన ప్రేమగా మారిపోతుందని స్త్రీలనుద్దేశించి చెప్పాడు.


(49) జూనో (హీర), మినర్వ (పల్లాస్ లేక ఎథినా), వీనస్ (ఆఫ్రోడైట్) ఈ ముగ్గురు దేవతలలో అందగత్తె ఎవరనే విషయంలో జరిగిన పోటీలో వీనస్ గెలుపొందింది. 







No comments:

Post a Comment