Sunday, April 30, 2023

మూడుతరాల బానిసత్వం



మూడుతరాల బానిసత్వం


తొలితరం బానిసత్వం ఆఫ్రికన్లకు పరిమితమయ్యింది. ఆఫ్రికా ఖండంలోని నల్లజాతి ప్రజలను అన్యాయంగా, దౌర్జన్యంగా బంధించి అమెరికా తీసుకుపోయి, అక్కడ వారిని సంతలో పశువులను అమ్మినట్లుగా అమ్మితే, కొన్నవారు వారికి ఏమీ చెల్లించకుండా కేవలం బ్రతకడానికి (చావకుండా ఉండటానికి) ఇంత తిండి పెడుతూ, ఎదురు తిరిగితే తీవ్రంగా శిక్షిస్తూ, వారితో జీవితాంతం వెట్టి చాకిరీ చేయించుకునేవారు. తమ యజమాని చెప్పిన పనిని చేయడం తప్ప వారికి ఎలాంటి హక్కులు ఉండేవి కావు. 


ఇంతటి అమానుషమైన బానిస వ్యవస్థను రద్దుచేయాలనే డిమాండ్ చివరికి అమెరికాలో అంతర్యుద్ధానికి (Civil War) దారితీస్తే, అబ్రహాం లింకన్ ఈ వ్యవస్థను రద్దుచేసి, అమెరికాలోని నల్లజాతివారందరికీ విముక్తిని ప్రసాదించాడు. అమెరికాలో ఇప్పుడు మనం చూస్తున్న నల్లవారిలో ఎక్కువమంది వారి సంతతే.      


నల్లజాతీయుల బానిస వ్యవస్థ రద్దవడంతో తెల్లవారి దేశాలలో, వారి వలసలలో (Colonies) శ్రామికుల కొరత ఏర్పడింది. ఆ కొరతను పూడ్చడానికి మలితరం బానిసత్వం మొదలైనది. దాని పేరే ఒప్పంద శ్రామిక (Contract Labour) వ్యవస్థ. భారతదేశం లాంటి వలస పాలిత దేశాలు దీనికి వేదిక అయ్యాయి. 


తెల్లవారి దేశాలలో, వారి వలసలలో పనిచేయడానికి నిర్బంధ విధానంలో కాకుండా, ఒక ఒప్పందాన్ని (Contract) కుదుర్చుకుని, వారిని ఆయాదేశాలకు తీసుకుపోయి పనిచేయించుకునేవారు. నల్లజాతి వారిలా కాకుండా, వీరికి మాత్రం చేసినపనికి ప్రతిఫలం చెల్లించేవారు. భారతదేశంలాంటి దేశాలలోని పేదప్రజల సగటు ఆదాయం కన్నా అది ఎక్కువగా ఉండటంతో, చాలామంది పేదప్రజలు ఒప్పంద కార్మికులుగా మారి, ఆయా దేశాలకు వలసవెళ్ళి, కాలక్రమంలో అక్కడే స్థిరపడిపోయారు.


రెండవ ప్రపంచ యుద్ధానంతర పరిణామాలలో వలసలన్నీ స్వాతంత్ర్యాన్ని పొందడంతో ఈ వ్యవస్థ కూడా దానంతటదే కనుమరుగైపోయింది. ఇప్పుడు వివిధ దేశాలలో మనం చూస్తున్న భారతజాతి ప్రజలలో ఎక్కువమంది ఆ ఒప్పంద కార్మికుల సంతతే. 


ఒప్పంద కార్మిక వ్యవస్థ అంతరించిన పిమ్మట మూడవతరం బానిసలు తలయెత్తారు. వారే Willing Employees. వీరిని ఎవరూ బలవంత పెట్టరు..., ఎవరూ వీరితో ఒప్పందం చేసుకోరు. తమంతట తామే ...అధిక సంపాదన కొరకూ, ఉన్నత జీవన ప్రమాణాలకొరకూ  ఇష్టపూర్వకంగా తరలివెళతారు. 


ఇది కాలక్రమంలో పెరిగి పెరిగి, ఇప్పుడు పెద్దయెత్తున కొనసాగుతున్నది. వీరు ప్రపంచంలోని అన్ని దేశాలనుండి తలయెత్తినా ముఖ్యంగా చైనా, భారత్ లాంటి ఆసియా దేశాల నుండి అధిక సంఖ్యలో ఉన్నారు. వీరు తమ తమ దేశాలలోనే చదువు పూర్తి చేసుకొని, ఉద్యోగం నిమిత్తం అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా మొదలైన ధనిక దేశాలకు వలస వెళ్ళతారు. వీరిలో కొందరు తిరిగి వస్తారు; అధిక సంఖ్యాకులు మాత్రం అక్కడే స్థిరపడతారు. 


ఈ 3G Slavery ఇంకెంత కాలం కొనసాగుతుందో, ఎప్పుడు అంతరిస్తుందో కాలమే చెప్పాలి. 





చదువులలో వర్గభేదాలు




చదువులలో వర్గభేదాలు


సమాజంలో సాధారణ ప్రజల పిల్లలు మంచి ఉద్యోగంలో స్థిరపడటానికి ఐ.ఐ.టి., యన్.ఐ.టి., ఐ.ఎ.యస్., ఐ.పి.యస్. మొదలైనవి చదవడానికి ప్రయత్నిస్తారు.

 

ఉన్నత వర్గాల పిల్లలు మాత్రం తమ కుటుంబానికి చెందిన సంపదను కాపాడుకోవడానికి, వ్యాపార సామ్రాజ్యాలను విస్తరించుకోవడానికి యం.బి.ఎ., కామర్స్, ఎకనామిక్స్, సైకాలజి, మాస్ కమ్యూనికేషన్ మొదలైనవి చదువుతారు. 





BRAND - QUALITY - 2




జె.పి., జె.డి. - గాంధీ, మోదీ



రాజకీయాలలో జె.పి., జె.డి. లాంటి వ్యక్తులను ప్రజలు ఎన్నుకోకపోవడానికి కారణం వారు నాణ్యత ఉన్నవ్యక్తులేకానీ, బ్రాండింగ్ ఉన్న వ్యక్తులు కారు.


రాజకీయాలలో గాంధీ, నెహ్రూ ఒకబ్రాండ్...


యన్.టి.ఆర్. ఒక బ్రాండ్....


వై.యస్. ఒక బ్రాండ్....


మోదీ ఒక బ్రాండ్... 


స్వాతంత్రోద్యమ కాలంలో గాంధీ, నెహ్రూ బ్రాండింగ్ రూపుదిద్దుకున్నది.


చలనచిత్రాలలో నటించే కాలంలోనే యన్.టి.ఆర్. అనే బ్రాండ్ రూపుదిద్దుకున్నది. 


రాజశేఖర్ రెడ్డి పరిపాలనాకాలంలో వై.యస్. అనేది ఒక బ్రాండ్‌గా మారింది. 


మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు తనను తాను ఒక బ్రాండ్‌గా మార్చుకున్నాడు. 


బ్రాండింగ్ అంటే ప్రజలను సైకలాజికల్‌గా డామినేట్ చేసి, వారు మనలను అంగీకరించేటట్లు చేయడం. దీనినే ప్రజల విశ్వాసాన్ని చూరగొనడం, ప్రజాదరణను పొందడం అని కొంచెం మర్యాదపూర్వకంగా చెబుతారు. 


అందుకే బ్రాండింగ్ ఉన్న నాయకులను ప్రజలు గంపగుత్తగా ఓట్లు వేసి గెలిపిస్తారు. 


అలాంటి బ్రాండింగ్ ఏదీ జె.పి., జె.డి.ల విషయంలో జరగలేదు. వారు కేవలం నిజాయతీ, చిత్తశుద్ధి ఉన్న వ్యక్తులు మాత్రమే.

 






BUY QUALITY - SELL BRAND

 



BUY QUALITY - SELL BRAND



నాణ్యత ఒక్కదాని ద్వారా నీవు ప్రజాదరణను పొందలేవు. బ్రాండింగ్ కావాలి. నాణ్యత, బ్రాండింగ్ రెండూ ఉంటే మంచిదే కానీ ప్రజల విశ్వాసం చూరగొనడంలో నాణ్యత పాత్ర స్వల్పం. అది నీ నైతికతకు మాత్రమే అద్దం పడుతుంది. నాణ్యతను గుర్తించేంత శ్రమను ఎక్కువమంది ప్రజలు తీసుకోరు. వారు గొర్రెలవంటివారు. మిగతావారు ఏంచేస్తున్నారో గమనించి తామూ అదే పనిని చేస్తారు. బ్రాండింగ్ మాయాజాలంతో ముందు కొంత మందిని రాబడితే మిగిలిన వారు కూడా మిడతలదండు వలే వచ్చి చేరతారు.


నీవు మాత్రం కొనేటపుడు నాణ్యతను కొను... తక్కువ ధరకు వస్తుంది. అమ్మేటపుడు బ్రాండ్‌ను అమ్ము... అధిక ధర పలుకుతుంది. 




ప్రాణప్రదమైనవి



ప్రాణప్రదమైనవి


ATMOSPHERE IS MORE THAN LIFE 

Because it decides your character and that character decides your DESTINY.

In the long run of your life your character (not your efforts) only transforms into your destiny. So associate with good people and always dismiss the bad company.



EDUCATION IS EQUAL TO LIFE

Because it decides your career and that career decides your SUCCESS.

Education is not always formal. Any form of learning is called Education. So don't loose any opportunity to learn anything worthy.



NUTRITION IS NEXT TO LIFE

Because it decides your health and that health decides your PHYSICAL WELL-BEING.

 Do not consider food as an expenditure. It is an investment. You can do anything in the world only if you are physically fit. So take nutrient food and avoid bad habits. 


జీవితంలో దేన్ని అయినా వాయిదా వేయి కానీ, ఈ మూడింటినీ ఎన్నడూ వాయిదా వేయకు. ఎందుకంటే ఇవి ఎప్పటికప్పుడు జరగాల్సినవి... ఎల్లప్పుడూ జరగాల్సినవి. ఒకవేళ వాయిదావేస్తే ఆలోటును పూడ్చుకునే అవకాశాన్ని జీవితం నీకెప్పటికీ ఇవ్వదు.



Tuesday, August 4, 2020

ప్రేమకళ - రెండవ భాగం - XII






ప్రేమకళ 

(రెండవ భాగం) 


Book II Part XII: Aphrodisiacs? 


మందులు, మాకులు








సావరి (Satureja) లాంటి హానికరమైన మూలికలతో నీ శృంగార సామర్థ్యాన్ని పెంచుకోమని కొంతమంది నీకు సలహా ఇస్తారు. 


నా దృష్టిలో అవన్నీ విషాలు తప్ప మరేమీ కాదు. 


లేదంటే వారు మిరియాలను దురదగొండి విత్తనాలతో కలిపి, లేదా పచ్చ చేమంతిని పాత ద్రాక్షసారాయిలో పిండి వాడమని కూడా చెబుతారు. 


ఎరిక్స్ పర్వత శిఖరాన నీడగా ఉండే కొండవాలు మీద కొలువైయున్న దేవత (వీనస్) తను అనుగ్రహించే సుఖాలను అనుభవించడానికి అలాంటి వికృత మరియు హింసాత్మక సాధనాలను ఆమోదించదు. 


అయినప్పటికీ, నీవు మెగెరా ప్రాంతం నుండి వచ్చే తెల్ల ఉల్లిపాయను మరియు మన తోటలలో పెరిగే కామోద్రేకాన్ని కలిగించే మూలికలను, గ్రుడ్లను తీసుకోవచ్చు. 


హైమెట్టస్ ప్రాంతం నుండి వచ్చిన తేనెను మరియు సూదుల్లాంటి ఆకులుండే దేవదారు వృక్షపు విత్తనాలను కూడా తీసుకోవచ్చు.










ప్రేమకళ - రెండవ భాగం - XI






ప్రేమకళ 

(రెండవ భాగం)


Book II Part XI: Have Other Friends: But Be Careful 


వేరే స్నేహాలను కలిగి ఉండు: కానీ జాగ్రత్త!






కోపం తారాస్థాయికి చేరి తన దంతాల మెరుపు దెబ్బతో వడిగల వేటకుక్కలను దొర్లించి వేస్తున్న ఎర్రబొచ్చు అడవిపంది కానీ... 


తన కూనలకు చన్నులప్పగించి స్తన్యమిస్తున్న ఆడసింహం కానీ...


జాగరూకుడు కాని పాదచారిచే తొక్కబడిన రక్తపింజర గానీ... 


.......తన భర్త పడకమీద వేరొక ఆడది ఉండగా చూచిన ఆడదానికన్నా భీకరమైనవికావు. 


ఆమె ముఖం క్రోధంతో వంకర్లు తిరిగిపోతుంది. కత్తి, కొరివి, చేతికి ఏది దొరికితే అది దొరకబుచ్చుకుని, సంయమనం అంతా పక్కనబెట్టి, అయోనియన్ దేవుడి వలన పిచ్చిపట్టిన మెనాడ్ వలే తన శత్రువుమీదకు దూసుకెళుతుంది.  


జాసన్ దుశ్చర్యలకు మరియు అతడు వివాహబంధాన్ని ఉల్లంఘించినందుకుగానూ కిరాతకురాలైన మెడియా తన స్వంత పిల్లలను చంపటంద్వారా ప్రతీకారం తీర్చుకున్నది. 


అదిగో, ఆ స్వాలో పక్షి కూడా క్రూరమైన తల్లే. చూడు, ఆమె వక్షస్థలం ఇంకా రక్తపుచారికలతోనే ఉన్నది. 


ఆవిధంగా ఎంతో సంతోషకరమైన, ఎంతో దృఢంగా ముడివేయబడిన బంధాలు విచ్ఛిన్నమయ్యాయి. 


అప్రమత్తత కలిగిన ప్రేమికుడు ఈర్ష్యతో కూడిన ఇటువంటి క్రోధావేశాలు తలయెత్తకుండా జాగ్రత్త వహించాలి.


అలాగని నేను మీరంతా ఒకే ప్రియురాలికి కట్టుబడి ఉండాలనే నైతిక ఉద్భోధ చేస్తున్నానని ఊహించుకోవద్దు. 


పాపము శమించుగాక! 


ఒక వివాహిత స్త్రీకికూడా అలాంటి వ్రతాన్ని ఆచరించడం కష్టంగా ఉంటుంది. 


మీ విలాసాలనేమీ మానుకోవద్దు, కానీ మీరు చేసే ఈ చిన్న చిన్న తప్పులకు మాత్రం సచ్ఛీలత అనే ముసుగును వేయండి.  


నీ అదృష్టాల గురించి ఎన్నడూ గప్పాలు కొట్టకు. 


ఒక స్త్రీకి ఇచ్చిన బహుమతి మరో స్త్రీ గుర్తించేవిధంగా ఎప్పుడూ ఉండకూడదు. 


నీ రహస్య సమావేశాలకు నిర్ణీత సమయం ఉండకూడదు. 


నీ ప్రియురాలికి - ఆమెకు తెలిసిన సంకేతస్థలంలో- నీవు పట్టుబడకుండా ఉండాలంటే అందరినీ ఒకే ప్రదేశంలో కలవకు.  


నీవు ఎప్పుడు ఉత్తరం రాసినా, ఏమి రాసావో ముందు ఓసారి స్వయంగా చదివి పరీక్షించు. చాలా మంది స్త్రీలు ఉత్తరాన్ని -అది అందించదలచుకున్న సందేశం కన్నా- చాలా ఎక్కువ అర్థంతో చదువుతారు.


వీనస్ తాను గాయపడినపుడు సరైన బదులిస్తుంది. గాయపరచిన నిన్ను దెబ్బకు దెబ్బ కొడుతుంది. నీవు తనకు ఎలాంటి బాధ కలిగించావో అదే బాధ నీకు కలిగేటట్లు చేస్తుంది. 


అగమెమ్నాన్ తన భార్యతో సరిపెట్టుకున్నంతకాలం ఆమె పవిత్రంగానే ఉన్నది. అయితే, తన భర్త చేసిన నమకద్రోహం ఆమెను చెడుమార్గం పట్టేటట్లు చేసినది. 


పవిత్ర చిహ్నాలను ధరించిన క్రిసెస్ -తన కుమార్తెను తనకు అప్పగించమని- తన భర్తను వ్యర్థంగా ప్రాధేయపడ్డాడని ఆమె తెలుసుకున్నది. 


ఓ! బ్రైసీస్! దుఃఖంతో నీ హృదయాన్ని చీల్చివేసిన ఈ నీ అపహరణ గురించి, -ఎంత లజ్జాకరమైన కారణాలతో యుద్ధం సుదీర్ఘంగా కొనసాగుతున్నదో కూడా- ఆమె తెలుసుకున్నది. 


అయితే ఇవన్నీ ఆమె వినిన సంగతులు మాత్రమే. 


కానీ ఆమె స్వయంగా తన కళ్ళతో ప్రియామ్ కూతురిని చూసింది. ఒక విజేత తన బంధీకి బానిస అవటం -ఎంత లజ్జాకరమైన దృశ్యం- ఆమె చూసింది. 


ఆ రోజు నుండి క్లైటెమ్‌నెస్ట్రా… ఏగిస్తస్‌ను తన హృదయంలోనికి మరియు పానుపు మీదకు కూడా ఆహ్వానించింది. అంతేకాక తన భర్త చేసిన నేరానికి దుర్మార్గంగా ప్రతీకారం తీర్చుకున్నది. 


నీ రహస్య ప్రేమాయణాలను నీవెంత బాగా దాయడానికి ప్రయత్నించినా కూడా ఒకవేళ అవి వెలుగు చూసినట్లైతే... నీ తప్పును నిరాకరించడానికి ఎన్నడూ సంకోచించకు. 


అటువంటి సందర్భాలలో నీవు లొంగిపోకు, అలాగే ఆమె యెడల మునిపటికన్నా ఎక్కువ ఆదరణ చూపకు. ఎందుకంటే అవి తప్పు చేసినవారి ఖచ్చితమైన లక్షణాలు. 


ఏ ఒక్క ప్రయత్నాన్నీ విడువకుండా ఆమెతో పానుపుమీదకు చేరు. మన్మథకేళి ఒక్కదానిలోనే శాంతి మొత్తం దాగున్నది; నీవు చేసిన తప్పు పూర్వపక్షం అవడానికి అదొక్కటే దారి.



(మెడియా (Medea) తన భర్త అయిన జాసన్ (Jason) తనను విడనాడి కోరింత్ దేశ రాకుమారిని చేపట్టడంతో ఆగ్రహించి ఆమెను మరియు అతడి వలన తనకు కలిగిన ఇరువురి కుమారులను సంహరించి కోరింత్ను విడిచి వెళ్ళిపోతుంది.)


(తన సోదరిని బలాత్కరించి, ఆమె నాలుకను తెగ్గోసిన భర్త టెరియస్ (Tereus) మీద ప్రతీకారంతో ప్రొక్నె (Procne) అతడి వలన తనకు కలిగిన కుమారుడిని చంపి, అతడికి వండి పెడుతుంది. భుజించిన తరువాత జరిగిన సంగతి తెలిసుకున్న టెరియస్ ఆగ్రహంతో ఆమెను సంహరించడానికి వెంటపడగా ఆమె ఒక స్వాలో పక్షిగా మారిపోతుంది.)
.

(ట్రోజన్ యుద్ధంలో గ్రీకుసేనాని అగమెమ్నాన్ (Agamemnon) ట్రోజన్ పూజారి క్రిసెస్ (Chryses) కుమార్తెను చెరబట్టి, అతడు ప్రాధేయఫడినా విడిచిపెట్టలేదని గ్రీసులో ఉన్న అగమెమ్నాన్ భార్య క్లైటెమ్నెస్ట్రా (Clytemnestra) తెలుసుకుంటుంది. తరువాత తన భర్త బ్రైసీస్ (Briseis) అనే యువతిని చెరబట్టిన విషయాన్ని కూడా తెలుసుకుంటుంది. ఆతరువాత అగమెమ్నాన్ యుద్ధబహుమతిగా ట్రాయ్ రాజు ప్రియామ్ (Priam) కుమార్తె కస్సాండ్రాను (Cassandra) వెంటతీసుకుని గ్రీసుకు వస్తాడు. ఆగ్రహించిన క్లైటెమ్నెస్ట్రా థైస్టెస్ (Thyestes) కొడుకైన ఏగిస్తస్‌తో (Aegisthus)  ప్రేమబంధాన్ని ఏర్పరచుకుని, అతని సహాయంతో వారిరువురినీ హత్యచేస్తుంది.)






                    




Friday, July 31, 2020

ప్రేమకళ - రెండవ భాగం - X



ప్రేమకళ 

(రెండవ భాగం)


కొంతకాలం ఆమెకు కనిపించకు







తీరాన్ని వీడేటపుడు నీ తెరచాపలకు ఎలాంటి గాలి కావాలో అలాంటి గాలి లోపలి సముద్రపు యానానికి అవసరముండదు. 


ప్రేమ జనించే సమయంలో సున్నితంగా ఉంటుంది. అలవాటుపడే కొలదీ దృఢంగా మారుతుంది. సరైన ఆహారంతో దానిని పోషిస్తే అది త్వరలోనే బలిష్ఠంగా మారుతుంది. 
  

ఈ రోజు నిన్ను భయపెడుతున్న ఎద్దును అది దూడగా ఉన్నపుడు నీవు కొట్టేవాడివి. 


నేడు తన నీడన నీకు ఆశ్రయమిస్తున్న వృక్షం ఒకనాడు ఒక బలహీనమైన చిన్నమొక్క. 


తను జన్మించినపుడు ఒక చిన్న పిల్లకాలువగా ఉన్న నది కొద్దికొద్దిగా బలాన్ని సంతరించుకుంటూ, పారే కొలదీ అసంఖ్యాకమైన ఉపనదుల నుండి ఎంతో నీటిని స్వీకరిస్తుంది. 


ఆమె నీకు అలవాటు పడేటట్లు చేసుకో, అలవాటుకన్నా శక్తివంతమైనదేదీ లేదు. 


ఆమె మదిని గెలుచుకోవడానికి నీవు చేసే ప్రయత్నాలలో ఎన్నడూ విసుగుచెందకు. 


నిన్ను ఆమె ఎల్లవేళలా చూస్తూనే ఉండాలి. నీవు చెప్పేది ఆమె ఎల్లవేళలా ఆలకిస్తూనే ఉండాలి. 


నీ ముఖాన్ని ఆమె రాత్రీ చూడాలి, పగలూ చూడాలి. 


నీవు లేకపోవడం ఆమెకు వెలితిగా అనిపిస్తుందనే నమ్మకం నీకు బాగా కుదిరినపుడు ఆమెను ఒంటరిగా వదిలివేయి.


నీవు లేకపోవడం ఆమెకు ఆందోళన కలిగిస్తుందనుంటే ఆమెకు కొంత విరామం ఇవ్వు: కొంత విరామం ఇచ్చిన మట్టి తనలో నాటబడిన విత్తనాలకు హెచ్చుమొత్తంలో తిరిగి చెల్లిస్తుంది.


ఎండిన నేల గగనం నుండి పడే వర్షపునీటిని వేగంగా ఇంకించుకుంటుంది. 


డెమోఫూన్ తన చెంతనే ఉన్నంతకాలం ఫిల్లిస్‌కు అతని యెడల ప్రేమ తాపం నులివెచ్చగానే ఉండేది. అతడు నౌకాయానం ఆరంభించాడోలేదో అతనియెడల మోహంతో ఆమె దహించుకుపోయింది. 


గడుగ్గాయి యులిసెస్ తన ఎడబాటు ద్వారా పెనెలోప్‌ను చిత్రహింస పెట్టాడు. 


లోడామియా, నీవు కన్నీటితో ప్రొటెసిలాస్ తిరిగిరాకను కాంక్షించావు.


కానీ సురక్షిత మార్గాన్ని అనుసరించు. మరీ ఎక్కువ కాలం దూరంగా ఉండకు. ఎడబాటు వలన కలిగే బాధను కాలం తగ్గించివేస్తుంది. 


కనులముందు లేనిది మనసులో కూడా ఉండదు. 


కనిపించని ప్రియుడు త్వరలోనే మరువబడి, అతడి స్థానాన్ని మరొకడు స్వీకరిస్తాడు. 


మెనెలాస్ వెళ్ళగానే ఏకాంత శయనంతో విసిగిపోయిన హెలెన్ తన అతిథి బాహుమందిరంలో ఆత్మీయతను, సాంత్వనను కోరుకున్నది. 


అకటా! మెనాలస్, నీవెంత వెఱ్ఱివాడవు! నీ భార్యను, ఒక అపరిచితుణ్ణి ఒకే కప్పు క్రింద వదిలేసి నీవు ఒక్కడివే వెళ్ళిపోయావు. 


పిచ్చివాడా! 

దుర్బలమైన పావురాన్ని కబళించే గ్రద్దకు అప్పగిస్తావా? 


నిండు గొఱ్ఱెలదొడ్డిని ఆకలిగొన్న తోడేలు వశం చేస్తావా? 


లేదు, హెలెన్‌ను నిందించవలసిన పనిలేదు. ఆమె ప్రియుని దోషంకూడా ఏమీ లేదు. అతడి స్థానంలో నీవున్నా, మరెవరున్నా ఏమి చేసేవారో, అదే అతను చేశాడు. 


సమయం మరియు అవకాశం రెండూ ఇవ్వడంద్వారా నీవే వారిని జారత్వానికి ప్రేరేపించావు. 


ఆమె అమలుపరచినది నీమూలంగా కలిగిన యోచన కాదా? 


ఆమె ఏమి చేయగలదు? ఆమె భర్త దూరంగా ఉన్నాడు, నాగరికుడైన ఒక అతిథి యెదుట ఉన్నాడు, పైగా ఆమె రిక్తశయ్యపై ఒంటరిగా శయనించడానికి భయపడుతున్నది.


మెనెలాస్ ఏమైనా అనుకోనీ; నా దృష్టిలో హెలెన్ నేరం చేయలేదు. ఆమె చేసిందల్లా ఎంతో అనుకూలుడైన తన భర్త మూలంగా లబ్దిని పొందడమే. 








Tuesday, July 28, 2020

ప్రేమకళ - రెండవ భాగం - IX




ప్రేమకళ 

(రెండవ భాగం) 


ఆమె జబ్బుపడినపుడు సాంత్వన కలిగించు!






ఆకురాలుకాలం సమీపిస్తున్నపుడు............


వసుధ పూర్ణశోభతో అలరారుతున్నపుడు...........


ఎఱ్ఱని ద్రాక్షపండ్లు తమ ధూమ్రవర్ణపు రసంతో ఉబ్బి ఉన్నపుడు............


ఎముకలు కొరికే చలి, భరింపరాని ఎండ ఒకటి విడిచి ఒకటి బాధిస్తున్నపుడు............


వాతావరణంలోని ఈ వ్యత్యాసం వలన తరచూ మన శరీరం మాంద్యానికి లోనౌతుంది.


నిజానికి నీ ప్రియురాలు మంచి ఆరోగ్యవంతురాలే అయి ఉండవచ్చు. కానీ ఏదైనా కొద్దిపాటి అనారోగ్యం వలన ఆమె మంచం మీదే ఉండిపోవలసి వస్తే............ వాతావరణం యొక్క దుష్ప్రభావాలకు ఆమె బాధితురాలైనట్లైతే............ నీవెంత శ్రద్ధ గలిగినవాడివో, ఎంత ప్రేమ కలిగిన వాడివో ఆమెకు చూపడానికి నీకిదే సమయం. 


నీవు తరువాత పెద్దమొత్తంలో కోసుకోదగిన పంటకు విత్తనాలు నాటవలసిన సమయం ఇదే. 


ఆమె జబ్బు మూలంగా చిరచిరలాడుతుంటే నిరుత్సాహపడకు.


ఆమె ఆమోదించే సేవలన్నీ నీ స్వహస్తాలతో ఆమెకు అందించు. 


నీవు సహానుభూతితో కన్నీరు కార్చడం ఆమె కంటపడనీయి. 


ఆమెను ముద్దాడటానికి నీవు ఇష్టపడటంలేదని ఆమెనెప్పుడూ గమనించనీయకు.  


ఆమె ఎండిపోయిన పెదవులు నీ కన్నీటితో తడి నింపుకోనీ. 


ఆమె త్వరలోనే తిరిగి కోలుకోవాలని కోరుకుంటూ ఎన్నో ప్రార్థనలు చేయి, వాటన్నింటినీ ఆమె వినేంత బిగ్గరగా చేయి. 


సమయం చూసుకొని, శుభశకునాన్ని సూచించే కల ఒకటి వచ్చిందని ఆమెతో చెప్పు.  


ఒక ముదుసలి అవ్వ తన వణికే చేతులతో గ్రుడ్లను, గంధకాన్ని పట్టుకుని వచ్చి ఆమె మంచాన్ని, ఆ గదిని పరిశుద్ధపరిచే విధంగా ఏర్పాటు చేయి. 


ఈ శ్రద్ధ, ఈ సంరక్షణల జ్ఞాపకాలన్నీ ఆమె తన హృదయంలో పదిలపరచుకొంటుంది. 


అనేక మంది ఇలాంటి చిన్న చిన్న పనులు చేసి, వీలునామా ద్వారా వారసత్వ హక్కులనే పొందారు. 


అలాగని అనవసరమైన విషయాలలో వేలు పెట్టి, అసలే జబ్బుతో ఉన్న ఆమెకు నీ మీద ఏవగింపు (loathing) కలిగేటట్లు చేసుకోకు.


నీవు ప్రదర్శించే ఆదరం అంతా ఆమెకు సంతోషం కలిగించేవిధంగా (charming) మాత్రమే ఉండాలి.


నీ ఆపేక్ష, నీ ఆందోళన శృతిమించకూడదు. 


ఆమె తీసుకునే ఆహారాన్ని నియంత్రించే పనిని నెత్తిన వేసుకోకు. 


ఆమెకు 'అది తినకూడదు', 'ఇది తినకూడదు' అని చెప్పకు. 


రోతపుట్టించే మందు తెచ్చి తాగమని ఆమెకు ఇవ్వకు. 


అదంతా నీ ప్రత్యర్థికి వదిలివేయి. 









Monday, July 27, 2020

ప్రేమకళ - రెండవ భాగం - VIII



ప్రేమకళ 

(రెండవ భాగం)


ఆమె చెప్పినట్లు నడచుకో!  ఆమె చేసినది మెచ్చుకో!








నీవు ఏదైనా ఒక ఉపయోగకరమైన పని చేయాలని నిర్ణయించుకున్నపుడు, ఆ పని చేయమని నీ ప్రియురాలే నిన్ను  అడిగేటట్లు చేసుకో!  


నీవు నీ బానిసలలో ఒకడికి స్వేచ్ఛనివ్వాలని తలచినట్లైతే ఆ బానిస ఆమెను అభ్యర్ధించేటట్లు చేయి. 


విధినిర్వహణలో చూపిన నిర్లక్ష్యానికి నీ బానిసను నీవు శిక్షించకూడదనుకుంటే ఆ దయగల చర్యలో ఆమెకు పరపతి దక్కేటట్లు చూడు. 


ప్రయోజనం నీది, పేరు ఆమెది. నీకు పోయేదేమీలేదు. ఆమె మాత్రం నిన్ను తన చిటికెనవ్రేలితో ఆడించగలనని అనుకుంటుంది.


నీ ప్రియురాలి ప్రేమ అలాగే కొనసాగాలని నీవు అనుకుంటే ఆమె అందచందాలకు నీ కళ్ళు చెదిరిపోయాయని ఆమె భావించేవిధంగా నీవు చేయాలి.  


ఆమె ఊదారంగు దుస్తులు ధరిస్తే ఊదారంగుకు సాటిరాగలది మరేదీలేదని ఆమెతో చెప్పు. 


ఆమె కోస్ వస్త్రంతో చేసిన గౌను ధరిస్తే ఆమెకు అంత మనోహరంగా నప్పేది మరేదీలేదని ఆమెతో చెప్పు. 


ఆమె బంగారు వస్త్రాలు ధరించి మెరిసిపోతుంటే ఆమె సౌందర్యం ముందు బంగారం తీసికట్టేనని నీవు భావిస్తున్నట్లు ఆమెతో చెప్పు. 


ఆమె చలికాలపు ఉన్ని బట్టలు ధరిస్తే అవి మనోజ్ఞంగా ఉన్నాయని ఆమెతో చెప్పు. 


ఆమె పలుచని వస్త్రాలలో కనబడితే నీలో ఆమె ప్రేమాగ్ని రగిల్చిందని చెప్పు. అలాగే జలుబు చేయకుండా జాగ్రత్తవహించమని ఆందోళనకరమైన స్వరంతో ఆమెను అర్థించు. 


ఆమె నుదిటిమీద కురులు రెండుగా విడిపోతే ఆ విధానమే నీకిష్టమని చెప్పు.

ఆమె వేడి ద్వారా తన కేశాలను ఉంగరాలు తిప్పుకుంటే "ఉంగరాల జుట్టంటే నాకెంత ప్రేమో" అని చెప్పు.  


ఆమె నృత్యం చేసేటపుడు ఆమె చేతులను, ఆమె గానం చేసేటపుడు ఆమె స్వరాన్ని ప్రశంసించు. ఆమె వాటిని ముగిస్తే అంత త్వరగా అవి ముగింపుకు చేరినందుకు నీవెంతో చింతిస్తున్నావని చెప్పు. 


ఆమె నిన్ను తన పానుపు మీదకు అనుమతిస్తే ఆ సుఖాలపెన్నిధికి వందనమర్పించు, ఆనందాతిశయంవలన  వణుకుతున్న స్వరంతో ఆమె నీకు ఎలాంటి స్వర్గాన్ని అందించిందో చెప్పు. 


ఆమె భయంకర సర్పకేశిని (Medusa) కన్నా ప్రచండమైన స్త్రీ అయినాకూడా తన ప్రియుని యెడల (అతని మాటలతో) సాత్వికంగా, వినమ్రంగా మారిపోతుంది. 


నీవు మంచి కపటిగా ఉండాలి. అంతేకాక నీ ముఖంలో ఎన్నడూ నీవు చెప్పేమాటలను సమర్థించలేని భావం కనబడకూడదు. 


పన్నాగం అనేది ఎదుటివారు గ్రహించనంతసేపే ప్రయోజనకరం. ఒకసారి అది తెలిసిపోయిందంటే భంగపాటు తప్పదు. నమ్మకం ఇక ఎప్పటికీ పోయినట్లే. 













Sunday, July 26, 2020

ప్రేమకళ - రెండవ భాగం - VII





ప్రేమకళ 

(రెండవ భాగం)


అభిరుచి కలిగిన చిన్న చిన్న బహుమతులను ఆమెకు అందించు






నీ ప్రియురాలికి ఖరీదైన బహుమతులను అందించమని నేను నీకు సలహా ఇవ్వను. అల్పమైనవి కొన్నింటిని ఆమెకు సమర్పించు. అయితే వాటిని జాగ్రత్తగా ఎంచుకోవాలి, అవి సందర్భానికి తగినట్లుగా ఉండాలి. 


దేశం తన సమృద్ధియైన సంపదలనన్నింటినీ ప్రదర్శిస్తున్నపుడు, చెట్లకొమ్మలు బరువుతో క్రిందికి వంగినపుడు ఒక పండ్లబుట్టను ఆమె తలుపువద్ద వదిలిరావడానికి ఒక యువబానిసను నియోగించు.


దేశంలోని మీప్రాంతంనుండి అవి వచ్చినట్లుగా నీవు చెప్పవచ్చు - నిజానికి వాటిని నీవు రోమ్ లోనే కొన్నప్పటికీ.  


ఆమెకు ద్రాక్షపండ్లను గానీ అమరిల్లిస్ ఇష్టపడిన అడవిగింజలను (chestnuts) గానీ పంపు. ఇప్పుడైతే అమరిల్లిస్ వాటిని ఇష్టపడకపోవచ్చు. 


అవేకాదు, గువ్వలనో గోరింకలనో బహూకరించి కూడా నీ మదిలో ఆమె నిలిచియున్నదనే విషయాన్ని చాటవచ్చు.  


సంతానం లేని ఒక ధనిక వృద్ధురాలి దాయాదులు కూడా ఇదే పద్దతిని అనుసరిస్తారని నాకు తెలుసు. బహుమతులకు అపనింద తెచ్చినవారు నశించుగాక!


కవిత్వం పంపమనే సలహా కూడా నేను నీకు ఇవ్వనా? అయ్యో, పద్యాలు అంతగా గణింపబడవు!


పద్యాలను అందరూ ప్రశంసిస్తారు, కానీ నిజానికి వారు బహుమతులనే కోరుకుంటారు.


అనాగరికుడైనా సరే, అతడు ధనవంతుడైనచో అనుగ్రహపాత్రుడు అవుతాడు. 


ఇది స్వర్ణయుగమన్నది చాలా నిజం. స్వర్ణం ఉన్నతమైన గౌరవాలను కొనుగోలు చేస్తుంది. స్వర్ణం ప్రేమను కూడా ఖరీదు చేస్తుంది. 


తొమ్మిదిమంది విజ్ఞానదేవతలతో కలిసి హోమర్ అంతటివాడు వచ్చినాకూడా అతడు తనతోపాటు ఏమీ వెంటతేకపోతే తక్షణం వెళ్ళగొట్టబడతాడు.


అయినప్పటికీ పాండిత్యం కలిగిన స్త్రీలు కొంతమంది ఉంటారు. అయితే వారు అరుదుగా ఉంటారు. 


పాండిత్యమేమీ లేకుండా, ఉన్నట్లు కనిపించాలని అభిలషించే వారు కూడా ఉంటారు. 


వారిరువురినీ కూడా నీవు నీ కవిత్వం ద్వారా ప్రశంసించు. 


నీ కవిత్వం ఏపాటిదైననూ, దానిని ప్రభావవంతంగా ఎలా చదవాలో నీకు తెలిసినట్లైతే అది ఇంపుగా అనిపిస్తుంది. 


నిజానికి పద్యాలను బాగా కూర్చి, చక్కగా చదివి వినిపించినా కూడా ఆ స్త్రీలు వాటిని ఒక అల్పమైన, .......అత్యంత అల్పమైన బహుమతిగానే భావిస్తారు.







Friday, July 24, 2020

ప్రేమకళ - రెండవ భాగం - VI





ప్రేమకళ 

(రెండవ భాగం)


ఆమె సేవకులను ఆకట్టుకో







ఆమె సేవకులను - అట్టడుగు వారితో సహా- మంచి చేసుకోవడం నీ హోదాకు తగనిపని అని అస్సలు అనుకోకు. 


వారిలో ప్రతి ఒక్కరిని పేరుపెట్టి పలకరించు. వారి బానిస చేతులను నీ చేతులలోకి తీసుకో.  


నీవు కొనగలిగే ఖరీదులో ఉండే బహుమతులను వారికి ఇవ్వు (నీకు ఇదేమంత ఖర్చు కాదు). 


ఆడబానిసల పండుగ (Juno Caprotina) వచ్చినపుడు నీ ప్రియురాలి వ్యక్తిగత సహాయకురాలికి ఓ మంచి బహుమతిని అందించు. 


సేవకగృహ నివాసులందరితో మంచిగా ఉండు. 


వాకిట కావలికాసేవాడిని మరియు నీ ప్రియురాలి గది తలుపు చెంతనే నిదురించే బానిసను మరువకు.



(Juno Caprotina అనేది ప్రాచీన రోమ్‌లో ప్రతిసంవత్సరం జూలై 7 న స్త్రీబానిసల కొరకు జరుపుకునే ఒక పండుగ)











ప్రేమకళ - రెండవ భాగం - V






ప్రేమకళ  

(రెండవ భాగం)


దుర్బలహృదయుడిగా ఉండవద్దు


ప్రేమ అనేది యుద్ధం వంటిది. 


దుర్బలహృదయం అందమైన స్త్రీని ఎన్నటికీ జయించలేదు. 


పిరికిపందలు కాముని సేవకు పనికిరారు.


ప్రేమయుద్ధాలలో పోరాడేవారు రాత్రి, చలికాలం, సుదీర్ఘ ప్రయాణాలు, కౄరమైన బాధ, వేదన కలిగించే శారీరకశ్రమ.....  ఇలాంటివన్నీ భరించాలి.  


అనేకసార్లు నీవు ఆకాశంలోని కరిగే మేఘాలనుండి కురిసే జడివానను సహించాలి, .......అలాగే అనేకసార్లు చలిలో కటికనేలమీద పరుండాలి.  


అడ్మిటస్ కు చెందిన పశువుల మందలను కాస్తున్నపుడు అపోలో ఒక చిన్న గుడిశలో నివశించేవాడని చెబుతారు. అపోలో చేసినట్లుగా చేయడానికి ఎవరు సిగ్గుపడతారు? 


కలకాలం గాఢంగా ప్రేమించాలనుకుంటే నీవు తప్పక అతిశయాన్ని విడనాడాలి. 


నీ ప్రియురాలివద్దకు సాధారణమైన మరియు సురక్షితమైన మార్గం నీకు నిరాకరించబడినట్లైతే,..........

ఆమె తలుపులు నీకు మూసివేయబడినట్లైతే............ 

ఇంటికప్పు పైకి ఎక్కి, పొగగొట్టం గుండానో, ఆకాశగవాక్షం గుండానో కిందికి దిగు. 


తన కొరకు నీవు చేసిన ఈ ప్రమాదకర సాహసాన్ని చూసి ఆమె ఎంతగా సంతోషిస్తుందో! 


ఇది నిఖార్సయిన నీ ప్రేమను ఆమెకు తెలియజేయడానికి నీవు చేసిన ఒక బాస. 


లియాండర్ అనేకసార్లు తన ప్రియురాలు లేకుండా ఉండగలిగికూడా తన గాఢమైన ప్రేమను నిరూపించడానికి జలసంధి ఆవలకు ఈదేవాడు.



(గ్రీకు దేవుడైన అపోలో పైథాన్ అనే పామును సంహరించడంతో శపించబడి ఒలంపస్ పర్వతం నుండి బహిష్కరించబడి కొంతకాలం అడ్మిటస్ అనే రాజు వద్ద పశువులకాపరిగా సేవలందిస్తాడు.)


(హీరో అనే యువతి ఆసియామైనర్ (టర్కీ) లోని హెల్లెస్పాంట్ జలసంధికి ఆవల ఉన్న ఒక ఊరిలో ఆఫ్రోడైట్ దేవతకు పూజారిణి. జలసంధికి ఈవల నున్న ఊరికి చెందిన లియాండర్ అనే యువకుడూ ఆమె ప్రేమించుకుంటారు. ఆమె పూజారిణి కనుక వారి వివాహం జరగడానికి వీలులేదు. కనుక లియాండర్ జలసంధిని ఈది వెళ్ళి ఆమెను కలుసుకునేవాడు.)




Friday, May 22, 2020

ప్రేమకళ - రెండవ భాగం - IV






ప్రేమకళ

(రెండవ భాగం) 


సహించు, శిరసావహించు, ఏకీభవించు







నీ ప్రియురాలు నీయెడల నిర్దయగా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే దానిని ఓర్పుతో భరించు; ఆమె త్వరలోనే తన మనసు మార్చుకుంటుంది. 


నీవొక కొమ్మను జాగ్రత్తగా, మెల్లగా వంచినట్లైతే అది విరగదు. అదే నీ బలమంతా ఉపయోగించి దానిని తటాలున లాగినట్లైతే అది పుటుక్కున విరిగిపోతుంది. 


నీటిప్రవాహంతో కలిసి పయనిస్తే నీవు నదిని సకాలంలో దాటతావు. ఏటికి ఎదురీదడానికి ప్రయత్నిస్తే ఎప్పటికీ దాటలేవు. 


ఓర్పు పులులు, నుమిడియా సింహాలను కూడా మెత్తబరుస్తుంది. ఎద్దు నెమ్మదిగా అరకకు అలవాటు పడుతుంది.


అర్కాడియాకు చెందిన అటలాంటా కన్నా మచ్చికకాని స్త్రీ ఎక్కడైనా ఉందా; ఆమె ఎంతటి అహంకారి అయినప్పటికీ చివరికి ఒక ప్రేమికుడి నిరంతరాయమైన ఏకాగ్రతకు, ఓపికకు లొంగిపోయింది. 


మిలానియన్ తన ప్రియురాలి నిర్దయకు, తన దురదృష్టానికి ఎన్నోసార్లు ఆ చెట్లకింద విలపించాడని అంతా చెప్పుకుంటారు. ఆజ్ఞప్రకారం, తరచూ వేటవలలను తన మెడమీద మోసేవాడు. తన బల్లెంతో తరచూ అడవిపందులను చీల్చిచండాడేవాడు. హైలాస్ బాణాలు కూడా అతడికి తగిలేవి. అయితే వేరేబాణాలు......, అయ్యో! అవేంటో అతడికి బాగా తెలుసు (ప్రేమదేవుడి బాణాలు), మరింత బాధాకరమైన గాయాలను అతడికి చేసేవి.


విల్లు తీసుకుని మెనాలస్ ప్రాంతపు కొండలను, కోనలను అధిరోహించమనిగానీ, అతిబరువైన వలలను నీ వీపున మోయమనిగానీ నేను నిన్ను ఆదేశించను. శత్రుబాణాలకు నీ ఱొమ్మును ఎదురొడ్డమని నేను నిన్ను ఆజ్ఞాపించను. నీవు గనుక వివేకవంతుడివైనట్లైతే నా నియమ నిబంధనలు ఆచరించడానికి ఏమంత కష్టం కాదని నీవు తెలుసుకుంటావు. ఆమె ఒకవేళ మొండిగా ప్రవర్తిస్తుంటే, ఆమెను అలాగే ఉండనివ్వు, చివరికి విజయం నీదే అవుతుంది.


ఆమె నిన్ను ఏమి చేయమన్నా సరే, దానిని తప్పనిసరిగా చేయడం ఒక్కటే నీ పని. 


ఆమె దేనిని నిందిస్తుందో, దానిని నీవూ నిందించు. 


ఆమె దేనిని ఇష్టపడుతుందో, దానిని నీవూ ఇష్టపడు. 


ఆమె దేనిని కాదంటుందో, దానిని నీవూ కాదను. 


ఆమె నవ్వితే, నీవూ నవ్వు. 


ఆమె కన్నీరు పెట్టుకుంటే, నీవూ కన్నీరు పెట్టుకో. 


ఒక్క మాటలో చెప్పాలంటే నీ మనోస్థితి ఆమె మనోస్థితికి అద్దంపట్టాలి.  


ఆమె పచ్చీసు ఆడాలని కోరుకుంటే, నీవు కావాలనే సరిగా ఆడకుండా ఆటలో ఆమెను గెలవనీయి. 


మీరు పాచికలాట ఆడుతుంటే ఆమెను ఓడిపోయి ఉక్రోషపడనీయకు, పైగా అదృష్టమెప్పుడూ నీదరికి రాదన్నట్లుగా కనబడనీయి. 


మీ యుద్ధక్షేత్రం చదరంగం అయితే నీ యోధులందరూ తమ గాజుశత్రువు చేతిలో ఊచకోతకు గురయ్యేటట్లు చూసుకో.


ఆమె గొడుగు ఆమె పైనే ఉండేటట్లుగా జాగ్రత్తగా పట్టుకో,  


ఆమె గుంపులో కనుక చిక్కుకుంటే ఆమెకు దారి ఏర్పరచు, 


ఆమె పానుపుపైకి చేరాలనుకుంటే సహాయంగా పీట తెప్పించు. 


ఆమె నాజూకైన పాదాలకు పాదరక్షలు తొడుగు లేక విప్పు. 


మరి నీవు చలితో చస్తున్నాసరే తరచు ఆమె చల్లని చేతులను నీ ఛాతీమీద వెచ్చబరచాలి. 


కొంత అగౌరవంగా కనిపించినప్పటికీ, ఆమె చూసుకోడానికి బానిసవలే ఆమె అద్దాన్ని పట్టుకోడానికి నీవు అన్యధా భావించకూడదు. 


అమిత బలశాలియై, అసమాన ధైర్యసాహసాలను ప్రదర్శించి, తాను భుజాలమీద మోసిన ఒలింపియన్ పర్వతం మీద నివసించే యోగ్యతను పొందిన హెర్క్యులెస్ అంతటివాడు అయోనియన్ పనిగత్తెల మధ్యన వారిలో ఒకడిగా నివసించి, ఊలుబుట్టను పట్టుకొని ముతక ఊలు వడికినట్లుగా ఎందుకు చెప్పబడ్డాడు. తన ప్రియురాలి ఆజ్ఞలను ఆ టిరింథియన్ వీరుడు పాటించాడు. మరి అతను భరించినది భరించడానికి నీవు సంకోచిస్తావా?


నీ ప్రియురాలు సభాస్థలి వద్ద కలుసుకుందామని చెబితే, చెప్పిన సమయం కన్నా బాగా ముందే అక్కడకు చేరుకో, చివరి నిమిషం వరకు అక్కడి నుండి కదలకు. 


మరోచోట ఎక్కడైనా తనను కలుసుకోమని ఆమె నిన్ను అడిగితే, అన్నీ వదిలేసి పరుగున వెళ్ళు. రద్దీ ఉంటే తోసుకువెళ్ళు.


 రాత్రిపూట బయటవిందు ముగిసిన తరువాత ఆమె తన ఇంటికి వెళ్ళాలనుకొని బానిసను పిలిస్తే, త్వరితగతిన నీ సేవలందించు. 


ఆమె ఊరిలో ఉండి నిన్ను రమ్మని జాబు రాస్తే ఆమెవద్దకు వెంటనే బయలుదేరు, ఎందుకంటే ప్రేమ ఆలస్యాన్ని భరించలేదు. 


ఒకవేళ నీకు వాహనమేదీ దొరకకపోతే నడచి వెళ్ళు. ఉరుములు మెరుపులతో గాలివాన వస్తున్నా, ఎండ దహించివేస్తున్నా, మంచు కురిసి దారిమీద పేరుకున్నా సరే ఆగకు.


(అటలాంట గ్రీకు పురాణాలలో అర్కాడియా ప్రాంతానికి చెందిన ఒక వేటగత్తె. వివాహం చేసుకోవడం ఆమెకు ఇష్టం ఉండదు, వేట మాత్రమే ఆమెకు ఇష్టం. ఆమెను ప్రేమించిన మిలానియన్ ఆమె మనసు గెలుచుకోవడానికి ఆమెకు సహాయకునిగా చేరతాడు. హైలాస్ ఆమెను మోహించిన ఒక సెంటార్ …అంటే సగం మనిషి, సగం జంతువు.)  


(ఒక హత్యకు శిక్షగా హెర్క్యులెస్ లిడియా దేశపు (నేటి టర్కీ ప్రాంతం) యువరాణి ఓంఫలేకు ఒక సంవత్సరం బానిసగా మారతాడు. ఆమె అతడిని తన వద్ద పనిచేసే అయోనియన్ స్త్రీలతో పాటుగా ఉంచి వారు చేసే ఊలువడికే పనిని ఇతనితోకూడా చేయిస్తుంది. కొంతకాలం తరువాత ఆమె అతడికి స్వేచ్చ ఇచ్చి వివాహం చేసుకుంటుంది.)








Tuesday, May 19, 2020

ప్రేమకళ - రెండవ భాగం - III






ప్రేమకళ

(రెండవ భాగం) 


సౌమ్యంగానూ, శాంతంగానూ ఉండు







హృద్యమైన విధానం స్త్రీల విషయంలో అద్భుతాలను చేస్తుంది. మొరటుతనం మరియు కఠినమైన మాటలు అయిష్టతను మాత్రమే పెంచుతాయి. 


తన జీవితాన్ని పోట్లాటలోనే గడుపుతుంది కనుక గ్రద్దను మనం అసహ్యించుకుంటాము; బెదిరిపోయే గొఱ్ఱెలమంద మీద దాడి చేసే తోడేలును కూడా మనం అసహ్యించుకుంటాము.


అయితే సౌమ్యంగా ఉంటుంది కనుక మనిషి స్వాలో పక్షికి ఉచ్చు పన్నడు, పావురానికైతే అది నివసించడానికి గూడు కూడా కడతాడు. 


అన్నిరకాల వివాదాలకు, పరుష సంభాషణతో కూడిన జగడాలకు దూరంగా ఉండు. ఆహ్లాదకరమైన మాటలు ప్రేమను పెంచి పోషిస్తాయి. 


పోట్లాటల మూలంగానే ఒక స్త్రీ తన భర్తకు దూరమవుతుంది, అలాగే ఒక భర్త తన భార్యకు దూరమౌతాడు. అలా ప్రవర్తించడంలో వారిరువురూ తాము ఎదుటివారికి వారి పద్దతిలోనే బదులిస్తున్నామని భావిస్తారు. వారిని దానికే వదిలివేయి. 


పెళ్ళి చేసుకునేవారు ఒకరికొకరు పోట్లాటలను కట్నంగా ఇచ్చుకుంటారు. కానీ ఒక ప్రియురాలితో మృదుమధురమైన సంగతులు మాత్రమే మాట్లాడాలి. 


మీ ఇరువురినీ పానుపు మీదకు చేర్చింది చట్టం కాదు. నీ చట్టం, ఆమె చట్టం; మీ ఇరువురి చట్టం కూడా ప్రేమే. 


సుతిమెత్తని లాలన, వినసొంపైన మాటలు లేకుండా ఆమెను ఎప్పుడూ సమీపంచకు, దానితో నీ రాక ఆమెను ఎల్లప్పుడూ సంతోషపరుస్తుంది. 


నేను ప్రేమవిద్యను బోధించేది ధనవంతులకు కాదు. బహుమతులను ఈయగలిగిన పురుషునికి నేను బోధించే పాఠాలలో ఏ ఒక్క దాని అవసరం కూడా ఉండదు. 


కావలసినప్పుడల్లా "ఈ బహుమతిని స్వీకరించు" అని అనగలిగినవాడికి తగినంత నేర్పరితనం ఉన్నట్లే. అతడిని విడిచిపెట్టాలి. నేను ఒప్పుకుంటున్నాను. అతడి విధానాలు నా విధానాలకన్నా చాలా శక్తివంతమైనవి. 


నేను పేదవాని కవిని; ఎందుకంటే నేను స్వయంగా పేదవాడిని, అలాగే ప్రేమలో పడటమంటే ఏమిటో నాకు తెలుసు. బహుమతులను అందించలేక నేను నా ప్రియురాలికి కవిత్వాన్ని అందిస్తుంటాను. 


పేదవాడు తన ప్రేమ వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలి. పరుషమైన భాష ఉపయోగించకుండా అతడు తనను తాను నియంత్రించుకోవాలి. ధనిక ప్రేమికుడు ఎన్నడూ భరించనివాటిని ఎన్నింటినో ఇతడు తప్పక భరించాలి.


ఒకసారి కొంచెం కోపమొచ్చి నేను నా ప్రియురాలి జుట్టుని చెదరగొట్టడం నాకు గుర్తుంది. ఆ క్షణికమైన కోపం ఎన్నో సంతోషకరమైన దినాలను నాకు లేకుండా చేసింది. నేనామె దుస్తులను చించినట్లు నేను గమనించలేదు, చించాననికూడా నేను అనుకోవడం లేదు. అయితే ఆమె నేను చించానని చెప్పింది, దానితో ఆమెకు వేరే దుస్తులు కొనక తప్పలేదు.


ప్రియమైన స్నేహితులారా! మీ గురువుకన్నా తెలివిగా ఉండండి. అతడు చేసినట్లు చేయకండి, ఒకవేళ అలా చేసేటట్లైతే అరుపులు, కేకలకు సిద్ధంగా ఉండండి. 


మీరు యుద్ధప్రియులైతే పార్థియన్లమీద యుద్ధం చేయండి, కానీ ప్రియురాలితో మాత్రం శాంతియుతంగా ఉండండి. ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండండి, అలాగే ప్రేమను ప్రేరేపించేటట్లుగా మరే విధంగానైనా ఉండండి.