Friday, July 31, 2020

ప్రేమకళ - రెండవ భాగం - X



ప్రేమకళ 

(రెండవ భాగం)


కొంతకాలం ఆమెకు కనిపించకు







తీరాన్ని వీడేటపుడు నీ తెరచాపలకు ఎలాంటి గాలి కావాలో అలాంటి గాలి లోపలి సముద్రపు యానానికి అవసరముండదు. 


ప్రేమ జనించే సమయంలో సున్నితంగా ఉంటుంది. అలవాటుపడే కొలదీ దృఢంగా మారుతుంది. సరైన ఆహారంతో దానిని పోషిస్తే అది త్వరలోనే బలిష్ఠంగా మారుతుంది. 
  

ఈ రోజు నిన్ను భయపెడుతున్న ఎద్దును అది దూడగా ఉన్నపుడు నీవు కొట్టేవాడివి. 


నేడు తన నీడన నీకు ఆశ్రయమిస్తున్న వృక్షం ఒకనాడు ఒక బలహీనమైన చిన్నమొక్క. 


తను జన్మించినపుడు ఒక చిన్న పిల్లకాలువగా ఉన్న నది కొద్దికొద్దిగా బలాన్ని సంతరించుకుంటూ, పారే కొలదీ అసంఖ్యాకమైన ఉపనదుల నుండి ఎంతో నీటిని స్వీకరిస్తుంది. 


ఆమె నీకు అలవాటు పడేటట్లు చేసుకో, అలవాటుకన్నా శక్తివంతమైనదేదీ లేదు. 


ఆమె మదిని గెలుచుకోవడానికి నీవు చేసే ప్రయత్నాలలో ఎన్నడూ విసుగుచెందకు. 


నిన్ను ఆమె ఎల్లవేళలా చూస్తూనే ఉండాలి. నీవు చెప్పేది ఆమె ఎల్లవేళలా ఆలకిస్తూనే ఉండాలి. 


నీ ముఖాన్ని ఆమె రాత్రీ చూడాలి, పగలూ చూడాలి. 


నీవు లేకపోవడం ఆమెకు వెలితిగా అనిపిస్తుందనే నమ్మకం నీకు బాగా కుదిరినపుడు ఆమెను ఒంటరిగా వదిలివేయి.


నీవు లేకపోవడం ఆమెకు ఆందోళన కలిగిస్తుందనుంటే ఆమెకు కొంత విరామం ఇవ్వు: కొంత విరామం ఇచ్చిన మట్టి తనలో నాటబడిన విత్తనాలకు హెచ్చుమొత్తంలో తిరిగి చెల్లిస్తుంది.


ఎండిన నేల గగనం నుండి పడే వర్షపునీటిని వేగంగా ఇంకించుకుంటుంది. 


డెమోఫూన్ తన చెంతనే ఉన్నంతకాలం ఫిల్లిస్‌కు అతని యెడల ప్రేమ తాపం నులివెచ్చగానే ఉండేది. అతడు నౌకాయానం ఆరంభించాడోలేదో అతనియెడల మోహంతో ఆమె దహించుకుపోయింది. 


గడుగ్గాయి యులిసెస్ తన ఎడబాటు ద్వారా పెనెలోప్‌ను చిత్రహింస పెట్టాడు. 


లోడామియా, నీవు కన్నీటితో ప్రొటెసిలాస్ తిరిగిరాకను కాంక్షించావు.


కానీ సురక్షిత మార్గాన్ని అనుసరించు. మరీ ఎక్కువ కాలం దూరంగా ఉండకు. ఎడబాటు వలన కలిగే బాధను కాలం తగ్గించివేస్తుంది. 


కనులముందు లేనిది మనసులో కూడా ఉండదు. 


కనిపించని ప్రియుడు త్వరలోనే మరువబడి, అతడి స్థానాన్ని మరొకడు స్వీకరిస్తాడు. 


మెనెలాస్ వెళ్ళగానే ఏకాంత శయనంతో విసిగిపోయిన హెలెన్ తన అతిథి బాహుమందిరంలో ఆత్మీయతను, సాంత్వనను కోరుకున్నది. 


అకటా! మెనాలస్, నీవెంత వెఱ్ఱివాడవు! నీ భార్యను, ఒక అపరిచితుణ్ణి ఒకే కప్పు క్రింద వదిలేసి నీవు ఒక్కడివే వెళ్ళిపోయావు. 


పిచ్చివాడా! 

దుర్బలమైన పావురాన్ని కబళించే గ్రద్దకు అప్పగిస్తావా? 


నిండు గొఱ్ఱెలదొడ్డిని ఆకలిగొన్న తోడేలు వశం చేస్తావా? 


లేదు, హెలెన్‌ను నిందించవలసిన పనిలేదు. ఆమె ప్రియుని దోషంకూడా ఏమీ లేదు. అతడి స్థానంలో నీవున్నా, మరెవరున్నా ఏమి చేసేవారో, అదే అతను చేశాడు. 


సమయం మరియు అవకాశం రెండూ ఇవ్వడంద్వారా నీవే వారిని జారత్వానికి ప్రేరేపించావు. 


ఆమె అమలుపరచినది నీమూలంగా కలిగిన యోచన కాదా? 


ఆమె ఏమి చేయగలదు? ఆమె భర్త దూరంగా ఉన్నాడు, నాగరికుడైన ఒక అతిథి యెదుట ఉన్నాడు, పైగా ఆమె రిక్తశయ్యపై ఒంటరిగా శయనించడానికి భయపడుతున్నది.


మెనెలాస్ ఏమైనా అనుకోనీ; నా దృష్టిలో హెలెన్ నేరం చేయలేదు. ఆమె చేసిందల్లా ఎంతో అనుకూలుడైన తన భర్త మూలంగా లబ్దిని పొందడమే. 








No comments:

Post a Comment