Friday, July 24, 2020

ప్రేమకళ - రెండవ భాగం - V






ప్రేమకళ  

(రెండవ భాగం)


దుర్బలహృదయుడిగా ఉండవద్దు


ప్రేమ అనేది యుద్ధం వంటిది. 


దుర్బలహృదయం అందమైన స్త్రీని ఎన్నటికీ జయించలేదు. 


పిరికిపందలు కాముని సేవకు పనికిరారు.


ప్రేమయుద్ధాలలో పోరాడేవారు రాత్రి, చలికాలం, సుదీర్ఘ ప్రయాణాలు, కౄరమైన బాధ, వేదన కలిగించే శారీరకశ్రమ.....  ఇలాంటివన్నీ భరించాలి.  


అనేకసార్లు నీవు ఆకాశంలోని కరిగే మేఘాలనుండి కురిసే జడివానను సహించాలి, .......అలాగే అనేకసార్లు చలిలో కటికనేలమీద పరుండాలి.  


అడ్మిటస్ కు చెందిన పశువుల మందలను కాస్తున్నపుడు అపోలో ఒక చిన్న గుడిశలో నివశించేవాడని చెబుతారు. అపోలో చేసినట్లుగా చేయడానికి ఎవరు సిగ్గుపడతారు? 


కలకాలం గాఢంగా ప్రేమించాలనుకుంటే నీవు తప్పక అతిశయాన్ని విడనాడాలి. 


నీ ప్రియురాలివద్దకు సాధారణమైన మరియు సురక్షితమైన మార్గం నీకు నిరాకరించబడినట్లైతే,..........

ఆమె తలుపులు నీకు మూసివేయబడినట్లైతే............ 

ఇంటికప్పు పైకి ఎక్కి, పొగగొట్టం గుండానో, ఆకాశగవాక్షం గుండానో కిందికి దిగు. 


తన కొరకు నీవు చేసిన ఈ ప్రమాదకర సాహసాన్ని చూసి ఆమె ఎంతగా సంతోషిస్తుందో! 


ఇది నిఖార్సయిన నీ ప్రేమను ఆమెకు తెలియజేయడానికి నీవు చేసిన ఒక బాస. 


లియాండర్ అనేకసార్లు తన ప్రియురాలు లేకుండా ఉండగలిగికూడా తన గాఢమైన ప్రేమను నిరూపించడానికి జలసంధి ఆవలకు ఈదేవాడు.



(గ్రీకు దేవుడైన అపోలో పైథాన్ అనే పామును సంహరించడంతో శపించబడి ఒలంపస్ పర్వతం నుండి బహిష్కరించబడి కొంతకాలం అడ్మిటస్ అనే రాజు వద్ద పశువులకాపరిగా సేవలందిస్తాడు.)


(హీరో అనే యువతి ఆసియామైనర్ (టర్కీ) లోని హెల్లెస్పాంట్ జలసంధికి ఆవల ఉన్న ఒక ఊరిలో ఆఫ్రోడైట్ దేవతకు పూజారిణి. జలసంధికి ఈవల నున్న ఊరికి చెందిన లియాండర్ అనే యువకుడూ ఆమె ప్రేమించుకుంటారు. ఆమె పూజారిణి కనుక వారి వివాహం జరగడానికి వీలులేదు. కనుక లియాండర్ జలసంధిని ఈది వెళ్ళి ఆమెను కలుసుకునేవాడు.)




No comments:

Post a Comment