Monday, July 27, 2020

ప్రేమకళ - రెండవ భాగం - VIII



ప్రేమకళ 

(రెండవ భాగం)


ఆమె చెప్పినట్లు నడచుకో!  ఆమె చేసినది మెచ్చుకో!








నీవు ఏదైనా ఒక ఉపయోగకరమైన పని చేయాలని నిర్ణయించుకున్నపుడు, ఆ పని చేయమని నీ ప్రియురాలే నిన్ను  అడిగేటట్లు చేసుకో!  


నీవు నీ బానిసలలో ఒకడికి స్వేచ్ఛనివ్వాలని తలచినట్లైతే ఆ బానిస ఆమెను అభ్యర్ధించేటట్లు చేయి. 


విధినిర్వహణలో చూపిన నిర్లక్ష్యానికి నీ బానిసను నీవు శిక్షించకూడదనుకుంటే ఆ దయగల చర్యలో ఆమెకు పరపతి దక్కేటట్లు చూడు. 


ప్రయోజనం నీది, పేరు ఆమెది. నీకు పోయేదేమీలేదు. ఆమె మాత్రం నిన్ను తన చిటికెనవ్రేలితో ఆడించగలనని అనుకుంటుంది.


నీ ప్రియురాలి ప్రేమ అలాగే కొనసాగాలని నీవు అనుకుంటే ఆమె అందచందాలకు నీ కళ్ళు చెదిరిపోయాయని ఆమె భావించేవిధంగా నీవు చేయాలి.  


ఆమె ఊదారంగు దుస్తులు ధరిస్తే ఊదారంగుకు సాటిరాగలది మరేదీలేదని ఆమెతో చెప్పు. 


ఆమె కోస్ వస్త్రంతో చేసిన గౌను ధరిస్తే ఆమెకు అంత మనోహరంగా నప్పేది మరేదీలేదని ఆమెతో చెప్పు. 


ఆమె బంగారు వస్త్రాలు ధరించి మెరిసిపోతుంటే ఆమె సౌందర్యం ముందు బంగారం తీసికట్టేనని నీవు భావిస్తున్నట్లు ఆమెతో చెప్పు. 


ఆమె చలికాలపు ఉన్ని బట్టలు ధరిస్తే అవి మనోజ్ఞంగా ఉన్నాయని ఆమెతో చెప్పు. 


ఆమె పలుచని వస్త్రాలలో కనబడితే నీలో ఆమె ప్రేమాగ్ని రగిల్చిందని చెప్పు. అలాగే జలుబు చేయకుండా జాగ్రత్తవహించమని ఆందోళనకరమైన స్వరంతో ఆమెను అర్థించు. 


ఆమె నుదిటిమీద కురులు రెండుగా విడిపోతే ఆ విధానమే నీకిష్టమని చెప్పు.

ఆమె వేడి ద్వారా తన కేశాలను ఉంగరాలు తిప్పుకుంటే "ఉంగరాల జుట్టంటే నాకెంత ప్రేమో" అని చెప్పు.  


ఆమె నృత్యం చేసేటపుడు ఆమె చేతులను, ఆమె గానం చేసేటపుడు ఆమె స్వరాన్ని ప్రశంసించు. ఆమె వాటిని ముగిస్తే అంత త్వరగా అవి ముగింపుకు చేరినందుకు నీవెంతో చింతిస్తున్నావని చెప్పు. 


ఆమె నిన్ను తన పానుపు మీదకు అనుమతిస్తే ఆ సుఖాలపెన్నిధికి వందనమర్పించు, ఆనందాతిశయంవలన  వణుకుతున్న స్వరంతో ఆమె నీకు ఎలాంటి స్వర్గాన్ని అందించిందో చెప్పు. 


ఆమె భయంకర సర్పకేశిని (Medusa) కన్నా ప్రచండమైన స్త్రీ అయినాకూడా తన ప్రియుని యెడల (అతని మాటలతో) సాత్వికంగా, వినమ్రంగా మారిపోతుంది. 


నీవు మంచి కపటిగా ఉండాలి. అంతేకాక నీ ముఖంలో ఎన్నడూ నీవు చెప్పేమాటలను సమర్థించలేని భావం కనబడకూడదు. 


పన్నాగం అనేది ఎదుటివారు గ్రహించనంతసేపే ప్రయోజనకరం. ఒకసారి అది తెలిసిపోయిందంటే భంగపాటు తప్పదు. నమ్మకం ఇక ఎప్పటికీ పోయినట్లే. 













No comments:

Post a Comment