ప్రేమకళ
(రెండవ భాగం)
సహించు, శిరసావహించు, ఏకీభవించు
నీ ప్రియురాలు నీయెడల నిర్దయగా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే దానిని ఓర్పుతో భరించు; ఆమె త్వరలోనే తన మనసు మార్చుకుంటుంది.
నీవొక కొమ్మను జాగ్రత్తగా, మెల్లగా వంచినట్లైతే అది విరగదు. అదే నీ బలమంతా ఉపయోగించి దానిని తటాలున లాగినట్లైతే అది పుటుక్కున విరిగిపోతుంది.
నీటిప్రవాహంతో కలిసి పయనిస్తే నీవు నదిని సకాలంలో దాటతావు. ఏటికి ఎదురీదడానికి ప్రయత్నిస్తే ఎప్పటికీ దాటలేవు.
ఓర్పు పులులు, నుమిడియా సింహాలను కూడా మెత్తబరుస్తుంది. ఎద్దు నెమ్మదిగా అరకకు అలవాటు పడుతుంది.
అర్కాడియాకు చెందిన అటలాంటా కన్నా మచ్చికకాని స్త్రీ ఎక్కడైనా ఉందా; ఆమె ఎంతటి అహంకారి అయినప్పటికీ చివరికి ఒక ప్రేమికుడి నిరంతరాయమైన ఏకాగ్రతకు, ఓపికకు లొంగిపోయింది.
మిలానియన్ తన ప్రియురాలి నిర్దయకు, తన దురదృష్టానికి ఎన్నోసార్లు ఆ చెట్లకింద విలపించాడని అంతా చెప్పుకుంటారు. ఆజ్ఞప్రకారం, తరచూ వేటవలలను తన మెడమీద మోసేవాడు. తన బల్లెంతో తరచూ అడవిపందులను చీల్చిచండాడేవాడు. హైలాస్ బాణాలు కూడా అతడికి తగిలేవి. అయితే వేరేబాణాలు......, అయ్యో! అవేంటో అతడికి బాగా తెలుసు (ప్రేమదేవుడి బాణాలు), మరింత బాధాకరమైన గాయాలను అతడికి చేసేవి.
విల్లు తీసుకుని మెనాలస్ ప్రాంతపు కొండలను, కోనలను అధిరోహించమనిగానీ, అతిబరువైన వలలను నీ వీపున మోయమనిగానీ నేను నిన్ను ఆదేశించను. శత్రుబాణాలకు నీ ఱొమ్మును ఎదురొడ్డమని నేను నిన్ను ఆజ్ఞాపించను. నీవు గనుక వివేకవంతుడివైనట్లైతే నా నియమ నిబంధనలు ఆచరించడానికి ఏమంత కష్టం కాదని నీవు తెలుసుకుంటావు. ఆమె ఒకవేళ మొండిగా ప్రవర్తిస్తుంటే, ఆమెను అలాగే ఉండనివ్వు, చివరికి విజయం నీదే అవుతుంది.
ఆమె నిన్ను ఏమి చేయమన్నా సరే, దానిని తప్పనిసరిగా చేయడం ఒక్కటే నీ పని.
ఆమె దేనిని నిందిస్తుందో, దానిని నీవూ నిందించు.
ఆమె దేనిని ఇష్టపడుతుందో, దానిని నీవూ ఇష్టపడు.
ఆమె దేనిని కాదంటుందో, దానిని నీవూ కాదను.
ఆమె నవ్వితే, నీవూ నవ్వు.
ఆమె కన్నీరు పెట్టుకుంటే, నీవూ కన్నీరు పెట్టుకో.
ఒక్క మాటలో చెప్పాలంటే నీ మనోస్థితి ఆమె మనోస్థితికి అద్దంపట్టాలి.
ఆమె పచ్చీసు ఆడాలని కోరుకుంటే, నీవు కావాలనే సరిగా ఆడకుండా ఆటలో ఆమెను గెలవనీయి.
మీరు పాచికలాట ఆడుతుంటే ఆమెను ఓడిపోయి ఉక్రోషపడనీయకు, పైగా అదృష్టమెప్పుడూ నీదరికి రాదన్నట్లుగా కనబడనీయి.
మీ యుద్ధక్షేత్రం చదరంగం అయితే నీ యోధులందరూ తమ గాజుశత్రువు చేతిలో ఊచకోతకు గురయ్యేటట్లు చూసుకో.
ఆమె గొడుగు ఆమె పైనే ఉండేటట్లుగా జాగ్రత్తగా పట్టుకో,
ఆమె గుంపులో కనుక చిక్కుకుంటే ఆమెకు దారి ఏర్పరచు,
ఆమె పానుపుపైకి చేరాలనుకుంటే సహాయంగా పీట తెప్పించు.
ఆమె నాజూకైన పాదాలకు పాదరక్షలు తొడుగు లేక విప్పు.
మరి నీవు చలితో చస్తున్నాసరే తరచు ఆమె చల్లని చేతులను నీ ఛాతీమీద వెచ్చబరచాలి.
కొంత అగౌరవంగా కనిపించినప్పటికీ, ఆమె చూసుకోడానికి బానిసవలే ఆమె అద్దాన్ని పట్టుకోడానికి నీవు అన్యధా భావించకూడదు.
అమిత బలశాలియై, అసమాన ధైర్యసాహసాలను ప్రదర్శించి, తాను భుజాలమీద మోసిన ఒలింపియన్ పర్వతం మీద నివసించే యోగ్యతను పొందిన హెర్క్యులెస్ అంతటివాడు అయోనియన్ పనిగత్తెల మధ్యన వారిలో ఒకడిగా నివసించి, ఊలుబుట్టను పట్టుకొని ముతక ఊలు వడికినట్లుగా ఎందుకు చెప్పబడ్డాడు. తన ప్రియురాలి ఆజ్ఞలను ఆ టిరింథియన్ వీరుడు పాటించాడు. మరి అతను భరించినది భరించడానికి నీవు సంకోచిస్తావా?
నీ ప్రియురాలు సభాస్థలి వద్ద కలుసుకుందామని చెబితే, చెప్పిన సమయం కన్నా బాగా ముందే అక్కడకు చేరుకో, చివరి నిమిషం వరకు అక్కడి నుండి కదలకు.
మరోచోట ఎక్కడైనా తనను కలుసుకోమని ఆమె నిన్ను అడిగితే, అన్నీ వదిలేసి పరుగున వెళ్ళు. రద్దీ ఉంటే తోసుకువెళ్ళు.
రాత్రిపూట బయటవిందు ముగిసిన తరువాత ఆమె తన ఇంటికి వెళ్ళాలనుకొని బానిసను పిలిస్తే, త్వరితగతిన నీ సేవలందించు.
ఆమె ఊరిలో ఉండి నిన్ను రమ్మని జాబు రాస్తే ఆమెవద్దకు వెంటనే బయలుదేరు, ఎందుకంటే ప్రేమ ఆలస్యాన్ని భరించలేదు.
ఒకవేళ నీకు వాహనమేదీ దొరకకపోతే నడచి వెళ్ళు. ఉరుములు మెరుపులతో గాలివాన వస్తున్నా, ఎండ దహించివేస్తున్నా, మంచు కురిసి దారిమీద పేరుకున్నా సరే ఆగకు.
(అటలాంట గ్రీకు పురాణాలలో అర్కాడియా ప్రాంతానికి చెందిన ఒక వేటగత్తె. వివాహం చేసుకోవడం ఆమెకు ఇష్టం ఉండదు, వేట మాత్రమే ఆమెకు ఇష్టం. ఆమెను ప్రేమించిన మిలానియన్ ఆమె మనసు గెలుచుకోవడానికి ఆమెకు సహాయకునిగా చేరతాడు. హైలాస్ ఆమెను మోహించిన ఒక సెంటార్ …అంటే సగం మనిషి, సగం జంతువు.)
(ఒక హత్యకు శిక్షగా హెర్క్యులెస్ లిడియా దేశపు (నేటి టర్కీ ప్రాంతం) యువరాణి ఓంఫలేకు ఒక సంవత్సరం బానిసగా మారతాడు. ఆమె అతడిని తన వద్ద పనిచేసే అయోనియన్ స్త్రీలతో పాటుగా ఉంచి వారు చేసే ఊలువడికే పనిని ఇతనితోకూడా చేయిస్తుంది. కొంతకాలం తరువాత ఆమె అతడికి స్వేచ్చ ఇచ్చి వివాహం చేసుకుంటుంది.)
No comments:
Post a Comment