Sunday, July 26, 2020

ప్రేమకళ - రెండవ భాగం - VII





ప్రేమకళ 

(రెండవ భాగం)


అభిరుచి కలిగిన చిన్న చిన్న బహుమతులను ఆమెకు అందించు






నీ ప్రియురాలికి ఖరీదైన బహుమతులను అందించమని నేను నీకు సలహా ఇవ్వను. అల్పమైనవి కొన్నింటిని ఆమెకు సమర్పించు. అయితే వాటిని జాగ్రత్తగా ఎంచుకోవాలి, అవి సందర్భానికి తగినట్లుగా ఉండాలి. 


దేశం తన సమృద్ధియైన సంపదలనన్నింటినీ ప్రదర్శిస్తున్నపుడు, చెట్లకొమ్మలు బరువుతో క్రిందికి వంగినపుడు ఒక పండ్లబుట్టను ఆమె తలుపువద్ద వదిలిరావడానికి ఒక యువబానిసను నియోగించు.


దేశంలోని మీప్రాంతంనుండి అవి వచ్చినట్లుగా నీవు చెప్పవచ్చు - నిజానికి వాటిని నీవు రోమ్ లోనే కొన్నప్పటికీ.  


ఆమెకు ద్రాక్షపండ్లను గానీ అమరిల్లిస్ ఇష్టపడిన అడవిగింజలను (chestnuts) గానీ పంపు. ఇప్పుడైతే అమరిల్లిస్ వాటిని ఇష్టపడకపోవచ్చు. 


అవేకాదు, గువ్వలనో గోరింకలనో బహూకరించి కూడా నీ మదిలో ఆమె నిలిచియున్నదనే విషయాన్ని చాటవచ్చు.  


సంతానం లేని ఒక ధనిక వృద్ధురాలి దాయాదులు కూడా ఇదే పద్దతిని అనుసరిస్తారని నాకు తెలుసు. బహుమతులకు అపనింద తెచ్చినవారు నశించుగాక!


కవిత్వం పంపమనే సలహా కూడా నేను నీకు ఇవ్వనా? అయ్యో, పద్యాలు అంతగా గణింపబడవు!


పద్యాలను అందరూ ప్రశంసిస్తారు, కానీ నిజానికి వారు బహుమతులనే కోరుకుంటారు.


అనాగరికుడైనా సరే, అతడు ధనవంతుడైనచో అనుగ్రహపాత్రుడు అవుతాడు. 


ఇది స్వర్ణయుగమన్నది చాలా నిజం. స్వర్ణం ఉన్నతమైన గౌరవాలను కొనుగోలు చేస్తుంది. స్వర్ణం ప్రేమను కూడా ఖరీదు చేస్తుంది. 


తొమ్మిదిమంది విజ్ఞానదేవతలతో కలిసి హోమర్ అంతటివాడు వచ్చినాకూడా అతడు తనతోపాటు ఏమీ వెంటతేకపోతే తక్షణం వెళ్ళగొట్టబడతాడు.


అయినప్పటికీ పాండిత్యం కలిగిన స్త్రీలు కొంతమంది ఉంటారు. అయితే వారు అరుదుగా ఉంటారు. 


పాండిత్యమేమీ లేకుండా, ఉన్నట్లు కనిపించాలని అభిలషించే వారు కూడా ఉంటారు. 


వారిరువురినీ కూడా నీవు నీ కవిత్వం ద్వారా ప్రశంసించు. 


నీ కవిత్వం ఏపాటిదైననూ, దానిని ప్రభావవంతంగా ఎలా చదవాలో నీకు తెలిసినట్లైతే అది ఇంపుగా అనిపిస్తుంది. 


నిజానికి పద్యాలను బాగా కూర్చి, చక్కగా చదివి వినిపించినా కూడా ఆ స్త్రీలు వాటిని ఒక అల్పమైన, .......అత్యంత అల్పమైన బహుమతిగానే భావిస్తారు.







No comments:

Post a Comment