Tuesday, August 4, 2020

ప్రేమకళ - రెండవ భాగం - XI






ప్రేమకళ 

(రెండవ భాగం)


Book II Part XI: Have Other Friends: But Be Careful 


వేరే స్నేహాలను కలిగి ఉండు: కానీ జాగ్రత్త!






కోపం తారాస్థాయికి చేరి తన దంతాల మెరుపు దెబ్బతో వడిగల వేటకుక్కలను దొర్లించి వేస్తున్న ఎర్రబొచ్చు అడవిపంది కానీ... 


తన కూనలకు చన్నులప్పగించి స్తన్యమిస్తున్న ఆడసింహం కానీ...


జాగరూకుడు కాని పాదచారిచే తొక్కబడిన రక్తపింజర గానీ... 


.......తన భర్త పడకమీద వేరొక ఆడది ఉండగా చూచిన ఆడదానికన్నా భీకరమైనవికావు. 


ఆమె ముఖం క్రోధంతో వంకర్లు తిరిగిపోతుంది. కత్తి, కొరివి, చేతికి ఏది దొరికితే అది దొరకబుచ్చుకుని, సంయమనం అంతా పక్కనబెట్టి, అయోనియన్ దేవుడి వలన పిచ్చిపట్టిన మెనాడ్ వలే తన శత్రువుమీదకు దూసుకెళుతుంది.  


జాసన్ దుశ్చర్యలకు మరియు అతడు వివాహబంధాన్ని ఉల్లంఘించినందుకుగానూ కిరాతకురాలైన మెడియా తన స్వంత పిల్లలను చంపటంద్వారా ప్రతీకారం తీర్చుకున్నది. 


అదిగో, ఆ స్వాలో పక్షి కూడా క్రూరమైన తల్లే. చూడు, ఆమె వక్షస్థలం ఇంకా రక్తపుచారికలతోనే ఉన్నది. 


ఆవిధంగా ఎంతో సంతోషకరమైన, ఎంతో దృఢంగా ముడివేయబడిన బంధాలు విచ్ఛిన్నమయ్యాయి. 


అప్రమత్తత కలిగిన ప్రేమికుడు ఈర్ష్యతో కూడిన ఇటువంటి క్రోధావేశాలు తలయెత్తకుండా జాగ్రత్త వహించాలి.


అలాగని నేను మీరంతా ఒకే ప్రియురాలికి కట్టుబడి ఉండాలనే నైతిక ఉద్భోధ చేస్తున్నానని ఊహించుకోవద్దు. 


పాపము శమించుగాక! 


ఒక వివాహిత స్త్రీకికూడా అలాంటి వ్రతాన్ని ఆచరించడం కష్టంగా ఉంటుంది. 


మీ విలాసాలనేమీ మానుకోవద్దు, కానీ మీరు చేసే ఈ చిన్న చిన్న తప్పులకు మాత్రం సచ్ఛీలత అనే ముసుగును వేయండి.  


నీ అదృష్టాల గురించి ఎన్నడూ గప్పాలు కొట్టకు. 


ఒక స్త్రీకి ఇచ్చిన బహుమతి మరో స్త్రీ గుర్తించేవిధంగా ఎప్పుడూ ఉండకూడదు. 


నీ రహస్య సమావేశాలకు నిర్ణీత సమయం ఉండకూడదు. 


నీ ప్రియురాలికి - ఆమెకు తెలిసిన సంకేతస్థలంలో- నీవు పట్టుబడకుండా ఉండాలంటే అందరినీ ఒకే ప్రదేశంలో కలవకు.  


నీవు ఎప్పుడు ఉత్తరం రాసినా, ఏమి రాసావో ముందు ఓసారి స్వయంగా చదివి పరీక్షించు. చాలా మంది స్త్రీలు ఉత్తరాన్ని -అది అందించదలచుకున్న సందేశం కన్నా- చాలా ఎక్కువ అర్థంతో చదువుతారు.


వీనస్ తాను గాయపడినపుడు సరైన బదులిస్తుంది. గాయపరచిన నిన్ను దెబ్బకు దెబ్బ కొడుతుంది. నీవు తనకు ఎలాంటి బాధ కలిగించావో అదే బాధ నీకు కలిగేటట్లు చేస్తుంది. 


అగమెమ్నాన్ తన భార్యతో సరిపెట్టుకున్నంతకాలం ఆమె పవిత్రంగానే ఉన్నది. అయితే, తన భర్త చేసిన నమకద్రోహం ఆమెను చెడుమార్గం పట్టేటట్లు చేసినది. 


పవిత్ర చిహ్నాలను ధరించిన క్రిసెస్ -తన కుమార్తెను తనకు అప్పగించమని- తన భర్తను వ్యర్థంగా ప్రాధేయపడ్డాడని ఆమె తెలుసుకున్నది. 


ఓ! బ్రైసీస్! దుఃఖంతో నీ హృదయాన్ని చీల్చివేసిన ఈ నీ అపహరణ గురించి, -ఎంత లజ్జాకరమైన కారణాలతో యుద్ధం సుదీర్ఘంగా కొనసాగుతున్నదో కూడా- ఆమె తెలుసుకున్నది. 


అయితే ఇవన్నీ ఆమె వినిన సంగతులు మాత్రమే. 


కానీ ఆమె స్వయంగా తన కళ్ళతో ప్రియామ్ కూతురిని చూసింది. ఒక విజేత తన బంధీకి బానిస అవటం -ఎంత లజ్జాకరమైన దృశ్యం- ఆమె చూసింది. 


ఆ రోజు నుండి క్లైటెమ్‌నెస్ట్రా… ఏగిస్తస్‌ను తన హృదయంలోనికి మరియు పానుపు మీదకు కూడా ఆహ్వానించింది. అంతేకాక తన భర్త చేసిన నేరానికి దుర్మార్గంగా ప్రతీకారం తీర్చుకున్నది. 


నీ రహస్య ప్రేమాయణాలను నీవెంత బాగా దాయడానికి ప్రయత్నించినా కూడా ఒకవేళ అవి వెలుగు చూసినట్లైతే... నీ తప్పును నిరాకరించడానికి ఎన్నడూ సంకోచించకు. 


అటువంటి సందర్భాలలో నీవు లొంగిపోకు, అలాగే ఆమె యెడల మునిపటికన్నా ఎక్కువ ఆదరణ చూపకు. ఎందుకంటే అవి తప్పు చేసినవారి ఖచ్చితమైన లక్షణాలు. 


ఏ ఒక్క ప్రయత్నాన్నీ విడువకుండా ఆమెతో పానుపుమీదకు చేరు. మన్మథకేళి ఒక్కదానిలోనే శాంతి మొత్తం దాగున్నది; నీవు చేసిన తప్పు పూర్వపక్షం అవడానికి అదొక్కటే దారి.



(మెడియా (Medea) తన భర్త అయిన జాసన్ (Jason) తనను విడనాడి కోరింత్ దేశ రాకుమారిని చేపట్టడంతో ఆగ్రహించి ఆమెను మరియు అతడి వలన తనకు కలిగిన ఇరువురి కుమారులను సంహరించి కోరింత్ను విడిచి వెళ్ళిపోతుంది.)


(తన సోదరిని బలాత్కరించి, ఆమె నాలుకను తెగ్గోసిన భర్త టెరియస్ (Tereus) మీద ప్రతీకారంతో ప్రొక్నె (Procne) అతడి వలన తనకు కలిగిన కుమారుడిని చంపి, అతడికి వండి పెడుతుంది. భుజించిన తరువాత జరిగిన సంగతి తెలిసుకున్న టెరియస్ ఆగ్రహంతో ఆమెను సంహరించడానికి వెంటపడగా ఆమె ఒక స్వాలో పక్షిగా మారిపోతుంది.)
.

(ట్రోజన్ యుద్ధంలో గ్రీకుసేనాని అగమెమ్నాన్ (Agamemnon) ట్రోజన్ పూజారి క్రిసెస్ (Chryses) కుమార్తెను చెరబట్టి, అతడు ప్రాధేయఫడినా విడిచిపెట్టలేదని గ్రీసులో ఉన్న అగమెమ్నాన్ భార్య క్లైటెమ్నెస్ట్రా (Clytemnestra) తెలుసుకుంటుంది. తరువాత తన భర్త బ్రైసీస్ (Briseis) అనే యువతిని చెరబట్టిన విషయాన్ని కూడా తెలుసుకుంటుంది. ఆతరువాత అగమెమ్నాన్ యుద్ధబహుమతిగా ట్రాయ్ రాజు ప్రియామ్ (Priam) కుమార్తె కస్సాండ్రాను (Cassandra) వెంటతీసుకుని గ్రీసుకు వస్తాడు. ఆగ్రహించిన క్లైటెమ్నెస్ట్రా థైస్టెస్ (Thyestes) కొడుకైన ఏగిస్తస్‌తో (Aegisthus)  ప్రేమబంధాన్ని ఏర్పరచుకుని, అతని సహాయంతో వారిరువురినీ హత్యచేస్తుంది.)






                    




No comments:

Post a Comment