Saturday, June 8, 2013

'చెస్టర్‌ఫీల్డ్ సలహాలు '-ఉపోద్ఘాతం

 


ఉపోద్ఘాతం

(INTRODUCTION)



ప్రపంచానికి రాజనీతిని బోధించే కార్యాన్ని మాకియవెల్లి నెరవేర్చాడు. యుద్ధకళను బోధించే పనిని సన్–జు నిర్వర్తించాడు. ప్రేమపాఠాలు ఒవిడ్ నేర్పాడు. అలాగే ఎదుగుతున్న బాలలు, విశాల ప్రపంచంలోకి అడుగిడబోతున్న యువత తెలుసుకోవలసిన విషయాలను, అలవరచుకోవలసిన అలవాట్లను, పొందవలసిన క్రమశిక్షణను లార్డ్ చెస్టర్‌ఫీల్డ్ బోధించాడు.


చెస్టర్‌ఫీల్డ్ (1694-1773) ఇంగ్లాండు దేశపు కులీన వర్గానికి చెందినవాడు. ఇతడు ఆనాటి తన దేశప్రభుత్వంలో ఎన్నో ఉన్నతస్థాయి పదవీ బాధ్యతలు నిర్వర్తించాడు. ఇతడు 1732 లో జన్మించిన తన కొడుకు ఫిలిప్‌ను ప్రయోజకుడైన, సమర్థుడైన వ్యక్తిగా తీర్చిదిద్దాలనే ఉద్దేశ్యంతో అతని బాల్యదశ నుండి 30సంవత్సరాలపాటు 400కు పైగా ఉత్తరాల ద్వారా ప్రాపంచిక విజ్ఞానాన్ని అత్యంత ఆసక్తికరంగానూ, సులభగ్రాహ్యమైన శైలిలోనూ బోధించాడు. అతి మనోహరమైన భాషాసౌందర్యంతోనూ, అతి విలువైన బోధనతోనూ విలసిల్లే ఆ ఉత్తరాలు చెస్టర్‌ఫీల్డ్ మరణానంతరం ప్రచురింపబడి ఆంగ్ల ప్రజానీకం యొక్క హృదయాలను హత్తుకున్నాయి.


ఇటువంటి విషయాలను బోధించినవారు చెస్టర్‌ఫీల్డ్ కు ముందూ ఉన్నారు, తరువాత కూడా ఉన్నారు. కానీ వారందరిలోనూ చెస్టర్‌ఫీల్డ్ యొక్క స్థానం అద్వితీయమైనది. మరిముఖ్యంగా నేటికాలంలో వ్యక్తిత్వవికాసం పేరుతో అనేక గ్రంథాలు మనకు మార్కెట్లో ప్రత్యక్షమవుతున్నాయి. అనేకమంది వ్యక్తిత్వవికాసనిపుణులమంటూ భారీఫీజులు వసూలు చేసి క్లాసులు నిర్వహిస్తున్నారు. అవన్నీ చదివినంతసేపూ, విన్నంతసేపూ ఉత్తేజభరితంగా ఉంటాయి. కానీ తరువాత ఏ ఒక్క విషయంగూడా మన మనసులో నిలిచి ఉండదు, మన ప్రవర్తనను ప్రభావితం చేయదు—వెరసి వెచ్చించిన మొత్తమంతా, పడిన ప్రయాసంతా వ్యర్థం. కానీ చెస్టర్‌ఫీల్డ్ యొక్క ఈ బోధను ఒక్కసారి అధ్యయనం చేస్తే ఏ ఒక్క విషయాన్నీ కూడా జీవితంలో మరెన్నటికీ మరువలేము.


నేటికాలపు బోధకుల లక్ష్యం డబ్బుసంపాదన. కనుక వారు ప్రత్యర్థులతో ఉన్న పోటీని, మార్కెట్ ట్రెండును దృష్టిలో ఉంచుకుని రాసుకుపోతూ, చెప్పుకుపోతూ ఉంటారు. విద్యార్థులను ఆకర్షించగల అనవసర విషయాల ప్రస్తావనే వారి బోధనలో అధికం. నిజంగా వ్యక్తిత్వానికి పునాదిగా నిలబడగలిగిన విషయాలేవీ అందులో ఉండవు.


చెస్టర్‌ఫీల్డ్ కు ఈ ఉత్తరాలు రాసేటపుడు ఇవన్నీ ఈ విధంగా ప్రచురించబడగలవన్న ఆలోచనేలేదు. కేవలం తన కుమారుడిని ఉత్తమ వ్యక్తిగా తీర్చిదిద్దాలన్న ఓ తండ్రికి ఉండే సహజమైన అభిలాషతో చిత్తశుద్ధితోనూ, లక్ష్యశుద్ధితోనూ ఆంతరంగికంగా రాసిన ఉత్తరాలు ఇవి. ఓ తండ్రికి ఉండే ఆరాటమే కాక చెస్టర్‌ఫీల్డ్, తాను స్వయంగా ఉన్నత విద్యావంతుడు గావడం; ప్రభువంశీకుడుగావడంతో విలువల యెడల, క్రమశిక్షణ గలిగిన జీవితం యెడల, నాగరిక జీవనశైలి యెడల పట్టుదల గలిగినవాడవటం; ఉన్నతస్థాయి రాజోద్యోగిగా అనేక ప్రాంతాలలో, అనేక మంది వ్యక్తులతో కలసి పనిచేసి గడించిన లోకానుభవం; మనోహరమైన ఆంగ్లభాషను రాయగలిగే సామర్థ్యం—ఇవన్నీ కలసి అత్యంత విలువైన బోధ ఈ ప్రపంచానికి అందడానికి కారణమయ్యాయి.


చిత్తశుద్ధిలో అంతరమేకాక కాక; చెస్టర్‌ఫీల్డ్‌ కు, నేటి కాలపు వ్యక్తిత్వవికాస నిపుణులకు మరో వ్యత్యాసం కూడా ఉన్నది. నేటికాలపు వ్యక్తిత్వవికాస బోధన ప్రధానంగా 'యోచనాత్మక’ (thinking based) రూపంలో ఉంటుంది. అంటే దానిలో Positive Thinking, Self-Confidence, Self-Esteem మొదలైన యోచనాత్మకమైన అంశాలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఇవన్నీ నిస్సందేహంగా ప్రాముఖ్యత కలిగినవే; ఐతే ఒక వ్యక్తిలో ఇవి indirect గా induce చేయబడాలేగానీ, వాటిని ప్రత్యక్షంగా బోధించకూడదు. ఈ వాస్తవాన్ని నేటి బోధకులు గుర్తించని కారణంగా వారు వ్యక్తుల మీద తమ ప్రభావాన్ని చూపలేకపోతున్నారు.


ఐతే చెస్టర్‌ఫీల్డ్ ఈ వాస్తవాన్ని గుర్తించి, తన వ్యక్తిత్వవికాస బోధనకు Polished Behavior, Good–Breeding, Graces మొదలైనవాటిని పునాదిగా చేసుకోవడంద్వారా ‘యోచనాత్మక’ రూపాన్ని కాక, ‘ఆచరణాత్మక’ (practice based) రూపాన్ని ఇచ్చి, దానిని అత్యంత ప్రభావశీలంగా నిర్మించాడు.


ఈ కారణం చేతనే ఆయన Etiquette కు, Manners కు ప్రఖ్యాతి వహించాడు. ఐతే ఈ గ్రంథాన్ని చదివిన మీదట ఆయన వీటిని తన బోధనకు పునాదిగా చేసుకున్నాడే తప్ప వాటికే పరిమితమైపోలేదనీ, ఆయన బోధన యువజనుల వ్యక్తిత్వం యొక్క సర్వతోముఖవికాసానికి కావలసిన అన్ని అంశాలతో కూడుకొని సమగ్రంగా ఉంటుందనీ గ్రహించగలుగుతారు.


ఈ బోధనకు మరో విశిష్టత కూడా ఉన్నది. ఇవి ఆధునిక యుగారంభంలో రాయబడినా కూడా ఫ్రెంచి విప్లవ భావజాలంగానీ, అక్టోబర్ విప్లవ భావజాలంగానీ మానవుడి ఆలోచనావిధానాన్ని ప్రభావితం చేయడానికన్నా ముందే రాయబడ్డాయి. ఈ రెండు విప్లవాలు మానవాళికి ఎంతో మేలు చేసిన సంగతి అలా ఉంచితే, అవి మోసుకువచ్చిన నూతనభావజాలం మూలంగా మానవుడు తరతరాలుగా కాపాడుకుంటూ వస్తున్న కొన్ని ముఖ్యమైన విలువలను అనివార్యంగా వదులుకోవాల్సి వచ్చింది. అటువంటి పరిణామం జరగడానికంటే ముందే రాయబడటంతో చెస్టర్‌ఫీల్డ్ ఉత్తరాలు మనిషి అలవరచుకోవలసిన కల్తీలేని అసలుసిసలు విలువలతో అలరారుతూ ఉంటాయి.


చెస్టర్‌ఫీల్డ్ తన స్వంత కొడుకుకు, పెంపుడు కొడుకుకు రాసిన అన్ని ఉత్తరాలు కలిపి కొన్ని వందల సంఖ్యలో ఉంటాయి. వాటిలో చాలావరకూ సుదీర్ఘమైన ఉత్తరాలే. అవన్నీ కలిపితే పెద్ద ఉద్గ్రంథమే అవుతుంది. కనుకనే కాలక్రమంలో Best Letters, Selected Letters లాంటి పేర్లతో కొన్ని ముఖ్యమైన ఉత్తరాలనో లేక ఆ ఉత్తరాలలోని కొన్ని ముఖ్యభాగాలనో సంకలనం చేసిన గ్రంథాలు ప్రచురింపబడ్డాయి. అయితే 1861 లో “Lord Chesterfield’s Advice to His Son on Men and Manners” పేరుతో విలియం టెగ్ చే ప్రచురింపబడిన ఓ చిరుగ్రంథం మరింత విశిష్టమైనది. ఆ గ్రంథంలో చెస్టర్‌ఫీల్డ్ తన ఉత్తరాలలో బోధించిన విషయాలన్నింటినీ అంశాలవారీగా విభజించి, ఒకానొక అంశం గురించి అనేక ఉత్తరాలలో బోధించిన సందర్భంలో వాటిలో పునరావృతాలను వదిలేస్తూ, ముఖ్యమైన వాక్యాలను మాత్రం ఒక చోటకు చేర్చి ఆయన బోధనల సారాన్నంతటినీ సంక్షిప్తంగా అందించడం జరిగినది. ఆ గ్రంథంలోని విషయం మొత్తాన్నీ యథాతథంగా “Advice of Lord Chesterfield” పేరుతో నేను మీకు అందిస్తున్నాను.


నిజమైన వ్యక్తిత్వానికి నిచ్చెనమెట్లవంటి అంశాలున్న ఈ గ్రంథాన్ని చదివి అనేక విలువైన సలహాలు, సూచనలు పొందడంతోపాటు చెస్టర్‌ఫీల్డ్ పద ప్రయోగాన్నీ, హృద్యమైన ఆంగ్లవాక్య నిర్మాణశైలిని ఆస్వాదించండి !



—బి. యల్. సరస్వతీ కుమార్


No comments:

Post a Comment