Thursday, March 31, 2016

ప్రేమకళ-లేఖ వ్రాయి! బాస చేయి!



లేఖ వ్రాయి! బాస చేయి!




మార్గాన్ని సుగమం చేసుకోవడనికి ముందుగా ఆమెకొక లేఖ రాయడం ఉత్తమం:

అందులో ఆమెను నీవెంత గాఢంగా ప్రేమిస్తున్నావో చెప్పాలి.

అందులో ఆమెకు చక్కని ప్రశంసలను అందించు, అలాగే ప్రేమికులు ఎల్లప్పుడూ చెప్పే అహ్లాదకరమైన కబుర్లన్నీ చెప్పు:

నీవెవరివైనా కూడా ఆమెను మాత్రం వినమ్రంగా వేడుకో.

ప్రియామ్ (Priyam) వేడికోలుకు కరిగిపోయిన అచెల్లిస్ హెక్టార్ మృతదేహాన్ని అతడికి అప్పగించాడు:

వినమ్రంగా విన్నపాలు చేసే స్వరానికి ఆగ్రహించిన దేవుడుకూడా అనుగ్రహిస్తాడు.

మాట ఇవ్వు! మాట ఇవ్వు!, మాట ఇవ్వు!

మాట ఇస్తే పోయేదేముంది? మాట ఇవ్వడంలో ఎవరైనా ధనవంతులే!

ఆశ ఒక్కసారి జనించిందంటే ఇక అది చిరకాలం నిలబడుతుంది. ఆశ ఒక మోసపూరితమైన దేవత, అయినాకూడా చాలా ఉపయోగకరమైనది.

నీ ప్రియురాలికి నీవు ఒక్కసారి బహుమతి ఇచ్చివేశావూ అంటే ఇక ఆమె నిన్ను త్యజించివేస్తుంది. ఆమె తనకు కావలసింది తను గెలుచుకుంది, ఇక ఆమెకు పోయేదేమీ లేదు.

అయితే నీవు ఇవ్వక పోతే మాత్రం త్వరలోనే ఇవ్వబోతున్నట్లుగా ఎప్పుడూ కనబడుతుంటావు.

ఈ విధంగానే ఒక రైతు, ఏదో ఒకనాటికి పంట పండక పోతుందా అని ఆశతో, చవుడు భూమికి ఎరువులు వేస్తూ ఉంటాడు.

ఈ విధంగానే ఒక జూదగాడు తను పోగొట్టుకున్న సొమ్మంతా తిరిగి పొందాలనే ఆశతో, ప్రతీసారీ నష్టపోతున్నాకూడా, మళ్ళీ మళ్ళీ పందెం ఒడ్డుతూనే ఉంటాడు.

ఇది నిజంగా గొప్ప సమస్య. ఆమెకు ఏ బహుమతీ ఈయకుండానే ఆమెను గెలుచుకోవడమనేది మగవాడు తన చాతుర్యాన్నంతా వెలికితీసి సాధించవలసిన సమస్య:

నీవు దీనిలో విజయం సాధించావూ అంటే, తను అప్పటికే ఇచ్చివేసిన దానికి ప్రతిఫలం దక్కకుండా పోతుందేమోనని, ఇక అమె నీకు ఇస్తూనేపోతుంది

కనుక ఆమెకు నీ ఉత్తరాన్ని పంపు. దానిని తీయని మాటలతో నింపు.

ఆ ఉత్తరం ఆమె ఉద్దేశాన్ని తెలుసుకొనే ఒక ప్రాథమిక పరీక్షలా, ఆమె హృదయాన్ని చేరుకొనే మార్గాన్ని సుగమం చేసేదిలా ఉండాలి.

ఒక ఆపిల్ పండు మీద వ్రాయబడిన కొద్ది అక్షరాలు (42)సిడిప్పె మోసపోవడానికి దారితీసాయి. తను వాటిని చదవినప్పుడు తన మాటల చేతనే తాను ఉచ్చులో చిక్కుకున్నట్లు ఆ తొందరపాటు బాలిక తెలుసుకున్నది.

రోమన్ యువకులారా! నా సలహాను పాటించి మేథోవిద్యలను (Liberal Arts: Grammar, Rhetoric, and Logic) నేర్చుకోండి.

ఇది కేవలం ఏవరో ఒక భయపడిన ముద్దాయిని రక్షించడానికి మాత్రమే కాదు! సాధారణ ప్రజలు, గంభీరంగా ఉండే న్యాయమూర్తి, సెనేట్ సభ్యులతోపాటు ఒక స్త్రీని కూడా వాక్పటిమ ఆకట్టుకుంటుంది.

అయితే మీ నైపుణ్యాలను దాచివేయండి: మీ భాషాపటిమను ఆరంభంలోనే ప్రదర్శించడానికి తొందరపడవద్దు మీ భాషలో కఠినమైన పదాలు లేకుండా చూడండి.

తాను ఒక సభను ఉద్దేశించి మాట్లాడుతున్నట్లుగా తన ప్రియురాలికి ఉత్తరం వ్రాసేవాడు మూర్ఖుడు గాక మరెవరు? ప్రదర్శనాత్మకమైన ఉత్తరం తరచుగా ఒక స్త్రీని నీకు వ్యతిరేకంగా మారుస్తుంది.

నీ భాష సహజంగానూ, సాధారణంగానూ అదేసమయంలో ఆకట్టుకునేటట్లుగానూ ఉండాలి.

ఒక్కమాటలో చెప్పాలంటే ఆమెను నీవు స్వయంగా కలిసి మాట్లాడితే ఏం చెబుతావో అదే చెప్పు.

ఆమె నీ ఉత్తరాన్ని తిరస్కరించి, చదవకుండానే తిప్పి పంపితే నీవు నీ ప్రయత్నాన్ని మానుకోకు ……ఈసారి చదువుతుందనే ఆశతో ఉండు.

మొండికేసే ఎద్దులు త్వరలోనే కాడిని మెడకెత్తుకుంటాయి,

వయసులో ఉండి మాటవినని మగగుఱ్ఱం కొద్దికాలంలోనే కళ్ళానికి లోబడుతుంది,

వాడుతూనే ఉంటే ఇనుప ఉంగరం తరిగిపోతుంది,

ప్రతిరోజూ నేలను దున్నుతుంటే నాగలికర్రు అరిగిపోతుంది.

ఱాతి కన్నా కఠినమైనది, నీటి కన్నా మృదువైనది ఏవైనా ఉన్నాయా? అయినప్పటికీ కఠినమైన ఱాతిని మృదువైన నీరు కోసివేస్తుంది.

కనుక పట్టువిడువక ప్రయత్నిస్తూనే ఉండు. నీ వలా చేస్తే కొద్దికాలంలోనే (43)పినలోప్‌ను సైతం గెలుచుకోగలుగుతావు!

ట్రాయ్ నగరం చాలాకాలం శత్రువుల చేతికి చిక్కలేదు, కానీ చివరికి చిక్కింది.

ఒకవేళ ఆమె నీ ఉత్తరం చదివి తిరిగి సమాధానం ఈయకపోతే, ఆమెనేమీ ఒత్తిడి చేయకు. నీ పొగడ్తలను ఆమె అలా చదువుతూ ఉండేటట్లు మాత్రమే చేయి.

చదవాలని అనుకున్నప్పుడు, తాను చదివినదానికి సమాధానం ఇవ్వాలని కూడా అనుకుంటుంది.

ప్రతి విషయం కూడా తగిన సమయం వచ్చినపుడు నెమ్మదిగా….. అలా….. అలా…. జరిగిపోతుంది.

బహుశా తనను ఇబ్బంది పెట్టవద్దని చిరుకోపంతో చెబుతూ ఆమె నీకు ఉత్తరం రాస్తుంది.

ఆమె అలా రాస్తే గనుక, నీవు నిజంగానే ఆమె చెప్పినటు చేస్తావేమోనని భయపడిపోతుంది.

ఆమె నిన్ను అడగకపోయినప్పటికీ నీవు తన వెంటపడుతూనే ఉండాలని ఆమె కోరుకుంటుంది.

[ఏమి చెయ్యమని ఆమె నీకు చెబుతుందోనీవు తన వెంటపడవద్దని నీవు నిజంగానే అలా చేసేస్తావేమోనని మనసులో భయపడుతుంది. ఏమి చెయ్యమని ఆమె నీకు చెప్పదో నీవు తన వెంటపడాలని నీవు అదే చేయాలని ఆమె మనసులో కోరుకుంటుంది]

కనుక వెంటపడుతూనే ఉండు. నీ హృదయవాంఛ త్వరలోనే నెరవేరుతుంది.



Footnote:


(42) సిడిప్పె డెలోస్ ద్వీపానికి చెందిన ఒక అందమైన కన్య. ఆమె డయానా దేవాలయంలో పూజాకార్యక్రమంలో ఉండగా ఆమెను ఎకోంటియస్ చూచి ప్రేమించాడు. తన ప్రేమను ఆమెకు స్వయంగా వ్యక్తపరచలేక అతడు ఒక ఆపిల్ పండు మీద పెళ్ళిప్రమాణాన్ని రాసి ఆమె పాదాలముందు జారవిడిచాడు. ఆ పండును చేతిలోకి తీసుకున్న సిడిప్పే ఆ ప్రమాణాన్ని పదేపదే చదివింది. డయానా దేవాలయంలో పలికిన మాటలను ఎవరైనా సరే తప్పని సరిగా ఆచరించి తీరాలన్న నాటికాలపు నియమంతో ఆమె తనకు తెలియకుండానే ఎకోంటియస్‌కు భార్య అయిపోయింది.


(43) పినలోప్ ట్రోజన్ యుద్ధవీరుడు యూలిసెస్ భార్య, పతివ్రత. అతడు యుద్ధానికి వెళ్ళి ఇరవై సంవత్సరాల పాటు తిరిగి రాకపోయినా, ఎందరో పురుషుల ప్రేమవిన్నపాలను సైతం లెక్కింపక తన భర్త రాకకోసం ఎదురు చూచింది.




No comments:

Post a Comment