పాలిపో! చిక్కిపో!
ఒక నావికునికి పాలిపోయిన మేనిచ్ఛాయ నప్పదు. సూర్యకిరణాలు, ఉప్పునీటి తుంపరలతో అతని శరీరం నల్లబడి ఉండాలి.
బయలు ప్రదేశంలో నాగలితో, దమ్ముచక్రాలతో ఎప్పుడూ నేలను తిరగవేస్తూ ఉండే రైతుకు కూడా పాలిపోయిన వర్ణం నప్పదు.
ఓ క్రీడాకారుడా! పతకం కోసం శ్రమించే నీకు చర్మం తెల్లగా ఉంటే, అది చూడటానికి అంత బాగుండదు.
అయితే ప్రతీ ప్రేమికుడు మాత్రం పాలిపోయి ఉండాలి.
పాలిపోయిన వర్ణం ప్రేమకు చిహ్నం. మూర్ఖులు దానికెటువంటి ఉపయోగం లేదని అనుకున్నా కూడా, అది మాత్రం ప్రేమకు తగిన వర్ణచ్ఛాయ.
నీవు పాలిపోవటం చూచి నీ ప్రేమికురాలు, సానుభూతితో, నీ ఆరోగ్యం గురించి ఆదుర్దా చెందుతుంది.
లిరిస్ వెనుక అడవులలో సంచరించినప్పుడు ఓరియన్ ప్రేమభావనతో పాలిపోయి ఉన్నాడు.
తనను తిరస్కరించిన నైయద్ కోసం డఫిన్స్ కూడా పాలిపోయాడు.
చిక్కిపోవటం కూడా నీ హృదయంలోని ప్రేమకు ఒక సూచిక.
అందమైన జుత్తు ఉన్న నీ తలకు గుడ్డ కప్పుకోవడానికి సిగ్గుపడకు!
నిద్రలేని రాత్రులు ఒక యువకుడి శరీరాన్ని సన్నబరుస్తాయి.
నీ ఆకాంక్షలు నెరవేరే క్షణానికి నీవు దగ్గరవ్వాలంటే దయనీయంగా కనబడటానికి వెనుకాడకు!
అప్పుడు నిన్ను చూచిన వాళ్ళంతా ఇలా అనగలరు “అయ్యో! ఓ విషాదమూర్తీ! నీవెందుకు ప్రేమలో పడ్డావు!”
No comments:
Post a Comment