జైత్రయాత్ర కూడా అనువైనదే
అదిగో! చూడు! ఈ భూమి మీద మిగిలిన ప్రాంతాన్నంతటినీ జయించడానికి సీజర్ పథకం సిద్ధం చేస్తున్నాడు: తూర్పు దిక్కున దూరంగా ఉన్న దేశాలన్నీ ఇప్పుడు మనకు పాదాక్రాంతం అవ్వవలసిందే.
ఓ! దుడుకు పార్థియన్లారా! మీమీద మేము ప్రతీకారం తీర్చుకోబోతున్నాం:
క్రాసస్ (19) తన సమాధిలోనే సంతోషిస్తాడు,
అనాగరికుల చేతచిక్కి అవమానింపబడిన రోమన్ రాజచిహ్నాల్లారా! మీరుకూడా సంతోషించండి!
ప్రతీకారం తీర్చేవాడు మనచెంతనే ఉన్నాడు! ముక్కుపచ్చలారని పసివయసులో అతడు నాయకుడిగా ప్రకటింపబడ్డాడు (20), అతడు బాలుడైనా కూడా ఒక బాలుడికి సాధ్యంకానిరీతిలో యుద్ధం చేస్తాడు.
పిరికిపందల్లారా! దేవుడి వయసును లెక్కించే వ్యర్థప్రయత్నం మానుకొండి!:
సీజర్‌లాంటి వ్యక్తిలో తగుసమయం కన్నా ముందే ధైర్యం ఉదయిస్తుంది. దైవికమైన ప్రతిభ కాలంకన్నా వేగంగా పెరిగి పెద్దదవుతుంది, అది నెమ్మదైన వృద్ధిలోని జాగుతనాన్ని అస్సలు సహించలేదు.
హెర్క్యులస్ తన రెండు చేతులతో రెండు సర్పాలను నలిపిపారవేసినపుడు అతడు ఇంకా చిన్నపిల్లవాడే, ఆవిధంగా అతడు తాను ఊయలలో ఉండగానే దేవతలరాజైన Joveకి కొడుకుగా తగినవాడనిపించుకున్నాడు.
ఇంకా బాలుడిగానే ఉన్న ఓ! బాకస్! నీ ఆయుధానికి భయపడిన ఇండియాని నీవు జయించినప్పుడు నీ వయసెంత?
ఓ! యువ సీజర్! నీ తండ్రి అండదండలతో, అతడిచ్చిన ధైర్యంతోనే నీవు నీ సైన్యాన్ని నడుపుతావు;
నీ తండ్రి అండదండలతో, అతడిచ్చిన ధైర్యంతోనే నీవు నీ శత్రువులను జయిస్తావు!
నీవు నీ తొలిపాఠాలను అటువంటి గొప్ప వారికి ఋణపడే నేర్చుకోవాలి.
ఇప్పుడు నీవు యువరాజువు, కానీ ఒకనాటికి మహారాజువు.
నీకూ సోదరులున్నారు కనుక ఆ సోదరులకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకో,
నీకూ ఓ తండ్రి ఉన్నాడు కనుక ఒక తండ్రికి ఉండవలసిన హక్కులను (21) నిలబెట్టు.
నీ తండ్రి, నీ దేశపు తండ్రి; ఇరువురూ కలిసి నీకు ఈ అధికారాన్ని అందించారు.
నీ శత్రువు మాత్రం ఇవ్వనిచ్చగించని తన తండ్రి చేతిలోనుండి రాజదండాన్ని బలవంతంగా గుంజుకున్నాడు.
నీ పవిత్ర ఆశయం ఆ పాపిష్టి శత్రువు మీద విజయం సాధిస్తుంది.
న్యాయం, ధర్మం నీ పతాకం వెంబడే నడుస్తాయి
తమ దుష్ట ఆశయం మూలంగా పార్థియన్లు నైతికంగా ముందే ఓడిపోయారు; సైనికంగా కూడా వారు ఓడిపోతారు.
తూర్పు ప్రాంతపు ఐశ్వర్యాన్ని నా యువ కథానాయకుడు మన దేశ సంపదకు జతచేస్తాడు
మార్స్ అతని తండ్రి …సీజర్ కూడా అతని తండ్రే (22) –ఒకరు దేవుడు, మరొకరు కాబోయే దేవుడు– ఇరువురూ అతడికి ఎటువంటి హానీ జరగకుండా సురక్షితంగా కాపాడాలి.
భవిష్యత్తులో దాగిన రహస్యాలను నేను చదవగలను.
ఔను! నీవు జయిస్తావు!
నీకే అంకితం చేయబడిని కవిత్వంతో నేను నీ కీర్తిగానాన్ని ఆలపిస్తాను. పెద్ద స్వరంతో నేను నిన్ను గొప్పగా ప్రశంసిస్తాను.
నా వర్ణనలో నీవు లేచి, స్థిరంగా నిలబడి, యుద్ధానికి ఆయత్తం కమ్మని సైన్యాన్ని గంభీరంగా ఆదేశిస్తావు.
నీ ధైర్య స్థైర్యాలను ప్రతిబింబించడంలో నా గానం విఫలం అవ్వకుండా ఉండుగాక!
నా గానంలో పార్థియన్– పారిపోతూ వెన్నుచూపుతుంటాడు,
రోమన్– పారిపోయే శత్రువు తన వైపు ఎక్కుబెట్టిన బాణాలను ఎదుర్కొంటూ ఉంటాడు.
ఓ! పార్థియన్! నీవు గెలవడానికి పారిపోతుంటే, నీవు ఓడిపోలేదని చెప్పడానికి ఇంకా ఏమి మిగిలింది?!
పారిపోతున్న మీకు మార్స్ ఇకనుండి అశుభం తప్ప మరేమీ పలుకడు.
ఆరోజు త్వరలోనే వస్తుంది. అప్పుడు తన జైత్రయాత్ర ముగించి తిరిగి వస్తున్న మన యువరాజు, బంగారంతో ధగద్ధాయమానంగా మెరిసిపోతూ, అందరిలోకెల్లా ఆకర్షణీయంగా కనిపిస్తూ, నాలుగు శ్వేతాశ్వాలు పూన్చిన రథాన్ని అధిరోహించి నగర వీధులలో ఊరేగుతూ వస్తుంటాడు.
జయించబడిన నాయకులు కంఠాలకు గొలుసులు బంధింపబడి, అతని ముందు నడుస్తుంటారు. వారప్పుడు మునిపటిలా తమ రక్షణ కొరకు పారిపోలేరు.
యువతీ యువకులు ఆ దృశ్యాన్ని ఆనందంతో తిలకిస్తుంటారు. అందరి హృదయాలలో సంతోషం నిండి ఉంటుంది.
అప్పుడు ఒక సుందరి ఆ ప్రదర్శన (23) వంక చేయి చూపుతూ,
ఆ రాజు పేరేమిటి?
ఈ సేనాని ఎవరు?
అది ఏ దేశం?
అవి ఏ పర్వతాలు?
అదిగో అక్కడ కనబడుతున్నది ఏ నది? అని నిన్ను అడుగుతుంది.
వెంటనే అన్ని ప్రశలకు సమాధానం చెప్పు,
ఇంకా ఆమె ఏమేమి అడగబోతోందో ముందే ఊహించి వాటన్నింటికీ స్థిరమైన సమాధానాలివ్వు.
ఒకవేళ నీకు సమాధానం తెలియకపోయినాకూడా, నీకంతా బాగా తెలిసినట్లు మాట్లాడు.
“అక్కడ యూఫ్రటిస్ (24) ఉన్నాడు. అతని తలకు మొక్కల కాడలతో చేసిన కిరీటం ఉంది.
అదిగో! నీలి రంగు కురులతో ఉన్న ఆ ముసలివాడు టైగ్రిస్.
వాళ్ళా? హ్మ్...! ఆఁ..! వాళ్ళు ఆర్మీనియా దేశస్తులు.
అదిగో! అల్లంత దూరాన ఉన్న ఆమె పర్షియా దేశం. డేనియా (Danae) కుమారుడు పెర్సియస్ (Perseus,) పుట్టింది అక్కడే!
అది ఏచమానియా లోయల మధ్యన ఈ మధ్యనే వెలసిన ఒక పట్టణం.
అక్కడ బంధించబడి ఒక వ్యక్తి ఉన్నాడు, అదిగో దూరాన ఉన్న మరో వ్యక్తి కూడా….! వీళ్ళు పట్టుబడ్డ సేనానులు”
నీకు తెలిసినట్లైతే వాళ్ళ పేర్లేమిటో చెప్పు, తెలియకపోతే వాళ్ళకు తగినట్లుగా ఉండే పేర్లేవైనా ఊహించి చెప్పు.
Footnote:
(19) రోమన్ సామ్రాజ్యానికి తూర్పున ఆసియాలో ఉన్న పార్థియా రోమన్‌లకు శత్రుదేశం. పార్థియన్‌లను రోమన్‌లు అనాగరికులుగా పరిగణించేవారు. రోమన్లు క్రాసస్ నాయకత్వంలో పార్థియన్ల మీద యుద్ధంచేసి చిత్తుగా ఓడిపోయారు. క్రాసస్ రోమన్ రిపబ్లిక్ త్రిసభ్య ప్రభుత్వంలో (Triumvirate) జూలియస్ సీజర్, పాంపేల సహచరుడు. ఆయుద్ధంలో (53B.C.) క్రాసస్ పార్థియన్లచే వధింపబడ్డాడు.
(20) అగస్టస్ చక్రవర్తికి జూలియా అనే కూతురు ఒక్కరే సంతానం. అగస్టస్ ఆమెను మహాయోధుడైన తన సేనాని అగ్రిప్పకు ఇచ్చి వివాహం చేశాడు. ఆ దంపతులకు ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుళ్ళు జన్మించారు. ఆ ముగ్గురు కొడుకులలో పెద్దవాడైన గైయస్‌ను అగస్టస్ దత్తత స్వీకరించి, తన వారసుడిగా ప్రకటించాడు. దానితో అతడుకూడా సీజర్‌గా (Gaius Caesar) పిలువబడ్డాడు. అగస్టస్ 1 B.C.లో ఇరవయ్యేళ్ళ వయసులో ఉన్న ఇతడికి వివాహం చేసి, ఆసియా ప్రాంతంలోని పార్థియా, ఆర్మీనియాలలో తలయెత్తిన కొన్నిసమస్యలను పరిష్కరించిరమ్మని కొన్ని అధికారాలతో, కొంత సైన్యంతో రాజప్రతినిథిగా పంపుతున్న సందర్భాన్నే ఒవిడ్ పైన పేర్కొన్నాడు.
(21) పార్థియా రాజు ఫ్రాటెస్ IV (Phraates IV) కు నలుగురు కొడుకులు. వీళ్ళు కాక ఒక రోమన్ బానిస స్త్రీ వలన ఫ్రాటసెస్ (Phraataces) అనే మరో కొడుకు కలుగుతాడు. ఆ రోమన్ బానిస తన కొడుకైన ఫ్రాటసెస్‌ను రాజును చేయాలని తన సవతి కొడుకులు నలుగురినీ దేశం నుండి వెళ్ళగొట్టిస్తుంది. తరువాత ఫ్రాటసెస్, రాజైన తన తండ్రి ఫ్రాటెస్ IV ను హత్య చేసి, (2 B.C.) ఫ్రాటెస్ V గా సింహాసనం అధిష్ఠిస్తాడు. ఫ్రాటసెస్ వలన అతడి సవతి సోదరులకు జరిగిన అన్యాయాన్నీ, ఫ్రాటెస్ IV, ఒక తండ్రిగా తన కొడుకులలో ఎవరిని రాజును చేయాలో నిర్ణయించే హక్కును కలిగి ఉన్నాకూడా ఫ్రాటసెస్ ఆ హక్కును గుర్తించకుండా అతడిని హత్యచేసిమరీ రాజ్యాధికారాన్ని చేజిక్కించుకున్న వైనాన్నీ అన్యాపదేశంగా పేర్కొంటూ, దుర్మార్గుడైన ఫ్రాటసెస్‌కు తగిన శాస్తి చేయమని గైయస్ సీజర్‌ను ఒవిడ్ కోరుతున్నాడు.
(22) మార్స్ యుద్ధానికి అధిదేవుడు కనుక యుద్ధానికి బయలు దేరిన అతడికి మార్స్‌ను తండ్రిగా భావించాలి, అగస్టస్ సీజర్ అతడిని తన వారసుడిగా దత్తత స్వీకరించాడు కనుక అతడూ తండ్రే.
(23) ప్రాచీన రోమన్ల కాలంలో రాజులు జైత్రయాత్ర నుండి విజేతగా స్వదేశం తిరిగి వచ్చే సమయంలో గొప్ప ప్రదర్శనతో కూడిన ఊరేగింపును ఏర్పాటు చేసేవారు. ఆ ప్రదర్శనలో తక్కువ ఎత్తు ఉండే అనేక శకటాలు ఒకదాని వెంట ఒకటి కదులుతుండగా, వాటిమీద జయించిన ప్రాంతాలకు చెందిన దేశాలు, నదులు, పర్వతాలు మొదలైన వాటి మీనియేచర్ రూపాలు ఏర్పాటు చేయబడేవి. మన రిపబ్లిక్ డే పెరేడ్ వలే. నిజానికి మన మోక్ నావల్ ఫైట్స్, రిపబ్లిక్ డే పెరేడ్స్ లాంటివన్నీ కూడా నేటి ఆధునిక కాలంలో అన్ని దేశాలవారూ అనుసరిస్తున్న నాటి రోమన్ సాంప్రదాయాలే.
(24) టైగ్రిస్, యూఫ్రటిస్‌లు పార్థియా ప్రాంతపు నదులు. పైన పేర్కొన్నది వాటి మూర్తి రూపాల (personification) వర్ణన.
No comments:
Post a Comment