మాట ఇవ్వు! మోసగించు!
బాస చేయడానికి వెనుకాడకు.
బాసలు యువతులను ఊరిస్తాయి.
నీవు చేసే బాసకు ఏ దేవుళ్ళను కావాలంటే ఆ దేవుళ్ళను
సాక్షులుగా చేయి!
పైన ఉండే జూపిటర్ ప్రేమికుల అబద్దపు ప్రమాణాలను
చూచి నవ్వుకొని, వాటన్నింటినీ గాలికి కొట్టుకుపోయేటట్లు చేయాలని వాయుదేవుడికి
ఆజ్ఞాపిస్తాడు.
జూపిటర్ తన భార్య అయిన జూనోకు –తాను విశ్వాసపాత్రుడిగా
ఉంటానని– తరచూ స్టిక్స్ నది సాక్షిగా (50)అబద్దపు ప్రమాణం చేసేవాడు. అతడి ఉదాహరణ మనకు ధైర్యాన్ని ఇచ్చుగాక! (తనను అనుసరించే వారికి
ఇప్పుడు అతడు సానుకూలంగా ఉంటాడు)
దేవుళ్ళనేవాళ్ళు ఉంటే మంచిదే! మనం ఆ దేవుళ్ళను నమ్మటమూ మంచిదే! వారి పురాతన పూజావేదికల మీద మధువును, సాంబ్రాణీ పొగను నైవేద్యంగా ఉంచుదాం.
వారు బద్దకంగా, నిర్వ్యాపారంగా, నిద్రపోతూ ఉండరు. మనం తప్పు చేస్తే శిక్షిస్తారు, ఒప్పు చేస్తే లబ్ది
చేకూరుస్తారు.
కనుక నీవు ఎల్లవేళలా దేవుని సమక్షంలోనే ఉన్నట్లుగా
తప్పు చేయకుండా బ్రతుకు!
ఇతరులు నీ మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకో!
మత సంప్రదాయాలను పాటించు!
మోసం చేయకు!
నీ చేతులకు రక్తాన్ని అంటనీయకు!
అయితే, నీవు వివేకవంతుడివైనట్లైతే, స్త్రీలను మాత్రం మోసం చేయి! నీకు ఏ పాపం అంటదు, ఏ శిక్షా పడదు.
ఇక మిగతా అన్ని విషయాలలో ఇచ్చిన మాటకు కట్టుబడు!
మోసం చేసే వారిని మోసం చేసెయ్!
స్త్రీలు అనేవాళ్ళు చాలావరకు
ఒక నమ్మకద్రోహం చేసే జాతి. వాళ్ళు పన్నిన ఉచ్చులో స్వయంగా వాళ్ళనే పడనివ్వండి!
ఒకసారి ఈజిప్టు దేశంలో వర్షాలు లేక, పంటలు పండక, వరుసగా తొమ్మిది సంవత్సరాలు కరువు తలయెత్తింది.
ఆ దేశపు రాజు బుసిరిస్ వద్దకు థ్రేసియస్ అనే
ఒక పరదేశీయుడు వచ్చి ఎవరైనా ఒక కొత్త వ్యక్తి రక్తాన్ని చిందించినట్లైతే దేవతలరాజైన
జూపిటర్ అనుగ్రహిస్తాడని చెబుతాడు.
అంతట బుసిరిస్ థ్రేసియస్‌తో “అలాగైతే దేవునికి బలి
ఇవ్వవలసిన మొదటి వ్యక్తివి నీవే! ఈజిప్టుకు వర్షాన్ని రప్పించగల ఆ కొత్తవ్యక్తి రక్తం
నీదే!” అని పలికాడు.
ఫలారిస్ కూడా క్రూరుడైన పెరిల్లస్‌ను అతడు
రూపొందించిన ఇత్తడి ఎద్దులోనే పెట్టి కాల్చివేశాడు.
దురదృష్టవంతుడైన ఆ చేతిపనివాడు తన పనితనాన్ని
మొదట తానే ఋజువు చేయవలసివచ్చింది.
రెండు శిక్షలూ న్యాయమైనవే. ‘చావుకు పథకరచన చేసేవారు
తమ ఆవిష్కరణ ద్వారా తామే నశించాలి’ అనే దాని కన్నా న్యాయమైన
నియమం నిజానికి మరోటిలేదు.
ఈ కారణంగా, అబద్దానికి అబద్దమే
బదులవ్వటం న్యాయమే కనుక,
స్త్రీని మోసపోనివ్వండి.
ఆ నమ్మకద్రోహం అంతకు ముందు తాను చేసిన దానికి
బదులే కనుక అందుకు ఆమె తనను తాను తప్ప మరెవ్వరినీ నిందించలేదు.
Footnote:
(50) దేవతలకు రాజైన జూపిటర్‌కు అనేక మంది పరాయిస్త్రీలతో సంబంధాలుండేవి.
ఇది సహించని అతని భార్య జూనో అతడిని నిలదీసినప్పుడల్లా ఆమెకు ఆతడు అబద్దపు ప్రమాణాలు
చేస్తుండేవాడు. స్టిక్స్ నది సాక్షిగా ప్రమాణం చేయడం రోమన్ దేవతల ఆచారం
No comments:
Post a Comment