వ్యాహ్యాళికి వెళ్ళినపుడు వెదుకు!
వేసవి కాలంలో, సాయం సమయంలో చల్లని
నీడనిచ్చే పాంపే పోర్టికో (4)&(5) క్రిందకు వ్యాహ్యాళికి వెళ్ళడమే నీవు చేయవలసినది.
ఓ మాతృమూర్తి తన కుమారుడు చేసిన అభివృద్ధికి, అందమైన విదేశీ పాలరాతి పనితనంతో మరికొంత అభివృద్ధిని జోడించిన
భవనం (6) వద్దకు కూడా వెళ్ళు.
ప్రాచీన చిత్రాలతో అలంకరింపబడి, తన నిర్మాత పేరుమీదుగానే పిలువబడుతున్న లివియా పోర్టికోను (7) సందర్శించడం మానకు.
దురదృష్టవంతులైన తమ భర్తలను చంపడానికి సిద్ధమవుతున్న
డానైడ్స్, (8),(9),(10&(11) వారి చెంతనే దూసిన ఖడ్గంతో రౌద్రంగా నిలబడి ఉన్న వాళ్ళ తండ్రి కనబడే చోటుకి సైతం వెళ్ళు.
వీనస్ విలపించిన ఎడోనిస్ (12)&(13) కొరకు జరిపే ఉత్సవాన్నీ, వారానికొకసారి జరిగే యూదుల పూజా కార్యక్రమాన్నీ మరువకు.
ఈజిప్షియన్ ఆవు (14) దేవాలయాన్ని విడువకు. ఆమె జూపిటర్‌తో తను నడిపిన ప్రేమవ్యవహారాన్ని
అనేక మంది స్త్రీలు అనుసరించేటట్లుగా చేసింది.
చెబితే నమ్మరుగానీ, న్యాయస్థానాలు కూడా ప్రేమవ్యవహారాలకు
తగినవై ఉంటాయి.
న్యాయవాదులు ప్రేమజ్వాలను రేపే కాముడి బాణాలకు లొంగని వారేం
కాదు. పాలరాతితో నిర్మించబడిన వీనస్ దేవాలయం చెంతనే, అప్పియన్ జలధార గాలిలోకి
నీటిని చిమ్మే ప్రాంతంలో(15), అనేక మంది న్యాయవాదులు కాముడి ఉచ్చులో పడిపోయారు.
ఇతరులను రక్షించేవాడు తనను తాను రక్షించుకోలేకపోతాడు.
అటువంటి పరిస్థితిలో గొప్పవక్త కూడా ఒక్కోసారి మాటల కోసం తడుముకుంటాడు. పరిస్థితి తారుమారవడంతో అతడు తన కొరకే వాదించవలసివస్తుంది.
ఆవిధమైన సందిగ్ధావస్థలో ఉన్న అతడిని, చెంతనే ఉన్న తన ఆలయం నుండి చూచి, వీనస్ నవ్వుకుంటుంది.
కొద్దిసేపటి క్రితం అతడు ఒక రక్షకుడు, కానీ ఇప్పుడు అతడు ఒక ఆశ్రితుడుగా ఉండటానికి ఇష్టపడుతున్నాడు.
Footnote:
(4) ప్రాచీన రోమ్‌లో పోర్టికో అంటే పైకప్పు ఉన్న నడవలు. ఆ కప్పులకు
ఆధారంగా స్థంభాలు ఉంటాయి. ఈ పోర్టికోలు ఏదైనా భవనానికి అనుబంధంగా నైనా ఉంటాయి, లేదా విడిగానైనా ఉంటాయి. ఈ పోర్టికోలు సాధారణ రహదారులు కాదు. ప్రజలు వాటిని ఓ ఉద్యానవనంలా
వ్యాయామానికి, వ్యాహ్యాళికి, ఖాళీసమయాలలో కాలక్షేపం చేయడానికి, అలాగే ఆయా ప్రాంతాలను సందర్శించేవారు ఎండ, వానలనుండి రక్షణ పొందడానికి ఉపయోగించేవారు. ఒక్కోసారి అక్కడ వస్తువులను విక్రయించేవారు. ఒక్కోసారి వాటిలో న్యాయవిచారణ కూడా జరిపేవారు. దేవాలయాలకు అనుబంధంగా
కట్టిన పోర్టికోలైతే అక్కడ పూజాదికాలు నిర్వహించడానికి వచ్చిన వారు మకాం చేయడానికి
ఉపయోగపడేవి. కొంతభాగం కూలిపోయి శిధిలాలుగా మిగిలిన ఈ పోర్టికోలను ఇప్పటికీ మనం రోమ్‌నగరంలో
దర్శించవచ్చు
(5) జూలియస్ సీజర్ సహచరుడైన ‘పాంపే ద గ్రేట్’ రోమ్‌లో ఓ పోర్టికోను నిర్మించాడు, దానికి సమీపంలో నీడనిచ్చే చెట్లను, ఆహ్లాదకరమైన జలధారలను ఏర్పాటుచేశాడు.
(6) అగస్టస్ చక్రవర్తి ఓ వినోదమందిరాన్ని దానికి అనుబంధంగా ఓ పోర్టికోను
నిర్మించాడు, దానిని అగస్టస్ మేనల్లుడు మార్సెల్లస్ కొంత అభివృద్ధి పరిచాడు, అతడి మరణానంతరం అతడి తల్లి, అగస్టస్‌కు సోదరి అయిన
ఆక్టేవియా ఆ పోర్టికోను మరికొంత అభివృద్ధిచేసినది.
(7) అగస్టస్ చక్రవర్తి భార్య లివియా కూడా రోమ్‌నగరంలో ఓ పోర్టికోను
నిర్మించింది.
(8) గ్రీకు పురాణలలో డానస్ ఈజిప్టు యువరాజు, ఇతని కవల సోదరుడి పేరు ఏజిప్టస్. వీరిరువురి మధ్యన వచ్చిన ఒక గొడవను పరిష్కరించడానికి
తన యాభై మంది కుమారులకు, డానస్ తన యాభై మంది
కుమార్తెలనిచ్చి వివాహం జరిపించాలని ఏజిప్టస్ ప్రతిపాదించగా, అది ఇష్టం లేని డానస్, అతని కుమార్తెలు ఓ నావలో ఈజిప్టు నుండి ఆర్గోస్‌కు పారిపోతారు. అక్కడ ఆర్గోస్‌కు డానస్ రాజవుతాడు.
అక్కడకు కూడా వచ్చి ఏజిప్టస్
బలవంతంచేయగా, ఇష్టం లేకుండానే వివాహాలు
జరిపించడానికి అంగీకరించిన డానస్, పెళ్ళిరోజే తన కుమార్తెలకు
ప్రతిఒక్కరికీ ఓ ఖడ్గాన్ని ఇచ్చి, ఆ రాత్రే ఏజిప్టస్
కుమారులనందరినీ చంపిస్తాడు. (ఒక్క కుమార్తె మాత్రం తండ్రి మాట జవదాటుతుంది)
(9) డానస్ కుమార్తెలను డానైడ్స్‌గా పిలుస్తారు.
(10) రోమ్‌నగరంలోని పాలటైన్ కొండమీద అగస్టస్ చక్రవర్తి అపోలో దేవాలయాన్ని
కట్టించి, దానికి చుట్టూ ఓ పోర్టికోను
నిర్మించి దానిలో పై పురాణ గాథకు సంబంధించిన విగ్రహాలను ఏర్పాటు చేయించాడు.
(11) అగస్టస్ చక్రవర్తి కాలంలో రోమ్‌నగరంలో అనేక అందమైన కట్టడాలు వెలిసాయి.
అందుకే అగస్టస్ గర్వంగా ఇలా అనేవాడు. “నా అధీనంలోకి వచ్చినపుడు రోమ్ ఇటుకలతో నిండి
ఉండేది, దానిని నేను పాలరాతిమయం చేసి
విడిచిపెట్టాను.” ("found Rome brick and left it
marble.")
(12) గ్రీకు పురాణాలలో ఎడోనిస్ ఒక అందమైన యువకుడు. అతడిని వీనస్ గాఢంగా
ప్రేమిస్తుంది. అందుకు కోపించిన ఆమె భర్త ఒక అడవిపంది రూపం ధరించి ఎడోనిస్ వేటాడే సమయంలో
అతడిని చంపుతాడు. అప్పుడు వీనస్ తీవ్రంగా విలపించి దేవతల రాజైన జియస్‌ను ప్రార్థంచి
అతడిని బ్రతికించుకుంటుంది. ఈ గాథ ఆధారంగా రోమన్లు వీనస్ దేవాలయంలో ఎడోనిస్ ఉత్సవాన్ని
జరుపుతారు. ఆ ఉత్సవం రోజున రోమన్ స్త్రీలు ఆ దేవాలయానికి వెళ్ళి ఎడోనిస్ కోసం పెద్దపెట్టున
విలపిస్తారు.
(13) అగస్టస్ కాలానికి రోమ్‌నగరంలో అనేకమంది యూదులు నివసిస్తూ ఉండేవారు.
వారు తమ ప్రార్థనా మందిరంలో (synagogue) వారానికొకసారి (Sabbath) అట్టహాసంగా జరిపే మతపరమైన కార్యక్రమాలకు రోమన్‌స్త్రీలు కూడా కుతూహలం కొద్దీ వెళుతుండేవారు.
(14) రోమన్ పురాణాలలో దేవతల రాజైన జూపిటర్‌కు అయో ప్రియురాలు. తన
భార్య జూనోకు భయపడి జూపిటర్ అయోను ఓ అందమైన తెల్లని ఆవుగా మార్చుతాడు. ఈ విషయం పసిగట్టిన
జూనో ఆ ఆవును బాధించడానికి ఒక గుడ్డీగను (gadfly) పంపుతుంది. ఆ ఈగ తన శరీరాన్ని అదేపనిగా తొలుస్తుండగా ఆ బాధ తట్టుకోలేక
అయో ఆవురూపంలోనే భూమండలమంతా తిరుగుతూ ఓ సముద్రాన్ని ఈది చివరికి ఈజిప్టుదేశం
చేరుతుంది. (అయో ఈదిన ఆ సముద్రం నేటికీ అయోనియన్ సముద్రంగా పిలువబడుతున్నది.
దానిని మనం మధ్యధరా సముద్రంలో ఇటలీ, గ్రీసు దేశాలమధ్యన చూడవచ్చు) తరువాత ఆమె ఈజిప్టు దేశంలో తిరిగి తన మామూలు స్త్రీ రూపాన్ని
పొందుతుంది.
(15) ప్రాచీన రోమ్‌లో నగరం నడిమధ్యన ఫోరమ్‌లని పిలవబడే బహిరంగ ఖాళీ
స్థలాలుండేవి. ఇవి దీర్ఘచతురస్రాకారంలో చాలా పెద్దగా ఉండేవి. వాటిలో అనేకరకాలైన కార్యక్రమాలు
జరుగుతుండేవి. సంత జరిగేది, మతపరమైన ఉత్సవాలు జరిగేవి, ఎన్నికలు జరిగేవి. మల్లయుద్ధ పోటీలు, పరుగు పందేలతో పాటు అనేక ఇతర క్రీడోత్సవాలు జరిగేవి. నాటకాలు లాంటి అనేక ఇతర వినోదకార్యక్రమాలు కూడా జరిగేవి. వీటన్నింటికన్నా
ముఖ్యంగా ఫోరమ్‌లు న్యాయవిచారణ జరిగే న్యాయస్థానాలుగా, పరిపాలనా కార్యక్రమాలు జరిగే రాజకీయ వేదికలుగా ఉపయోగపడేవి. రోమ్‌నగరంలో
54 B.C.లో జూలియస్ సీజర్ రక్షణ
గోడ ఉన్న ఒక ఫోరమ్‌ను ఏర్పాటు చేసి దానిలో వీనస్ దేవాలయాన్ని నిర్మించాడు. ఆ ఫోరమ్‌నే
న్యాయ విచారణ జరిగే ప్రాంతంగా ఒవిడ్ పైన పేర్కొన్నాడు.
No comments:
Post a Comment