Showing posts with label భారత జాతి. Show all posts
Showing posts with label భారత జాతి. Show all posts

Saturday, January 10, 2009

భారతజాతి బలహీనత

మెతకతనాన్ని ధర్మంగా, భగవంతునికి ప్రీతిపాత్రమైన చర్యగా భావించటం భారతదేశపు జాతీయ మనస్తత్వంలో అనాదిగా కొనసాగుతున ఒక బలహీనత. ధర్మభావన ఎడల సరైన అవగాహన లేకుండా, ధర్మసూక్ష్మాన్ని గ్రహించే ప్రయత్నం చేయకుండా, కేవలం సాత్వికంగా ఉండటమే ధర్మమని భ్రమించటం ఈ బలహీనతకు కారణం. ఈ మనోదౌర్బల్యం భారతజాతిని పురాణకాలంలో కానీయండి, ఇతిహాసకాలంలో కానీయండి, తదనంతర కాలంలో కానీయండి పూర్తిగా ప్రభావితం చేసింది. జాతిని క్రమంగా నిర్వీర్యం చేసింది.

సత్యవాక్పరిపాలన, పితృవాక్యపరిపాలన, క్షమాగుణం, అడిగినవారికి లేదనకుండా, కాదనకుండా విచక్షణ లేకుండా ఏది అడిగితే అది ఇచ్చేయడం ..ఇత్యాది చర్యలన్నీ ధర్మాలుగా భారతజాతిలో అనాదిగా చలామణీ అవుతూ వస్తున్నాయి. శరణన్నవాడికి అవతలి వాడి బలమేమిటో తెలుసుకోకుండా అభయమివ్వటం, ఓడిపోయి క్షమించమనగానే వాడెంతటి ప్రమాదకర శత్రువో అని ఆలోచించకుండా వాడిని క్షమించి వదలి వేయటం, వాడిని సరిహద్దులవరకూ సగౌరవంగా, మరే ఇతర రాజూ వాడి మీద దాడి చేయకుండా రక్షణ కల్పించి మరీ సాగనంపటం.. ఇత్యాది మతిమాలిన చర్యలన్నింటినీ భారతజాతి గొప్ప ఆదర్శాలుగా భావిస్తూ, వాటిని ఆచరిస్తూ వచ్చింది. చాణక్యుడు, శివాజీ లాంటి ఒకరిద్దరు రాజనీతి వేత్తలు తప్ప మిగతా వారంతా ఈ ధోరణిలోనే ప్రవర్తించారు. ఇటువంటి ధోరణి వలనే భారతజాతి రాజనీతికి దూరమై, నిర్వీర్యమై పరులకు బానిసై పతనమయ్యింది.

ఈ విధమైన మనోదౌర్బల్యం కేవలం ఎదుటివాడి యెడల మెతక తనాన్ని ప్రదర్శించడం తోటే ఆగిపోలేదు. మన జీవితంలోని అనేక అంశాలమీద దీని ప్రభావం ప్రసరించింది. ఎదుటివారి నుండి మనకు రావలసినది రాబట్టుకోక పోవడం, విచక్షణా రహితంగా అల్పులను కూడా గౌరవించడం, నిరాడంబరత పేరుతో ఐహిక సమృద్ధిని సాధించటానికి కృషి చేయకపోవటం, శక్తి ఉండి కూడా రాజ్యవిస్తరణ చేయక పోవటం, సంపద మీద, భోగాల యెడల దిక్కుమాలిన విముఖత చూపడం… సాధారణ ప్రజల్లోనైతే ఈ ధోరణి నిరాసక్తంగా, నిర్లిప్తంగా జీవించేయటం, శుచి, శుభ్రత లేకుండా ఉండటం, విద్యార్జన చేయక పోవటం, మూఢనమ్మకాలు, గుడ్డిగా ఇతరుల మీద ఆధారపడటం, ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయటం, ఏదో నాలుగు తిండి గింజలతో పొట్ట నింపుకోవటం, ఎదుగూ బొదుగూ లేకుండా జీవించటం.. ఇలా ఈ సాత్విక ధోరణి భారత జాతీయ జీవన విధానాన్ని నిస్సారం చేసేసింది.

పురాణకాలంలో, జాతీయ మనస్తత్త్వ పరిణామక్రమం కొనసాగుతున్నందున, అది జ్ఞాన బోధకు ఇంకా అర్హత సంపాదించనందున ఈ ధోరణిని భారత జాతిలోని ఏ తపస్వీ, ఏ జ్ఞానీ ఖండించలేదు. అసలు విషయం బోధించలేదు. ఈ జాతి ఆ అర్హత పొందిన ద్వాపర యుగాంతానికి తత్ విషయ బోధనకై శ్రీకృష్ణుడు అవతరించాడు. మహాభారత యుద్ధం జరగబోయే కురుక్షేత్రంలో యుద్ధానికి ముందు భారతజాతి యొక్క సారజనీన బలహీనతైన సాత్విక ప్రవర్తనే సత్యమనే ధోరణికి అర్జునుడు లోనయ్యాడు. దాని ప్రభావంతో రాజ్యం కోసం స్వజనులను చంపుకోవటం పాపమనీ, అంతకన్నా బిచ్చమెత్తుకోవటమే మేలనీ భావించాడు. ధుర్యోధనాదులు తమకు పెట్టిన బాధలను, వారి వల్ల తాము పొందిన కష్టనష్టాలను మరచిపోయి వారిని క్షమించటమే మంచిదనే నిర్ణయానికి వచ్చాడు. వారి యెడల కరుణ చూపి వారు తమ నుండి అన్యాయంగా కాజేసిన రాజ్యాన్ని వారికే వదలడం ఆదర్శవంతమైన ప్రవర్తన అనే నిర్ణయానికి వచ్చాడు. అదే విషయాన్ని శ్రీకృష్ణునితో అన్నాడు.

జాతీయ బలహీనతకు ప్రతినిథిలా నిలచిన అర్జునుడి వాదనను శ్రీ కృష్ణుడు పూర్తిగా ఖండించాడు. అతని పలుకులు చిలుక పలుకులన్నాడు. ఇది నపుంసకులకు చెల్లే మాటలు కానీ అర్జునుడు వంటి వీరాధివీరునకు చెల్లే మాటలు కావన్నాడు. అర్జునుడి ధోరణిని గొప్ప ఆదర్శంగా జాతి మొత్తం తలకెత్తుకుంటున్న కాలంలో కృష్ణుడు గొప్ప సాహసంతో, మరెంతో జ్ఞానంతో ఆ ధోరణిని ఒక్క పెట్టున ఖండించి వేశాడు. సాత్విక మైన కర్మ ఆదర్శం కాజాలదనీ, అసలైన ఆదర్శవంతమైన కర్మ ఎటువంటిదో, మనిషి అనుసరించదగిన కర్మ విధానమెటువంటిదో అర్జునుడికి (తద్వారా మన జాతి మొత్తానికీ) గీతారూపంలో బోధించాడు.

నిరంతరం సాత్వికమైన కర్మలు ఆచరించటం ఆదర్శం కాదు, సందర్భౌచిత్యాన్ననుసరించి సాత్విక కర్మలతోబాటు రాజస, తామస కర్మలను కూడా ఆచరించటమే సత్యమార్గమనీ, మనిషి ఆదర్శంగా ఉండాలనే ఆరాటాన్ని కూడా విడనాడి కేవలం నిష్కామంగా కర్మలాచరించాలనీ, అప్పుడే సత్యమార్గ జీవనం సాధ్యమవుతుందనీ బోధించాడు. అలా బోధించడమే కాక, కురుక్షేత్ర రణరంగంలో ఆచరణాత్మకంగా కూడా సత్యమార్గమంటే ఎలాఉంటుందో చూపించాడు. ధర్మరాజు చేత అబద్దమాడించాడు. యుద్ధ నియమాలకు విరుద్ధంగా భీముని చేత ధుర్యోధనుని తొడల మీద గదతో మోదించి చంపించాడు. శిఖండిని అడ్డుపెట్టుకుని భీష్ముడినీ, రథచక్రం నేలలో క్రుంగి, నిరాయుధుడై ఉన్న కర్ణుడుని అర్జునుడి చేతా చంపించాడు. ఈ చర్యలన్నీ భారతజాతి సంప్రదాయ ఆలోచనా విధానాన్ననుసరించి, సాధారణ మానవుల ఆలోచనా ధోరణిని అనుసరించి అన్యాయ పూరితమైన చర్యలు. కానీ సత్య మార్గమంటే పైకి సాత్వికంగా కనిపించేదే కాదనీ, ఇలా కూడా ఉంటుందనీ నిరూపించటానికే శ్రీకృష్ణుడు ఇవన్నీ చేయించాడు. (అబద్ధం రాజస కర్మ. యుద్ధం తామస కర్మ.)

పాండవుల చేత చేయించడమే కాదు ..తాను సైతం ఇలాంటి కర్మలు ఆచరించాడు. జరాసంధుని చేతిలో ఓడిపోయి మధుర నుండి శాశ్వతంగా, సపరివారంగా ద్వారకకు పారిపోయాడు. తరువాత జరాసంధుడిని భీముని చేత చంపించాడు. కాలయవనుని చేతిలో ఓడిపోయి పారిపోతున్నట్లు నటించి గుహలో దూరి అక్కడ నిద్రిస్తున్న ముచికుందుని చేత అతడిని చంపించాడు. సాధారణ మానవుల దృష్టిలో పారిపోవడం పిరికి పందల లక్షణం. కానీ యుద్ధంలో దుష్టుడైన శత్రువును గెలవటం, అతడిని మట్టుబెట్టటం ముఖ్యం. అంతే కానీ పారిపోయామా లేక రొమ్మెదురొడ్డి పోరాడామా అన్నది కాదు. కృష్ణుడు పారిపోయి కూడా గెలిచాడు. అదీ కృష్ణతత్త్వం! అదీ సరైన కర్మా చరణ అంటే!

శ్రీ కృష్ణుడు ఇంత వివరణాత్మకంగా గీతా రూపంలో బోధగా, తదుపరి కురుక్షేత్ర రణరంగంలో ఆచరణాత్మకంగా సత్యమార్గ కర్మ విధానాన్ని వివరించినా దానిని భారతజాతి అవగాహన చేసుకొనకుండా ‘సాత్విక ప్రవర్తనే సత్యం’ అనే భ్రమలోనే ఉండిపోయింది. భారతజాతి బలహీనత యొక్క తాత్త్విక నేపథ్యం ఇదే. ఈ బలహీనతను ఆసరాగా చేసుకునే విదేశీయులు మనల్ని జయించారు. ఈ బలహీనతవల్లే స్వతంత్రులమైనా కూడా అభివృద్ధిని సాధించలేక ప్రపంచ దేశాలలో చాలా రంగాలలో వెనుకబడి పోయాము.

భారతజాతి ఈ ధోరణిని విడనాడి తన మనసును బలోపేతం చేసుకొని సత్యకర్మ అంటే సాత్విక ప్రవర్తన ఒక్కటే కాదనీ, సాత్విక, రాజస, తామస కర్మల మేలు కలయిక అని గుర్తెరిగి, తదనుగుణంగా ప్రవర్తించి ప్రపంచదేశాలలో ప్రాబల్యాన్ని సాధించడానికి మనమంతా కృష్ణతత్త్వాన్ని ముందుగా మన వ్యక్తిగత జీవితాలలో ఆచరించడానికి ప్రయత్నిద్దాం!