Thursday, March 31, 2016

ప్రేమకళ- వేయి స్వభావాలకు, వేయి పథకాలు




వేయి స్వభావాలకు వేయి పథకాలు




మన మజిలీ దగ్గర పడింది. ఈలోపు నేను మీకు మరొక విషయం చెబుతాను.


స్త్రీలనేవాళ్ళు రకరకాల మనస్తత్వాలతో ఉంటారు. వేయి మనస్తత్వాలతో నీవు వేయి పద్దతులలో వ్యవహరించాలి. 


ఒకే నేలలో అన్ని పంటలూ బాగా పండవు. ఈ నేల ద్రాక్షకు తగినది, ఆ నేల ఆలివ్‌కు, ఇదిగో ఇక్కడ గోధుమ బాగా పండుతుంది.


ఎన్ని రకాల రూపాలు, ఎన్ని రకాల ముఖాలను నీవు కలుసుకుంటావో, ఈ ప్రపంచంలో అన్ని రకాల మనస్తత్వాలు ఉన్నట్లుగా నీవు గమనిస్తావు.


తెలివైనవాడు ఈ రకరకాల మనస్తత్వాలకూ, స్వభావాలకూ తగినట్లుగా తనను తాను ఎలా మలచుకోవాలో, సందర్భానికి తగినట్లుగా తన సంభాషణ ఎలా ఉండాలో తెలుసుకొని ఉంటాడు.


ప్రొటియస్ (60) ఒకసారి ఓ అందమైన నీటి అలగా, మరొకసారి ఓ సింహంగా, మరోసారి ఓ చెట్టుగా, మరోసారి గుర్రుమనే ఓ ఎలుగుబంటిగా తనను తాను మార్చుకుంటాడు.


చేపను పట్టే విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది. కొన్నింటిని బల్లెంతో గుచ్చి పట్టుకుంటావు, కొన్నింటిని గాలం వేసి పట్టుకుంటావు, మరికొన్నింటిని వలలో బంధించి పట్టుకుంటావు.  


రకరకాల మనుషులకు, రకరకాల పద్దతులు తగిన విధంగా ఉంటాయి.


నీ ప్రియురాలి వయసును బట్టి కూడా నీవు వాటిని మార్చవలసి ఉంటుంది. (61) వయసు మీరిన దుప్పి నీ కుట్రలను దూరం నుండే గ్రహిస్తుంది.

అమాయకురాలి వద్ద మితిమీరిన తెలివితేటలను, బిడియస్తురాలి వద్ద మితిమీరిన దూకుడును ప్రదర్శిస్తే, ఆమె ఆత్మవిశ్వాసం కోల్పోయి, భయంతో నీకు దూరంగా ఉండిపోతుంది.


ఈ కారణం చేతనే ఒక సంస్కారవంతుడైన పురుషుడి కౌగిలిలోకి రావడానికి భయపడిన స్త్రీ, ఒక పనికిమాలిన వెధవ చేతులలో వాలిపోవటం అనేది ఒక్కోసారి జరుగుతుంది.


నేను చేపట్టినకార్యంలో కొంత భాగం మిగిలిపోయింది, కొంత భాగం పూర్తయింది. ఇక ఇక్కడ మన నావకు (62)లంగరు వేసి, ఒకింత విశ్రాంతి తీసుకుందాం.



Footnote:


(60) గ్రీకు పురాణాలలో ప్రొటియస్ ఒక సముద్ర దేవుడు. ఇతడు తన రూపాన్ని కావలసినట్లుగా మార్చుకోగలడు.


(61) వయసు, అనుభవం ఉన్న ప్రౌఢకాంత, తనను లోబరుచుకోవడానికి నీవు వేసే ఎత్తుగడలను, సులభంగా గ్రహిస్తుందని అర్థం.


(62) ఒక ప్రేమికుడు ప్రేమవ్యవహారంలో క్రమంగా ముందుకెళ్ళడాన్నీ, తాను ‘ప్రేమకళ’ను బోధించడాన్నీ రెంటినీ ఒవిడ్ నౌకాయానంతో పోల్చాడు. ఒక్కోసారి రథయాత్రతోకూడా పోల్చాడు.





‘ప్రేమకళ’ మొదటి భాగం సమాప్తం








ప్రేమకళ- స్నేహితుల విషయంలో జాగ్రత్తగా ఉండు!







స్నేహితుల విషయంలో జాగ్రత్తగా ఉండు!



మంచి చుట్టూ చెడు అల్లుకుపోయి ఉందని నేను విచారంతో ఎలుగెత్తి అరవనా? లేక కేవలం నిన్ను హెచ్చరించనా?


స్నేహం, విశ్వాసపాత్రత అనేవి రెండూ డొల్ల మాటలు.


నీవు గాఢంగా ప్రేమించే స్త్రీ లోని ఆకర్షణల గురించి నీ స్నేహితుడికి చెప్పటం అంత మంచిది కాదు. నీవు ఆమె గురించి చెప్పినదంతా అతడు నిజమని నమ్మిన పక్షంలో, వెంటనే అతడు నీకు ప్రత్యర్థిగా మారిపోతాడు.


అయితే నీవిలా వాదించవచ్చు:


పాట్రోక్లస్ (56) అచెల్లిస్ పానుపునెప్పుడూ మలినం చేయలేదు.


(పాట్రోక్లస్, అచెల్లిస్‌కెప్పుడూ ద్రోహం చేయలేదు)


ఫేడ్రా, పిరిథోస్ (57) విషయంలో మాత్రం ఎటువంటి తప్పూ చేయలేదు.


పైలేడ్స్, హెర్మియోన్‌ని (58) ప్రేమించాడు, అయితే అది (59) అపోలోకు ఎథీనా మీద ఉన్న ప్రేమ లాంటిది,  లేదా అది కవల సోదరులైన కాస్టర్, పొల్లక్స్‌లకు తమ తోబుట్టువైన హెలెన్ మీద ఉన్న ప్రేమ లాంటిది.


అటువంటి అద్భుతాలు జరుగుతాయని నీవు ఆశిస్తుంటే, పూపొద నుండి ఆపిల్‌పళ్ళను కోయాలనీ, నదీప్రవాహం మధ్యన తేనెను సేకరించాలని కూడా ఆశించు!


చెడు అనేది మనిషిని త్వరగా ఆకర్షిస్తుంది. అలానే, ప్రతిమనిషీ తన స్వీయసంతోషాన్నే చూసుకుంటాడు. అంతేకాక మరొకరు బాధపడటం ద్వారా పొందిన సంతోషం మరింత తీయగా ఉంటుంది.


ఆ! ఎంత దిగ్భ్రాంతికరం! ప్రేమికులు ఎక్కువగా భయపడవలసినది తమ ప్రత్యర్థుల గురించి కాదు, స్నేహితుల గురించే.


కనుక ‘నమ్మదగిన మనుషులు’ అని నీవు అనుకునే వారందరికీ దూరంగా ఉంటే, నీవు సురక్షితంగా ఉంటావు!


ఈవిధంగా చుట్టం, సోదరుడు, ప్రాణమిత్రుడు లాంటి వారందరి విషయంలో జాగ్రత్తగా ఉండు! సాధారణంగా నిన్ను ఇక్కట్లపాలు చేసే వ్యక్తులు వీరే!




Footnote:


(56) పాట్రోక్లస్, అచెల్లిస్ ఇరువురూ ప్రాణస్నేహితులు


(57) పిరిథోస్, ఫేడ్రా భర్త అయిన థెసియస్‌కు మిత్రుడు


(58) పైలేడ్స్, హెర్మియోన్ భర్త అయిన ఒరెస్టెస్‌కు మిత్రుడు


(59) అపోలోకు ఎథీనా సోదరి 








ప్రేమకళ- పాలిపో! చిక్కిపో!





పాలిపో! చిక్కిపో!





ఒక నావికునికి పాలిపోయిన మేనిచ్ఛాయ నప్పదు. సూర్యకిరణాలు, ఉప్పునీటి తుంపరలతో అతని శరీరం నల్లబడి ఉండాలి.


బయలు ప్రదేశంలో నాగలితో, దమ్ముచక్రాలతో ఎప్పుడూ నేలను తిరగవేస్తూ ఉండే రైతుకు కూడా పాలిపోయిన వర్ణం నప్పదు.


ఓ క్రీడాకారుడా! పతకం కోసం శ్రమించే నీకు చర్మం తెల్లగా ఉంటే, అది చూడటానికి అంత బాగుండదు.


అయితే ప్రతీ ప్రేమికుడు మాత్రం పాలిపోయి ఉండాలి.


పాలిపోయిన వర్ణం ప్రేమకు చిహ్నం. మూర్ఖులు దానికెటువంటి ఉపయోగం లేదని అనుకున్నా కూడా, అది మాత్రం ప్రేమకు తగిన వర్ణచ్ఛాయ.


నీవు పాలిపోవటం చూచి నీ ప్రేమికురాలు, సానుభూతితో, నీ ఆరోగ్యం గురించి ఆదుర్దా చెందుతుంది.


లిరిస్ వెనుక అడవులలో సంచరించినప్పుడు ఓరియన్ ప్రేమభావనతో పాలిపోయి ఉన్నాడు.


తనను తిరస్కరించిన నైయద్ కోసం డఫిన్స్ కూడా పాలిపోయాడు.


చిక్కిపోవటం కూడా నీ హృదయంలోని ప్రేమకు ఒక సూచిక.


అందమైన జుత్తు ఉన్న నీ తలకు గుడ్డ కప్పుకోవడానికి సిగ్గుపడకు!


నిద్రలేని రాత్రులు ఒక యువకుడి శరీరాన్ని సన్నబరుస్తాయి.


నీ ఆకాంక్షలు నెరవేరే క్షణానికి నీవు దగ్గరవ్వాలంటే దయనీయంగా కనబడటానికి వెనుకాడకు!


అప్పుడు నిన్ను చూచిన వాళ్ళంతా ఇలా అనగలరు “అయ్యో! ఓ విషాదమూర్తీ! నీవెందుకు ప్రేమలో పడ్డావు!”













ప్రేమకళ- కన్నీళ్ళు, ముద్దులతో ముందడుగు వేయి!








కన్నీళ్ళు, ముద్దులతో ముందడుగు వేయి!





ప్రేమవ్యవహారంలో కన్నీళ్ళు కూడా బాగా ఉపయోగపడతాయి. కన్నీళ్ళు కఠిన శిలను సైతం కరిగిస్తాయి.


కనుక, సాధ్యమైతే కన్నీళ్ళతో తడిచిన నీ ముఖాన్ని నీ ప్రియురాలు చూచేటట్లు చేయి! నీకు కన్నీళ్ళు రాకపోతే –సమయానికి అవి ఎప్పుడూ రావు– తడిచిన చేతితో నీ కళ్ళను తాకు!  



సుతిమెత్తని మాటలకు ముద్దులు ఎంత గొప్పగా తోడు అవుతాయో అనుభవమున్న ఏ ప్రేమికుడికి తెలియదు?!



ఆమె తనను ముద్దాడవద్దని వారిస్తున్నా కూడా ముద్దాడు!



బహుశ మొదట ఆమె పెనుగులాడుతుంది.



“అంతా తొందరే!!” అంటుంది.



ఆమె పెనుగులాడుతున్నప్పటికీ దానిలో తాను ఓడిపోవాలనే ఆమె కోరుకుంటుంది.



అయినప్పటికీ ఆమెతో మరీ మొరటుగా ప్రవర్తించకు!



ఆమె సున్నితమైన నోటికి నొప్పి కలిగించకు!



నీవొక మోటు మనిషివి అని ఆమెతో అనిపించుకోకు!



ఆమెను నీవు ముద్దాడిన తరువాత, మిగతాది పొందలేకపోతే, గెలుచుకున్న దానికి కూడా నీవు తగినవాడవుకావు.



నీ కోరికలు నెరవేరే సమయం రావడానికి ఇంకా నీకేం కావాలి?!



ఓ! ఎంత సిగ్గు చేటు!



నిన్ను నిరోధించినది నీ మర్యాద కాదు! అది నీ మూర్ఖత్వం! అది నీ విదూషకత్వం!  



‘పెనుగులాటలో ఆమెను నేను హింసించి ఉండే వాడిని’ అని నీవు అంటావా? అయితే స్త్రీలు ఆ హింసనే ఇష్టపడతారు.



వారు తాము ఇవ్వాలనుకున్నది తమనుండి దోచివేయబడాలని కోరుకుంటారు.



కోరికల తుఫానులో బలవంతంగా చేజిక్కించుకోబడ్డ ప్రతీ స్త్రీ సంతోషంలో ఓలలాడుతుంది. మరి ఏమి ఇచ్చినా కూడా ఆమెను అంతలా సంతోషపరచలేవు.



తనను బలవంతంగా లోబరుచుకునే ఒక పెనుగులాటనుండి ఏ హానీ జరగకుండా తాను బయటపడినప్పుడు పైకి ఆమె సంతోషంగా కనబడటానికి ప్రయత్నించినప్పటికీ లోలోన బాధపడుతుంది.



ఫోబే (Phoebe) బలాత్కరించబడింది, అలాగే ఆమె చెల్లెలు ఎలైరా (Elaira) కూడా బలాత్కరించబడింది.  అయినా కూడా వారు తమను బలాత్కరించిన వారిని మనస్పూర్తిగా ఇష్టపడ్డారు.



మహావీరుడైన అచెల్లిస్ మరియు స్కిరస్ యువతిల కథ బాగా తెలిసినదే. అయినా ఇప్పుడు మరోసారి చెబితే బాగుంటుంది.



ఇడా పర్వత పాదం వద్ద తనను తన ఇరువురి ప్రత్యర్థులమీద విజేతగా నిలిపినందుకు వీనస్ పారిస్‌కు (51)ప్రతిఫలాన్ని ఇచ్చివేసింది.



సుదూరాన ఉన్న దేశాన్నుండి (52)ప్రియామ్‌కు ఒక కొత్తకోడలు వచ్చింది. ట్రోజన్ గోడల మధ్యన గ్రీకు వధువు నివసిస్తున్నది.



ఆమె భర్తకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకుంటామని గ్రీకులు ప్రతిన పూనారు.  ఎందుకంటే ఒకరి అవమానం అందరికీ అవమానమే.



అయితే అచెల్లిస్ మాత్రం తన పురుషత్వాన్ని ఒక యువతి బట్టల మాటున దాచివేశాడు. తన తల్లి ప్రాధేయపడటం మూలంగా ఇలా చేశాడు కాబట్టి సరిపోయింది, లేదంటే ఇది అతడికి ఎంతో సిగ్గుచేటైన విషయం.



ఏకస్ (53) వంశంలో ప్రభవించిన ఓ! అచెల్లిస్! అక్కడ ఏం చేస్తున్నావు?



ఊలు అల్లడంలో నిమగ్నమై ఉన్నావా?



అది ఒక పురుషుడు చేయవలసిన పనేనా?



నీవు కీర్తిని ఆర్జించవలసినది ఎథీనా యొక్క (54)ఇతర విద్యలద్వారా!



అల్లిక వస్తువులుండే బుట్టతో నీకేం పని?



నీ చేతికి తగిన పని డాలును పట్టుకోవడం!



హెక్టార్ లాంటి మహాయోధుణ్ణి పడగొట్టవలసిన ఆ చేతిలోకి అల్లిక సూది ఎలా వచ్చింది?



ఆ ఊలు కండెలన్నింటినీ అవతల పారవేయి!



నీ బలిష్టమైన బాహువుతో పెలియాన్ పర్వతం నుండి తెచ్చిన బల్లాన్ని పట్టుకొని గాలిలో ఆడించు!



ఒకసారి సందర్భవశాత్తూ అచెల్లిస్ మరియు ఒక రాకుమార్తె ఒకే పడకగదిలో కలసి ఉండవలసివచ్చింది. అప్పుడు ఆమెమీద అత్యాచారం జరగడంతో వెనువెంటనే, తనతో కలసి ఉన్నది ఒక మగవాడు, అని ఆమెకు తెలిసిపోయింది. (55)



‘ఆమె నిస్సందేహంగా బలప్రయోగానికే లొంగిపోయింది’ అని మనం తప్పనిసరిగా నమ్మవలసిందే.



అయితే అందుకు ఆమెకు కనీసం కోపంకూడా రాలేదు. పైగా ఆ బలప్రయోగంద్వారానే తాను లోబరుచుకోబడాలని ఇష్టపూర్వకంగా కోరుకుంది.



అచెల్లిస్ అల్లిక సూదిని పక్కన బెట్టి, వీరోచితమైన ఆయుధాలను చేతబట్టి, వెళ్ళడానికి తొందరపడుతున్నపుడు “మరికొంత సేపు ఉండు” అని ఆమె ప్రాధేయపూర్వకంగా చాలాసార్లు అన్నది.



ఆమె మీద జరిగిన బలప్రయోగం ఇప్పుడు ఏమైపోయింది?



ఓ! డీడామియా! నీ మాన మర్యాదలను మంటగలిపినవాడినే ప్రాధేయపూర్వక స్వరంతో వెళ్ళకుండా ఆపుతున్నావు, ఎందువల్ల?



స్త్రీ ముందుగా చొరవ తీసుకోడానికి మర్యాద అంగీకరించదు అన్నది నిజం. కనుక తన ప్రేమికుడు చొరవ తీసుకున్నప్పుడు లోబడటానికి ఆమె ఇష్టపడుతుంది.



ఒక ప్రేమికుడు స్త్రీయే ముందుగా అడగాలని అనుకుంటున్నాడంటే అతడు తన రూపం గురించి మితిమీరిన విశ్వాసంతో ఉన్నట్లే.



అతడే మొదట ప్రారంభించాలి,



అతడే ఆమెను ప్రాధేయపడాలి,



అతని వేడికోళ్ళకు ఆమె చెవి ఒగ్గుతుంది.



అడుగు! దక్కించుకో!



ఆమె కేవలం నీవు అడగటం కొరకే ఎదురు చూస్తుంటుంది.



నీలో కోరిక ఎలా పుట్టిందో, ఎందుకు పుట్టిందో ఆమెతో చెప్పు!



జూపిటర్ గతకాలపు కథానాయికలను మోకాళ్ళు వంచి ప్రార్థించేవాడు. అతడెంత గొప్పవాడైనప్పటికీ వారిలో ఏ ఒక్కరు కూడా తనంతట తానుగా వచ్చి ఎప్పుడూ అతడిని వేడుకోలేదు.



ఇంత చేసినా నీకు కేవలం ఛీత్కారం మాత్రమే ఎదురైతే నీ పథకాన్ని అంతటితో విరమించుకో! ఇక ఏమాత్రం ముందుకెళ్ళకు!



చాలామంది స్త్రీలు తమకు దొరకకుండా పోయేదానినే కోరుకుంటారు, తమకు అందుబాటులోకి వచ్చిన దానిని ఇష్టపడరు.  కనుక నెమ్మదించు! తనకోసం నీవు మరీ ఎక్కువగా ప్రయత్నిస్తున్నావని ఆమె అనుకోకూడదు.



ఒక్కోసారి నీ అసలు ఉద్దేశాన్ని ముందే బయటపెట్టకూడదు. స్నేహం ముసుగులో ప్రేమ మొదలుపెట్టు. ఈ విధంగా ఒక స్త్రీ తన ప్రేమికుడిని తిరస్కరించలేని స్థితికి రావడం, స్నేహం ప్రేమగా పరిపక్వత చెందటం నేను చాలాసార్లు చూశాను. 




Footnote:


(51) జూనో (హీర), మినర్వ (పల్లాస్ లేక ఎథినా), వీనస్ (ఆఫ్రోడైట్): ఈ ముగ్గురు దేవతలలో అందగత్తె ఎవరనే విషయంలో జరిగిన పోటీకి న్యాయనిర్ణేతగా ట్రోజన్ యువరాజు పారిస్ నిలుస్తాడు. తనను విజేతగా ప్రకటిస్తే ప్రపంచంలోకెల్లా అందమైన స్త్రీ అయిన హెలెన్‌ను అతడికి కానుకగా ఇస్తానని వీనస్ అతడికి మాట ఇస్తుంది. దానితో పారిస్ వీనస్‌నే విజేతగా నిలుపుతాడు. అయితే అప్పటికే హెలెన్‌కు గ్రీసు దేశంలోని స్పార్టా ప్రాంతపు రాజైన మెనెలాస్‌తో వివాహం జరిగిపోయి ఉంటుంది. పారిస్ స్పార్టాను సందర్శించినపుడు, వీనస్ వరప్రభావంతో హెలెన్ అతడితో కలిసి ట్రాయ్ నగరానికి పారిపోతుంది. హెలెన్‌ను తిరిగి తీసుకురావడానికి మెనలాస్ సోదరుడు ఆగమెమ్నాన్ నాయకత్వంలో గ్రీకులు ట్రాయ్ నగరం మీద అనేక సంవత్సరాల పాటు గొప్పయుద్ధం చేస్తారు. అదే సుప్రసిద్ధ ట్రోజన్ యుద్ధం.

(52) ప్రియామ్ ట్రాయ్‌కు రాజు, పారిస్‌కు తండ్రి.

(53) ఏకస్ దేవతలకు రాజైన జూపిటర్ లేక జియస్‌కు కొడుకు, అచెల్లిస్‌కు తాత.

(54) ఎథీనా కళలు, చేతి వృత్తులు, విజ్ఞానం, యుద్ధం మొదలైన వాటికి అధిదేవత. అచెల్లిస్ యువతి వేషధారణలో ఉన్నపుడు ఊలు అల్లాడు. ఊలు అల్లడం ఎథీనా యొక్క విద్య. అలాగే  యుద్ధం చేయడం కూడా ఎథీనా యొక్క విద్యే. ఊలు అల్లుతున్న అచెల్లిస్‌ను ఉద్దేశించి ‘ఎథీనా యొక్క ఇతర విధ్యలద్వారా నీవు కీర్తిని ఆర్జించాలి’ అంటే ‘యుద్ధం చేయడం ద్వారా’ అని అర్థం.


(55) ట్రోజన్ యుద్ధంలో అచెల్లిస్ మరణిస్తాడని ముందే తెలుసుకున్న అతడి తల్లి అతడికి నచ్చచెప్పి ఒక యువతి వలే వేషధారణ చేసి, స్కిరస్ ద్వీపపు రాజును ఒప్పించి అతడి ఏడుగురు కుమార్తెలతో కలిపి ఉంచుతుంది. అలా ఉంటుండగా ఒక రాత్రి ఆ ఏడుగురిలో డీడామియా అనే యువతితో అచెల్లిస్ ఏకాంతంగా గడపవలసివస్తుంది. ఆ సమయంలో అచెల్లిస్ ఆమెను బలాత్కరిస్తాడు. అప్పటినుండి డీడామియా అచెల్లిస్‌తో గాఢమైన ప్రేమలో పడుతుంది. తరువాత యూలిసెస్ అనే వీరుడు అచెల్లిస్ జాడ కనుక్కొని, స్కిరస్ ద్వీపానికి వచ్చి, అతడిని యుద్ధానికి తీసుకెళతాడు. ఆ సమయంలో డీడామియా తనను వీడి వెళ్ళవద్దని అచెల్లిస్‌ను ప్రాధేయపడుతుంది.









ప్రేమకళ- మాట ఇవ్వు! మోసగించు!






మాట ఇవ్వు! మోసగించు!



బాస చేయడానికి వెనుకాడకు. బాసలు యువతులను ఊరిస్తాయి.


నీవు చేసే బాసకు ఏ దేవుళ్ళను కావాలంటే ఆ దేవుళ్ళను సాక్షులుగా చేయి!


పైన ఉండే జూపిటర్ ప్రేమికుల అబద్దపు ప్రమాణాలను చూచి నవ్వుకొని, వాటన్నింటినీ గాలికి కొట్టుకుపోయేటట్లు చేయాలని వాయుదేవుడికి ఆజ్ఞాపిస్తాడు.


జూపిటర్ తన భార్య అయిన జూనోకుతాను విశ్వాసపాత్రుడిగా ఉంటానని తరచూ స్టిక్స్ నది సాక్షిగా (50)అబద్దపు ప్రమాణం చేసేవాడు. అతడి ఉదాహరణ మనకు ధైర్యాన్ని ఇచ్చుగాక! (తనను అనుసరించే వారికి ఇప్పుడు అతడు సానుకూలంగా ఉంటాడు)


దేవుళ్ళనేవాళ్ళు ఉంటే మంచిదే! మనం ఆ దేవుళ్ళను నమ్మటమూ మంచిదే! వారి పురాతన పూజావేదికల మీద మధువును, సాంబ్రాణీ పొగను నైవేద్యంగా ఉంచుదాం.


వారు బద్దకంగా, నిర్వ్యాపారంగా, నిద్రపోతూ ఉండరు. మనం తప్పు చేస్తే శిక్షిస్తారు, ఒప్పు చేస్తే లబ్ది చేకూరుస్తారు.


కనుక నీవు ఎల్లవేళలా దేవుని సమక్షంలోనే ఉన్నట్లుగా తప్పు చేయకుండా బ్రతుకు!


ఇతరులు నీ మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకో!


మత సంప్రదాయాలను పాటించు!


మోసం చేయకు!


నీ చేతులకు రక్తాన్ని అంటనీయకు!


అయితే, నీవు వివేకవంతుడివైనట్లైతే, స్త్రీలను మాత్రం మోసం చేయి! నీకు ఏ పాపం అంటదు, ఏ శిక్షా పడదు.


ఇక మిగతా అన్ని విషయాలలో ఇచ్చిన మాటకు కట్టుబడు!


మోసం చేసే వారిని మోసం చేసెయ్!


స్త్రీలు అనేవాళ్ళు చాలావరకు ఒక నమ్మకద్రోహం చేసే జాతి. వాళ్ళు పన్నిన ఉచ్చులో స్వయంగా వాళ్ళనే పడనివ్వండి!


ఒకసారి ఈజిప్టు దేశంలో వర్షాలు లేక, పంటలు పండక, వరుసగా తొమ్మిది సంవత్సరాలు కరువు తలయెత్తింది.


ఆ దేశపు రాజు బుసిరిస్ వద్దకు థ్రేసియస్ అనే ఒక పరదేశీయుడు వచ్చి ఎవరైనా ఒక కొత్త వ్యక్తి రక్తాన్ని చిందించినట్లైతే దేవతలరాజైన జూపిటర్ అనుగ్రహిస్తాడని చెబుతాడు.


అంతట బుసిరిస్ థ్రేసియస్‌తో అలాగైతే దేవునికి బలి ఇవ్వవలసిన మొదటి వ్యక్తివి నీవే! ఈజిప్టుకు వర్షాన్ని రప్పించగల ఆ కొత్తవ్యక్తి రక్తం నీదే! అని పలికాడు.


ఫలారిస్ కూడా క్రూరుడైన పెరిల్లస్‌ను అతడు రూపొందించిన ఇత్తడి ఎద్దులోనే పెట్టి కాల్చివేశాడు.


దురదృష్టవంతుడైన ఆ చేతిపనివాడు తన పనితనాన్ని మొదట తానే ఋజువు చేయవలసివచ్చింది.


రెండు శిక్షలూ న్యాయమైనవే. చావుకు పథకరచన చేసేవారు తమ ఆవిష్కరణ ద్వారా తామే నశించాలి అనే దాని కన్నా న్యాయమైన నియమం నిజానికి మరోటిలేదు.


ఈ కారణంగా, అబద్దానికి అబద్దమే బదులవ్వటం న్యాయమే కనుక, స్త్రీని మోసపోనివ్వండి.
 

ఆ నమ్మకద్రోహం అంతకు ముందు తాను చేసిన దానికి బదులే కనుక అందుకు ఆమె తనను తాను తప్ప మరెవ్వరినీ నిందించలేదు.




Footnote:



(50) దేవతలకు రాజైన జూపిటర్‌కు అనేక మంది పరాయిస్త్రీలతో సంబంధాలుండేవి. ఇది సహించని అతని భార్య జూనో అతడిని నిలదీసినప్పుడల్లా ఆమెకు ఆతడు అబద్దపు ప్రమాణాలు చేస్తుండేవాడు. స్టిక్స్ నది సాక్షిగా ప్రమాణం చేయడం రోమన్ దేవతల ఆచారం



ప్రేమకళ- విందు సమయంలో ధైర్యం చేయి!



విందు సమయంలో ధైర్యం చేయి!




అదిగో చూడు! మధుదేవుడైన (God of Wine) బాకస్ తన కవిని (ఒవిడ్‌ను) రమ్మని పిలుస్తున్నాడు!

అతను కూడా ప్రేమికులకు సహాయం చేస్తాడు. తాను జ్వలించిపోయే అగ్నిజ్వాలలనే అతడు ఎగదోస్తాడు.

విచారంతో ఉద్వేగంగా ఉన్న అరియాడ్నే నాక్సస్‌దీవిలో అలలతాకిడికి గురైన సముద్రతీరం వెంబడి ఒంటరిగా తిరుగాడుతున్నది.

అప్పుడే నిదుర నుండి మేల్కొన్నట్లుగా వదులైన బట్టలతో, పాదరక్షలు లేని పాదాలతో, ముడివేయని కురులు భుజాలమీద కదలాడుతూ ఉన్న ఆమె తన లేలేత చెక్కిళ్ళ మీద కన్నీరు ధారగా కారుతుండగా, వినిపించుకోని ఆ సముద్రపు అలలతో మొరపెట్టుకుంటూ, థెసియస్ కొరకు రోదిస్తున్నది.

ఆమె బిగ్గరగా అరుస్తున్నది, అదే సమయంలో ఏడుస్తున్నది; అయితే రెండూ ఆమె అందాన్ని ద్విగుణీకృతం చేస్తున్నాయి.

ఆమె తన అందమైన గుండెలను అదేపనిగా బాదుకుంటూ అయ్యో! ఆ నమ్మకద్రోహి నన్ను విడిచివెళ్ళాడు!! ఇప్పుడు నాగతేంటి?! అయ్యో! ఇప్పుడు నేనేం చేయాలి?!” అని అరుస్తున్నది.

ఇంతలో హఠాత్తుగా తప్పెటలను, తాళాలను పిచ్చెత్తినట్లు వాయించిన శబ్దాలు ఆ తీరం వెంబడి ప్రతిధ్వనించాయి.

భయభీతురాలైన ఆమె తన చివరి మాటలను అస్పష్టంగా పలుకుతూ మూర్చిల్లింది. దాదాపు చనిపోయిన స్థితికి చేరుకున్న ఆమె శరీరంలో రక్తపు ఆనవాళ్ళే లేవు.

అదిగో! అలలవలే కదలాడుతున్న శిరోజాలు కలిగిన (44) మినాడ్‌లను చూడు! వేగంగా కదిలే శాటిర్‌లను చూడు! ఇటువంటి అనుచరగణంతో కూడుకున్న దేవుని ఊరేగింపు అక్కడకు చేరుకున్నది.

అదిగో! ముసలి (45 ) సైలినస్‌ను చూడు! ఎప్పటిలాగే తాగి ఊగుతున్నాడు!

మోయలేని బరువుతో సరిగా నడవలేకపోతున్న గాడిదనెక్కి సరిగా కూచుండలేక దాని మెడమీది జూలును గట్టిగా పట్టుకుని ఉన్నాడు.

అతడు తనను వెక్కిరించి పారిపోతున్న మినాడ్‌ల వెంటపడుతున్నాడు. అలా వెంటపడేటప్పుడు నైపుణ్యంలేని ఆ రౌతు తన పొడవు చెవుల గాడిదను కర్రతో అదిలించగా తల ముందుగా నేలకు గుద్దుకునేటట్లుగా దానిమీద నుండి దొర్లి కిందపడ్డాడు.

అప్పుడు శాటిర్‌లన్నీ పెద్దపెట్టున ఇలా అరిచాయి. లెమ్ము! ఓ తండ్రీ! మరలా లెమ్ము!

అంతటా ద్రాక్షతీగలతో అలంకరింపబడి ఉన్న ఎత్తైన రథం మీద నుండి ఆ దేవుడు బంగారు పగ్గాలను పట్టుకొని రథానికి పూన్చిన పులుల బృందాన్ని నిలువరించాడు.

థెసియస్‌ను పోగొట్టుకున్న ఆ యువతి భయంతో Bతన మేని ఛాయను, తన స్వరాన్ని కూడా పోగొట్టుకున్నది.

మూడుసార్లు ఆమె పారిపోవడానికి ప్రయత్నించింది. కానీ, మూడు సార్లూ ఆమె అడుగులు భయంతో స్థంభించిపోయాయి.

ఆమె పెనుగాలిలో చిగురుటాకులా వణికిపోయింది, కొలనులోని గడ్డిపోచలా కంపించిపోయింది.

"నీ భయాలన్నీ తీసి పక్కనబెట్టు" ఆ దేవుడు బిగ్గరగా పలికాడు:

నాలో ఒక సున్నితమైన, థెసియస్‌కన్నా ఎక్కువ విశ్వాసపాత్రుడైన ప్రేమికుడిని నీవు చూస్తావు, ఓ! మైనస్ ప్రియ పుత్రికా! నీవు ఈ బాకస్‌కు భార్యవవుతావు,. ఆకాశంలో నివాసాన్ని నీకు శుల్కంగా ఇస్తాను. నీవొక నూతన తార అవుతావు.  నీ ప్రకాశవంతమైన కిరీటం దారితెలియని నావికులకు దారి చూపిస్తుంది.”

ఆ విధంగా పలుకుతూ తన పులుల వలన ఆమెకు భయం కలుగకుండా రథం నుండి క్రిందకు దూకాడు.

అతని పాదల క్రింద ఉన్న ఇసుకలో (46) పచ్చదనం మొలిచింది.

మూర్ఛిల్లుతూ ప్రతిఘటించలేకుండా ఉన్న ఆమెను బాకస్ పొదివి పట్టుకొని ఎత్తుకెళ్ళిపోయాడు.

దేవుడు తాను చేయదలచుకున్నది చేసేయగలడు, ఎవరు మాత్రం అతడిని కాదనగలరు!

అప్పుడు కొందరు వివాహగీతాలను ఆలపించారు, మరికొందరు జయజయధ్వానాలు చేశారు.

వీటి మధ్యన ఆ దేవుడు, ఆ వధువు దివ్యమైన ఒక పానుపు మీద ఒక్కటవ్వడం ద్వారా తమ వివాహకార్యక్రమాన్ని పూర్తిచేశారు.

మద్యం ఏరులై ప్రవహించే విందు వినోదాలలో నీవు పాల్గొనేటప్పుడు,

ఆ సమయంలో నీచెంతనే ఒక స్త్రీ ఉన్నపుడు,

రాత్రికి మరియు రాత్రిపూట జరిగే విందువినోదాలకు అధిదేవుడైన బాకస్‌ను నీ తలకు మద్యంమత్తు మితిమీరి ఎక్కకూడదని ప్రార్థించు!

అలాగైతేనే నీవు నీ ప్రియురాలితో గూఢార్థాలతో కూడిన సంభాషణను సులభంగా నెరపగలవు. దానిని ఆమె సులువుగా అర్థం చేసుకోగలదు.

ఒక్క చుక్క మధువుతో టేబుల్ మీద తీయని ప్రేమ చిహ్నాలను నీవు గీయగలుగుతావు, వాటిని చదివిన ఆమెకు తన మీద నీకెంత ప్రేమ ఉందో తెలుస్తుంది.

నీ కళ్ళతో ఆమె కళ్ళలోకి చూస్తూనే ఉండు, అలా నీ ప్రేమ సందేశాన్ని ఆమెకు చేరవేయి. అనేకసార్లు, ఒక్క మాటకూడా పలుకకుండా కళ్ళు అద్భుతమైన సంగతులు చెప్పగలుగుతాయి.

ఆమె తాగినప్పుడు, ఆ కప్పును చేజిక్కించుకోవడంలో ముందుండి, ఆమె పెదవులు తాకిన చోట నీ పెదవులను ఒత్తిపెట్టి తాగు!

ఆమె చేతి వేళ్ళు కొంచెంగా తాకి ఉన్న ఆహార పదార్థాలను నీవు ఎంచుకో! వాటిని నీవు అందుకుంటుండగా నీ చేయి ఆమె చేతికి మృదువుగా తగలనీయి!

ఆమె భర్తతో కూడా మర్యాదగా మసలుకో! నీ ఎత్తులు నెరవేరడానికి అతని స్నేహం కన్నా ఎక్కువ ఉపయోగకరమైనది మరేది లేదు!

లాటరీ ద్వారా ఎవరెంత తాగాలో, ఎప్పుడు తాగాలో నిర్ణయించాలనుకున్నట్లైతే, అతడి వంతు ముందు వచ్చేటట్లు, అతడికి ఎక్కువ భాగం దక్కేటట్లు చూడు!

నీ తలకున్న పూలపట్టీని తీసి అతని తలకు అలంకరించు!

అతను నీతో సమానుడా, లేక నీకన్నా తక్కువవాడా అన్నది ముఖ్యం కాదు, వడ్డన ముందుగా అతడికే జరగనీయి!

నీవు చెప్పే ప్రతి విషయంలోనూ అతడిని ప్రశంసించు!

స్నేహం ముసుగులో అతడిని మోసగించడమనేది విజయం కొరకు అందరూ అనుసరించే ఒక ఖచ్చితమైన పద్దతి.

అయితే ఖచ్చితమైనదీ, అందరూ అనుసరించేదీ అయినప్పటికీ ఇది ఒక నిందార్హమైన నేరం.

ప్రేమవ్యవహారంలో ఒక్కోసారి (47) దూత చాలా దూరం వెళ్ళిపోతాడు, తనకు అప్పగించిన పనులకన్నా ఎక్కువ చేస్తాడు.

తాగడంలో నీవు మీరకూడని కొన్ని హద్దులను ఇప్పుడు నేను నీ ముందుంచుతాను.

నీ మెదడు మత్తులో మునిగేంతగా,

నీ నడక నిలకడ కోల్పోయేంతగా ఎప్పుడూ తాగకు!

తాగుడు మూలంగా తలయెత్తే తగాదాలలోకి వెళ్ళకు, కొట్లాటకు సిద్ధం కాకు!

మూర్ఖుని వలే మితిమీరితాగటం మూలంగా ప్రాణాలు కోల్పోయిన యూరిషన్‌ను నీవు అనుసరించకు!

విందు, మందు ఆనందాన్ని తగుమోతాదులోనే కలిగించాలి.

నీకు మంచి స్వరం ఉంటే పాట పాడు! నీకు ఎలా అయినా కదలగలిగిన కాళ్ళు ఉంటే డాన్స్ చేయి! ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళలో మంచి అభిప్రాయం కలిగించడానికి నీవు చేయగలిగిన ప్రతీ పనీ చేయి!

తప్పతాగడం అనేది ఒక అసహ్యకరమైన విషయం. కానీ అలా తాగినట్లు నటించడం అనేది నీకు ఉపయోగకరంగా ఉంటుంది.

దొంగనత్తితో నీ నాలుక తడబడేటట్లు చేయి! నీకు మాటలు పలకడం కష్టంగా ఉన్నట్లు నటించు! అప్పుడు నీవు కొంచెం హద్దుమీరి ఏమి చేసినా, ఏమి మాట్లాడినా కూడా, అది నీవు ఎక్కువగా తాగడం వలన అలా జరిగిందని భావించబడుతుంది.

నీ ప్రియురాలికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపు, ఆమె భర్తకు కూడా శుభాకాంక్షలు తెలుపు, కానీ మనసులో మాత్రం అతడికి అశుభం జరగాలని కోరుకో!

అథిథులు వెళ్ళడానికి లేచినిలబడినపుడు నీ ప్రియురాలికి బాగా సమీపానికి వెళ్ళడానికి నీకు మంచి అవకాశం దొరుకుతుంది. గుంపులో కలిసిపోయి, చాకచక్యంగా ఆమెకు దగ్గరగా వెళ్ళి, నీ చేతి వ్రేళ్ళు ఆమె తొడకు రుద్దుకొనేటట్లు, అలాగే నీ పాదం ఆమె పాదానికి తగిలేటట్లు చేయి!

ఇది ఆమెతో మాట్లాడే సమయం.

పనికిమాలిన బిడియాన్ని దూరంగా పారద్రోలు!

అదృష్టదేవత, ప్రేమదేవత ఇరువురూ ధైర్యవంతులకే అనుకూలంగా ఉంటారు.

ఏమి మాట్లాడాలో చెప్పమని నన్నడగవద్దు! నీవు మాట్లాడటం మొదలుపెడితే మాటలకోసం వెతుక్కోకుండా తగినంత వేగంతో వాటంతటవే వచ్చేస్తాయి.

నీవొక ప్రేమికుడి పాత్ర పోషించాలి. ఆమె కోసం నీవెంతగా వేగిపోతున్నావో ఆమెతో చెప్పు! ఆమె నమ్మకాన్ని గెలుచుకోవడానికి నీకున్న ప్రతీ నైపుణ్యాన్ని ఉపయోగించు!

ఇది కష్టమని అనుకోకు! ప్రతీ స్త్రీ తానొక కోరుకోదగిన వ్యక్తిననే భావిస్తుంది. చివరికి చాలా సాధారణంగా ఉండే స్త్రీకూడా తాను ఆకర్షణీయంగా ఉన్నట్లు భావించుకుంటుంది.

ఆరంభంలో ప్రేమను నటించినవాడు చివరికి నిజంగానే ప్రేమలో పడటం (48) ఎన్నిసార్లు జరగలేదు.

కనుక ఓ సుందరీమణులారా! ప్రేమికుడినంటూ మీ వెంటపడేవారిని దయగల దృష్టితో చూడండి! ఇప్పుడు నటించబడుతున్న ప్రేమ త్వరలోనే నిజమైన ప్రేమ కాగలదు!

నిండుగా ప్రవహించే నది దాని గట్లను నెమ్మదిగా కోతకు గురిచేసినట్లుగా, అన్యాపదేశమైన ప్రశంసలతో ఆమె హృదయంలోకి దొంగతనంగా ప్రవేశించగలవు.

ఆమె ముఖాన్ని, ఆమె శిరోజాలను, సన్నని ఆమె చేతి వ్రేళ్ళను, చిన్నగా, మృదువుగా ఉండే ఆమె పాదాలను ప్రశంసించడంలో ఎప్పుడూ అలసిపోకు!

పవిత్రమైన నడవడిక కలిగినవారు కూడా తమ అందాన్ని పొగిడినపుడు పొంగిపోతారు. పరిశుద్ధ కన్యలు కూడా తమ రూపలావణ్యాలను ఎంతో ఇష్టంగా కాపాడుకుంటారు. అలాకాకపోతే ఇడా అడవిలో తమ అందానికి బహుమతిని పొందలేకపోయినందుకు (49)జూనో, మినర్వాలు ఇప్పటికీ ఎందుకు సిగ్గుపడుతున్నారు?

అక్కడున్న మయూరాన్ని చూడు! దాని ఈకలను నీవు ప్రశంసలతో ముంచెత్తినట్లైతే, అది గర్వంతో తన పురి విప్పుతుంది. అలాకాక దాని వంక నీవు మౌనంగా చూచినట్లైతే, అది తన సంపదను ఎన్నడూ చూపించదు.

పందెపుగుఱ్ఱాలు పోటీ విరామసమయంలో తమ జూలు దువ్వబడినపుడు, తమ మెడ తట్టబడినపుడు గర్వపడతాయి.





Footnote:


(44) మినాడ్‌లు అంటే మధుదేవుడైన బాకస్‌ను అనుసరించి ఉండే స్త్రీలు, శాటిర్‌లు అంటే సగం మనిషి, సగం మేక లేక గుఱ్ఱంగా ఉండే విచిత్ర జీవులు. ఇవి కూడా బాకస్‌ను అనుసరించి ఉంటాయి.


(45) సైలినస్ బాకస్‌కు పెంపుడు తండ్రి, అనుచరుడు. శాటిర్‌లకు నాయకుడు. ఇతడు పొట్టిగా, లావుగా, బట్టతలతో ఉండే ఒక తాగుబోతు ముసలివాడు.


(46) బాకస్ మదువుతోపాటు వ్యవసాయానికి కూడా అధిదేవుడు


(47) ప్రేమలో విజయం సాధించడానికి ప్రియుడు చేసే ప్రయత్నాలను ఒవిడ్ ఇక్కడ ప్రేమదూతగా మూర్తీభవింపచేశాడు


(48) ప్రతీ స్త్రీ తానొక కోరుకోదగిన వ్యక్తిననే భావిస్తుంది కనుక ఒక పురుషుడు ఆమె ప్రేమను అభ్యర్థించినపుడు ఆ అభ్యర్థన నిజమైనదే అని ఆమె నమ్మడం అంత కష్టమేమీ కాదని పురుషులనుద్దేశించి చెప్పిన ఒవిడ్, ప్రేమను అభ్యర్థించే పురుషుడి నిజాయితీని శంకించి తిరస్కరించనవసరంలేదు. ఒకవేళ వారు ఆరంభంలో కపట ప్రేమను ప్రదర్శిస్తున్నా ఆ ప్రేమ త్వరలోనే నిజమైన ప్రేమగా మారిపోతుందని స్త్రీలనుద్దేశించి చెప్పాడు.


(49) జూనో (హీర), మినర్వ (పల్లాస్ లేక ఎథినా), వీనస్ (ఆఫ్రోడైట్) ఈ ముగ్గురు దేవతలలో అందగత్తె ఎవరనే విషయంలో జరిగిన పోటీలో వీనస్ గెలుపొందింది.