Friday, July 31, 2020

ప్రేమకళ - రెండవ భాగం - X



ప్రేమకళ 

(రెండవ భాగం)


కొంతకాలం ఆమెకు కనిపించకు







తీరాన్ని వీడేటపుడు నీ తెరచాపలకు ఎలాంటి గాలి కావాలో అలాంటి గాలి లోపలి సముద్రపు యానానికి అవసరముండదు. 


ప్రేమ జనించే సమయంలో సున్నితంగా ఉంటుంది. అలవాటుపడే కొలదీ దృఢంగా మారుతుంది. సరైన ఆహారంతో దానిని పోషిస్తే అది త్వరలోనే బలిష్ఠంగా మారుతుంది. 
  

ఈ రోజు నిన్ను భయపెడుతున్న ఎద్దును అది దూడగా ఉన్నపుడు నీవు కొట్టేవాడివి. 


నేడు తన నీడన నీకు ఆశ్రయమిస్తున్న వృక్షం ఒకనాడు ఒక బలహీనమైన చిన్నమొక్క. 


తను జన్మించినపుడు ఒక చిన్న పిల్లకాలువగా ఉన్న నది కొద్దికొద్దిగా బలాన్ని సంతరించుకుంటూ, పారే కొలదీ అసంఖ్యాకమైన ఉపనదుల నుండి ఎంతో నీటిని స్వీకరిస్తుంది. 


ఆమె నీకు అలవాటు పడేటట్లు చేసుకో, అలవాటుకన్నా శక్తివంతమైనదేదీ లేదు. 


ఆమె మదిని గెలుచుకోవడానికి నీవు చేసే ప్రయత్నాలలో ఎన్నడూ విసుగుచెందకు. 


నిన్ను ఆమె ఎల్లవేళలా చూస్తూనే ఉండాలి. నీవు చెప్పేది ఆమె ఎల్లవేళలా ఆలకిస్తూనే ఉండాలి. 


నీ ముఖాన్ని ఆమె రాత్రీ చూడాలి, పగలూ చూడాలి. 


నీవు లేకపోవడం ఆమెకు వెలితిగా అనిపిస్తుందనే నమ్మకం నీకు బాగా కుదిరినపుడు ఆమెను ఒంటరిగా వదిలివేయి.


నీవు లేకపోవడం ఆమెకు ఆందోళన కలిగిస్తుందనుంటే ఆమెకు కొంత విరామం ఇవ్వు: కొంత విరామం ఇచ్చిన మట్టి తనలో నాటబడిన విత్తనాలకు హెచ్చుమొత్తంలో తిరిగి చెల్లిస్తుంది.


ఎండిన నేల గగనం నుండి పడే వర్షపునీటిని వేగంగా ఇంకించుకుంటుంది. 


డెమోఫూన్ తన చెంతనే ఉన్నంతకాలం ఫిల్లిస్‌కు అతని యెడల ప్రేమ తాపం నులివెచ్చగానే ఉండేది. అతడు నౌకాయానం ఆరంభించాడోలేదో అతనియెడల మోహంతో ఆమె దహించుకుపోయింది. 


గడుగ్గాయి యులిసెస్ తన ఎడబాటు ద్వారా పెనెలోప్‌ను చిత్రహింస పెట్టాడు. 


లోడామియా, నీవు కన్నీటితో ప్రొటెసిలాస్ తిరిగిరాకను కాంక్షించావు.


కానీ సురక్షిత మార్గాన్ని అనుసరించు. మరీ ఎక్కువ కాలం దూరంగా ఉండకు. ఎడబాటు వలన కలిగే బాధను కాలం తగ్గించివేస్తుంది. 


కనులముందు లేనిది మనసులో కూడా ఉండదు. 


కనిపించని ప్రియుడు త్వరలోనే మరువబడి, అతడి స్థానాన్ని మరొకడు స్వీకరిస్తాడు. 


మెనెలాస్ వెళ్ళగానే ఏకాంత శయనంతో విసిగిపోయిన హెలెన్ తన అతిథి బాహుమందిరంలో ఆత్మీయతను, సాంత్వనను కోరుకున్నది. 


అకటా! మెనాలస్, నీవెంత వెఱ్ఱివాడవు! నీ భార్యను, ఒక అపరిచితుణ్ణి ఒకే కప్పు క్రింద వదిలేసి నీవు ఒక్కడివే వెళ్ళిపోయావు. 


పిచ్చివాడా! 

దుర్బలమైన పావురాన్ని కబళించే గ్రద్దకు అప్పగిస్తావా? 


నిండు గొఱ్ఱెలదొడ్డిని ఆకలిగొన్న తోడేలు వశం చేస్తావా? 


లేదు, హెలెన్‌ను నిందించవలసిన పనిలేదు. ఆమె ప్రియుని దోషంకూడా ఏమీ లేదు. అతడి స్థానంలో నీవున్నా, మరెవరున్నా ఏమి చేసేవారో, అదే అతను చేశాడు. 


సమయం మరియు అవకాశం రెండూ ఇవ్వడంద్వారా నీవే వారిని జారత్వానికి ప్రేరేపించావు. 


ఆమె అమలుపరచినది నీమూలంగా కలిగిన యోచన కాదా? 


ఆమె ఏమి చేయగలదు? ఆమె భర్త దూరంగా ఉన్నాడు, నాగరికుడైన ఒక అతిథి యెదుట ఉన్నాడు, పైగా ఆమె రిక్తశయ్యపై ఒంటరిగా శయనించడానికి భయపడుతున్నది.


మెనెలాస్ ఏమైనా అనుకోనీ; నా దృష్టిలో హెలెన్ నేరం చేయలేదు. ఆమె చేసిందల్లా ఎంతో అనుకూలుడైన తన భర్త మూలంగా లబ్దిని పొందడమే. 








Tuesday, July 28, 2020

ప్రేమకళ - రెండవ భాగం - IX




ప్రేమకళ 

(రెండవ భాగం) 


ఆమె జబ్బుపడినపుడు సాంత్వన కలిగించు!






ఆకురాలుకాలం సమీపిస్తున్నపుడు............


వసుధ పూర్ణశోభతో అలరారుతున్నపుడు...........


ఎఱ్ఱని ద్రాక్షపండ్లు తమ ధూమ్రవర్ణపు రసంతో ఉబ్బి ఉన్నపుడు............


ఎముకలు కొరికే చలి, భరింపరాని ఎండ ఒకటి విడిచి ఒకటి బాధిస్తున్నపుడు............


వాతావరణంలోని ఈ వ్యత్యాసం వలన తరచూ మన శరీరం మాంద్యానికి లోనౌతుంది.


నిజానికి నీ ప్రియురాలు మంచి ఆరోగ్యవంతురాలే అయి ఉండవచ్చు. కానీ ఏదైనా కొద్దిపాటి అనారోగ్యం వలన ఆమె మంచం మీదే ఉండిపోవలసి వస్తే............ వాతావరణం యొక్క దుష్ప్రభావాలకు ఆమె బాధితురాలైనట్లైతే............ నీవెంత శ్రద్ధ గలిగినవాడివో, ఎంత ప్రేమ కలిగిన వాడివో ఆమెకు చూపడానికి నీకిదే సమయం. 


నీవు తరువాత పెద్దమొత్తంలో కోసుకోదగిన పంటకు విత్తనాలు నాటవలసిన సమయం ఇదే. 


ఆమె జబ్బు మూలంగా చిరచిరలాడుతుంటే నిరుత్సాహపడకు.


ఆమె ఆమోదించే సేవలన్నీ నీ స్వహస్తాలతో ఆమెకు అందించు. 


నీవు సహానుభూతితో కన్నీరు కార్చడం ఆమె కంటపడనీయి. 


ఆమెను ముద్దాడటానికి నీవు ఇష్టపడటంలేదని ఆమెనెప్పుడూ గమనించనీయకు.  


ఆమె ఎండిపోయిన పెదవులు నీ కన్నీటితో తడి నింపుకోనీ. 


ఆమె త్వరలోనే తిరిగి కోలుకోవాలని కోరుకుంటూ ఎన్నో ప్రార్థనలు చేయి, వాటన్నింటినీ ఆమె వినేంత బిగ్గరగా చేయి. 


సమయం చూసుకొని, శుభశకునాన్ని సూచించే కల ఒకటి వచ్చిందని ఆమెతో చెప్పు.  


ఒక ముదుసలి అవ్వ తన వణికే చేతులతో గ్రుడ్లను, గంధకాన్ని పట్టుకుని వచ్చి ఆమె మంచాన్ని, ఆ గదిని పరిశుద్ధపరిచే విధంగా ఏర్పాటు చేయి. 


ఈ శ్రద్ధ, ఈ సంరక్షణల జ్ఞాపకాలన్నీ ఆమె తన హృదయంలో పదిలపరచుకొంటుంది. 


అనేక మంది ఇలాంటి చిన్న చిన్న పనులు చేసి, వీలునామా ద్వారా వారసత్వ హక్కులనే పొందారు. 


అలాగని అనవసరమైన విషయాలలో వేలు పెట్టి, అసలే జబ్బుతో ఉన్న ఆమెకు నీ మీద ఏవగింపు (loathing) కలిగేటట్లు చేసుకోకు.


నీవు ప్రదర్శించే ఆదరం అంతా ఆమెకు సంతోషం కలిగించేవిధంగా (charming) మాత్రమే ఉండాలి.


నీ ఆపేక్ష, నీ ఆందోళన శృతిమించకూడదు. 


ఆమె తీసుకునే ఆహారాన్ని నియంత్రించే పనిని నెత్తిన వేసుకోకు. 


ఆమెకు 'అది తినకూడదు', 'ఇది తినకూడదు' అని చెప్పకు. 


రోతపుట్టించే మందు తెచ్చి తాగమని ఆమెకు ఇవ్వకు. 


అదంతా నీ ప్రత్యర్థికి వదిలివేయి. 









Monday, July 27, 2020

ప్రేమకళ - రెండవ భాగం - VIII



ప్రేమకళ 

(రెండవ భాగం)


ఆమె చెప్పినట్లు నడచుకో!  ఆమె చేసినది మెచ్చుకో!








నీవు ఏదైనా ఒక ఉపయోగకరమైన పని చేయాలని నిర్ణయించుకున్నపుడు, ఆ పని చేయమని నీ ప్రియురాలే నిన్ను  అడిగేటట్లు చేసుకో!  


నీవు నీ బానిసలలో ఒకడికి స్వేచ్ఛనివ్వాలని తలచినట్లైతే ఆ బానిస ఆమెను అభ్యర్ధించేటట్లు చేయి. 


విధినిర్వహణలో చూపిన నిర్లక్ష్యానికి నీ బానిసను నీవు శిక్షించకూడదనుకుంటే ఆ దయగల చర్యలో ఆమెకు పరపతి దక్కేటట్లు చూడు. 


ప్రయోజనం నీది, పేరు ఆమెది. నీకు పోయేదేమీలేదు. ఆమె మాత్రం నిన్ను తన చిటికెనవ్రేలితో ఆడించగలనని అనుకుంటుంది.


నీ ప్రియురాలి ప్రేమ అలాగే కొనసాగాలని నీవు అనుకుంటే ఆమె అందచందాలకు నీ కళ్ళు చెదిరిపోయాయని ఆమె భావించేవిధంగా నీవు చేయాలి.  


ఆమె ఊదారంగు దుస్తులు ధరిస్తే ఊదారంగుకు సాటిరాగలది మరేదీలేదని ఆమెతో చెప్పు. 


ఆమె కోస్ వస్త్రంతో చేసిన గౌను ధరిస్తే ఆమెకు అంత మనోహరంగా నప్పేది మరేదీలేదని ఆమెతో చెప్పు. 


ఆమె బంగారు వస్త్రాలు ధరించి మెరిసిపోతుంటే ఆమె సౌందర్యం ముందు బంగారం తీసికట్టేనని నీవు భావిస్తున్నట్లు ఆమెతో చెప్పు. 


ఆమె చలికాలపు ఉన్ని బట్టలు ధరిస్తే అవి మనోజ్ఞంగా ఉన్నాయని ఆమెతో చెప్పు. 


ఆమె పలుచని వస్త్రాలలో కనబడితే నీలో ఆమె ప్రేమాగ్ని రగిల్చిందని చెప్పు. అలాగే జలుబు చేయకుండా జాగ్రత్తవహించమని ఆందోళనకరమైన స్వరంతో ఆమెను అర్థించు. 


ఆమె నుదిటిమీద కురులు రెండుగా విడిపోతే ఆ విధానమే నీకిష్టమని చెప్పు.

ఆమె వేడి ద్వారా తన కేశాలను ఉంగరాలు తిప్పుకుంటే "ఉంగరాల జుట్టంటే నాకెంత ప్రేమో" అని చెప్పు.  


ఆమె నృత్యం చేసేటపుడు ఆమె చేతులను, ఆమె గానం చేసేటపుడు ఆమె స్వరాన్ని ప్రశంసించు. ఆమె వాటిని ముగిస్తే అంత త్వరగా అవి ముగింపుకు చేరినందుకు నీవెంతో చింతిస్తున్నావని చెప్పు. 


ఆమె నిన్ను తన పానుపు మీదకు అనుమతిస్తే ఆ సుఖాలపెన్నిధికి వందనమర్పించు, ఆనందాతిశయంవలన  వణుకుతున్న స్వరంతో ఆమె నీకు ఎలాంటి స్వర్గాన్ని అందించిందో చెప్పు. 


ఆమె భయంకర సర్పకేశిని (Medusa) కన్నా ప్రచండమైన స్త్రీ అయినాకూడా తన ప్రియుని యెడల (అతని మాటలతో) సాత్వికంగా, వినమ్రంగా మారిపోతుంది. 


నీవు మంచి కపటిగా ఉండాలి. అంతేకాక నీ ముఖంలో ఎన్నడూ నీవు చెప్పేమాటలను సమర్థించలేని భావం కనబడకూడదు. 


పన్నాగం అనేది ఎదుటివారు గ్రహించనంతసేపే ప్రయోజనకరం. ఒకసారి అది తెలిసిపోయిందంటే భంగపాటు తప్పదు. నమ్మకం ఇక ఎప్పటికీ పోయినట్లే. 













Sunday, July 26, 2020

ప్రేమకళ - రెండవ భాగం - VII





ప్రేమకళ 

(రెండవ భాగం)


అభిరుచి కలిగిన చిన్న చిన్న బహుమతులను ఆమెకు అందించు






నీ ప్రియురాలికి ఖరీదైన బహుమతులను అందించమని నేను నీకు సలహా ఇవ్వను. అల్పమైనవి కొన్నింటిని ఆమెకు సమర్పించు. అయితే వాటిని జాగ్రత్తగా ఎంచుకోవాలి, అవి సందర్భానికి తగినట్లుగా ఉండాలి. 


దేశం తన సమృద్ధియైన సంపదలనన్నింటినీ ప్రదర్శిస్తున్నపుడు, చెట్లకొమ్మలు బరువుతో క్రిందికి వంగినపుడు ఒక పండ్లబుట్టను ఆమె తలుపువద్ద వదిలిరావడానికి ఒక యువబానిసను నియోగించు.


దేశంలోని మీప్రాంతంనుండి అవి వచ్చినట్లుగా నీవు చెప్పవచ్చు - నిజానికి వాటిని నీవు రోమ్ లోనే కొన్నప్పటికీ.  


ఆమెకు ద్రాక్షపండ్లను గానీ అమరిల్లిస్ ఇష్టపడిన అడవిగింజలను (chestnuts) గానీ పంపు. ఇప్పుడైతే అమరిల్లిస్ వాటిని ఇష్టపడకపోవచ్చు. 


అవేకాదు, గువ్వలనో గోరింకలనో బహూకరించి కూడా నీ మదిలో ఆమె నిలిచియున్నదనే విషయాన్ని చాటవచ్చు.  


సంతానం లేని ఒక ధనిక వృద్ధురాలి దాయాదులు కూడా ఇదే పద్దతిని అనుసరిస్తారని నాకు తెలుసు. బహుమతులకు అపనింద తెచ్చినవారు నశించుగాక!


కవిత్వం పంపమనే సలహా కూడా నేను నీకు ఇవ్వనా? అయ్యో, పద్యాలు అంతగా గణింపబడవు!


పద్యాలను అందరూ ప్రశంసిస్తారు, కానీ నిజానికి వారు బహుమతులనే కోరుకుంటారు.


అనాగరికుడైనా సరే, అతడు ధనవంతుడైనచో అనుగ్రహపాత్రుడు అవుతాడు. 


ఇది స్వర్ణయుగమన్నది చాలా నిజం. స్వర్ణం ఉన్నతమైన గౌరవాలను కొనుగోలు చేస్తుంది. స్వర్ణం ప్రేమను కూడా ఖరీదు చేస్తుంది. 


తొమ్మిదిమంది విజ్ఞానదేవతలతో కలిసి హోమర్ అంతటివాడు వచ్చినాకూడా అతడు తనతోపాటు ఏమీ వెంటతేకపోతే తక్షణం వెళ్ళగొట్టబడతాడు.


అయినప్పటికీ పాండిత్యం కలిగిన స్త్రీలు కొంతమంది ఉంటారు. అయితే వారు అరుదుగా ఉంటారు. 


పాండిత్యమేమీ లేకుండా, ఉన్నట్లు కనిపించాలని అభిలషించే వారు కూడా ఉంటారు. 


వారిరువురినీ కూడా నీవు నీ కవిత్వం ద్వారా ప్రశంసించు. 


నీ కవిత్వం ఏపాటిదైననూ, దానిని ప్రభావవంతంగా ఎలా చదవాలో నీకు తెలిసినట్లైతే అది ఇంపుగా అనిపిస్తుంది. 


నిజానికి పద్యాలను బాగా కూర్చి, చక్కగా చదివి వినిపించినా కూడా ఆ స్త్రీలు వాటిని ఒక అల్పమైన, .......అత్యంత అల్పమైన బహుమతిగానే భావిస్తారు.







Friday, July 24, 2020

ప్రేమకళ - రెండవ భాగం - VI





ప్రేమకళ 

(రెండవ భాగం)


ఆమె సేవకులను ఆకట్టుకో







ఆమె సేవకులను - అట్టడుగు వారితో సహా- మంచి చేసుకోవడం నీ హోదాకు తగనిపని అని అస్సలు అనుకోకు. 


వారిలో ప్రతి ఒక్కరిని పేరుపెట్టి పలకరించు. వారి బానిస చేతులను నీ చేతులలోకి తీసుకో.  


నీవు కొనగలిగే ఖరీదులో ఉండే బహుమతులను వారికి ఇవ్వు (నీకు ఇదేమంత ఖర్చు కాదు). 


ఆడబానిసల పండుగ (Juno Caprotina) వచ్చినపుడు నీ ప్రియురాలి వ్యక్తిగత సహాయకురాలికి ఓ మంచి బహుమతిని అందించు. 


సేవకగృహ నివాసులందరితో మంచిగా ఉండు. 


వాకిట కావలికాసేవాడిని మరియు నీ ప్రియురాలి గది తలుపు చెంతనే నిదురించే బానిసను మరువకు.



(Juno Caprotina అనేది ప్రాచీన రోమ్‌లో ప్రతిసంవత్సరం జూలై 7 న స్త్రీబానిసల కొరకు జరుపుకునే ఒక పండుగ)











ప్రేమకళ - రెండవ భాగం - V






ప్రేమకళ  

(రెండవ భాగం)


దుర్బలహృదయుడిగా ఉండవద్దు


ప్రేమ అనేది యుద్ధం వంటిది. 


దుర్బలహృదయం అందమైన స్త్రీని ఎన్నటికీ జయించలేదు. 


పిరికిపందలు కాముని సేవకు పనికిరారు.


ప్రేమయుద్ధాలలో పోరాడేవారు రాత్రి, చలికాలం, సుదీర్ఘ ప్రయాణాలు, కౄరమైన బాధ, వేదన కలిగించే శారీరకశ్రమ.....  ఇలాంటివన్నీ భరించాలి.  


అనేకసార్లు నీవు ఆకాశంలోని కరిగే మేఘాలనుండి కురిసే జడివానను సహించాలి, .......అలాగే అనేకసార్లు చలిలో కటికనేలమీద పరుండాలి.  


అడ్మిటస్ కు చెందిన పశువుల మందలను కాస్తున్నపుడు అపోలో ఒక చిన్న గుడిశలో నివశించేవాడని చెబుతారు. అపోలో చేసినట్లుగా చేయడానికి ఎవరు సిగ్గుపడతారు? 


కలకాలం గాఢంగా ప్రేమించాలనుకుంటే నీవు తప్పక అతిశయాన్ని విడనాడాలి. 


నీ ప్రియురాలివద్దకు సాధారణమైన మరియు సురక్షితమైన మార్గం నీకు నిరాకరించబడినట్లైతే,..........

ఆమె తలుపులు నీకు మూసివేయబడినట్లైతే............ 

ఇంటికప్పు పైకి ఎక్కి, పొగగొట్టం గుండానో, ఆకాశగవాక్షం గుండానో కిందికి దిగు. 


తన కొరకు నీవు చేసిన ఈ ప్రమాదకర సాహసాన్ని చూసి ఆమె ఎంతగా సంతోషిస్తుందో! 


ఇది నిఖార్సయిన నీ ప్రేమను ఆమెకు తెలియజేయడానికి నీవు చేసిన ఒక బాస. 


లియాండర్ అనేకసార్లు తన ప్రియురాలు లేకుండా ఉండగలిగికూడా తన గాఢమైన ప్రేమను నిరూపించడానికి జలసంధి ఆవలకు ఈదేవాడు.



(గ్రీకు దేవుడైన అపోలో పైథాన్ అనే పామును సంహరించడంతో శపించబడి ఒలంపస్ పర్వతం నుండి బహిష్కరించబడి కొంతకాలం అడ్మిటస్ అనే రాజు వద్ద పశువులకాపరిగా సేవలందిస్తాడు.)


(హీరో అనే యువతి ఆసియామైనర్ (టర్కీ) లోని హెల్లెస్పాంట్ జలసంధికి ఆవల ఉన్న ఒక ఊరిలో ఆఫ్రోడైట్ దేవతకు పూజారిణి. జలసంధికి ఈవల నున్న ఊరికి చెందిన లియాండర్ అనే యువకుడూ ఆమె ప్రేమించుకుంటారు. ఆమె పూజారిణి కనుక వారి వివాహం జరగడానికి వీలులేదు. కనుక లియాండర్ జలసంధిని ఈది వెళ్ళి ఆమెను కలుసుకునేవాడు.)