Friday, May 22, 2020

ప్రేమకళ - రెండవ భాగం - IV






ప్రేమకళ

(రెండవ భాగం) 


సహించు, శిరసావహించు, ఏకీభవించు







నీ ప్రియురాలు నీయెడల నిర్దయగా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే దానిని ఓర్పుతో భరించు; ఆమె త్వరలోనే తన మనసు మార్చుకుంటుంది. 


నీవొక కొమ్మను జాగ్రత్తగా, మెల్లగా వంచినట్లైతే అది విరగదు. అదే నీ బలమంతా ఉపయోగించి దానిని తటాలున లాగినట్లైతే అది పుటుక్కున విరిగిపోతుంది. 


నీటిప్రవాహంతో కలిసి పయనిస్తే నీవు నదిని సకాలంలో దాటతావు. ఏటికి ఎదురీదడానికి ప్రయత్నిస్తే ఎప్పటికీ దాటలేవు. 


ఓర్పు పులులు, నుమిడియా సింహాలను కూడా మెత్తబరుస్తుంది. ఎద్దు నెమ్మదిగా అరకకు అలవాటు పడుతుంది.


అర్కాడియాకు చెందిన అటలాంటా కన్నా మచ్చికకాని స్త్రీ ఎక్కడైనా ఉందా; ఆమె ఎంతటి అహంకారి అయినప్పటికీ చివరికి ఒక ప్రేమికుడి నిరంతరాయమైన ఏకాగ్రతకు, ఓపికకు లొంగిపోయింది. 


మిలానియన్ తన ప్రియురాలి నిర్దయకు, తన దురదృష్టానికి ఎన్నోసార్లు ఆ చెట్లకింద విలపించాడని అంతా చెప్పుకుంటారు. ఆజ్ఞప్రకారం, తరచూ వేటవలలను తన మెడమీద మోసేవాడు. తన బల్లెంతో తరచూ అడవిపందులను చీల్చిచండాడేవాడు. హైలాస్ బాణాలు కూడా అతడికి తగిలేవి. అయితే వేరేబాణాలు......, అయ్యో! అవేంటో అతడికి బాగా తెలుసు (ప్రేమదేవుడి బాణాలు), మరింత బాధాకరమైన గాయాలను అతడికి చేసేవి.


విల్లు తీసుకుని మెనాలస్ ప్రాంతపు కొండలను, కోనలను అధిరోహించమనిగానీ, అతిబరువైన వలలను నీ వీపున మోయమనిగానీ నేను నిన్ను ఆదేశించను. శత్రుబాణాలకు నీ ఱొమ్మును ఎదురొడ్డమని నేను నిన్ను ఆజ్ఞాపించను. నీవు గనుక వివేకవంతుడివైనట్లైతే నా నియమ నిబంధనలు ఆచరించడానికి ఏమంత కష్టం కాదని నీవు తెలుసుకుంటావు. ఆమె ఒకవేళ మొండిగా ప్రవర్తిస్తుంటే, ఆమెను అలాగే ఉండనివ్వు, చివరికి విజయం నీదే అవుతుంది.


ఆమె నిన్ను ఏమి చేయమన్నా సరే, దానిని తప్పనిసరిగా చేయడం ఒక్కటే నీ పని. 


ఆమె దేనిని నిందిస్తుందో, దానిని నీవూ నిందించు. 


ఆమె దేనిని ఇష్టపడుతుందో, దానిని నీవూ ఇష్టపడు. 


ఆమె దేనిని కాదంటుందో, దానిని నీవూ కాదను. 


ఆమె నవ్వితే, నీవూ నవ్వు. 


ఆమె కన్నీరు పెట్టుకుంటే, నీవూ కన్నీరు పెట్టుకో. 


ఒక్క మాటలో చెప్పాలంటే నీ మనోస్థితి ఆమె మనోస్థితికి అద్దంపట్టాలి.  


ఆమె పచ్చీసు ఆడాలని కోరుకుంటే, నీవు కావాలనే సరిగా ఆడకుండా ఆటలో ఆమెను గెలవనీయి. 


మీరు పాచికలాట ఆడుతుంటే ఆమెను ఓడిపోయి ఉక్రోషపడనీయకు, పైగా అదృష్టమెప్పుడూ నీదరికి రాదన్నట్లుగా కనబడనీయి. 


మీ యుద్ధక్షేత్రం చదరంగం అయితే నీ యోధులందరూ తమ గాజుశత్రువు చేతిలో ఊచకోతకు గురయ్యేటట్లు చూసుకో.


ఆమె గొడుగు ఆమె పైనే ఉండేటట్లుగా జాగ్రత్తగా పట్టుకో,  


ఆమె గుంపులో కనుక చిక్కుకుంటే ఆమెకు దారి ఏర్పరచు, 


ఆమె పానుపుపైకి చేరాలనుకుంటే సహాయంగా పీట తెప్పించు. 


ఆమె నాజూకైన పాదాలకు పాదరక్షలు తొడుగు లేక విప్పు. 


మరి నీవు చలితో చస్తున్నాసరే తరచు ఆమె చల్లని చేతులను నీ ఛాతీమీద వెచ్చబరచాలి. 


కొంత అగౌరవంగా కనిపించినప్పటికీ, ఆమె చూసుకోడానికి బానిసవలే ఆమె అద్దాన్ని పట్టుకోడానికి నీవు అన్యధా భావించకూడదు. 


అమిత బలశాలియై, అసమాన ధైర్యసాహసాలను ప్రదర్శించి, తాను భుజాలమీద మోసిన ఒలింపియన్ పర్వతం మీద నివసించే యోగ్యతను పొందిన హెర్క్యులెస్ అంతటివాడు అయోనియన్ పనిగత్తెల మధ్యన వారిలో ఒకడిగా నివసించి, ఊలుబుట్టను పట్టుకొని ముతక ఊలు వడికినట్లుగా ఎందుకు చెప్పబడ్డాడు. తన ప్రియురాలి ఆజ్ఞలను ఆ టిరింథియన్ వీరుడు పాటించాడు. మరి అతను భరించినది భరించడానికి నీవు సంకోచిస్తావా?


నీ ప్రియురాలు సభాస్థలి వద్ద కలుసుకుందామని చెబితే, చెప్పిన సమయం కన్నా బాగా ముందే అక్కడకు చేరుకో, చివరి నిమిషం వరకు అక్కడి నుండి కదలకు. 


మరోచోట ఎక్కడైనా తనను కలుసుకోమని ఆమె నిన్ను అడిగితే, అన్నీ వదిలేసి పరుగున వెళ్ళు. రద్దీ ఉంటే తోసుకువెళ్ళు.


 రాత్రిపూట బయటవిందు ముగిసిన తరువాత ఆమె తన ఇంటికి వెళ్ళాలనుకొని బానిసను పిలిస్తే, త్వరితగతిన నీ సేవలందించు. 


ఆమె ఊరిలో ఉండి నిన్ను రమ్మని జాబు రాస్తే ఆమెవద్దకు వెంటనే బయలుదేరు, ఎందుకంటే ప్రేమ ఆలస్యాన్ని భరించలేదు. 


ఒకవేళ నీకు వాహనమేదీ దొరకకపోతే నడచి వెళ్ళు. ఉరుములు మెరుపులతో గాలివాన వస్తున్నా, ఎండ దహించివేస్తున్నా, మంచు కురిసి దారిమీద పేరుకున్నా సరే ఆగకు.


(అటలాంట గ్రీకు పురాణాలలో అర్కాడియా ప్రాంతానికి చెందిన ఒక వేటగత్తె. వివాహం చేసుకోవడం ఆమెకు ఇష్టం ఉండదు, వేట మాత్రమే ఆమెకు ఇష్టం. ఆమెను ప్రేమించిన మిలానియన్ ఆమె మనసు గెలుచుకోవడానికి ఆమెకు సహాయకునిగా చేరతాడు. హైలాస్ ఆమెను మోహించిన ఒక సెంటార్ …అంటే సగం మనిషి, సగం జంతువు.)  


(ఒక హత్యకు శిక్షగా హెర్క్యులెస్ లిడియా దేశపు (నేటి టర్కీ ప్రాంతం) యువరాణి ఓంఫలేకు ఒక సంవత్సరం బానిసగా మారతాడు. ఆమె అతడిని తన వద్ద పనిచేసే అయోనియన్ స్త్రీలతో పాటుగా ఉంచి వారు చేసే ఊలువడికే పనిని ఇతనితోకూడా చేయిస్తుంది. కొంతకాలం తరువాత ఆమె అతడికి స్వేచ్చ ఇచ్చి వివాహం చేసుకుంటుంది.)








Tuesday, May 19, 2020

ప్రేమకళ - రెండవ భాగం - III






ప్రేమకళ

(రెండవ భాగం) 


సౌమ్యంగానూ, శాంతంగానూ ఉండు







హృద్యమైన విధానం స్త్రీల విషయంలో అద్భుతాలను చేస్తుంది. మొరటుతనం మరియు కఠినమైన మాటలు అయిష్టతను మాత్రమే పెంచుతాయి. 


తన జీవితాన్ని పోట్లాటలోనే గడుపుతుంది కనుక గ్రద్దను మనం అసహ్యించుకుంటాము; బెదిరిపోయే గొఱ్ఱెలమంద మీద దాడి చేసే తోడేలును కూడా మనం అసహ్యించుకుంటాము.


అయితే సౌమ్యంగా ఉంటుంది కనుక మనిషి స్వాలో పక్షికి ఉచ్చు పన్నడు, పావురానికైతే అది నివసించడానికి గూడు కూడా కడతాడు. 


అన్నిరకాల వివాదాలకు, పరుష సంభాషణతో కూడిన జగడాలకు దూరంగా ఉండు. ఆహ్లాదకరమైన మాటలు ప్రేమను పెంచి పోషిస్తాయి. 


పోట్లాటల మూలంగానే ఒక స్త్రీ తన భర్తకు దూరమవుతుంది, అలాగే ఒక భర్త తన భార్యకు దూరమౌతాడు. అలా ప్రవర్తించడంలో వారిరువురూ తాము ఎదుటివారికి వారి పద్దతిలోనే బదులిస్తున్నామని భావిస్తారు. వారిని దానికే వదిలివేయి. 


పెళ్ళి చేసుకునేవారు ఒకరికొకరు పోట్లాటలను కట్నంగా ఇచ్చుకుంటారు. కానీ ఒక ప్రియురాలితో మృదుమధురమైన సంగతులు మాత్రమే మాట్లాడాలి. 


మీ ఇరువురినీ పానుపు మీదకు చేర్చింది చట్టం కాదు. నీ చట్టం, ఆమె చట్టం; మీ ఇరువురి చట్టం కూడా ప్రేమే. 


సుతిమెత్తని లాలన, వినసొంపైన మాటలు లేకుండా ఆమెను ఎప్పుడూ సమీపంచకు, దానితో నీ రాక ఆమెను ఎల్లప్పుడూ సంతోషపరుస్తుంది. 


నేను ప్రేమవిద్యను బోధించేది ధనవంతులకు కాదు. బహుమతులను ఈయగలిగిన పురుషునికి నేను బోధించే పాఠాలలో ఏ ఒక్క దాని అవసరం కూడా ఉండదు. 


కావలసినప్పుడల్లా "ఈ బహుమతిని స్వీకరించు" అని అనగలిగినవాడికి తగినంత నేర్పరితనం ఉన్నట్లే. అతడిని విడిచిపెట్టాలి. నేను ఒప్పుకుంటున్నాను. అతడి విధానాలు నా విధానాలకన్నా చాలా శక్తివంతమైనవి. 


నేను పేదవాని కవిని; ఎందుకంటే నేను స్వయంగా పేదవాడిని, అలాగే ప్రేమలో పడటమంటే ఏమిటో నాకు తెలుసు. బహుమతులను అందించలేక నేను నా ప్రియురాలికి కవిత్వాన్ని అందిస్తుంటాను. 


పేదవాడు తన ప్రేమ వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలి. పరుషమైన భాష ఉపయోగించకుండా అతడు తనను తాను నియంత్రించుకోవాలి. ధనిక ప్రేమికుడు ఎన్నడూ భరించనివాటిని ఎన్నింటినో ఇతడు తప్పక భరించాలి.


ఒకసారి కొంచెం కోపమొచ్చి నేను నా ప్రియురాలి జుట్టుని చెదరగొట్టడం నాకు గుర్తుంది. ఆ క్షణికమైన కోపం ఎన్నో సంతోషకరమైన దినాలను నాకు లేకుండా చేసింది. నేనామె దుస్తులను చించినట్లు నేను గమనించలేదు, చించాననికూడా నేను అనుకోవడం లేదు. అయితే ఆమె నేను చించానని చెప్పింది, దానితో ఆమెకు వేరే దుస్తులు కొనక తప్పలేదు.


ప్రియమైన స్నేహితులారా! మీ గురువుకన్నా తెలివిగా ఉండండి. అతడు చేసినట్లు చేయకండి, ఒకవేళ అలా చేసేటట్లైతే అరుపులు, కేకలకు సిద్ధంగా ఉండండి. 


మీరు యుద్ధప్రియులైతే పార్థియన్లమీద యుద్ధం చేయండి, కానీ ప్రియురాలితో మాత్రం శాంతియుతంగా ఉండండి. ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండండి, అలాగే ప్రేమను ప్రేరేపించేటట్లుగా మరే విధంగానైనా ఉండండి.










Monday, May 18, 2020

ప్రేమకళ - రెండవ భాగం - II





ప్రేమకళ

(రెండవ భాగం) 


నీకు బుద్ధికుశలత అవసరం






మైనస్ ఒక సామాన్యమానవుని ఆకాశయానాన్ని ఆపలేకపోయాడు. నేను రెక్కలతో అతివేగంగా చరించే దేవుడినే నిలువరించడానికి ప్రయత్నిస్తున్నాను. 


మందులుమాకులు లేక మంత్రతంత్రాలను ఉపయోగించడం సరైనపని అని ఎవరైనా అనుకుంటే దురదృష్టవశాత్తూ వారు పొరబడినట్లే. 


మెడియా ఉపయోగించిన మూలికలవలనగానీ, మార్సి పలికిన మంత్రాలవలనగానీ ప్రేమ మనలేకపోయింది. మంత్రతంత్రాలవలన ఏదైనా ఉపయోగం ఉన్నట్లైతే మెడియా ప్రియుడైన జాసన్ ఆమెతోనే ఉండేవాడు. సర్సీ తను ప్రేమించిన యూలిసెస్ను తనతోనే ఉంచుకోగలిగేది.


ముఖం పాలిపోయేటట్లుచేసే వశీకరణచూర్ణాలను స్త్రీలమీద ప్రయోగించినపుడు అవి నిరుపయోగమే అవుతాయి. అవి మెదడుకు హానిచేసి పిచ్చి పట్టేటట్లు చేస్తాయి. అటువంటి నేరమయ సాధనాలకు దూరంగా ఉండండి!


నీవు ప్రేమను పొందాలనుకుంటే ప్రేమకు తగిన అర్హతను కలిగిఉండు. దానికొరకు అందం మరియు ఆకర్షణీయమైన రూపం సరిపోవు. 


నీవు ఎన్నడో హోమర్ ప్రశంసించిన నిరియస్ అంతటి అందగాడివైనప్పటికీ, దోషులైన జలకన్యలు లాక్కుపోయిన యువకుడు హైలాస్ అంతటి సొగసుకాడివి అయినప్పటికీ నీ ప్రియురాలు నీతోనే ఉండాలనుకుంటే, ఒకానొకనాడు ఆమె నిన్ను వీడి వెళ్ళిపోయినదని తెలుసుకొని విస్మయానికి గురికాకుండా ఉండాలంటే శరీర సౌందర్యానికి బుద్ధికుశలతను కూడా జతచేయి.


అందం అనేది ఒక అశాశ్వతమైన వరం. అది కదిలిపోయే కాలంతో తరిగిపోతూ ఉంటుంది. ఎంతకాలం నిలుస్తుందో అంత ఖచ్చితంగా అది అదృశ్యమౌతుంది. 


మల్లెలు ఎల్లకాలం పూయవు, కలువలు ఎల్లకాలం వికసించి ఉండవు. రోజాపువ్వు రాలిపోయిన తరువాత దాని మొండికాడకు ముళ్ళుమాత్రమే మిగులుతాయి. 


అదేవిధంగా ఓ అందమైన యువకుడా! నీ జుట్టు త్వరలోనే తెల్లబడుతుంది, ముడుతలవల్ల త్వరలోనే నీ ముఖం మీద చాళ్ళు ఏర్పడతాయి.


కాలంతోపాటు నిలచిఉండే సామర్థ్యాలను అలవరచుకొని వాటిని నీ సొగసుకు జతచేయి. అవి మాత్రమే చితిమంటల వరకు నీతో నిలిచి ఉంటాయి.


జీవితంయొక్క ఉన్నత సంస్కారాలను అధ్యయనం చేయి.  గ్రీకు మరియు లాటిన్ భాషలలో ఉండే సాహితీ సంపద ద్వారా నీమేథస్సును, ఆలోచనలను మెరుగుపరచుకో!


యూలిసెస్ అందగాడు కాదు, అయితే వాక్చాతుర్యం కలిగినవాడు. అతడి మీద మోహంతో ఇరువురు సముద్రదేవతలు వేదనపడ్డారు.  


అతడు బయలుదేరడానికి సిద్ధపడటం చూసినప్పుడు కాలిప్సో (Calypso) ఎన్నిసార్లు నిట్టూర్చిందో? 


అతడి నౌకాయానానికి కెరటాలు సహకరించవని ఆమె ఎలా చెబుతూనే ఉందో? 


ట్రాయ్నగర పతనగాథను మళ్ళీ మళ్ళీ చెప్పమని ఆమె అతడిని ఎన్నిసార్లు అడిగిందో లెక్కేలేదు, 


ప్రతీసారీ ఒక కొత్త విధానంలో అతడెన్నిసార్లు ఆ గాథను ఆమెకు మళ్ళీ మళ్ళీ చెప్పాడో లెక్కేలేదు. 


ఒకరోజు వారిరువురూ సముద్రపుటొడ్డున నిలిచియున్నారు. ఆ అందమైన జలకన్య థ్రేస్ రాజు ఏ విధంగా దుర్మరణం చెందాడో చెప్పమని అతడిని వేడుకుంటున్నది. యులిసెస్ తన చేతిలో ఉన్న ఒక పుల్లతో ఇసుక మీద గీసి వివరిస్తున్నాడు. 


"చూడు ట్రాయ్ ఇక్కడ ఉంది,"  కోటగోడ గీస్తూ చెప్పాడు. 


"సిమాయిస్ నది ఇక్కడ ప్రవహిస్తూ ఉంది. ఇది నా శిబిరం అనుకో. ఈ చుట్టూ ఉన్నదంతా మైదానం." దానిని గీసాడు. 


"రాత్రి సమయంలో అచెల్లిస్ గుఱ్ఱాలను దొంగిలించడానికి ప్రయత్నించిన డొలోన్ రక్తంతో ఎర్రబడిన ప్రదేశం అదే. థ్రేస్ రాజు రీసస్ గుడారాలు అవే. అతడినుండి దొంగిలించిన గుఱ్ఱాలతో నేను తిరిగి వచ్చింది అదుగో అటునుండే." 


అతడు ఈవిధంగా వివరిస్తూ ఉండగా హఠాత్తుగా ఓ అల వచ్చి ట్రాయ్‌ను, రీసస్‌ను, అతడి శిబిరాన్ని అన్నింటినీ చెరిపివేసింది.


అప్పుడు ఆ దేవత "చూశావా! ఈ అలలు ఎంత ప్రసిద్ధమైన పేర్లను చెరిపివేసినాయో, మరి నీవు నౌకాయానం ఆరంభించినపుడు ఇవి నీ మీద దయచూపుతాయని అనుకుంటున్నావా?" అని అన్నది.  




..............కనుక.., నీవెవరివైనా సరే, అందం యొక్క మోసపూరితమైన ఆకర్షణలో మరీ ఎక్కువ నమ్మకాన్ని ఉంచకు. కేవలం శారీరక సౌందర్యాన్ని కాక, దానికన్నా అధికమైనది దేన్నైనా కలిగి ఉండటానికి ప్రయత్నించు.



(గ్రీకు పురాణగాథలలో కాలిప్సో ఒక జలకన్య. అమె అయోనియన్ సముద్రంలోని ఒక దీవిలో ఒంటరిగా నివసిస్తూ ఉంటుంది. గ్రీకు వీరుడు యులిసెస్ తను ప్రయాణించే నౌక ప్రమాదానికి గురవడంతో అదే దీవికి చేరతాడు. అతడిని చూసి మోహించిన కాలిప్సో ఆ దీవిలో అతడిని నిర్బంధించి ఏడేళ్ళు తనతో ఉంచుకుంటుంది. ఆ తరువాత పరిపరివిధాలా వేడుకున్నాసరే అతడు తనను వీడిపోవడంతో ఆమె చివరికి ఆ దుఃఖంతోనే మరణిస్తుంది.)





Saturday, May 16, 2020

ప్రేమకళ - రెండవ భాగం - I




ప్రేమకళ

(రెండవ భాగం) 

అతడి కర్తవ్యం 






మృగయావినోదానికి (వేట) అధి దేవతను జయజయధ్వానాలతో ప్రస్తుతించండి! 


మరలా ప్రస్తుతించండి!   


నేను కోరుకునే బహుమతి నా వలలో చిక్కింది.


సంతోషిస్తున్న ప్రేమికులంతా విజయచిహ్నంగా పల్లవకిరీటాన్ని (ఆకులతో చేసిన కిరీటం)  నా నుదుటన ఉంచండి.


ఆస్క్రా ప్రాంతపు కవి హెసాయిడ్కన్నా, మేనియా ప్రాంతపు కవి ఆ ముసలి గుడ్డి హోమర్ కన్నా నన్ను ఉన్నతుడిగా భావించండి.


యుద్ధకాముక అమిక్లె ప్రాంతం నుండి తను చెరబట్టిన వధువుతో కలిసి తెల్లటి తెరచాపలెత్తి నౌకాయానం చేసిన అపరిచితుడైన పారిస్ ఇలాంటివాడే.


(ట్రాయ్ యువరాజైన పారిస్ స్పార్టాకి అతిథిగా వెళ్ళాడు. స్పార్టా దేశపు రాణి, అపురూప సౌందర్యరాశి అయిన హెలెన్ను అంతఃపురంలో రాజులేని సమయంలో అపహరించిన పారిస్ ఒక నౌకలో ఆమెను ట్రాయ్ నగరానికి తీసుకువెళ్ళాడు. స్పార్టాలోని ఓ జనావాసం పేరు అమిక్లే.)


ఓ హిప్పోడామియా! 


నీ స్వదేశం నుండి నిన్ను విజయరథంలో ఎంతో దూరం తీసుకువచ్చిన పెలోప్స్ కూడా ఇలాంటివాడే.


(హిప్పోడామియా తండ్రిని రథం నడిపే పోటీలలో ఓడించిన పెలోప్స్ ఆమెను చేబట్టి తనతో తీసుకువెళ్ళాడు.)


యువకుడా! ఎందుకు తొందర పడుతున్నావు?


నీ నౌకాయానం ఇంకా అలలు లేని నిశ్చల సముద్రంలోనే ఉంది.


నేను నిన్ను తోడ్కొనివెళుతున్న తీరం ఇంకా చాలా దూరం ఉంది.


నా కవితలు నీ ప్రియురాలిని నీ చేతులలోకి తెచ్చాయి; కానీ అది చాలదు.



ఆమెను ఎలా గెలుచుకోవాలో నా విద్య నీకు నేర్పింది. 


గెలుపొందిన ఆమెను ఎలా పదిలం చేసుకోవాలో కూడా నీకు తప్పక నేర్పాలి.


విజయాలు పొందడం చాలా గొప్ప, అయితే వాటిని నిలుపుకోవడం మరింత గొప్ప. 


ముందరిది ఒక్కోసారి యాదృచ్ఛికంగా జరగవచ్చు, కానీ తరువాతది ఎప్పుడూ నైపుణ్యం ఉంటేనే జరుగుతుంది.


వీనస్, మరియు ఆమె కొడుకువైన నీవు;  ఎప్పుడైనా నా మీద మీ కృపాదృక్కులు ప్రసరింపజేసారూ అంటే అది మరెప్పుడో కాదు ఇప్పుడే. నాకు మీ చేయూత కావలసినది ఇప్పుడే. 


(భారతీయ పురాణాలలో ప్రేమకు అధిదేవతలైన రతీ మన్మథులు భార్యాభర్తలు; కానీ గ్రీకు పురాణాలలోని ప్రేమ దేవతలైన ఆఫ్రోడైట్ మరియు ఎరోస్, లేక రోమన్ పురాణాలలోని వీనస్ మరియు క్యుపిడ్‌లు తల్లీకొడుకులు. ఇందులో వీనస్ లేక ఆఫ్రోడైట్ యవ్వనంలో ఉంటే ఆమె కొడుకైన క్యుపిడ్ లేక ఎరోస్ పసిబాలుడు.)


విజ్ఞాన దేవతవైన ఎరాటో! నిన్ను కూడా నేను ఆవాహన చేస్తున్నాను. ఎందుకంటే నీ పేరు ప్రేమ దేవుడైన ఎరోస్ నుండే వచ్చింది. 


(గ్రీకు పురాణాలలో తొమ్మిది మంది విజ్ఞాన దేవతలు ఉన్నారు. వీరంతా స్త్రీలు. వీరిలో ప్రేమ కవిత్వం చెప్పే విజ్ఞాన దేవత పేరు ఎరాటో)


నేను తల పోస్తున్న కార్యం చాలా గొప్పది.


ప్రేమ దేవుడైన ఆ చంచల బాలుడిని ఎలా బందీ చేయాలన్నదానిని నేను చెప్పబోతున్నాను. ఈ విశాల ప్రపంచంలో అతడు అటునిటు ద్రిమ్మరి వలే తిరుగుతుంటాడు. అతడు చాలా తేలికగా ఉంటాడు, పైగా ఎగరడానికి రెక్కలు కూడా ఉన్నాయి. అతడిని చరించకుండా ఆపడం చాలా కష్టం.


(క్రీట్ దేశపు రాజు మైనస్. అతని రాణి ఫసిఫె. ఆమె ఒక ఎద్దుని మోహించి దానితో కూడి సగం మనిషి, సగం ఎద్దు రూపంలో ఉండే మినోటార్ అనే ఒక బిడ్డను కంటుంది. దీనితో కోపించిన మైనస్ నిర్మాణశిల్పి (Architect) అయిన డెడాలస్తో ఒక జాలమందిరాన్ని (Labyrinth) నిర్మింపజేసి దానిలో మినోటార్‌ను బంధిస్తాడు.


డెడాలస్ ఏథెన్స్ నుండి పారిపోయి వచ్చి క్రీట్లో ఆశ్రయం పొందుతుంటాడు.



ఆ జాలమందిరం గురించి ప్రజలకు తెలియకూడదనుకున్న మైనస్ దానిని నిర్మించిన డెడాలస్‌ను, అతడి కొడుకైన ఇకారస్‌ను ఓ చోట బంధిస్తాడు. అయితే డెడాలస్ తన నిర్మాణ కౌశలాన్నంతా ఉపయోగించి తయారుచేసిన మైనపు రెక్కల సాయంతో తన కొడుకుతో పాటుగా అక్కడ నుండి తప్పించుకుంటాడు. )



తన విదేశీ అతిథి తప్పించుకోడానికి అవకాశమున్న ప్రతిదారినీ మైనస్ (Minos) మూసివేశాడు. అయినా కూడా అతడు సాహసించి మైనపు రెక్కలతో ఓ దారిని వెతుక్కున్నాడు. తన తల్లి చేసిన తప్పువల్ల జన్మించిన సగం మనిషి, సగం ఎద్దుగా ఉన్న ఆ వింతజీవిని ఖైదుచేసిన డెడాలస్ మైనస్తో ఇలా పలికాడు.


"ధర్మనిరతుడవైన ఓ రాజా! నా ప్రవాసానికి ముగింపు పలుకు. నా జన్మభూమి నా అస్థికలను స్వీకరించనీయి. కౄరమైన విధి నన్ను నా దేశంలో బ్రతకనీయలేదు, కనీసం నాకు అక్కడ చావునన్నా అనుగ్రహించు. 


నాసేవలు చాలవనుకుంటే నాకొడుకునైనా స్వదేశం తిరిగి వెళ్ళనీయి. ఒకవేళ నీకు యువకునిమీద జాలికలుగకపోతే కనీసం ఈ వృద్ధుడినైనా కరుణించు."


ఆ విధంగా డెడాలస్ వేడుకొన్నాడు. అయితే మైనస్ హృదయాన్ని తాకడానికి పలికిన ఈ మాటలు మరియు ఇలాంటివే అనేక ఇతర మాటలు అన్నీ వృధాప్రయాసే అయ్యాయి. 


అతడి వేడికోళ్ళను మైనస్ అసలు వినిపించుకోలేదు. అవి అతడిని ఏమాత్రం కదిలించలేకపోయాయి.


తన వేడికోళ్ళ వలన ఎలాంటి ఉపయోగం లేదని తెలుసుకున్న అతడు తనలో తాను ఇలా అనుకున్నాడు. 


“చూడూ! నీ సృజనాత్మకతను నిరూపించుకోవడానికి నిజానికి ఇది నీకొక అవకాశం. మైనస్ భూమిని శాసిస్తాడు, మైనస్ సముద్రాన్ని శాసిస్తాడు. కనుక వాటిద్వారా తప్పించుకోచూడటం వల్ల ఉపయోగం లేదు. ఇక మిగిలింది ఆకాశమే. ఆ ఆకాశం గుండా నాకొక మార్గాన్ని ఏర్పరుచుకుంటాను.


మహోన్నతుడవైన ఓ ఇంద్రా! నా ఈ దుడుకుతనాన్ని మన్నించు. ఆకాశాన దేవతల నివాసాల ఎత్తువరకు రావాలనేది నా ఉద్దేశం కాదు. అయితే నిర్దయుడైన ప్రభువునుండి తప్పించుకోవడానికి నాకున్నది ఒక్కటే మార్గం, ఒకేఒక్క మార్గం. 


ఒకవేళ పాతాళంలోగుండా ఏదైనా దారి ఉంటే, దానిలోగుండా వెళ్ళడానికి కూడా నేను భయపడేవాడిని కాదు. 


నా సహజత్వానికి భిన్నంగా వ్యవహరించే శక్తిని నాకు ప్రసాదించు.”


కష్టాలు తరచూ సృజనకు దారితీస్తాయి. ఎవరైనా, ఎప్పుడైనా అనుకున్నారా మానవుడు ఆకాశంగుండా ప్రయాణిస్తాడని. అయితే ఇది నిజం. డెడాలస్ పక్షి ఈకలను తెడ్లవలే పేర్చి రెక్కలను తయారు చేశాడు. అవి చెదిరిపోకుండా దారంతో కుట్టి, మంటలో కరిగించిన మైనంతో ఆ రెక్కల క్రిందిభాగానికి పూతవేశాడు.


మరిప్పుడు నూతనమైన మరియు అద్భుతమైన ఆ పనితనం పూర్తి అయినది. డెడాలస్ కొడుకు చిరునవ్వుతో ఆ ఈకలను, ఆ మైనాన్ని స్పృశించాడు. అయితే ఆ రెక్కలు తన భుజాల కొరకే తయారుగా ఉన్నాయని అతడికి తెలియదు.


అతడి తండ్రి వాటి గురించి ఇలా చెప్పాడు. “ఇదిగో చూడు! మనలను స్వదేశానికి తీసుకువెళ్ళే సాధనాలు ఇవే. వీటిద్వారానే మనం మైనస్ బారినుండి తప్పించుకుంటాము. మైనస్ మనకున్న అన్ని దారులను మూసివేయగలిగాడేమోగానీ, ఆకాశమార్గాలను మాత్రం అతడు మూసివేయలేడు. 


నా ఈ పనితనంద్వారా గగనంలోకి చొచ్చుకెళ్ళడం నీకు సాధ్యమవుతుంది.


అయితే తారామండలంలోని టెగియా కన్యవైపు గానీ, ఖడ్గదారియైన ఓరియన్వైపు గానీ నీ చూపు మరలకుండా జాగ్రత్త వహించు. నా ప్రయాణమార్గాన్ని నీవు అనుసరించు. నేను ముందుండి ప్రయాణిస్తాను. నన్ను అనుసరించడంతో తృప్తిపడు.  నీకు మార్గం చూపడానికి నేనుండగా నీకెలాంటి భయం ఉండదు.


మన గగనప్రయాణంలో మనం గనుక పైపైకి ఎగిరి సూర్యుని సమీపించినట్లైతే మన రెక్కలకున్న మైనం వేడిమిని తట్టుకోలేదు; అలాగే మరీ క్రింద ఎగిరినట్లైతే సముద్రపుతేమకు మన రెక్కలు బరువు పెరిగి వాటిని మనం కదిలించలేనంతటి భారంగా మారతాయి.


కనుక మధ్యన ఉన్న మార్గంలో ఎగురు; కుమారా! అలాగే వీచే గాలి గురించి కూడా జాగ్రత్త వహించు. అది ఏ వైపుకు వీస్తుందో ఆవైపుకే నీవు పయనించు.”


ఆ విధంగా పలికి అతడు ఆ రెక్కలను తన కుమారుని లేత భుజాలమీద అమర్చాడు. తదుపరి కొత్తగా రెక్కలొచ్చిన తన దుర్బలమైన పిల్లలకు ఎగరడమెలాగో తల్లిపక్షి నేర్పినట్లుగా ఆ రెక్కలను ఎలా కదిలించాలో అతనికి చూపాడు.


ఆమీదట, తన భుజాలకు కూడా రెక్కలను అమర్చుకుని, కొంత ఆతురతతో, కొంత భయంతో తెలియని దారిలో పయనానికి సిద్ధమయ్యాడు. 


తన ప్రయాణాన్ని ఆరంభించడానికి ముందు అతడు తన కొడుకుని ముద్దాడాడు. ఆ సమయంలో ఆ వృద్ధుని చెంపలమీద అశృధారలు అప్రయత్నంగా జాలువారాయి.


అక్కడికి సమీపంలోనే పర్వతం కన్నా ఎత్తు తక్కువగానూ, మైదాన ప్రాంతం కన్నా ఎత్తుగానూ ఉండే ఓ కొండ ఉన్నది. అక్కడినుండే వారు తమ దయనీయ గగనప్రయాణాన్ని ఆరంభించారు.


డెడాలస్ ఓ వైపు తన రెక్కలను కదిలిస్తూనే వెనుతిరిగి తన కొడుకు రెక్కలవైపు కూడా చూస్తున్నాడు. అయినాకూడా తన ప్రయాణమార్గం సాఫీగా ఉండేటట్లు చూసుకుంటున్నాడు. 


మొదట తమ గగనయానంలోని కొత్తదనం వారిని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. కాసేపటికి ఇకారస్ భయాన్నంతా పక్కనబెట్టి మరింత వేగంగా, మరింత ధైర్యంగా ఎగరనారంభించాడు. 


ఒక జాలరి చేపను పట్టబోతూ వీరిని చూచి తన గాలాన్ని చేజార్చుకున్నాడు.


అంతలోనే వారు సమోస్ ద్వీపాన్ని దాటేశారు. 


వారు ప్రయాణించిన మార్గానికి ఎడమవైపున నాక్సస్, పారోస్ ద్వీపాలు మరియు అపోలో దేవతకు ప్రియమైన డెలోస్ ద్వీపం ఉన్నాయి; 


అలాగే కుడివైపున లెబింథొస్ ద్వీపం, దట్టమైన అడవులున్న కలిమ్న ద్వీపం మరియు సమృద్ధిగా చేపలున్న కొలనులు చుట్టూ ఉండే ఆస్టిపాలే ద్వీపం ఉన్నాయి.


అంతలో ఇకారస్, యువతకు సహజంగా ఉండే నిర్లక్ష్యధోరణితో దుందుడుకుతనం పెరిగిపోయి, తన తండ్రిని వెనక వదిలేసి మరింత ఎత్తుకు ప్రయాణించాడు. 


అతని రెక్కల కట్లు వదులైపోయాయి, సూర్యుని సమీపించేకొలదీ మైనం కరిగిపోయి అతడు తన బాహువులను ఎంతగా కదిలించినా అవి గాలిని నిరోధించలేకపోయాయి. భయంతో బిక్కచచ్చిపోయిన అతడు ఆ స్వర్లోకపు ఎత్తులనుండి క్రిందనున్న సముద్రాన్ని చూశాడు.


భయం వల్ల ఏర్పడిన ఓ అంధకారం అతడి కనులను కమ్మేసింది. ఇప్పుడిక మైనం పూర్తిగా కరిగిపోగా అతడు తన వట్టిచేతులను అటూఇటూ కొట్టుకున్నాడు. తనను నిలిపి ఉంచే ఆధారమేదీ అక్కడ లేకపోవడంతో అతడు భయంతో గజగజ వణికిపోయాడు. 


క్రిందికి, మరింత క్రిందికి అతడు పడిపోతున్నాడు. 


అలా పడిపోతున్నపుడు అతడు ఇలా అరిచాడు. " తండ్రీ! ఓతండ్రీ! నాదన్నది అంతా ముగిసిపోయింది" 


అంతలోనే పచ్చని నీరు అతడి నోటిని శాశ్వతంగా నొక్కివేసింది.


దుఃఖితుడైన ఆ తండ్రి -ఇప్పుడు అతను తండ్రే కాదు- ఇలా అరిచాడు. 


" ఇకారస్, ఎక్కడ ఉన్నావు? ఏ గగన ప్రాంతాల కిందకు నీవు ప్రయాణించావు?  


ఇకారస్, ఇకారస్" అని అతడు మరల మరలా అరిచాడు. 


అంతలో నీటి తెట్టుమీద అతడి రెక్కలు కంటబడ్డాయి.


భూమి ఇకారస్ అస్థికలను స్వీకరించింది, సముద్రం అతడి పేరును గ్రహించింది.


(క్రీట్ దేశపు రాణి అయిన ఫసిఫే ఒక ఎద్దును మోహించిన కథ ప్రేమకళ తొలిభాగంలో చెప్పబడింది. దానికి కొనసాగింపే ఇప్పుడు చెప్పిన డెడాలస్, ఇకారస్ల గాథ.


అనుభవం, నైపుణ్యం ఉన్న డెడాలస్ లేని అవకాశాన్ని సృష్టిస్తే, అవి రెండూ లేని ఇకారస్ ఉన్న అవకాశాన్ని కూడా పోగొట్టుకున్నాడు.  



చాకచక్యం లేకపోతే చెంత చేరిన ప్రియురాలు కూడా చేజారిపోతుందన్నదే ఇక్కడ ఒవిడ్ చెప్పదలచుకున్నది.)