శ్రీమద్భగవద్గీత
పదునారవ అధ్యాయము
దైవాసురసంపద్విభాగయోగము
పదునారవ అధ్యాయము
దైవాసురసంపద్విభాగయోగము
శ్రీ భగవానువాచ
అభయం సత్త్వసంశుద్ధిః జ్ఞానయోగవ్యవస్థితిః |
దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవమ్ || 1
అహింసా సత్యమక్రోధః త్యాగః శాన్తిరపైశునమ్ |
దయా భూతేష్వలోలుప్త్వం మార్దవం హ్రీరచాపలమ్ || 2
తేజః క్షమా ధృతిః శౌచమ్ అద్రోహో నాతిమానితా |
భవన్తి సంపదం దైవీమ్ అభిజాతస్య భారత || 3
శ్రీ భగవానుడు: అర్జునా! భయం లేకపోవడం, చిత్తశుద్ధి, జ్ఞానయోగనిష్ఠ, దానం, ఇంద్రియనిగ్రహం, యజ్ఞం, వేదపఠనం, తపస్సు, సరళస్వభావం, అహింస, సత్యం, కోపంలేకపోవడం, త్యాగబుద్ధి, శాంతి, చాడీలు చెప్పకపోవడం, భూతదయ, విషయసుఖాలు వాంఛించకపోవడం, మృదుత్వం, సిగ్గు, చపలత్వం లేకపోవడం, తేజస్సు, ఓర్పు, ధైర్యం, శుచిత్వం, ద్రోహం చేయకపోవడం, దురభిమానం లేకపోవడం- ఈ ఇరవై ఆరు సుగుణాలూ దేవతల సంపదవల్ల పుట్టినవాడికి కలుగుతాయి.
దంభో దర్పో௨భిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ |
అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీమ్ || 4
పార్థా! రాక్షస సంపదలో పుట్టినవాడి లక్షణాలు ఇవి: కపటం, గర్వం, దురహంకారం, కోపం, కఠినత్వం, అవివేకం.
దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయాసురీ మతా |
మా శుచః సంపదం దైవీమ్ అభిజాతో௨సి పాండవ || 5
దైవసంపద మూలంగా మోక్షమూ, అసుర సంపదవల్ల సంసారబంధమూ కలుగుతాయి. అర్జునా! నీవు దైవసంపదలోనే జన్మించావు. కనుక విచారించనక్కరలేదు.
ద్వౌ భూతసర్గౌ లోకే௨స్మిన్ దైవ ఆసుర ఏవ చ |
దైవో విస్తరశః ప్రోక్తః ఆసురం పార్థ మే శృణు || 6
అర్జునా! ఈ లోకంలో ప్రాణుల సృష్టి దైవమనీ, ఆసురమనీ రెండురకాలు. దైవసంపద గురించి వివరంగా ఇదివరకే చెప్పాను. ఇక ఆసుర సంపద గురించి విను.
ప్రవృత్తిం చ నివృత్తిం చ జనా న విదురాసురాః |
న శౌచం నాపి చాచారో న సత్యం తేషు విద్యతే || 7
అసురస్వభావం కలిగినవాళ్ళకు చేయదగ్గదేదో, చేయకూడనిదేదో తెలియదు. వాళ్ళలో శుచిత్వం, సదాచారం, సత్యం కనుపించవు.
అసత్యమప్రతిష్ఠం తే జగదాహురనీశ్వరమ్ |
అపరస్పరసంభూతం కిమన్యత్కామహైతుకమ్ || 8
ఈ జగత్తు అసత్యమనీ, ఆధారమూ, అధిపతీ లేనిదనీ, కామవశంలో స్త్రీ పురుషుల కలయిక తప్ప సృష్టికి మరోకారణం లేదనీ వాళ్ళు వాదిస్తారు.
ఏతాం దృష్టిమవష్టభ్య నష్టాత్మానో௨ల్పబుద్ధయః |
ప్రభవన్త్యుగ్రకర్మాణః క్షయాయ జగతో௨హితాః || 9
అలాంటి నాస్తికులు –ఆత్మను కోల్పోయిన అల్పబుద్ధులు –ఘోరకృత్యాలుచేసే లోకకంటకులు, ప్రపంచ వినాశానికి పుడతారు.
కామమాశ్రిత్య దుష్పూరం దంభమానమదాన్వితాః |
మోహాద్గృహీత్వాసద్గ్రాహాన్ ప్రవర్తంతే௨శుచివ్రతాః || 10
వాళ్ళు అంతూదరీలేని కోరికలతో, ఆడంబరం, గర్వం, దురభిమానమనే దుర్గుణాలతో, అవివేకంవల్ల దుష్టభావాలతో దురాచారులై తిరుగుతారు.
చింతామపరిమేయాం చ ప్రలయాన్తాముపాశ్రితాః |
కామోపభోగపరమాః ఏతావదితి నిశ్చితాః || 11
ఆశాపాశశతైర్బద్ధాః కామక్రోధపరాయణాః |
ఈహన్తే కామభోగార్థమ్ అన్యాయేనార్థసంచయాన్ || 12
వాళ్ళు మృతిచెందేవరకూ వుండే మితిలేని చింతలతో కామభోగాలను అనుభవించడమే పరమావధిగా భావించి, అంతకు మించిందేదీ లేదని నమ్ముతారు. ఎన్నో ఆశాపాశాలలో చిక్కుకుని కామక్రోధాలకు వశులై విషయసుఖాలను అనుభవించడంకోసం అక్రమ ధనార్జనకు పూనుకుంటారు.
ఇదమద్య మయా లబ్ధమ్ ఇమం ప్రాప్స్యే మనోరథమ్ |
ఇదమస్తీదమపి మే భవిష్యతి పునర్ధనమ్ || 13
అసౌ మయా హతః శత్రుః హనిష్యే చాపరానపి |
ఈశ్వరో௨హమహం భోగీ సిద్ధో௨హం బలవాన్ సుఖీ || 14
ఆఢ్యో௨భిజనవానస్మి కో௨న్యో௨స్తి సదృశో మయా |
యక్ష్యే దాస్యామి మోదిష్యే ఇత్యజ్ఞానవిమోహితాః || 15
అనేకచిత్తవిభ్రాంతాః మోహజాలసమావృతాః |
ప్రసక్తాః కామభోగేషు పతంతి నరకే௨శుచౌ || 16
“ ఈవేళ నా కిది లభించింది. ఇక ఈ కోరిక నెరవేరుతుంది. నా కింత ఆస్తి వున్నది. మరింత సంపాదించబోతున్నాను. ఈ శత్రువును చంపేశాను. మిగిలిన శత్రువులను కూడ సంహరిస్తాను. నేను ప్రభువును, సుఖభోగిని, తలపెట్టినపని సాధించే సమర్థుణ్ణి, బలవంతుణ్ణి సుఖవంతుణ్ణి. నేను డబ్బున్న వాణ్ణి. ఉన్నత వంశంలో ఉద్భవించాను. నాకు సాటి అయిన వాడెవడూ లేడు. నేను యజ్ఞాలు చేస్తాను, దానాలిస్తాను, ఆనందం అనుభవిస్తాను.” అని వాళ్ళు అజ్ఞానంలో అనేకవిధాల కలవరిస్తారు. మోహవశులైన ఆ అసురస్వభావం కలిగినవాళ్ళు నిరంతరం కామభోగాలలోనే చిక్కుకుని చివరకు ఘోరనరకాల పాలవుతారు.
ఆత్మసంభావితాః స్తబ్ధా ధనమానమదాన్వితాః |
యజన్తే నామయజ్ఞైస్తే దంభేనావిధిపూర్వకమ్ || 17
తమను తామే పొగడుకుంటూ, వినయ విధేయతలు లేకుండా, ధనమద గర్వంతో వాళ్ళు శాస్త్రవిరుద్ధంగా పేరుకు మాత్రం యజ్ఞాలు చేస్తారు.
అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితాః |
మామాత్మపరదేహేషు ప్రద్విషన్తో௨భ్యసూయకాః || 18
అహంకారం, బలం, గర్వం, కామం, క్రోధం –వీటిని ఆశ్రయించి అసూయాపరులైన వీళ్ళు తమ శరీరంలోనూ, ఇతరుల శరీరాలలోనూ వుంటున్న నన్ను ద్వేషిస్తారు.
తానహం ద్విషతః క్రూరాన్ సంసారేషు నరాధమాన్ |
క్షిపామ్యజస్రమశుభాన్ ఆసురీష్వేవ యోనిషు || 19
ద్వేషపూరితులు, పాపచరితులు, క్రూరస్వభావులు అయిన అలాంటి మానవాధములను మళ్ళీ మళ్ళీ సంసారంలోనే పడవేస్తుంటాను.
ఆసురీం యోనిమాపన్నాః మూఢా జన్మని జన్మని |
మామప్రాప్యైవ కౌంతేయ తతో యాంత్యధమాం గతిమ్ || 20
కౌంతేయా! అసురజన్మ పొందే అలాంటి మూర్ఖులు ఏ జన్మలోనూ నన్ను చేరలేకపోవడమే కాకుండా అంతకంతకీ అధోగతి పాలవుతారు.
త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః |
కామః క్రోధస్తథా లోభః తస్మాదేతత్త్రయం త్యజేత్ || 21
కామం, క్రోధం, లోభం –ఈ నరక ద్వారాలు మూడూ ఆత్మవినాశానికి కారణాలు. అందువల్ల ఈ మూడింటినీ విడిచిపెట్టాలి.
ఏతైర్విముక్తః కౌంతేయ తమోద్వారైఃత్రిభిర్నరః |
ఆచరత్యాత్మనః శ్రేయః తతో యాతి పరాం గతిమ్ || 22
కౌంతేయా! ఈ మూడు దుర్గుణాలనూ విసర్జించినవాడు తనకు తాను మేలు చేసుకుని పరమపదం పొందుతాడు.
యః శాస్త్రవిధిముత్సృజ్య వర్తతే కామకారతః |
న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాం గతిమ్ || 23
శాస్త్రవిధులను విడిచిపెట్టి తన ఇష్టానుసారం ప్రవర్తించేవాడు తత్వజ్ఞానంకాని, సుఖంకాని, మోక్షంకాని పొందడు.
తస్మాచ్ఛాస్త్రం ప్రమాణం తే కార్యాకార్యవ్యవస్థితౌ |
జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం కర్మ కర్తుమిహార్హసి || 24
అందువల్ల చేయదగ్గదేదో, చేయకూడనిదేదో నిర్ణయించుకోవడంలో నీకు శాస్త్రమే ప్రమాణం. శాస్త్రవిధానాలను తెలుసుకుని తదనుగుణంగా ఈ లోకంలో నీవు కర్మలు చేయాలి.
ఇలా ఉపనిషత్తులు, బ్రహ్మవిద్య, యోగశాస్త్రం, శ్రీకృష్ణార్జున సంవాదం అయిన శ్రీమద్భగవద్గీతలోని "దైవాసురసంపద్విభాగయోగము" అనే పదునారవ అధ్యాయం సమాప్తం.
No comments:
Post a Comment