Monday, March 26, 2012

భగవద్గీత-తాత్పర్యసహితం: శ్రీ గీతామాహాత్మ్యం





శ్రీ గీతామాహాత్మ్యం


ధరోవాచ

భగవన్! పరమేశాన! భక్తిరవ్యభిచారిణీ!
ప్రారబ్ధం భుజ్యమానస్య కథం భవతి హే ప్రభో ||            1

భూదేవి: భగవంతుడా! పరమేశ్వరా! ప్రభూ! ప్రారబ్ధం అనుభవించేవాడికి అచంచలమైన భక్తి ఎలా కలుగుతుంది?

శ్రీ విష్ణురువాచ

ప్రారబ్ధం భుజ్యమానో௨పి గీతాభ్యాసరతస్సదా |
సముక్త స్స సుఖీ లోకేకర్మణా నోపలిప్యతే ||                2

శ్రీమహావిష్ణువు: భూదేవీ! ప్రారబ్ధం అనుభవిస్తున్నా నిరంతరం గీతను అభ్యసించేవాడు లోకంలో ముక్తి పొంది, సుఖపడతాడు; కర్మలకు బద్ధుడు కాడు.

మహాపాపాది పాపాని గీతాధ్యానం కరోతి చేత్ |
క్వచిత్ స్పర్శం న కుర్వంతి నళినీదళ మంభసా ||            3

తామరాకును నీరు అంటనట్లే గీతాపారాయణం చేసేవాడిని మహాపాపాలు కూడా ఏ మాత్రమూ అంటవు.

గీతాయాః పుస్తకం యత్ర యత్ర పాఠః ప్రవర్తతే |
తత్ర సర్వాణి తీర్థాని ప్రయాగదీని తత్ర వై ||                4

గీతాగ్రంథం వున్నచోట, గీతాపఠనం జరిగేచోట ప్రయాగలాంటి తీర్థాలన్నీ వుంటాయి.

సర్వేదేవాశ్చ ఋషయో యోగినః పన్నగాశ్చయే |
గోపాలా గోపికావా௨పి నారదోద్ధవపార్షదైః
సహాయో జాయతే శీఘ్రం యత్ర గీతా ప్రవర్తతే ||                5

గీతాపారాయణం జరిగేచోటకు సర్వదేవతలు, ఋషులు, యోగులు, నాగులు, గోపాలురు, గోపికలు, విష్ణుభక్తులైన నారదుడు, ఉద్ధవుడు మొదలైన వారు వచ్చి తోడ్పడతారు.

యత్ర గీతావిచారశ్చ పఠనం పాఠనం శ్రుతమ్ |
తత్రాహం నిశ్చితం పృథ్వి! నివసామి సదైవ హి ||            6

భూదేవీ! గీతను చర్చించడం, చదవడం, బోధించడం, వినడం జరిగే ప్రదేశంలో నేను నిరంతరం నివసిస్తుంటాను.

గీతాశ్రయో௨హం తిష్ఠామి గీతా మే చోత్తమం గృహమ్ |
గీతాజ్ఞానముపాశ్రిత్య త్రీన్లోకాన్పాలయామ్యహమ్ ||        7

నాకు ఆశ్రయమూ, ఉత్తమనివాస మందిరమూ గీతాశాస్త్రమే. గీతాజ్ఞానాన్ని బట్టే నేను మూడులోకాలనూ పరిపాలిస్తున్నాను.

గీతా మే పరమా విద్యా బ్రహ్మరూపా న సంశయః |
అర్థమాత్రాక్షరా నిత్యా స్వనిర్వాచ్య పదాత్మికా ||            8

నా పరమవిద్య అయిన గీత నాశరహితం, శాశ్వతం, వర్ణనాతీతం. అది బ్రహ్మస్వరూపం, అర్ధమాత్రాస్వరూపం అనడంలో అనుమానం లేదు.

చిదానందేన కృష్ణేన ప్రోక్తా స్వముఖతో௨ర్జునమ్ |
వేదత్రయీ పరానందా తత్త్వార్థజ్ఞాన మంజసా ||            9

చిదానందరూపం కలిగిన శ్రీకృష్ణపరమాత్మ అర్జునుడికి స్వయంగా చెప్పిన ఈ గీత మూడువేదాలసారం; పరమానంద స్వరూపం. తనను ఆశ్రయించిన వాళ్ళకిది తత్వజ్ఞానాన్ని తొందరగా కలగజేస్తుంది.

యో௨ష్టాదశ జపేన్నిత్యం నరో నిశ్చలమానసః |
జ్ఞానసిద్ధిం స లభతే తతో యాతి పరం పదమ్ ||            10

నిర్మలమైన మనసుతో నిత్యం గీత పద్దెనిమిది అధ్యాయాలనూ పారాయణం చేసేవాడు జ్ఞానసిద్ధి, దానిమూలంగా పరమపదమూ పొందుతాడు.

పాఠే௨సమర్థస్సంపూర్ణే తదర్ధం పాఠమాచరేత్ |
తదా గోదానజం పుణ్యం లభతే నాత్ర సంశయః ||            11

గీతను పూర్తిగా చదవలేనివాళ్ళు దానిలో సగమైనా చదివితే గోదానంవల్ల కలిగే పుణ్యఫలం తప్పకుండా దక్కుతుంది.

త్రిభాగం పఠమానస్తు గంగాస్నానఫలం లభేత్ |
షడంశం జపమానస్తు సోమయాగఫలం లభేత్ ||            12

గీతలో మూడవభాగం—ఆరు అధ్యాయాలు పారాయణం చేసేవాళ్ళకు గంగాస్నానంవల్ల కలిగే ఫలమూ, ఆరవభాగం—మూడు అధ్యాయాలు పఠించేవాళ్ళకు సోమయాగం చేయడం ద్వారా లభించే ఫలమూ ప్రాప్తిస్తాయి.

ఏకాధ్యాయం తు యో నిత్యం పఠతే భక్తిసంయుతః |
రుద్రలోకమవాప్నోతి గణోభూత్వావసే చ్చిరమ్ ||            13

భక్తితో నిత్యమూ ఒక అధ్యాయాన్ని చదివేవాడు రుద్రలోకం చేరి, అక్కడ ప్రమథగణాలలో ఒకడిగా చిరకాలం జీవిస్తాడు.

అధ్యాయ శ్లోకపాదం వా నిత్యం యః పఠతే నరః |
స యాతి నరతాం యావత్ మనుకాలం వసుంధరే ||            14

భూదేవీ! ఒక అధ్యాయంలోని నాలుగో భాగమైనా ప్రతీరోజూ పారాయణం చేసేవాడు ఒక మన్వంతరకాలం మానవజన్మ పొందుతాడు.

గీతయాః శ్లోకదశకం సప్త పంచ చతుష్టయమ్ |
ద్వౌ త్రీనేకం తదర్ధం వా శ్లోకానాం యః పఠేన్నరః ||    15

చంద్రలోకమవాప్నోతి వర్షాణామయుతం ధ్రువమ్ |
గీతాపాఠసమాయుక్తో మృతో௨మానుషతాం వ్రజేత్ ||            16

గీతలలోని శ్లోకాలు –పది, ఏడు, ఐదు, నాలుగు, మూడు, రెండు, ఒకటికాని, ఆఖరుకి అర్ధశ్లోకంకాని అనుదినం పఠించేవాడు పదివేల సంవత్సరాలు చంద్రలోకంలో సుఖజీవనం సాగిస్తాడనడంలో సందేహం లేదు. గీతాపారాయణం చేస్తూ మరణించేవాడికి దేవత్వం కలుగుతుంది.

గీతాభ్యాసం పునః కృత్వా లభతే ముక్తిమత్తమామ్ |
గీతేత్యుచ్చారసంయుక్తో మ్రియమాణో గతిం లభేత్ ||            17

గీతాధ్యయనం మళ్ళీమళ్ళీ చేసే మానవుడు ఉత్తమమైన పరమపదం పొందుతాడు. గీతను స్మరిస్తూ ప్రాణాలు విడిచిపెట్టేవాడికి ఉత్తమగతి లభిస్తుంది.

గీతార్థశ్రవణాసక్తో మహాపాపయుతో௨పి వా |
వైకుంఠం సమవాప్నోతి విష్ణునా సహ మోదతే ||            18

గీతార్థాన్ని వినడంలో ఆసక్తి కలిగినవాడు—ఎలాంటి మహాపాపి అయినప్పటికీ వైకుంఠానికి వెళ్ళి అక్కడ విష్ణువుతో పాటు ఆనందం అనుభవిస్తాడు.

గీతార్థం ధ్యాయతే నిత్యం కృత్వా కర్మాణి భూరిశః |
జీవన్ముక్తస్స విజ్ఞేయో దేహాంతే పరమం పదమ్ ||            19

నిత్యమూ అనేక కర్మలు ఆచరిస్తున్నా గీతార్థాన్ని ధ్యానించేవాడు జీవన్ముక్తుడై మరణానంతరం మోక్షం పొందుతాడు.

గీతామాశ్రిత్య బహవో భూభుజో జనకాదయః |
నిర్ధూతకల్మషా లోకే గీతా యాతాః పరంపదమ్ ||        20

గీతాశాస్త్రాన్ని ఆశ్రయించే ఈ లోకంలో జనకుడు లాంటి రాజఋషులు ఎంతో మంది పాపవిముక్తి పొంది, పరమపదం చేరుకోగలిగారు.

గీతయాః పఠనం కృత్వా మాహాత్మ్యం నై వ యః పఠేత్ |
వృథా పాఠో భవేత్తస్య శ్రమ ఏవ హ్యుదాహృతః ||            21

గీతాపఠనం చేశాక మాహాత్మ్యం చదవనివాడి పారాయణం వృధాప్రయాస మాత్రమే.

ఏతన్మాహాత్మ్యసంయుక్తం గీతాభ్యాసం కరోతి యః |
స తత్ఫలమవాప్నోతి దుర్లభాం గతిమాప్నుయాత్ ||                22

మాహాత్మ్యంతోసహా గీతాపారాయణం చేసేవాడికి పైన చెప్పిన ఫలంతోపాటు ఉత్తమగతి కూడా లభిస్తుంది.

సూత ఉవాచ

మాహాత్మ్యమేతద్గీతయాః మయా ప్రోక్తం సనాతనమ్ |
గీతాన్తే చ పఠేద్యస్తు యదుక్తం తత్ఫలం లభేత్ ||            23

సూతుడు: శౌనకాది మహర్షులారా ! సనాతనమైన గీతామాహాత్మ్యాన్ని ఇలా మీకు తెలియజేశాను. గీతాపారాయణం చేశాక దీన్ని చదివినవాడికి పైన చెప్పిన ఫలం దక్కుతుంది.


ఇలా శ్రీ వరాహపురాణంలోని “శ్రీ గీతామాహాత్మ్యం” సమాప్తం.




భగవద్గీత-తాత్పర్యసహితం: పదునెనిమిదవ అధ్యాయము





శ్రీమద్భగవద్గీత

పదునెనిమిదవ అధ్యాయము

మోక్షసన్న్యాసయోగం

అర్జున ఉవాచ

సన్న్యాసస్య మహాబాహో తత్త్వమిచ్ఛామి వేదితుమ్ |
త్యాగస్య చ హృషీకేశ పృథక్ కేశినిషూదన ||                1

అర్జునుడు: కృష్ణా! సన్యాసం, త్యాగం—వీటి స్వరూపాలను విడివిడిగా తెలుసుకోదలచాను.

శ్రీ భగవానువాచ

కామ్యానాం కర్మణాం న్యాసం సన్న్యాసం కవయో విదుః |
సర్వకర్మఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః ||            2

శ్రీ భగవానుడు: ఫలాన్ని ఆశించి చేసేకర్మలను విడిచిపెట్టడమే సన్యాసమని కొంతమంది పండితులు చెబుతారు. సమస్త కర్మల ఫలితాలనూ వదలిపెట్టడమే త్యాగమని కొందరి అభిప్రాయం.

త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణః |
యజ్ఞదానతపఃకర్మ న త్యాజ్యమితి చాపరే ||                3

దోషంలేని కర్మ అంటూ ఏదీ వుండదు కనుక కర్మలను విడిచిపెట్టాలని కొందరు బుద్ధిమంతులు చెబుతారు. మరి కొంతమంది యజ్ఞం, దానం, తపస్సు అనే కర్మలను పరిత్యజించకూడదని పలుకుతారు.

నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరతసత్తమ |
త్యాగో హి పురుషవ్యాఘ్ర త్రివిధః సంప్రకీర్తితః ||            4

అర్జునా! కర్మత్యాగవిషయంలో నా నిర్ణయం విను. త్యాగం మూడు విధాలు.

యజ్ఞదానతపఃకర్మ న త్యాజ్యం కార్యమేవ తత్ |
యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషిణామ్ ||        5

యజ్ఞం, దానం, తపస్సు అనే కర్మలు బుద్ధిమంతులకు చిత్తశుద్ధిని చేకూరుస్తాయి. అందువల్ల వాటిని విడిచిపెట్టకూడదు; తప్పకుండా చేయాలి.

ఏతాన్యపి తు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ |
కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమమ్ ||            6

పార్థా! అయితే యజ్ఞం, దానం, తపస్సు అనే ఈ కర్మలను కూడా ఆసక్తినీ, ఫలాన్నీ విడిచిపెట్టే ఆచరించాలని నిశ్చితమూ, ఉత్తమమూ అయిన నా అభిప్రాయం.

నియతస్య తు సన్న్యాసః కర్మణో నోపపద్యతే |
మోహాత్తస్య పరిత్యాగస్తామసః పరికీర్తితః ||            7

స్వధర్మానుసారంగా నిత్యం ఆచరించవలసిన కర్మలను విడిచిపెట్టడం మంచిదికాదు. అవివేకంతో చేసే అలాంటి త్యాగాన్ని తామస త్యాగమంటారు.

దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశభయాత్ త్యజేత్ |
స కృత్వా రాజసం త్యాగం నైవ త్యాగఫలం లభేత్ ||            8

దుఃఖం కలగజేస్తాయనే భావనతోకాని, శరీరానికి శ్రమ కలుగుతుందనే భయంతోకాని నిత్యకర్మలను విడిచిపెడితే అది రాజసత్యాగం అవుతుంది. అలాంటి త్యాగం చేసినవాడు త్యాగఫలం పొందలేడు.

కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతే௨ర్జున |
సంగం త్యక్త్వా ఫలం చైవ స త్యాగః సాత్త్వికో మతః ||        9

అర్జునా! వేదశాస్త్రాదులు విధించిన కర్మలను కర్తవ్యబుద్ధితో ఆసక్తినీ, ఫలాన్నీ విడిచిపెట్టి ఆచరించడమే సాత్వికత్యాగం.

న ద్వేష్ట్యకుశలం కర్మ కుశలే నానుషజ్జతే |
త్యాగీ సత్త్వసమావిష్టో మేధావీ ఛిన్నసంశయః ||        10

సత్వగుణ సంపన్నుడు, బుద్ధిమంతుడు, సంశయరహితుడు అయిన త్యాగశీలి కామ్యాలు, కష్టప్రదాలైన కర్మలను ద్వేషించడు; శుభప్రదాలు, సులభసాధ్యాలు అయిన కర్మలను అభిమానించడు.

న హి దేహభృతా శక్యం త్యక్తుం కర్మాణ్యశేషతః |
యస్తు కర్మఫలత్యాగీ స త్యాగీత్యభిధీయతే ||                11

కర్మలను పూర్తిగా వదలిపెట్టడం శరీరాన్ని ధరించినవాడికి శక్యం కాదు. కనుక కర్మఫలాలను విడిచిపెట్టినవాడే త్యాగి.

అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణః ఫలమ్ |
భవత్యత్యాగినాం ప్రేత్య న తు సన్న్యాసినాం క్వచిత్ ||            12

కర్మఫలాలను త్యాగంచేయనివాళ్ళకు మరణానంతరం తాము ఆచరించిన కర్మల ధర్మాధర్మాలనుబట్టి దుఃఖకరం, సుఖప్రదం, మిశ్రమం అనే మూడు విధాలైన ఫలాలు కలుగుతాయి. అయితే కర్మఫలాలను విడిచి పెట్టిన సన్యాసులకు అవి అంటవు.

పంచైతాని మహాబాహో కారణాని నిబోధ మే |
సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణామ్ ||        13

అర్జునా! సర్వకర్మలూ ఫలించడానికి సాంఖ్యశాస్త్రం ఐదు కారణాలు చెప్పింది. వాటిని వివరిస్తాను విను.

అధిష్టానం తథా కర్తా కరణం చ పృథగ్విధమ్ |
వివిధాశ్చ పృథక్‌చేష్టా దైవం చైవాత్ర పంచమమ్ ||        14

కర్మలన్నిటికీ శరీరం, జీవాత్మ, ఇంద్రియాలు, వాటి వేర్వేరు వ్యాపారాలు, దైవం అనే ఐదూ కారణాలు.

శరీరవాఙ్మనోభిర్యత్ కర్మ ప్రారభతే నరః |
న్యాయం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః ||            15

మానవుడు శరీరం, వాక్కు, మనసులతో మంచిపనికాని, చెడ్డపనికాని ఆరంభించడానికి కారణాలు ఈ ఐదే.

తత్త్రైవం సతి కర్తారమ్ ఆత్మానం కేవలం తు యః |
పశ్యత్యకృతబుద్ధిత్వాత్ న స పశ్యతి దుర్మతిః ||            16

కర్మలకు సంబంధించిన కారణాలు ఇలా వుండగా బుద్ధి, సంస్కారం లేనివాడు తానే కర్తనని తలుస్తాడు. అలాంటి అవివేకి కర్మస్వరూపాన్నికాని, ఆత్మస్వరూపాన్నికాని సరిగా తెలుసుకోలేడు.

యస్య నాహంకృతో భావో బుద్ధిర్యస్య న లిప్యతే |
హత్వాపి స ఇమాన్‌లోకాన్ న హంతి న నిబధ్యతే ||            17

కర్మల విషయంలో అహంకారమమకారాలు లేనివాడు ఈ ప్రాణులన్నిటినీ చంపినా హంతకుడు కాడు; కర్మలు అతనిని బంధించవు.

జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాతా త్రివిధా కర్మచోదనా |
కరణం కర్మ కర్తేతి త్రివిధః కర్మసంగ్రహః ||            18

తెలివి, తెలుసుకోదగ్గది, తెలుసుకునేవాడు—ఈ మూడూ కర్మలకు కారణాలు. అలాగే కర్మకు ఆధారం సాధనం, చేసేపని, చేసేవాడు అని మూడు విధాలు.

జ్ఞానం కర్మ చ కర్తా చ త్రిధైవ గుణభేదతః |
ప్రోచ్యతే గుణసంఖ్యానే యథావచ్ఛృణు తాన్యపి ||            19

గుణాల భేదాన్నిబట్టి జ్ఞానం, కర్మ, కర్త అనేవాటిని సాంఖ్యశాస్త్రం మూడేసి విధాలుగా విభజించింది. వాటిని గురించి చెబుతాను విను.

సర్వభూతేషు యేనైకం భావమవ్యయమీక్షతే |
అవిభక్తం విభక్తేషు తద్‌జ్ఞానం విద్ధి సాత్త్వికమ్ |        20

విడివిడి విభాగాలుగా వుండే ప్రాణులన్నిటిలోనూ అఖండమూ, అవినాశమూ, అవిభక్తమూ అయిన ఆత్మవస్తువును చూసేవాడి జ్ఞానం సాత్వికజ్ఞానమని తెలుసుకో.

పృథక్త్వేన తు యద్‌జ్ఞానం నానాభావాన్‌పృథగ్విధాన్ |
వేత్తి సర్వేషు భూతేషు తద్‌జ్ఞానం విద్ధి రాజసమ్ ||        21

వేర్వేరుగా కనుపించే సర్వభూతాలలోని ఆత్మలు అనేకవిధాలుగా వున్నాయని భావించేవాడి జ్ఞానం రాజసజ్ఞానం.

యత్తు కృత్స్నవదేకస్మిన్ కార్యే సక్తమహైతుకమ్ |
అతత్త్వార్థవదల్పం చ తత్తామసముదాహృతమ్ ||            22

తత్వాన్ని తెలుసుకోకుండా, తగిన కారణం లేకుండా సమస్తమూ అదే అనే సంకుచితదృష్టితో ఏదో ఒకే పనిమీద ఆసక్తి కలిగివుండేవాడిజ్ఞానం తామసజ్ఞానం.

నియతం సంగరహితమ్ అరాగద్వేషతః కృతమ్ |
అఫలప్రేప్సునా కర్మ యత్తత్‌సాత్త్వికముచ్యతే ||                23

ఆసక్తి, అభిమానం, అనురాగం, ద్వేషం, ఫలాపేక్ష లేకుండా శాస్త్రసమ్మతంగా చేసే కర్మను సాత్వికకర్మ అంటారు.

యత్తు కామేప్సునా కర్మ సాహంకారేణ వా పునః |
క్రియతే బహుళాయాసం తద్రాజసముదాహృతమ్ ||            24

ఫలాభిలాషతో, అహంకారంతో, అధికప్రయాసతో ఆచరించేకర్మను రాజసకర్మ అని చెబుతారు.

అనుబంధం క్షయం హింసామ్ అనవేక్ష్య చ పౌరుషమ్ |
మోహాదారభ్యతే కర్మ యత్తత్‌తామసముచ్యతే ||                25

సాధకబాధకాలనూ, తన సామర్థ్యాన్నీ ఆలోచించకుండా అవివేకంతో ఆరంభించే కర్మ తామసకర్మ అవుతుంది.

ముక్తసంగో௨నహంవాదీ ధృత్యుత్సాహసమన్వితః |
సిద్ధ్యసిద్ధ్యోర్నిర్వికారః కర్తా సాత్త్విక ఉచ్యతే ||            26

ఫలాపేక్ష, అహంభావం విడిచిపెట్టి ధైర్యోత్సాహాలతో జయాపజయాలను లెక్కచేయకుండా కర్మలు చేసేవాణ్ణి సాత్వికకర్త అంటారు.

రాగీ కర్మఫలప్రేప్సుః లుబ్ధో హింసాత్మకో௨శుచిః |
హర్షశోకాన్వితః కర్తా రాజసః పరికీర్తితః ||            27

అనురాగం, కర్మఫలాసక్తి, దురాశ, పరపీడన పరాయణత్వాలతో శుచీ, శుభ్రమూ లేకుండా సుఖదుఃఖాలకు లొంగిపోతూ కర్మలు ఆచరించేవాడు రాజసకర్త అవుతాడు.

అయుక్తః ప్రాకృతః స్తబ్ధః నైష్కృతికో௨లసః |
విషాదీ దీర్ఘసూత్రీ చ కర్తా తామస ఉచ్యతే ||                28

మనోనిగ్రహం, వివేకం, వినయం లేకుండా ద్రోహబుద్ధితో, దుష్టస్వభావంతో, నిరుత్సాహంతో నిరంతరవిచారంతో, కాలయాపనతో కర్మలు చేసేవాణ్ణి తామసకర్త అని చెబుతారు.

బుద్ధేర్భేదం ధృతేశ్చైవ గుణతస్త్రివిధం శృణు |
ప్రోచ్యమానమశేషేణ పృథక్త్వేన ధనంజయ ||            29

ధనంజయా! గుణభేధాలనుబట్టి బుద్ధీ, ధైర్యమూ మూడేసివిధాలు. వాటిని గురించి పూర్తిగా విడివిడిగా వివరిస్తాను విను.

ప్రవృత్తిం చ నివృత్తిం చ కార్యాకార్యే భయాభయే |
బంధం మోక్షం చ యా వేత్తి బుద్ధిః సా పార్థ సాత్త్వికీ ||    30

పార్థా! కర్మమార్గాన్నీ, సన్యాసమార్గాన్నీ, కర్తవ్యాకర్తవ్యాలనూ, భయాభయాలనూ, బంధాన్నీ, మోక్షాన్నీ గ్రహించే బుద్ధి సాత్వికబుద్ధి.

యయా ధర్మమధర్మం చ కార్యం చాకార్యమేవ చ |
అయథావత్ ప్రజానాతి బుద్ధిః సా పార్థ రాజసీ ||            31

పార్థా! ధర్మాధర్మాలనూ, కార్యాకార్యాలనూ, సరిగా తెలుసుకోలేని బుద్ధి రాజసబుద్ధి.

అధర్మం ధర్మమితి యా మన్యతే తమసావృతా |
సర్వార్థాన్ విపరీతాంశ్చ బుద్ధిః సా పార్థ తామసీ ||        32

పార్థా! అజ్ఞానాంధకారంవల్ల అధర్మాన్ని ధర్మంగా, ప్రతి విషయాన్నీ విరుద్ధంగా, విపరీతంగా భావించే బుద్ధి తామసబుద్ధి.

ధృత్యా యయా ధారయతే మనఃప్రాణేంద్రియక్రియాః |
యోగేనావ్యభిచారిణ్యా ధృతిః సా పార్థ సాత్త్వికీ ||            33

పార్థా! మనసు, ప్రాణం, ఇంద్రియాలు—వీటి వ్యాపారాలను యోగసాధనతో నిలబెట్టగలిగే నిశ్చలధైర్యం సాత్వికధైర్యం.

యయా తు ధర్మకామార్థాన్ ధృత్యా ధారయతే௨ర్జున |
ప్రసంగేన ఫలాకాంక్షీ ధృతిః సా పార్థ రాజసీ ||        34

పార్థా! ధర్మార్థకామాలపట్ల అభిలాష, అభిమానం, ఫలాభిలాష కలిగివుండే ధైర్యం రాజసధైర్య.

యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవ చ |
న విముంచతి దుర్మేధా ధృతిః సా పార్థ తామసీ ||            35

పార్థా! బుద్ధిలేనివాడు నిద్ర, భయం, దుఃఖం, విషాదం, మదం—వీటిని విడిచిపెట్టకుండా చేసే ధైర్యం తామసధైర్యం.

సుఖం త్విదానీం త్రివిధం శృణు మే భరతర్షభ |
అభ్యాసాద్రమతే యత్ర దుఃఖాన్తం చ నిగచ్ఛతి ||            36

యత్తదగ్రే విషమివ పరిణామే௨మృతోపమమ్ |
తత్సుఖం సాత్త్వికం ప్రోక్తమ్, ఆత్మబుద్ధిప్రసాదజమ్ ||        37

భరతశ్రేష్ఠా! మానవుడికి అభ్యసించేకొద్దీ ఆనందం, దుఃఖవినాశం కలగజేసే సుఖం మూడు విధాలు. దాన్ని గురించి తెలియజేస్తాను విను. ఆరంభంలో విషంలా వున్నా అంతంలో అమృతసమానమయ్యే సుఖాన్ని సాత్వికసుఖమని చెబుతారు. అది నిర్మలమైన బుద్ధివల్ల కలుగుతుంది.

విషయేంద్రియసంయోగాత్ యత్తదగ్రే௨మృతోపమమ్ |
పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతమ్ ||            38

మొదట అమృతతుల్యంగా వుండి చివరకు విషంగా మారే సుఖం విషయాలు, ఇంద్రియాల కలయికవల్ల కలిగేది—రాజససుఖం అవుతుంది.

యదగ్రే చానుబంధే చ సుఖం మోహనమాత్మనః |
నిద్రాలస్యప్రమాదోత్థం తత్తామసముదాహృతమ్ ||            39

నిద్ర, బద్ధకం, ప్రమాదాలవల్ల జనించి, ఆదిలోనూ, అంతంలోనూ మోహం కలగజేసే సుఖాన్ని తామససుఖం అంటారు.

న తదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః |
సత్త్వం ప్రకృతిజైర్ముక్తం యదేభిః స్యాత్ త్రిభిర్గుణైః ||        40

ప్రకృతివల్ల కలిగిన ఈ మూడు గుణాలతో ముడిపడని వస్తువేదీ భూలోకంలోకాని, స్వర్గలోకంలోకాని, దేవతలలోకాని లేదు.

బ్రాహ్మణక్షత్రియవిశాం శూద్రాణాం చ పరంతప |
కర్మాణి ప్రవిభక్తాని స్వభావప్రభవైర్గుణైః ||            41

పరంతపా! బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులకు వారి వారి స్వభావంవల్ల కలిగిన గుణాలనుబట్టి కర్మలు విభజించబడ్డాయి.

శమో దమస్తపః శౌచం క్షాంతిరార్జవమేవ చ |
జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రాహ్మం కర్మ స్వభావజమ్ ||        42

బ్రాహ్మణులకు స్వభావసిద్ధమైన కర్మలు ఇవి: మనోనిగ్రహం, బాహ్యేంద్రియ నిగ్రహం, తపస్సు, శుచిత్వం, ఓర్పు, సత్ప్రవర్తన, శాస్త్రజ్ఞానం అనుభవజ్ఞానం, దేవుడిమీద నమ్మకం.

శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధే చాప్యపలాయనమ్ |
దానమీశ్వరభావశ్చ క్షాత్రం కర్మ స్వభావజమ్ ||        43

పరాక్రమం, పౌరుషం, ధైర్యం, దక్షత, యుద్ధంలో పారిపోకపోవడం దానం, పరిపాలనాసామర్థ్యం—ఇవి క్షత్రియుల కర్మలు.

కృషిగౌరక్ష్యవాణిజ్యం వైశ్యకర్మ స్వభావజమ్ |
పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజమ్ ||            44

వైశ్యులకు స్వభావంవల్ల కలిగిన కర్మలు: వ్యవసాయం, పశుపోషణ, వ్యాపారం. ఇక శూద్రులకర్మ సేవచేయడం.

స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః |
స్వకర్మనిరతః సిద్ధిం యథా విందతి తచ్ఛృణు ||            45

తాను ఆచరించే కర్మపట్ల శ్రద్ధ కలిగినవాడు సిద్ధి పొందుతాడు. స్వభావసిద్ధమైన తన కర్మమీద ఆసక్తి వున్నవాడు ఎలా సిద్ధి పొందుతాడో చెబుతాను విను.

యతః ప్రవృత్తిర్భూతానాం యేన సర్వమిదం తతమ్ |
స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః ||            46

సమస్తప్రాణుల పుట్టుకకూ, పోషణకూ కారణుడై విశ్వమంతటా వ్యాపించివున్న పరమాత్మను తనకు విధించబడ్డ కర్మలను ఆచరించడం ద్వారా అర్చించి మానవుడు పరమగతి పొందుతాడు.

శ్రేయాన్‌స్వధర్మో విగుణః పరధర్మాత్‌స్వనుష్ఠితాత్ |
స్వభావనియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషమ్ ||            47

బాగా ఆచరించబడ్డ ఇతరుల ధర్మంకంటే గుణం లేనిదిగా కనుపించినా తన ధర్మమే మంచిది. తన ధర్మాన్ని తాను నిర్వర్తించేవాడికి పాపం అంటదు.

సహజం కర్మ కౌంతేయ సదోషమపి న త్యజేత్ |
సర్వారంభా హి దోషేణ ధూమేనాగ్నిరివావృతాః ||            48

కౌంతేయా!  నిప్పును కప్పుకున్న పొగలాగ కర్మలన్నిటినీ దోషం ఆవరించి వుంటుంది. అందువల్ల ఏదైనా దోషమున్నా స్వభావసిద్ధమైన కర్మను విడిచిపెట్టకూడదు.

అసక్తబుద్ధిః సర్వత్ర జితాత్మా విగతస్పృహః |
నైష్కర్మ్యసిద్ధిం పరమాం సన్న్యాసేనాధిగచ్ఛతి ||            49

అన్ని విషయాలపట్ల ఆసక్తి విడిచిపెట్టి, ఆత్మనిగ్రహంతో, ఆశలు లేకుండా, ఫలత్యాగబుద్ధితో కర్మలు ఆచరించేవాడు పరమోత్తమమైన కర్మాతీత స్థితి పొందుతాడు.

సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథాప్నోతి నిబోధ మే |
సమాసేనైవ కౌంతేయ నిష్ఠా జ్ఞానస్య యా పరా ||            50

కౌంతేయా! నిష్కామకర్మసిద్ధి పొందినవాడు పరమాత్మను ఎలా పొందుతాడో, జ్ఞాననిష్ఠ అంటే ఏమిటో సంగ్రహంగా చెబుతాను సావధానంగా విను.

బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్య చ |
శబ్దాదీన్ విషయాన్, త్యక్త్వా రాగద్వేషౌ వ్యుదస్య చ ||    51

వివిక్తసేవీ లఘ్వాశీ యతవాక్కాయమానసః |
ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః ||            52

అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహమ్ |
విముచ్య నిర్మమః శాంతో బ్రహ్మభూయాయ కల్పతే ||            53

పరిశుద్ధమైన బుద్ధికలిగి, ధైర్యంతో మనసును వశపరచుకుని, శబ్దాది విషయాలనూ రాగద్వేషాలనూ విడిచిపెట్టి, ఏకాంతవాసం చేస్తూ, మితంగా తింటూ, మాటలు, శరీరం, మనసులను అదుపులో పెట్టుకుని, నిరంతరం ధ్యానయోగంలో వుంటూ, వైరాగ్యాన్ని ఆశ్రయించి అహంకారం, బలం, గర్వం, కామం, క్రోధం, వస్తుసేకరణలను వదలిపెట్టి, మమకారం లేకుండా శాంతస్వభావం కలిగినవాడు బ్రహ్మస్వరూపం పొందడానికి అర్హుడు.

బ్రహ్మభూతః ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి |
సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరామ్ ||        54

అలా బ్రహ్మస్వరూపం పొందినవాడు ప్రశాంతమైన మనసుతో దేనినీ ఆశించడు; దేనికీ దుఃఖించడు. సమస్త భూతాలనూ సమభావంతో చూస్తూ   నాపట్ల పరమభక్తి కలిగివుంటాడు.

భక్త్యా మామభిజానాతి యావాన్యశ్చాస్మి తత్త్వతః |
తతో మాం తత్త్వతో జ్ఞాత్వా విశతే తదనంతరమ్ ||            55

భక్తివల్ల అతను నేను ఎంతటివాడినో, ఎలాంటివాడినో యథార్థంగా తెలుసుకుంటాడు. నా స్వరూపస్వభావాలను గ్రహించిన అనంతరం నాలో ప్రవేశిస్తాడు.

సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః |
మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయమ్ ||            56

కర్మలన్నిటినీ ఎప్పుడూ ఆచరిస్తున్నప్పటికీ నన్ను ఆశ్రయించేవాడు నా అనుగ్రహంవల్ల శాశ్వతమూ, నాశరహితమూ అయిన మోక్షం పొందుతాడు.

చేతసా సర్వకర్మాణి మయి సన్న్యస్య మత్పరః |
బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్తః సతతం భవ ||            57

హృధయపూర్వకంగా అన్నికర్మలూ నాకే అర్పించి, నన్నే పరమగతిగా భావించి, ధ్యానయోగాన్ని అవలంబించి, నీ మనసు నిరంతరం నామీదే వుంచు.

మచ్చిత్తః సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి |
అథ చేత్ త్వమహంకారాత్ న శ్రోష్యసి వినంక్ష్యసి ||            58

నామీద మనసు నిలిపితే నా అనుగ్రహంవల్ల   సంసారసంబంధమైన ప్రతిఒక్క ప్రతిబంధకాన్నీ అతిక్రమిస్తావు. అలాకాకుండా అహంకారంతో నా ఉపదేశాన్ని పెడచెవిని పెడితే చెడిపోతావు.

యదహంకారమాశ్రిత్య న యోత్స్య ఇతి మన్యసే |
మిథ్యైష వ్యవసాయస్తే ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి ||            59

అహంకారంవల్ల యుద్ధం చేయకూడదని నీవు భావించినా ఆ ప్రయత్నం ఫలించదు. ఎందువల్లనంటే నీ స్వభావమే నీ చేత యుద్ధం చేయించి తీరుతుంది.

స్వభావజేన కౌంతేయ నిబద్ధః స్వేన కర్మణా |
కర్తుం నేచ్ఛసి యన్మోహాత్ కరిష్యస్యవశో௨పి తత్ ||            60

కౌంతేయా! అవివేకంవల్ల నీవు ఇష్టపడకపోయినా, స్వభావసిద్ధమైన స్వధర్మకర్మకు కట్టుబడి పరాధీనుడవై ఆ పని తప్పకుండా చేస్తావు.

ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశే௨ర్జున తిష్ఠతి |
భ్రామయన్‌సర్వభూతాని యంత్రారూఢాని మాయయా ||            61

అర్జునా! సర్వేశ్వరుడు సమస్తప్రాణుల హృదయాలలోనూ విలసిల్లుతూ, తన మాయతో సర్వభూతాలనూ కీలుబొమ్మలలాగ ఆడిస్తున్నాడు.

తమేవ శరణం గచ్ఛ సర్వభావేన భారత |
తత్ప్రసాదాత్పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతమ్ ||    62

అర్జునా! అన్నివిధాల ఆ ఈశ్వరుడినే శరణు వేడు. ఆయన దయవల్ల పరమశాంతినీ, శాశ్వతమైన మోక్షాన్నీ పొందుతావు.

ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాద్గుహ్యతరం మయా |
విమృశ్యైతదశేషేణ యథేచ్ఛసి తథా కురు ||                63

పరమరహస్యమైన జ్ఞానాన్ని నీకు చెప్పాను. బాగా ఆలోచించి నీకెలా తోస్తే అలా చెయ్యి.

సర్వగుహ్యతమం భూయః శృణు మే పరమం వచః |
ఇష్టో௨సి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితమ్ ||            64

నీ వంటే నాకెంతో ఇష్టం. అందువల్ల నీ మేలుకోరి పరమరహస్యమూ, సర్వోత్కృష్టమూ అయిన మరో మాట చెబుతాను విను.

మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు |
మామేవైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియో௨సి మే ||            65

నామీదే మనసు వుంచి, నాపట్ల భక్తితో నన్ను పూజించు; నాకు నమస్కరించు. నాకు ఇష్టుడవు కనుక ఇది నిజమని శపథం చేసి మరీ చెబుతున్నాను. నీవలా చేస్తే తప్పకుండా నన్ను చేరుతావు.

సర్వధర్మాన్‌పరిత్యజ్య మామేకం శరణం వ్రజ |
అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః ||        66

సర్వధర్మాలనూ విడిచిపెట్టి నన్నే ఆశ్రయించు. పాపాలన్నిటినుంచీ నీకు విముక్తి కలగజేస్తాను. విచారించకు.

ఇదం తే నాతపస్కాయ నాభక్తాయ కదాచన |
న చాశుశ్రూషవే వాచ్యం న చ మాం యో௨భ్యసూయతి ||            67

నీకు ఉపదేశించిన ఈ గీతాశాస్త్రాన్ని తపసు చేయనివాడికీ, భక్తి లేనివాడికీ, వినడానికి ఇష్టంలేనివాడికీ, నన్ను దూషించేవాడికీ ఎప్పుడూ చెప్పకూడదు.

య ఇమం పరమం గుహ్యం మద్భక్తేష్వభిధాస్యతి |
భక్తిం మయి పరాం కృత్వా మామేవైష్యత్యసంశయః ||        68

పరమరహస్యమైన ఈ గీతాశాస్త్రాన్ని నా భక్తులకు బోధించేవాడు నామీద పరమభక్తితో నన్ను చేరుతాడనడంలో సందేహం లేదు.

న చ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః |
భవితా న చ మే తస్మాత్, అన్యః ప్రియతరో భువి ||            69

అలాంటివాడికంటే నాకు బాగా ప్రీతి కలుగజేసేవాడు మనుషులలో మరొకడు లేడు. అతనికంటే నాకు ఎక్కువ మక్కువ కలిగినవాడు ఈ లోకంలో ఇక ఉండబోడు.

అధ్యేష్యతే చ య ఇమం ధర్మ్యం సంవాదమావయోః |
జ్ఞానయజ్ఞేన తేనాహమ్, ఇష్టః స్యామితి మే మతిః ||        70

మన వుభయులకీ మధ్య జరిగిన ఈ ధర్మసంవాదాన్ని చదివినవాడు జ్ఞానయజ్ఞంతో నన్ను ఆరాధిస్తున్నాడని నా వుద్దేశం.

శ్రద్ధావాననసూయశ్చ శృణుయాదపి యో నరః |
సో௨పి ముక్తః శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణామ్ ||71

ఈ గీతాశాస్త్రాన్ని శ్రద్ధతో అసూయలేకుండా ఆలకించేవాడు పాపాల నుంచి విముక్తి పొంది, పుణ్యాత్ములుండే శుభలోకాలను చేరుతాడు.

కచ్చిదేతచ్ఛ్రుతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా |
కచ్చిదజ్ఞానసమ్మోహః ప్రనష్టస్తే ధనంజయ ||            72

పార్థా! నిశ్చలమైన మనసుతో నీవు ఈ గీతాశాస్త్రాన్ని విన్నావు కదా! ధనంజయా! అవివేకంవల్ల కలిగిన నీ భ్రాంతి అంతా అంతరించిందా లేదా?

అర్జున ఉవాచ

నష్టో మోహః స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుత |
స్థితో௨స్మి గతసందేహః కరిష్యే వచనం తవ ||            73

అర్జునుడు: కృష్ణా! నీ దయవల్ల నా వ్యామోహం తొలగిపోయింది; జ్ఞానం కలిగింది. నా సందేహాలన్నీ తీరిపోయాయి. నీ ఆదేశాన్ని శిరసా వహించడానికి సిద్ధంగా వున్నాను.

సంజయ ఉవాచ

ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః |
సంవాదమిమమశ్రౌషమ్, అద్భుతం రోమహర్షణమ్ ||        74

సంజయుడు: శ్రీకృష్ణభగవానుడికి మహాత్ముడైన అర్జునుడికీ మధ్య ఇలా ఆశ్చర్యకరంగా, ఒళ్ళు పులకరించేటట్లుగా సాగిన సంవాదాన్ని విన్నాను.

వ్యాసప్రసాదాచ్ఛృతవాన్, ఏతద్గుహ్యమహం పరమ్ |
యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయతః స్వయమ్ ||    75

యోగేశ్వరుడైన శ్రీకృష్ణభగవానుడు స్వయంగా అర్జునుడికి అతిరహస్యమూ, సర్వోత్కృష్టమూ అయిన ఈ యోగశాస్త్రాన్ని చెబుతుండగా శ్రీ వేదవ్యాసమహర్షి కృపవల్ల నేను విన్నాను.

రాజన్ సంస్మృత్య సంస్మృత్య సంవాదమ్ ఇమమద్భుతమ్ |
కేశవార్జునయోః పుణ్యం హృష్యామి చ ముహుర్ముహుః ||        76

ధృతరాష్ట్ర మహారాజా! అద్భుతమూ, పుణ్యప్రదమూ అయిన కృష్ణార్జునుల ఈ సంవాదాన్ని పదే పదే స్మరించుకుంటూ సంతోషిస్తున్నాను.

తచ్చ సంస్మృత్య సంస్మృత్య రూపమత్యద్భుతం హరేః |
విస్మయో మే మహాన్ రాజన్ హృష్యామి చ పునఃపునః ||    77

ధృతరాష్ట్ర మహారాజా ! అత్యద్భుతమైన శ్రీకృష్ణభగానుడి విశ్వరూపాన్ని మళ్ళీ మళ్ళీ తలుచుకుంటూ మహాశ్చర్యం పొంది ఎంతో సంతోషిస్తున్నాను.

యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్థరః |
తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ ||            78

యోగేశ్వరుడైన శ్రీకృష్ణభగవానుడూ, ధనుస్సు ధరించిన అర్జునుడూ వుండేచోట సంపద, విజయం, ఐశ్వర్యం, నీతి నిలకడగా వుంటాయని నా విశ్వాసం.



ఇలా ఉపనిషత్తులు, బ్రహ్మవిద్య, యోగశాస్త్రం, శ్రీకృష్ణార్జున సంవాదం అయిన శ్రీమద్భగవద్గీతలోని " మోక్షసన్న్యాస యోగము" అనే పదునెనిమిదవ అధ్యాయం సమాప్తం.






భగవద్గీత-తాత్పర్యసహితం: పదునేడవ అధ్యాయము




శ్రీమద్భగవద్గీత

పదునేడవ అధ్యాయము

శ్రద్ధాత్రయ విభాగయోగము


అర్జున ఉవాచ

యే శాస్త్రవిధిముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః |
తేషాం నిష్ఠా తు కా కృష్ణ సత్త్వమాహో రజస్తమః ||        1

అర్జునుడు: కృష్ణా! శాస్త్రవిధులను విడిచిపెట్టినప్పటికీ శ్రద్ధతో పూజాదులు చేసేవాళ్ళ ప్రవృత్తి ఎలాంటిది?సాత్వికమా? రాజసమా? తామసమా?

శ్రీ భగవానువాచ

త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా |
సాత్త్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు ||            2

శ్రీ భగవానుడు: ప్రాణుల సహజసిద్ధమైనశ్రద్ధ సాత్వికమనీ, రాజసమనీ, తామసమనీ మూడువిధాలు. దానిని వివరిస్తాను విను.

సత్త్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత |
శ్రద్ధామయో௨యం పురుషో యో యచ్ఛ్రద్ధః స ఏవ   సః ||        3

అర్జునా! మానవులందరికీ వారివారి స్వభావాన్నిబట్టి శ్రద్ధ కలుగుతుంది. శ్రద్ధలేనివాడంటూ లేడు. ఎవడికి ఎలాంటి శ్రద్ధ వుంటుందో వాడు అలాంటివాడే అవుతాడు.

యజంతే సాత్త్వికా దేవాన్ యక్షరక్షాంసి రాజసాః |
ప్రేతాన్ భూతగణాంశ్చాన్యే యజన్తే తామసా జనాః ||        4

సాత్వికులు దేవతలనూ, రాజసులు యక్షరాక్షసులనూ, తామసులు భూతప్రేతాలనూ పూజిస్తారు.

అశాస్త్రవిహితం ఘోరం తప్యన్తే యే తపో జనాః |
దంభాహంకారసంయుక్తాః కామరాగబలాన్వితాః ||        5

కర్శయన్తః శరీరస్థం భూతగ్రామమచేతసః |
మాం చైవాన్తఃశరీరస్థం తాన్ విద్ధ్యాసురనిశ్చయాన్ ||    6

శాస్త్రవిరుద్ధంగా ఘోరతపస్సులు చేస్తూ అవివేకంతో తమ శరీరంలోని పంచభూతాలనే కాకుండా, అంతరాత్మగా వున్న నన్ను కూడా పీడించే ఆడంబరులూ, అహంకారులూ, కామబలగర్వితులూ, అసురస్వభావం కలిగినవాళ్ళని తెలుసుకో.

ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః |
యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు ||            7

అందరికీ ఇష్టమైన ఆహారం మూడు విధాలు. అలాగే యజ్ఞం, తపస్సు, దానం కూడా. వాటి తేడాలను తెలియజేస్తాను విను.

ఆయుఃసత్త్వబలారోగ్యసుఖప్రీతివివర్ధనాః |
రస్యాః స్నిగ్ధాః స్థిరా హృద్యాః ఆహారాః సాత్త్వికప్రియాః ||8

సాత్వికులకు ప్రీతికలిగించే ఆహారపదార్థాలు ఇవి: ఆయుర్దాయం, బుద్ధిబలం, శరీరబలం, ఆరోగ్యం, సుఖం, సంతోషం—వీటిని వృద్ధిచేస్తూ రసమూ, చమురూ కలిగి, చాలాకాలం ఆకలిని అణచిపెట్టి, మనసుకు ఆహ్లాదం కలగజేసేవి.

కట్వమ్లలవణాత్యుష్ణతీక్ష్ణరూక్షవిదాహినః |
ఆహారా రాజసస్యేష్టాః దుఃఖశోకామయప్రదాః ||        9

బాగా చేదు, పులుపు, ఉప్పు, వేడి, కారంకలిగి, చమురులేకుండా వెర్రిదాహం పుట్టించే ఆహారపదార్థాలంటే రాజసులకు ఇష్టం. ఇవి శరీరానికి బాధ, మనసుకు వ్యాకులత, వ్యాధులు కలగజేస్తాయి.

యాతయామం గతరసం పూతి పర్యుషితం చ యత్ |
ఉచ్ఛిష్టమపి చామేధ్యం భోజనం తామసప్రియమ్ ||        10

తామసులకు చల్లబడిపోయింది, సారంలేనిది, వాసనకొడుతున్నది, చలిది, ఎంగిలిది, అపవిత్రమైనది అయిన ఆహారమంటే ఇష్టం.

అఫలాకాంక్షిభిర్యజ్ఞో విధిదృష్టో య ఇజ్యతే |
యష్టవ్యమేవేతి మనః సమాధాయ స సాత్త్వికః ||            11

తమ కర్తవ్యంగా విశ్వసించి, ఫలాపేక్ష లేకుండా శాస్త్రసమ్మతంగా చేసే యజ్ఞాన్ని సాత్వికయజ్ఞమంటారు.

అభిసంధాయ తు ఫలం దంభార్థమపి చైవ యత్ |
ఇజ్యతే భరతశ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసమ్ ||            12

అర్జునా! ఫలాన్ని ఆశించికాని, ఆడంబరంకోసంకాని చేసే యజ్ఞం రాజసయజ్ఞమని గ్రహించు.

విధిహీనమసృష్టాన్నం మంత్రహీనమదక్షిణమ్ |
శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే ||            13

అశాస్త్రీయంగా అన్నదానం, మంత్రాలు, దక్షిణ లేకుండా అశ్రద్ధతో ఆచరించే యజ్ఞాన్ని తామసయజ్ఞమని చెబుతారు.

దేవద్విజగురుప్రాజ్ఞపూజనం శౌచమార్జవమ్ |
బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే ||                14

దేవతలను, బ్రాహ్మణులను, గురువులను, జ్ఞానులను పూజించడం, పవిత్రంగా వుండడం. కల్లాకపటం లేకుండా ప్రవర్తించడం, బ్రహ్మచర్యదీక్షనూ, అహింసావ్రతాన్నీ అవలంబించడం –వీటిని శరీరంతో చేసే తపస్సని చెబుతారు.

అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్ |
స్వాధ్యాయాభ్యసనం చైవ వాఙ్మయం తప ఉచ్యతే ||            15

ఇతరులకు బాధ కలిగించకుండా సత్యం, ప్రియం, హితమూ అయిన సంభాషణ సాగించడం, వేదాధ్యయనం చేయడం వాక్కుకు సంబంధించిన తపస్సు అంటారు.

మనః ప్రసాదః సౌమ్యత్వం మౌనమాత్మవినిగ్రహః |
భావసంశుద్ధిరిత్యేతత్ తపో మానసముచ్యతే ||                16

మనసును నిర్మలంగా వుంచుకోవడం, మౌనం వహించడం, శాంతస్వభావమూ, ఆత్మనిగ్రహమూ, అంతఃకరణశుద్ధీ కలిగివుండడం మనస్సుతో చేసే తపస్సు అవుతుంది.

శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్త్రివిధం నరైః |
అఫలాకాంక్షిభిర్యుక్తైః సాత్త్వికం పరిచక్షతే ||            17

నిర్మలమైన మనసు కలిగినవాళ్ళు పరమశ్రద్ధతో ఫలాపేక్ష లేకుండా మూడు విధాలైన ఈ తపస్సు చేస్తే అది సాత్వికమని చెబుతారు.

సత్కారమానపూజార్థం తపో దంభేన చైవ యత్ |
క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమధ్రువమ్ ||            18

సత్కారం, సన్మానం, పూజలు పొందడంకోసం ఆడంబరంగా ఆచరించే తపస్సు అస్థిరం, అనిశ్చితం. అలాంటిది రాజసమంటారు.

మూఢగ్రాహేణాత్మనో యత్పీడయా క్రియతే తపః |
పరస్యోత్సాదనార్థం వా తత్తామసముదాహృతమ్ ||            19

మొండిపట్టుదలతో తన శరీరానికి బాధ కలిగేటట్లుకాని, ఇతరులకు హాని తలపెట్టికాని చేసే తపస్సు తామసమవుతుంది.

దాతవ్యమితి యద్దానం దీయతే௨నుపకారిణే |
దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్త్వికం స్మృతమ్ ||        20

దానం చేయడం కర్తవ్యంగా భావించి, పుణ్యక్షేత్రాలలో పర్వదినాలలో యోగ్యతను గమనించి, ప్రత్యుపకారం చేయలేనివాళ్ళకు చేసేదానం సాత్వికం.

యత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః |
దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసం స్మృతమ్ ||        21

ప్రత్యుపకారం పొందాలనే వుద్దేశంతోకాని, ప్రతిఫలాన్ని ఆశించికాని, మనసులో బాధపడుతూకాని చేసేదానం రాజసం.

అదేశకాలే యద్దానం అపాత్రేభ్యశ్చ దీయతే |
అసత్కృతమవజ్ఞాతం తత్తామసముదాహృతమ్ ||            22

అనువుకానిచోట అకాలంలో అపాత్రుడికి అగౌరవంగా, అవమానకరంగా యిచ్చేదానం తామసం.

ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణస్త్రివిధః స్మృతః |
బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా ||            23

పరబ్రహ్మకు ఓమ్ తత్ సత్ అనే మూడు పేర్లు చెప్పారు. పూర్వం దానివల్లనే బ్రాహ్మణులు, వేదాలు, యజ్ఞాలు సృష్టించబడ్డాయి.

తస్మాదోమిత్యుదాహృత్య యజ్ఞదానతపఃక్రియాః |
ప్రవర్తంతే విధానోక్తాః సతతం బ్రహ్మవాదినామ్ ||        24

అందువల్లనే వేదవేత్తలు శాస్త్రోక్తంగాచేసే యజ్ఞాలు, దానాలు, తపస్సులను ఎప్పుడూ “ ఓమ్ ” అని చెప్పిన తరువాతే ఆరంభిస్తారు.

తదిత్యనభిసంధాయ ఫలం యజ్ఞతపఃక్రియాః |
దానక్రియాశ్చ వివిధాః క్రియన్తే మోక్షకాంక్షిభిః ||        25

మోక్షాన్ని కోరేవాళ్ళు ఫలాపేక్ష లేకుండా పలువిధాలైన యజ్ఞాలు, దానాలు, తపస్సులవంటి పుణ్యకార్యాలు తత్ అనే శబ్దాన్ని ఉచ్చరించిన అనంతరమే ఆచరిస్తారు.

సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ప్రయుజ్యతే |
ప్రశస్తే కర్మణి తథా సచ్ఛబ్దః పార్థ యుజ్యతే ||            26

పార్థా! ఉనికి, ఉత్తమం—ఈ రెండు అర్థాలలో సత్ అనే పదాన్ని వాడతారు. అలాగే శుభకార్యాలలో కూడా సత్ శబ్దాన్ని ఉపయోగిస్తారు.

యజ్ఞే తపసి దానే చ స్థితిః సదితి చోచ్యతే |
కర్మ చైవ తదర్థీయం సదిత్యేవాభిధీయతే ||                27

యజ్ఞం, తపస్సు, దానాలలోని నిష్ఠకు కూడా సత్ శబ్దం సంకేతం. ఈశ్వరుడి ప్రీతికిచేసే కర్మలన్నిటినీ సత్ అనే చెబుతారు.

అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చ యత్ |
అసదిత్యుచ్యతే పార్థ న చ తత్ప్రేత్య నో ఇహ ||                28

పార్థా! హోమం, దానం, తపస్సు, ఇతర కర్మలు—వీటిని అశ్రద్ధగా ఆచరిస్తే అసత్ అంటారు. వాటివల్ల ఇహలోకంలోకాని, పరలోకంలోకాని ఫలితమేమీ వుండదు.



ఇలా ఉపనిషత్తులు, బ్రహ్మవిద్య, యోగశాస్త్రం, శ్రీకృష్ణార్జున సంవాదం అయిన శ్రీమద్భగవద్గీతలోని " శ్రద్ధాత్రయ విభాగయోగము" అనే పదునేడవ అధ్యాయం సమాప్తం.





భగవద్గీత-తాత్పర్యసహితం: పదునారవ అధ్యాయము




శ్రీమద్భగవద్గీత

పదునారవ అధ్యాయము

దైవాసురసంపద్విభాగయోగము


శ్రీ భగవానువాచ

అభయం సత్త్వసంశుద్ధిః జ్ఞానయోగవ్యవస్థితిః |
దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవమ్ ||        1

అహింసా సత్యమక్రోధః త్యాగః శాన్తిరపైశునమ్ |
దయా భూతేష్వలోలుప్త్వం మార్దవం హ్రీరచాపలమ్ ||        2

తేజః క్షమా ధృతిః శౌచమ్ అద్రోహో నాతిమానితా |
భవన్తి సంపదం దైవీమ్ అభిజాతస్య భారత ||            3

శ్రీ భగవానుడు: అర్జునా! భయం లేకపోవడం, చిత్తశుద్ధి, జ్ఞానయోగనిష్ఠ, దానం, ఇంద్రియనిగ్రహం, యజ్ఞం, వేదపఠనం, తపస్సు, సరళస్వభావం, అహింస, సత్యం, కోపంలేకపోవడం, త్యాగబుద్ధి, శాంతి, చాడీలు చెప్పకపోవడం, భూతదయ, విషయసుఖాలు వాంఛించకపోవడం, మృదుత్వం, సిగ్గు, చపలత్వం లేకపోవడం, తేజస్సు, ఓర్పు, ధైర్యం, శుచిత్వం, ద్రోహం చేయకపోవడం, దురభిమానం లేకపోవడం- ఈ ఇరవై ఆరు సుగుణాలూ దేవతల సంపదవల్ల పుట్టినవాడికి కలుగుతాయి.

దంభో దర్పో௨భిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ |
అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీమ్ ||            4

పార్థా! రాక్షస సంపదలో పుట్టినవాడి లక్షణాలు ఇవి: కపటం, గర్వం, దురహంకారం, కోపం, కఠినత్వం, అవివేకం.

దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయాసురీ మతా |
మా శుచః సంపదం దైవీమ్ అభిజాతో௨సి పాండవ ||        5

దైవసంపద మూలంగా మోక్షమూ, అసుర సంపదవల్ల సంసారబంధమూ కలుగుతాయి. అర్జునా! నీవు దైవసంపదలోనే జన్మించావు. కనుక విచారించనక్కరలేదు.

ద్వౌ భూతసర్గౌ లోకే௨స్మిన్ దైవ ఆసుర ఏవ చ |
దైవో విస్తరశః ప్రోక్తః ఆసురం పార్థ మే శృణు ||        6

అర్జునా! ఈ లోకంలో ప్రాణుల సృష్టి దైవమనీ, ఆసురమనీ రెండురకాలు. దైవసంపద గురించి వివరంగా ఇదివరకే చెప్పాను. ఇక ఆసుర సంపద గురించి విను.

ప్రవృత్తిం చ నివృత్తిం చ జనా న విదురాసురాః |
న శౌచం నాపి చాచారో న సత్యం తేషు విద్యతే ||            7

అసురస్వభావం కలిగినవాళ్ళకు చేయదగ్గదేదో, చేయకూడనిదేదో తెలియదు. వాళ్ళలో శుచిత్వం, సదాచారం, సత్యం కనుపించవు.

అసత్యమప్రతిష్ఠం తే జగదాహురనీశ్వరమ్ |
అపరస్పరసంభూతం కిమన్యత్కామహైతుకమ్ ||            8

ఈ జగత్తు అసత్యమనీ, ఆధారమూ, అధిపతీ లేనిదనీ, కామవశంలో స్త్రీ పురుషుల కలయిక తప్ప సృష్టికి మరోకారణం లేదనీ వాళ్ళు వాదిస్తారు.

ఏతాం దృష్టిమవష్టభ్య నష్టాత్మానో௨ల్పబుద్ధయః |
ప్రభవన్త్యుగ్రకర్మాణః క్షయాయ జగతో௨హితాః ||        9

అలాంటి నాస్తికులు –ఆత్మను కోల్పోయిన అల్పబుద్ధులు –ఘోరకృత్యాలుచేసే లోకకంటకులు, ప్రపంచ వినాశానికి పుడతారు.

కామమాశ్రిత్య దుష్పూరం దంభమానమదాన్వితాః |
మోహాద్గృహీత్వాసద్గ్రాహాన్ ప్రవర్తంతే௨శుచివ్రతాః ||        10

వాళ్ళు అంతూదరీలేని కోరికలతో, ఆడంబరం, గర్వం, దురభిమానమనే దుర్గుణాలతో, అవివేకంవల్ల దుష్టభావాలతో దురాచారులై తిరుగుతారు.

చింతామపరిమేయాం చ ప్రలయాన్తాముపాశ్రితాః |
కామోపభోగపరమాః ఏతావదితి నిశ్చితాః ||                11

ఆశాపాశశతైర్బద్ధాః కామక్రోధపరాయణాః |
ఈహన్తే కామభోగార్థమ్ అన్యాయేనార్థసంచయాన్ ||        12

వాళ్ళు మృతిచెందేవరకూ వుండే మితిలేని చింతలతో కామభోగాలను అనుభవించడమే పరమావధిగా భావించి, అంతకు మించిందేదీ లేదని నమ్ముతారు. ఎన్నో ఆశాపాశాలలో చిక్కుకుని కామక్రోధాలకు వశులై విషయసుఖాలను అనుభవించడంకోసం అక్రమ ధనార్జనకు పూనుకుంటారు.

ఇదమద్య మయా లబ్ధమ్ ఇమం ప్రాప్స్యే మనోరథమ్ |
ఇదమస్తీదమపి మే భవిష్యతి పునర్ధనమ్ ||                13

అసౌ మయా హతః శత్రుః హనిష్యే చాపరానపి |
ఈశ్వరో௨హమహం భోగీ సిద్ధో௨హం బలవాన్ సుఖీ ||        14

ఆఢ్యో௨భిజనవానస్మి కో௨న్యో௨స్తి సదృశో మయా |
యక్ష్యే దాస్యామి మోదిష్యే ఇత్యజ్ఞానవిమోహితాః ||            15

అనేకచిత్తవిభ్రాంతాః మోహజాలసమావృతాః |
ప్రసక్తాః కామభోగేషు పతంతి నరకే௨శుచౌ ||            16

“ ఈవేళ నా కిది లభించింది. ఇక ఈ కోరిక నెరవేరుతుంది. నా కింత ఆస్తి వున్నది. మరింత సంపాదించబోతున్నాను. ఈ శత్రువును చంపేశాను. మిగిలిన శత్రువులను కూడ సంహరిస్తాను. నేను ప్రభువును, సుఖభోగిని, తలపెట్టినపని సాధించే సమర్థుణ్ణి, బలవంతుణ్ణి సుఖవంతుణ్ణి. నేను డబ్బున్న వాణ్ణి. ఉన్నత వంశంలో ఉద్భవించాను. నాకు సాటి అయిన వాడెవడూ లేడు. నేను యజ్ఞాలు చేస్తాను, దానాలిస్తాను, ఆనందం అనుభవిస్తాను.” అని వాళ్ళు అజ్ఞానంలో అనేకవిధాల కలవరిస్తారు. మోహవశులైన ఆ అసురస్వభావం కలిగినవాళ్ళు నిరంతరం కామభోగాలలోనే చిక్కుకుని చివరకు ఘోరనరకాల పాలవుతారు.

ఆత్మసంభావితాః స్తబ్ధా ధనమానమదాన్వితాః |
యజన్తే నామయజ్ఞైస్తే దంభేనావిధిపూర్వకమ్ ||            17

తమను తామే పొగడుకుంటూ, వినయ విధేయతలు లేకుండా, ధనమద గర్వంతో వాళ్ళు శాస్త్రవిరుద్ధంగా పేరుకు మాత్రం యజ్ఞాలు చేస్తారు.

అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితాః |
మామాత్మపరదేహేషు ప్రద్విషన్తో௨భ్యసూయకాః ||        18

అహంకారం, బలం, గర్వం, కామం, క్రోధం –వీటిని ఆశ్రయించి అసూయాపరులైన వీళ్ళు తమ శరీరంలోనూ, ఇతరుల శరీరాలలోనూ వుంటున్న నన్ను ద్వేషిస్తారు.

తానహం ద్విషతః క్రూరాన్ సంసారేషు నరాధమాన్ |
క్షిపామ్యజస్రమశుభాన్ ఆసురీష్వేవ యోనిషు ||            19

ద్వేషపూరితులు, పాపచరితులు, క్రూరస్వభావులు అయిన అలాంటి మానవాధములను మళ్ళీ మళ్ళీ సంసారంలోనే పడవేస్తుంటాను.

ఆసురీం యోనిమాపన్నాః మూఢా జన్మని జన్మని |
మామప్రాప్యైవ కౌంతేయ తతో యాంత్యధమాం గతిమ్ ||        20

కౌంతేయా! అసురజన్మ పొందే అలాంటి మూర్ఖులు ఏ జన్మలోనూ నన్ను చేరలేకపోవడమే కాకుండా అంతకంతకీ అధోగతి పాలవుతారు.

త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః |
కామః క్రోధస్తథా లోభః తస్మాదేతత్త్రయం త్యజేత్ ||        21

కామం, క్రోధం, లోభం –ఈ నరక ద్వారాలు మూడూ ఆత్మవినాశానికి కారణాలు. అందువల్ల ఈ మూడింటినీ విడిచిపెట్టాలి.

ఏతైర్విముక్తః కౌంతేయ తమోద్వారైఃత్రిభిర్నరః |
ఆచరత్యాత్మనః శ్రేయః తతో యాతి  పరాం గతిమ్ ||        22

కౌంతేయా! ఈ మూడు దుర్గుణాలనూ విసర్జించినవాడు తనకు తాను మేలు చేసుకుని పరమపదం పొందుతాడు.

యః శాస్త్రవిధిముత్సృజ్య వర్తతే కామకారతః |
న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాం గతిమ్ ||            23

శాస్త్రవిధులను విడిచిపెట్టి తన ఇష్టానుసారం ప్రవర్తించేవాడు తత్వజ్ఞానంకాని, సుఖంకాని, మోక్షంకాని పొందడు.

తస్మాచ్ఛాస్త్రం ప్రమాణం తే కార్యాకార్యవ్యవస్థితౌ |
జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం కర్మ కర్తుమిహార్హసి ||            24

అందువల్ల చేయదగ్గదేదో, చేయకూడనిదేదో నిర్ణయించుకోవడంలో నీకు శాస్త్రమే ప్రమాణం. శాస్త్రవిధానాలను తెలుసుకుని తదనుగుణంగా ఈ లోకంలో నీవు కర్మలు చేయాలి.



ఇలా ఉపనిషత్తులు, బ్రహ్మవిద్య, యోగశాస్త్రం, శ్రీకృష్ణార్జున సంవాదం అయిన శ్రీమద్భగవద్గీతలోని "దైవాసురసంపద్విభాగయోగము" అనే పదునారవ అధ్యాయం సమాప్తం.




భగవద్గీత-తాత్పర్యసహితం: పదునైదవ అధ్యాయము





శ్రీమద్భగవద్గీత

పదునైదవ అధ్యాయము

పురుషోత్తమప్రాప్తియోగము

శ్రీ భగవానువాచ

ఊర్ధ్వమూలమధశ్శాఖమ్ అశ్వత్థం ప్రాహురవ్యయమ్ |
ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్ ||            1

శ్రీ భగవానుడు: వేదాలు ఆకులుగా వేళ్ళు పైకి, కొమ్మలు క్రిందకి వుండే సంసారమనే అశ్వత్థవృక్షం (రావి చెట్టు) నాశం లేనిదని చెబుతారు. ఇది తెలుసుకున్నవాడే వేదార్థం ఎరిగినవాడు.

అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖాః
గుణప్రవృద్ధా విషయప్రవాళాః |
అధశ్చ మూలాన్యనుసంతతాని
కర్మానుబంధీని మనుష్యలోకే ||                    2

ఈ సంసారవృక్షం కొమ్మలు గుణాలవల్ల పెంపొందుతూ విషయసుఖాలే చిగుళ్ళుగా క్రిందకీ మీదకీ విస్తరిస్తాయి. మానవలోకంలో ధర్మాధర్మ కర్మబంధాలవల్ల దానివేళ్ళు దట్టంగా క్రిందకి కూడా వ్యాపిస్తాయి.

న రూపమస్యేహ తథోపలభ్యతే
నాంతో న చాదిర్న చ సంప్రతిష్ఠా |
అశ్వత్థమేనం సువిరూఢమూలమ్
అసంగశస్త్రేణ దృఢేన ఛిత్త్వా ||                        3

తతః పదం తత్పరిమార్గితవ్యం
యస్మిన్‌గతా న నివర్తంతి భూయః |
తమేవ చాద్యం పురుషం ప్రపద్యే
యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణీ ||                    4

ఈ సంసారవృక్షం స్వరూపంకాని, ఆదిమధ్యాంతాలుకాని ఈ లోకంలో ఎవరికీ తెలియవు. లోతుగా నాటుకున్న వేళ్ళతో విలసిల్లుతున్న ఈ అశ్వత్థ వృక్షాన్ని వైరాగ్యమనే ఖడ్గంతో ఖండించివేశాక, పునర్జన్మ లేకుండా చేసే పరమపదాన్ని వెదకాలి. ఆనాదిగా ఈ సంసారవృక్షం విస్తరించడానికి కారకుడైన ఆదిపురుషుణ్ణి – పరమాత్మను శరణుపొందాలి.

నిర్మానమోహా జితసంగదోషా
అధ్యాత్మనిత్యా వినివృత్తకామాః |
ద్వంద్వైర్విముక్తాః సుఖదుఃఖసంజ్ఞైః
గచ్ఛంత్యమూఢాః పదమవ్యయం తత్ ||                5

అభిమానం, అవివేకం లేకుండా, అనురాగదోషాన్ని జయించి, ఆత్మజ్ఞానతత్పరులై, కోరికలన్నిటినీ విడిచిపెట్టి, సుఖదుఃఖాది ద్వంద్వాలకు అతీతులైన జ్ఞానులు శాశ్వతమైన ఆ బ్రహ్మపదాన్ని పొందుతారు.

న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః |
యద్గత్వా న నివర్తంతే తద్దామ పరమం మమ ||            6

దాన్ని సూర్యుడుకాని, చంద్రుడుకాని, అగ్నికాని ప్రకాశింపచేయ లేరు. దేనిని పొందితే మళ్ళీ సంసారానికి రానక్కరలేదో అలాంటి పరంధామం నాది.

మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః |
మనఃషష్ఠానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి ||            7

నాలోని శాశ్వతమైన ఒక అంశమే మానవలోకంలో జీవాత్మగా పరిణమించి ప్రకృతిలోని జ్ఞానేంద్రియాలనూ, మనస్సునూ ఆకర్షిస్తుంది.

శరీరం యదవాప్నోతి యచ్ఛాప్యుత్క్రామతీశ్వరః |
గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధానివాశయాత్ ||            8

వాయువు పువ్వులనుంచి వాసనలను తీసుకుపోయేటట్లుగా జీవుడు శరీరాన్ని ధరించేటప్పుడూ, విడిచిపెట్టేటప్పుడూ ఇంద్రియాలనూ, మనస్సునూ వెంటబెట్టుకు పోతాడు.

శ్రోత్రం చక్షుః స్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ |
అధిష్ఠాయ మనశ్చాయం విషయానుపసేవతే ||                9

ఈ జీవుడు చెవి, కన్ను, చర్మం, నాలుక, ముక్కు అనే ఐదు జ్ఞానేంద్రియాలనూ, మనస్సునూ ఆశ్రయించి శబ్దాది విషయాలను అనుభవిస్తాడు.

ఉత్క్రామంతం స్థితం వాపి భుఞ్జానం వా గుణాన్వితమ్ |
విమూఢా నానుపశ్యన్తి పశ్యన్తి జ్ఞానచక్షుషః ||        10

మరో శరీరాన్ని పొందుతున్నప్పుడూ, శరీరంలో వున్నప్పుడూ, విషయాలను అనుభవిస్తున్నప్పుడూ, గుణాలతోకూడి వున్నప్పుడూ కూడా ఈ జీవాత్మను మూఢులు చూడలేరు. జ్ఞానదృష్టి కలిగినవాళ్ళు మాత్రమే చూడగలుగుతారు.

యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితమ్ |
యతంతో௨ప్యకృతాత్మనో నైనం పశ్యంత్యచేతసః ||            11

ప్రయత్నం సాగించే యోగులు తమలోని పరమాత్మను దర్శిస్తారు. ఆత్మసంస్కారంలేని అవివేకులు ప్రయత్నించినా ఈ జీవాత్మను తిలకించలేరు.

యదాదిత్యగతం తేజో జగద్భాసయతే௨ఖిలమ్ |
యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకమ్ ||            12

సూర్యుడిలో వుండి జగత్తునంతటినీ ప్రకాశింపచేసే తేజస్సూ, చంద్రుడిలో, అగ్నిలోవుండే తేజస్సూ నాదే అని తెలుసుకో.

గామావిశ్య చ భుతాని ధారయామ్యహమోజసా |
పుష్ణామి చౌషదీః సర్వాః సోమో భూత్వా రసాత్మకః ||    13

నేను భూమిలో ప్రవేశించి నా ప్రభావంతో సర్వభూతాలనూ ధరిస్తున్నాను. అమృతమయుడైన చంద్రుడిగా సమస్త సస్యాలనూ పోషిస్తున్నాను.

అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః |
ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్ ||        14

“ వైశ్వానరుడు”  అనే జఠరాగ్నిరూపంతో సకలప్రాణుల శరీరాలలోనూ వుండి ప్రాణాపానవాయువులతో కలసి, నాలుగు రకాల ఆహారాలను జీర్ణం చేస్తున్నాను.

సర్వస్య చాహం హృది సన్నివిష్టో
మత్తః స్మృతిర్ జ్ఞానమపోహనం చ |
వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో
వేదాన్తకృద్వేదవిదేవ చాహమ్ ||                    15

సర్వప్రాణుల హృదయాలలో వున్న నా వల్లనే జ్ఞాపకం, జ్ఞానం, మరపు కలుగుతాయి. వేదాలన్నిటివల్ల తెలుసుకోవలసిన వాణ్ణి నేనే. వేదాంతాలకు కర్తనూ, వేదాలను ఎరిగినవాణ్ణీ నేనే.

ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ |
క్షరః సర్వాణి భుతాని కూటస్థో௨క్షర ఉచ్యతే ||            16

ఈ లోకంలో క్షరుడనీ, అక్షరుడనీ ఇద్దరు పురుషులున్నారు. నశించే సమస్తప్రాణుల సముదాయాన్ని క్షరుడనీ మార్పులేని జీవుణ్ణి అక్షరుడనీ అంటారు.

ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః |
యో లోకత్రయమావిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వరః ||                17

ఈ వుభయులకంటే ఉత్తముడు నాశనంలేని ఈశ్వరుడిగా మూడు లోకాలలోనూ వ్యాపించి, వాటిని పాలిస్తున్న పరమాత్మ.

యస్మాత్ క్షరమతీతో௨హమక్షరాదపి చోత్తమః |
అతో௨స్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః ||            18

నేను క్షరుడిని మించినవాడినీ, అక్షరుడికంటే ఉత్తముడినీ కావడం వల్ల లోకంలోనూ, వేదాలలోనూ పురుషోత్తముడిగా ప్రసిద్ధి పొందాను.

యో మామేవమసమ్మూఢో జానాతి పురుషోత్తమమ్ |
స సర్వవిద్భజతి మాం సర్వభావేన భారత ||                19

అర్జునా! అజ్ఞానం లేకుండా అలా నన్ను పురుషోత్తముడిగా తెలుసుకునేవాడు సర్వజ్ఞుడై అన్నివిధాల నన్నే ఆరాధిస్తాడు.

ఇతి గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయానఘ |
ఏతద్‌బుద్ధ్వా బుద్ధిమాన్‌స్యాత్ కృతకృత్యశ్చ భారత ||        20

అర్జునా! అతిరహస్యమైన ఈ శాస్త్రాన్ని నీకు చెప్పాను. దీన్ని బాగా తెలుసుకున్నవాడు బుద్ధిమంతుడూ, కృతార్థుడూ అవుతాడు.


ఇలా ఉపనిషత్తులు, బ్రహ్మవిద్య, యోగశాస్త్రం, శ్రీకృష్ణార్జున సంవాదం అయిన శ్రీమద్భగవద్గీతలోని "పురుషోత్తమప్రాప్తియోగము" అనే పదునైదవ అధ్యాయం సమాప్తం.






భగవద్గీత-తాత్పర్యసహితం: పదునాల్గవ అధ్యాయం

శ్రీమద్భగవద్గీత

పదునాల్గవ అధ్యాయం

గుణత్రయవిభాగయోగం

శ్రీ భగవానువాచ

పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమమ్ |
యద్‌జ్ఞాత్వా మునయస్సర్వే పరాం సిద్ధిమితో గతాః ||        1

శ్రీ భగవానుడు: జ్ఞానాలన్నిటిలోకీ ఉత్తమం, ఉత్కృష్టమైన జ్ఞానాన్ని నీకు మళ్ళీ చెబుతాను విను. ఈ జ్ఞానాన్ని తెలుసుకున్న మునులంతా సంసారవ్యథల నుంచి, బాధలనుంచి తప్పించుకుని మోక్షం పొందారు.

ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః |
సర్గే௨పి నోపజాయంతే ప్రలయే న వ్యథంతి చ ||                2

ఈ జ్ఞానాన్ని ఆశ్రయించి నా స్వరూపం పొందిన వాళ్ళు సృష్టిసమయంలో పుట్టరు; ప్రళయకాలంలో చావరు.

మమ యోనిర్మహద్బ్రహ్మ తస్మిన్‌గర్భం దధామ్యహమ్ |
సంభవః సర్వభూతానాం తతో భవతి భారత ||            3

అర్జునా! మూలప్రకృతి నాకు గర్బాదానస్థానం. అందులో నేను సృష్టి బీజాన్ని ఉంచుతున్నందువల్ల సమస్త ప్రాణులూ పుడుతున్నాయి.

సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యాః |
తాసాం బ్రహ్మమహద్యోనిః అహం బీజప్రదః పితా ||        4

కౌంతేయా ! అన్ని జాతులలోనూ ఆవిర్భవిస్తున్న శరీరాలన్నింటికీ మూలప్రకృతే తల్లి. నేను బీజాన్ని ఇచ్చే తండ్రిని.

సత్త్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతిసంభవాః |
నిబద్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయమ్ ||            5

అర్జునా! ప్రకృతి వల్ల పుట్టిన సత్వం, రజస్సు, తమస్సు అనే మూడు గుణాలు శాశ్వతమైన ఆత్మను శరీరంలో బంధిస్తున్నాయి.

తత్ర సత్త్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయమ్ |
సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చానఘ ||            6

అర్జునా! వాటిలో సత్వగుణం నిర్మలమైనది కావడం వల్ల కాంతి, ఆరోగ్యం కలగజేస్తుంది. అది సుఖం మీద, జ్ఞానం మీద ఆసక్తి కలగజేసి ఆత్మను బంధిస్తుంది.

రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసంగసముద్భవమ్ |
తన్నిబధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినమ్ ||            7

కౌంతేయా ! రాగస్వరూపం కలిగిన రజోగుణం ఆశకు, ఆసక్తికి మూలమని తెలుసుకో. కర్మలమీద ఆసక్తి కలిగించి అది ఆత్మను బంధిస్తుంది.

తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినామ్ |
ప్రమాదాలస్యనిద్రాభిః తన్నిబధ్నాతి భారత ||            8

అర్జునా! అజ్ఞానం వల్ల జనించే తమోగుణం ప్రాణులన్నింటికీ అవివేకం కలగజేస్తుందని తెలుసుకో. అది పరాకు, బద్దకం, నిద్రలలో ఆత్మను శరీరంలో బంధిస్తుంది.

సత్త్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత |
జ్ఞానమావృత్య తు తమః ప్రమాదే సంజయత్యుత ||            9

అర్జునా! సత్వగుణం సుఖం చేకూరుస్తుంది; రజోగుణం కర్మలలో చేరుస్తుంది. తమోగుణం జ్ఞానాన్ని మరుగుపరచి ప్రమాదం కలగజేస్తుంది.

రజస్తమశ్చాభిభూయ సత్త్వం భవతి భారత |
రజఃసత్త్వం తమశ్చైవ తమః సత్త్వం రజస్తథా ||            10

అర్జునా! రజోగుణాన్నీ, తమోగుణాన్నీ అణచివేసి సత్వగుణం అభివృద్ధి చెందుతుంది. అలాగే సత్వతమోగుణాలను అణచివేసి రజోగుణమూ సత్వరజోగుణాలను అణగద్రొక్కి తమోగుణమూ వర్ధిల్లుతాయి.

సర్వద్వారేషు దేహే௨స్మిన్ ప్రకాశ ఉపజాయతే |
జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్త్వమిత్యుత ||            11

ఈ శరీరంలోని ఇంద్రియాలన్నిటినుంచీ ప్రకాశించే జ్ఞానం ప్రసరించినప్పుడు సత్వగుణం బాగా వృద్ధిపొందిందని తెలుసుకోవాలి.

లోభః ప్రవృత్తిరారంభః కర్మణామశమః స్పృహా |
రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ ||                12

అర్జునా! రజోగుణం అభివృద్ధి చెందుతున్నప్పుడు లోభం, కర్మలపట్ల ఆసక్తి, అశాంతి, ఆశ అనే లక్షణాలు కలుగుతుంటాయి.

అప్రకాశో௨ప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ |
తమస్యేతాని జాయంతే వివృద్ధే కురునందన ||                13

కురునందనా! బుద్ధిమాంద్యం, బద్దకం, అలక్ష్యం, అజ్ఞానం- ఈ దుర్లక్షణాలు తమోగుణ విజృంభణకు తార్కాణాలు.

యదా సత్త్వే ప్రవృద్ధే తు ప్రలయం యాతి దేహభృత్ |
తదోత్తమవిదాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే ||            14

సత్వగుణం ప్రవృద్ధిచెందిన సమయంలో మరణించినవాడు ఉత్తమజ్ఞానులు పొందే పుణ్యలోకాలు పొందుతాడు.

రజసి ప్రలయం గత్వా కర్మసంగిషు జాయతే |
తథా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే ||                15

రజోగుణం ప్రబలంగా ఉన్న దశలో మృతిచెందితే కర్మలమీద ఆసక్తి కలవాళ్ళకు జన్మిస్తాడు. అలాగే తమోగుణవృద్ధిలో తనువు చాలించినవాడు పామరులకు, పశుపక్ష్యాదులకు పుడతాడు.

కర్మణః సుకృతస్యాహుః సాత్త్వికం నిర్మలం ఫలమ్ |
రజసస్తు ఫలం దుఃఖమ్ అజ్ఞానం తమసః ఫలమ్ ||        16

సత్వగుణ సంబంధమైన సత్కార్యాల ఫలితంగా నిర్మలసుఖమూ, రాజసకర్మల మూలంగా దుఃఖం, తామస కర్మలవల్ల అజ్ఞానం కలుగుతాయని చెబుతారు.

సత్త్వాత్ సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ |
ప్రమాదమోహౌ తమసో భవతో௨జ్ఞానమేవ చ ||            17

సత్వగుణంవల్ల జ్ఞానం, రజోగుణంవల్ల లోభం, తమోగుణంవల్ల అజాగ్రత్త, మోహం, అజ్ఞానం సంభవిస్తాయి.

ఊర్ధ్వం గచ్ఛంతి సత్త్వస్థాః మధ్యే తిష్ఠంతి రాజసాః |
జఘన్యగుణవృత్తిస్థాః అధో గచ్ఛంతి తామసాః ||            18

సత్వగుణ సంపన్నులకు ఉత్తమలోకాలు సంప్రాప్తిస్తాయి. రజోగుణం ప్రధానంగా వున్నవాళ్ళు మానవలోకాన్నే పొందుతుండగా తమోగుణం కలిగినవాళ్ళు నరకలోకానికి పోతుంటారు.

నాన్యం గుణేభ్యః కర్తారం యదా ద్రష్టానుపశ్యతి |
గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సో௨ధిగచ్ఛతి ||            19

కర్మలన్నిటికీ గుణాలను తప్ప మరోదానిని కర్తగా భావించకుండా, గుణాలకు అతీతమైన పరమాత్మ తత్వాన్ని గ్రహించిన వివేకి మోక్షం పొందుతాడు.

గుణానేతానతీత్య త్రీన్ దేహీ దేహసముద్భవాన్ |
జన్మమృత్యుజరాదుఃఖైః విముక్తో௨మృతమశ్నుతే ||            20

శరీరం కారణంగా కలిగిన ఈ మూడు గుణాలను అధిగమించినవాడు పుట్టుక, చావు, ముసలితనం, దుఃఖాలనుంచి విముక్తుడై అమృతపదం పొందుతాడు.

అర్జున ఉవాచ

కైర్లింగైః త్రీన్ గుణానేతాన్ అతీతో భవతి ప్రభో |
కిమాచారః కథం చైతాన్ త్రీన్ గుణానతివర్తతే ||        21

అర్జునుడు: ప్రభూ! ఈ మూడు గుణాలనూ దాటినవాడి లక్షణాలేమిటి? అతని ప్రవర్తన ఎలా ఉంటుంది? ఈ గుణాలను ఎలా అతను అతిక్రమించగలుగుతాడు?

శ్రీ భగవానువాచ

ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవ చ పాండవ |
న ద్వేష్టి సంప్రవృత్తాని న నివృత్తాని కాంక్షతి ||            22

ఉదాసీనవదాసీనో గుణైర్యో న విచాల్యతే |
గుణా వర్తంత ఇత్యేవ యో௨వతిష్ఠతి నేఙ్గతే ||            23

సమదుఃఖసుఖః స్వస్థః సమలోష్టాశ్మకాంచనః |
తుల్యప్రియాప్రియో ధీరః తుల్యనిందాత్మసంస్తుతిః ||            24

మానావమానయోస్తుల్యః తుల్యో మిత్రారిపక్షయోః |
సర్వారంభపరిత్యాగీ గుణాతీతః స ఉచ్యతే ||                25

శ్రీ భగవానుడు: అర్జునా! గుణాతీతుడి గుర్తులివి: తనకు సంప్రాప్తించిన సత్వగుణసంబంధమైన సౌఖ్యాన్ని కాని, రజోగుణధర్మమైన కర్మప్రవృత్తిని కాని, తమోగుణ లక్షణమైన మోహాన్ని కాని ద్వేషించడు; అవి లేకుండా పోతే వాటిని ఆకాంక్షించడు. ఏమీ సంబంధం లేని వాడిలాగా వుండి గుణాలవల్ల చలించకుండా, సర్వకార్యాలలోనూ ప్రకృతిగుణాలే ప్రవర్తిస్తున్నాయని గ్రహించి, ఎలాంటి పరిస్థితులలోనూ తన నిశ్చలబుద్ధిని విడిచి పెట్టడు. సుఖదుఃఖాలు, మట్టిబెడ్డ, రాయి, బంగారం, ఇష్టానిష్టాలు, దూషణభూషణలు, మానావమానాలు, శత్రుమిత్రులను సమానదృష్టితో చూస్తూ కామ్యకర్మలన్నిటినీ విడిచిపెట్టి నిరంతరం ఆత్మావలోకనంలో నిమగ్నమై వుండే ధీరుడు.

మాం చ యో௨వ్యభిచారేణ భక్తియోగేన సేవతే |
స గుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే ||        26

అచంచలభక్తితో నన్ను సేవించేవాడు ఈ మూడుగుణాలనూ అధిగమించి ముక్తి పొందడానికి అర్హుడవుతాడు.

బ్రహ్మణో హి ప్రతిష్ఠాహమ్ అమృతస్యావ్యయస్య చ |
శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ ||            27

ఎందువల్లనంటే వినాశరహితం, వికారరహితం, శాశ్వత ధర్మ స్వరూపం, అఖండసుఖరూపమూ అయిన బ్రహ్మానికి నిలయాన్ని నేనే.


ఇలా ఉపనిషత్తులు, బ్రహ్మవిద్య, యోగశాస్త్రం, శ్రీకృష్ణార్జున సంవాదం అయిన శ్రీమద్భగవద్గీతలోని " గుణత్రయవిభాగయోగం" అనే పదునాల్గవ అధ్యాయం సమాప్తం.




భగవద్గీత-తాత్పర్యసహితం: పదమూడవ అధ్యాయం

శ్రీమద్భగవద్గీత

పదమూడవ అధ్యాయం

క్షేత్రక్షేత్రజ్ఞవిభాగయోగం

అర్జున ఉవాచ

ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ |
ఏతద్వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ ||            1

అర్జునుడు: కేశవా! ప్రకృతి, పురుషుడు, క్షేత్రం, క్షేత్రజ్ఞుడు, జ్ఞానం, జ్ఞేయం వీటన్నిటి గురించి తెలుసుకోవాలని నా అభిలాష.

శ్రీ భగవానువాచ

ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే |
ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః ||            2

శ్రీభగవానుడు: కౌంతేయా! ఈ శరీరమే క్షేత్రమనీ, దీనిని తెలుసుకుంటున్నవాడే క్షేత్రజ్ఞుడనీ క్షేత్రక్షేత్రజ్ఞుల తత్వం తెలిసినవాళ్ళు చెబుతారు.

క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత |
క్షేత్రక్షేత్రజ్ఞయోః జ్ఞానం యత్తద్ జ్ఞానం మతం మమ ||    3

ఆర్జునా! క్షేత్రాలన్నింటిలోనూ ఉన్న క్షేత్రజ్ఞుణ్ణి నేనే అని తెలుసుకో. క్షేత్రానికి క్షేత్రజ్ఞునికి సంబంధించిన జ్ఞానమే సరైన జ్ఞానమని నా ఉద్దేశం.

తత్‌క్షేత్రం యచ్చ యాదృక్చ యద్వికారి యతశ్చ యత్ |
స చ యో యత్ప్రభావశ్చ తత్సమాసేన మే శృణు ||                4

ఆ క్షేత్రం ఆకారవికారాలు, పుట్టుపూర్వోత్తరాలగురించీ క్షేత్రజ్ఞుడి స్వరూప స్వభావ ప్రభావాల గురించీ క్లుప్తంగా చెబుతాను విను.

ఋషిభిర్బహుధా గీతం ఛందోభిర్వివిధైః పృథక్ |
బ్రహ్మసూత్రపదైశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితైః ||            5

ఋషులు ఎన్నో విధాలుగా ఈ క్షేత్ర క్షేత్రజ్ఞుల తత్త్వాన్ని చాటిచెప్పారు. వేరువేరుగా వేదాలూ, సహేతుకంగా, సందేహరహితంగా సవివరంగా బ్రహ్మసూత్రాలూ ఈ స్వరూపాన్ని నిరూపించాయి.

మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ |
ఇంద్రియాణి దశైకం చ పంచ చేంద్రియగోచరాః ||            6

ఇచ్ఛా ద్వేషః సుఖం దుఃఖం సంఘాతశ్చేతనా ధృతిః |
ఏతత్ క్షేత్రం సమాసేన సవికారముదాహృతమ్ ||            7

పంచమహాభూతాలు, అహంకారం, బుద్ధి, మూలప్రకృతి, పది ఇంద్రియాలు, మనస్సు, ఐదు ఇంద్రియ విషయాలు, కోరిక, ద్వేషం, సుఖం, దుఃఖం, దేహేంద్రియాల సమూహం, తెలివి, ధైర్యం-వికారాలతోపాటు వీటి సముదాయాన్ని సంగ్రహంగా క్షేత్రమని చెబుతారు.

అమానిత్వమదంభిత్వమ్ అహింసా క్షాంతిరార్జవమ్ |
ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మవినిగ్రహః ||            8

ఇంద్రియార్థేషు వైరాగ్యమ్ అనహంకార ఏవ చ |
జన్మమృత్యుజరావ్యాధిదుఃఖదోషానుదర్శనమ్ ||            9

అసక్తిరనభిష్వంగః పుత్రదారగృహాదిషు |
నిత్యం చ సమచిత్తత్వమ్ ఇష్టానిష్టోపపత్తిషు ||            10

మయి చానన్యయోగేన భక్తిరవ్యభిచారిణీ |
వివిక్తదేశసేవిత్వమ్ అరతిర్జనసంసది ||                    11

అధ్యాత్మజ్ఞాననిత్యత్వం తత్త్వజ్ఞానార్థదర్శనమ్ |
ఏతద్‌జ్ఞానమితి ప్రోక్తమ్ అజ్ఞానం యదతో௨న్యథా ||        12

తనని తాను పొగడుకోకపోవడం, కపటం లేకపోవడం, అహింస, సహనం, సరళత్వం, సద్గురుసేవ, శరీరాన్నీ మనసునూ పరిశుద్ధంగా వుంచుకోవడం, స్థిరత్వం, ఆత్మ నిగ్రహం, ఇంద్రియవిషయాలపట్ల విరక్తి కలిగి ఉండటం, అహంకారం లేకపోవడం, పుట్టుక, చావు, ముసలితనం, రోగం అనేవాటివల్ల కలిగే దుఃఖాన్నీ దోషాన్నీ గమనించడం, దేనిమీదా ఆసక్తి లేకపోవడం, ఆలుబిడ్డలు, ఇళ్ళువాకిళ్ళ పట్ల వ్యామోహం లేకపోవడం, శుభాశుభాలలో సమభావం కలిగి ఉండటం, నామీద అనన్యమూ అచంచలమూ అయిన భక్తి కలిగి ఉండటం, ఏకాంత ప్రదేశాన్ని ఆశ్రయించడం, జనసమూహం మీద ఇష్టం లేక పోవడం, ఆత్మ ధ్యానంలో నిరంతరం నిమగ్నమై ఉండటం, తత్త్వజ్ఞానం వల్ల కలిగే ప్రయోజనాన్ని గ్రహించడం- ఇదంతా జ్ఞానమని చెప్పబడింది. దీనికి విరుద్ధమయింది అజ్ఞానం.

జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యద్ జ్ఞాత్వామృతమశ్నుతే |
అనాదిమత్పరం బ్రహ్మ న సత్తన్నాసదుచ్యతే ||                13

ఏది తెలుసుకోదగ్గదో, దేనిని తెలుసుకొంటే మానవుడు మోక్షం పొందుతాడో, అనాది అయిన ఆ పరబ్రహ్మాన్ని గురించి చెప్తాను. దానిని సత్తనికాని అసత్తనికాని వివరించడానికి వీలులేదు.

సర్వతః పాణిపాదం తత్ సర్వతో௨క్షిశిరోముఖమ్ |
సర్వతః శ్రుతిమల్లోకే సర్వమావృత్య తిష్ఠతి ||                14

అది అంతటా చేతులూ, కాళ్ళూ, తలలూ, ముఖాలూ, చెవులూ కలిగి సమస్త జగత్తునీ ఆవరించి ఉన్నది.

సర్వేంద్రియగుణాభాసం సర్వేంద్రియవివర్జితమ్ |
అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృ చ ||            15

ఆ బ్రహ్మం అన్ని ఇంద్రియాల గుణాలనూ ప్రకాశింపచేస్తున్నా సర్వేంద్రియాలూ లేనిది; దేనినీ అంటకపోయినా అన్నిటికీ ఆధారం; గుణాలు లేనిదైనా గుణాలను అనుభవిస్తుంది.

బహిరంతశ్చ భూతానామ్ అచరం చరమేవ చ |
సూక్ష్మత్వాత్‌తదవిజ్ఞేయం దూరస్థం చాంతికే చ తత్ ||        16

అది సర్వభుతాల వెలపల, లోపల కూడా ఉన్నది; కదలదు, కదులుతుంది; అతిసూక్ష్మస్వరూపం కావడం వల్ల తెలుసుకోవడానికి శక్యంకాదు; అది ఎంతో దూరంలోనూ బాగా దగ్గరలోనూ ఉన్నది.

అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితమ్ |
భూతభర్తృ చ తజ్జ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ ||            17

ఆ బ్రహ్మం ఆకారమంతా ఒకటే అయీనప్పటికీ సర్వప్రాణులలోనూ ఆకారభేదం కలిగినదానిలాగా కనపడుతుంది. అది భూతాలన్నిటినీ పోషిస్తుంది, భుజిస్తుంది, సృజిస్తుంది.

జ్యోతిషామపి తజ్జ్యోతిః తమసః పరముచ్యతే |
జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితమ్ ||    18

అది జ్యోతులన్నింటినీ ప్రకాశింపజేస్తుంది. అజ్ఞానాంధకారానికి అతీతమూ, జ్ఞానస్వరూపమూ, జ్ఞానంతో తెలుసుకోదగ్గదీ, జ్ఞానంతో పొందదగ్గదీ అయి అందరి హృదయాలలో అధిష్ఠించి వున్నది.

ఇతి క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః |
మద్భక్త ఏతద్విజ్ఞాయ మద్భావాయోపపద్యతే ||            19

ఇలా క్షేత్రం, జ్ఞానం, జ్ఞేయం గురించి క్లుప్తంగా చెప్పడం జరిగినది. నా భక్తుడు ఈ తత్త్వాన్ని తెలుసుకుని మోక్షం పొందడానికి అర్హుడవుతున్నాడు.

ప్రకృతిం పురుషం చైవ విద్ధ్యనాదీ ఉభావపి |
వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతిసంభవాన్ ||        20

ప్రకృతి, పురుషుడు- ఈ ఉభయులకీ ఆదిలేదని తెలుసుకో. వికారాలు, గుణాలు ప్రకృతినుంచి పుడుతున్నాయని గ్రహించు.

కార్యకారణకర్తృత్వే హేతుః ప్రకృతిరుచ్యతే |
పురుషః సుఖదుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే ||            21

శరీరం, ఇంద్రియాల ఉత్పత్తికి ప్రకృతే హేతువనీ, సుఖదుఃఖాలను అనుభవించేది పురుషుడనీ చెబుతారు.

పురుషః ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ |
కారణం గుణసంగో௨స్య సదసద్యోనిజన్మసు ||            22

ప్రకృతిలో వుండే పురుషుడు ప్రకృతివల్ల కలిగే గుణాలను అనుభవిస్తాడు. ఆ గుణాలపట్ల కల ఆసక్తిని బట్టే పురుషుడు ఉచ్చనీచ జన్మలు పొందుతాడు.

ఉపద్రష్టానుమంతా చ భర్తా భోక్తా మహేశ్వరః |
పరమాత్మేతి చాప్యుక్తో దేహే௨స్మిన్ పురుషః పరః ||        23

ఈ శరీరంలో అంటీ అంటనట్లుగా ఉండే పరమపురుషుణ్ణి సాక్షి, అనుమతించేవాడు, భరించేవాడు, అనుభవించేవాడు, మహేశ్వరుడు, పరమాత్మ అని చెబుతారు.

య ఏవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైస్సహ |
సర్వథా వర్తమానో௨పి న స భూయో௨భిజాయతే ||                24

ఇలా పురుషుణ్ణి గురించీ, గుణాలతో ఉన్న ప్రకృతిని గురించీ తెలుసుకున్న వాడు ఎలా జీవించినా పునర్జన్మ పొందడు.

ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మనా |
అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే ||                25

ధ్యానయోగంద్వారా కొంతమంది, జ్ఞానయోగం వల్ల మరికొంతమంది, కర్మయోగంతో ఇంకొంతమంది పరమాత్మను తమలో దర్శిస్తున్నారు.

అన్యే త్వేవమజానంతః శ్రుత్వాన్యేభ్య ఉపాసతే |
తే௨పి చాతితరంత్యేవ మృత్యుం శ్రుతిపరాయణాః ||            26

అలా తెలుసుకోలేని మరికొంతమంది, గురువుల ఉపదేశం పొంది ఉపాసిస్తారు. వినడంలో శ్రద్ధ కలిగిన వాళ్ళు కూడా సంసార రూపమైన మృత్యువు నుంచి ముక్తి పొందుతారు.

యావత్సంజాయతే కించిత్ సత్త్వం స్థావరజంగమమ్ |
క్షేత్రక్షేత్రజ్ఞసంయోగాత్ తద్విద్ధి భరతర్షభ ||            27

అర్జునా ! ఈ ప్రపంచంలో పుడుతున్న చరాచరాత్మకమైన ప్రతి వస్తువూ ప్రకృతి పురుషుల కలయిక వలల్నే కలుగుతున్నదని తెలుసుకో.

సమం సర్వేషు భూతేషు తిష్ఠంతం పరమేశ్వరమ్ |
వినశ్యత్స్వవినశ్యంతం యః పశ్యతి స పశ్యతి ||            28

శరీరాలు నశిస్తున్నా తాను నశించకుండా సమస్త ప్రాణులలోనూ సమానంగా వుండే పరమాత్మను చూసేవాడే సరైన జ్ఞాని.

సమం పశ్యన్‌హి సర్వత్ర సమవస్థితమీశ్వరమ్ |
న హినస్త్యాత్మనాత్మానం తతో యాతి పరాం గతిమ్ ||            29

పరమాత్మను సర్వత్రా సమానంగా వీక్షించేవాడు తనను తాను హింసించుకోడు. అందువల్ల అతను మోక్షం పొందుతాడు.

ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః |
యః పశ్యతి తథాత్మానమ్ అకర్తారం స పశ్యతి ||            30

ప్రకృతివల్లనే సమస్త కర్మలూ సాగుతున్నాయనీ, తానేమీ చేయడం లేదనీ తెలుసుకున్నవాడే నిజమైన జ్ఞాని.

యదా భూతపృథగ్భావమ్ ఏకస్థమనుపశ్యతి |
తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా ||                31

వేరువేరుగా కనుపించే సర్వభూతాలూ ఒకే ఆత్మలో వున్నాయనీ, అక్కడనుంచే విస్తరిస్తున్నాయనీ గ్రహించినప్పుడు మానవుడు బ్రహ్మపదం పొందుతాడు.

అనాదిత్వాన్నిర్గుణత్వాత్ పరమాత్మాయమవ్యయః |
శరీరస్థో௨పి కౌంతేయ న కరోతి న లిప్యతే ||                32

అర్జునా! శాశ్వతుడైన పరమాత్మ పుట్టుకలేనివాడూ, గుణరహితుడూ కావడంవల్ల దేహంలో వున్నా దేనికీ కర్త కాడు. కనుక కర్మఫలమేదీ అతనిని అంటదు.

యథా సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే |
సర్వత్రావస్థితో దేహే తథాత్మా నోపలిప్యతే ||                33

అంతటా వ్యాపించివున్నా, సూక్ష్మమైన ఆకాశం దేనినీ అంటనట్లు శరీరమంతటా వున్నా ఆత్మ కలుషితం కాదు.

యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవిః |
క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత ||            34

అర్జునా! సూర్యుడొక్కడే ఈ సమస్త లోకాన్నీ ప్రకాశింపచేస్తున్నట్లే; క్షేత్రజ్ఞుడైన పరమాత్మ క్షేత్రమంతటినీ ప్రకాశింపచేస్తున్నాడు.

క్షేత్రక్షేత్రజ్ఞయోరేవమ్ అంతరం జ్ఞానచక్షుషా |
భూతప్రకృతిమోక్షం చ యే విదుర్యాంతి తే పరమ్ ||            35

ఇలా క్షేత్రక్షేత్రజ్ఞుల భేదాన్ని ప్రకృతి గుణాలనుంచి ప్రాణులు మోక్షం పొందే విధానాన్ని జ్ఞానదృష్టితో తెలుసుకున్నవాళ్ళు పరమపదం పొందుతారు.


ఇలా ఉపనిషత్తులు, బ్రహ్మవిద్య, యోగశాస్త్రం, శ్రీకృష్ణార్జున సంవాదం అయిన శ్రీమద్భగవద్గీతలోని " క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగం" అనే పదమూడవ అధ్యాయం సమాప్తం.




Monday, March 12, 2012

భగవద్గీత-తాత్పర్యసహితం: పన్నెండవ అధ్యాయం




శ్రీమద్భగవద్గీత

పన్నెండవ అధ్యాయం

భక్తియోగం

అర్జున ఉవాచ

ఏవం సతతయుక్తా యే భక్తాస్త్వాం పర్యుపాసతే |
యే చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః || 1

అర్జునుడు: ఇలా నిరంతరం మనస్సు నీ మీదే నిలిపి నిన్ను భజించే భక్తులు ఉత్తములా ? ఇంద్రియాలకు గోచరించని ఆత్మ స్వరూపాన్ని ఆరాధించే వాళ్ళు ఉత్తములా? 

శ్రీ భగవానువాచ

మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్తా ఉపాసతే |
శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః || 2

శ్రీ భగవానుడు: నా మీదే మనసు నిలిపి నిత్యనిష్ఠతో, పరమ శ్రద్ధతో నన్ను ఉపాసించే వాళ్ళే ఉత్తమయోగులని నా ఉద్దేశం.

యే త్వక్షరమనిర్దేశ్యమ్ అవ్యక్తం పర్యుపాసతే |
సర్వత్రగమచింత్యం చ కూటస్థమచలం ధ్రువమ్ || 3

సంనియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః |
తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః || 4

ఇంద్రియాలన్నింటినీ బాగా వశపరచుకుని, సర్వత్రా సమభావం కలిగి, సమస్త భూతాలకూ మేలు చేయడంలోనే సంతోషం పొందుతూ నాశరహితమూ అనిర్వచనీయమూ అవ్యక్తమూ సర్వవ్యాప్తమూ ఊహాతీతమూ నిర్వికారమూ నిశ్చలమూ నిత్యమూ అయిన ఆత్మ స్వరూపాన్ని ఉపాసించేవాళ్ళు నన్నే పొందుతారు. 

క్లేశో௨ధికతరస్తేషామ్ అవ్యక్తాసక్తచేతసామ్ |
అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే || 5

ఆవ్యక్తమైన ఆత్మ స్వరూపాన్ని ఆదరించేవాళ్ళ శ్రమ ఎంతో ఎక్కువ. ఎందువలనంటే శరీరం మీద అభిమానం కలవాళ్ళకు అవ్యక్త బ్రహ్మం మీద నిష్ఠ కుదరటం కష్టసాధ్యం. 

యే తు సర్వాణి కర్మాణి మయి సన్న్యస్య మత్పరాః |
అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే || 6

తేషామహం సముద్ధర్తా మృత్యుసంసారసాగరాత్ |
భవామి నచిరాత్ పార్థ మయ్యావేశితచేతసామ్ || 7

పార్థా ! సమస్త కర్మలూ నాకే సమర్పించి నన్నే పరమగతిగా భావించి ఏకాగ్రతతో నన్ను ధ్యానిస్తూ సేవించే నా భక్తులను, మనసు నా మీదే నిలిపే వాళ్ళను మృత్యుముఖమైన సంసారసాగరం నుంచి అచిరకాలంలోనే నేను ఉద్ధరిస్తాను. 

మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ |
నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః || 8

నా మీదే మనసును బుద్ధిని నిలుపు. ఆ తరువాత తప్పకుండా నీవు నాలోనే నివసిస్తావు.

అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరమ్ |
అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ || 9

ధనంజయా ! అలా మనసు నామీద నిశ్చలంగా నీవు నిలపలేక పోతే అభ్యాసయోగంతో నన్ను పొందడానికి ప్రయత్నించు.

అభ్యాసే௨ప్యసమర్థో௨సి మత్కర్మపరమో భవ |
మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి || 10

అభ్యాసం చేయడంలోనూ అసమర్థుడవైతే నా కోసం కర్మలు ఆచరించు. నాకు ప్రీతి కలిగించే కర్మలు చేయడం వల్ల కూడా నీవు మోక్షం పొందగల్గుతావు.

అథైతదప్యశక్తో௨సి కర్తుం మద్యోగమాశ్రితః |
సర్వకర్మఫలత్యాగం తతః కురు యతాత్మవాన్ || 11

ఇక అదీ చేయలేకపోతే నన్ను ఆశ్రయించి మనోనిగ్రహంతో నీవు చేసే సమస్త కర్మల ఫలాలూ త్యగం చేయి.

శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాద్ధ్యానం విశిష్యతే |
ధ్యానాత్‌కర్మఫలత్యాగః త్యాగాచ్ఛాంతిరనంతరమ్ || 12

అవివేకంతో కూడిన అభ్యాసం కంటే జ్ఞానం మేలు; జ్ఞానం కంటే ధ్యానం ఉత్తమం; ధ్యానం కంటే కర్మఫలత్యాగం మంచిది. ఆ త్యాగం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.  

అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ |
నిర్మమో నిరహంకారః సమదుఃఖసుఖః క్షమీ || 13

సంతుష్టస్సతతం యోగీ యతాత్మా దృఢనిశ్చయః |
మయ్యర్పితమనోబుద్ధిః యో మద్భక్తస్స మే ప్రియః || 14

సమస్త ప్రాణులపట్ల ద్వేషం లేకుండా స్నేహభావం, దయ కలిగి, అహంకార మమకారాలు విడిచిపెట్టి సుఖదుఃఖాలను సమానంగా చుస్తూ, ఓర్పుతో వ్యవహరిస్తూ, నిత్యం సంతృప్తితో, యోగసాధనతో, ఆత్మనిగ్రహంతో, దృఢసంకల్పంతో మనసు, బుద్ధి నాకు అర్పించిన నా భక్తుడు నాకు ఇష్టుడు. 

యస్మాన్నోద్విజతే లోకో లోకాన్నోద్విజతే చ యః |
హర్షామర్షభయోద్వేగైః ముక్తో యః స చ మే ప్రియః || 15

తనవల్ల లోకమూ, లోకం వల్ల తను భయపడకుండా సంతోషం, కోపం, భయం, ఆవేశాలకు వశం కాకుండా ఉండేవాడు నాకు ఇష్టుడు. 

అనపేక్షః శుచిర్దక్షః ఉదాసీనో గతవ్యథః |
సర్వారంభపరిత్యాగీ యో మద్భక్తస్స మే ప్రియః || 16

దేనిమీదా కోరికలు లేనివాడు, పవిత్రుడు, కార్యదక్షుడు, పక్షపాతం లేనివాడు, చీకుచింతా లేనివాడు, ఆడంబర కర్మలన్నింటినీ విడిచిపెట్టినవాడు అయిన నా భక్తుడు నాకు ఇష్టుడు. 

యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి |
శుభాశుభపరిత్యాగీ భక్తిమాన్ యస్స మే ప్రియః || 17

సంతోషం, ద్వేషం లేకుండా దుఃఖం, కోరికలు, శుభాశుభాలు విడిచిపెట్టిన నా భక్తుడంటే నాకు ఇష్టం. 

సమశ్శత్రౌ చ మిత్రే చ తథా మానావమానయోః |
శీతోష్ణసుఖదుఃఖేషు సమస్సంగవివర్జితః || 18

తుల్యనిందాస్తుతిర్మౌనీ సంతుష్టో యేన కేనచిత్ |
అనికేతః స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః ||         19

శత్రువులపట్ల, మిత్రులపట్ల అలాగే మానావమానాలు, శీతోష్ణాలు, సుఖదుఃఖాలు, దూషణభూషణలపట్ల సమభావం కలిగినవాడు, దేనిమీదా ఆసక్తి లేనివాడు, మౌనంగా ఉండేవాడు, ఏ కొద్దిపాటి దొరికినా సంతృప్తి చెందేవాడు, స్థిరనివాసం లేనివాడు,దృఢనిశ్చయం కలిగినవాడు అయిన నా భక్తుడు నాకు ఇష్టుడు.

యే తు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే |
శ్రద్దధానా మత్పరమా భక్తాస్తే௨తీవ మే ప్రియాః || 20

శ్రద్ధతో నన్నే పరమ గతిగా నమ్మి అమృతం లాంటి ఈ ధర్మాన్ని నేను చెప్పినట్లు పాటించే నా భక్తులు నాకు చాలా ఇష్టులు.


ఇలా ఉపనిషత్తులు, బ్రహ్మవిద్య, యోగశాస్త్రం, శ్రీకృష్ణార్జున సంవాదం అయిన శ్రీమద్భగవద్గీతలోని "భక్తియోగం" అనే పన్నెండవ అధ్యాయం సమాప్తం.