శ్రీ భగవానువాచ:
భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః |
యత్తే௨హం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యయా || 1
శ్రీభగవానుడు: నా మాటలు విని ఆనందిస్తున్నావు. కనుక నీ శ్రేయస్సుకోరి శ్రేష్ఠమైన వాక్యం మళ్ళీ చెబుతున్నాను విను.
న మే విదుః సురగణాః ప్రభవం న మహర్షయః |
అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః || 2.
దేవగణాలకుకాని, మహాఋషులకుకాని నా పుట్టుపూర్వోత్తరాలు తెలియవు. దేవతలకూ, మహర్షులకూ అన్నివిధాల ఆదిపురుషుణ్ణి నేనేకావడం దీనికి కారణం.
యో మామజమనాదిం చ వేత్తి లోకమహేశ్వరమ్ |
అసమ్మూఢః స మర్త్యేషు సర్వపాపైః ప్రముచ్యతే || 3
పుట్టుక, ఆది లేనివాడననీ, సమస్త లోకాలకూ ప్రభువుననీ నన్ను తెలుసుకున్నవాడు మనుషులలో వివేకవంతుడై, పాపాలన్నిటినుంచి విముక్తి పొందుతాడు.
బుద్ధిర్జ్ఞానమసమ్మోహః క్షమా సత్యం దమః శమః |
సుఖం దుఃఖం భవో௨భావో భయం చాభయమేవ చ || 4
అహింసా సమతా తుష్టిః తపో దానం యశో௨యశః |
భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విధాః || 5
బుద్ధి, జ్ఞానం, మోహం లేకపోవడం, సహనం, సత్యం, బాహ్యేంద్రియ అంతరింద్రియ నిగ్రహం, సుఖం, దుఃఖం, జననం, మరణం, భయం, నిర్భయం, అహింస, సమదృష్టి, సంతుష్టి, తపస్సు, దానం, కీర్తి, అపకీర్తి వంటి వివిధ భావాలు ప్రాణులకు వాటివాటి కర్మానుసారం నా వల్లనే కలుగుతున్నాయి.
మహర్షయః సప్త పూర్వే చత్వారో మనవస్తథా |
మద్భావా మానసా జాతా యేషాం లోక ఇమాః ప్రజాః || 6
సప్తమహర్షులూ, సనకసనందనాది నలుగురు ప్రాచీనమునులూ, మనువులూ నా సంకల్పబలం వల్లనే నా మానస పుత్రులుగా పుట్టారు. వాళ్ళనుంచే ప్రపంచంలోని ఈ ప్రజలంతా జన్మించారు.
ఏతాం విభూతిం యోగం చ మమ యో వేత్తి తత్త్వతః |
సో௨వికంపేన యోగేన యుజ్యతే నా௨త్ర సంశయః || 7
నా సృష్టి మహిమనూ, యోగశక్తినీ యథార్థంగా ఎరిగినవాడికి నిశ్చయంగా నిశ్చలమైన యోగసిద్ధి కలుగుతుంది.
అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే |
ఇతి మత్వా భజంతే మాం బుధా భావసమన్వితాః || 8
సర్వజగత్తుకూ నేనే మూలకారణమనీ, నా వల్లనే సమస్తం నడుస్తున్నదనీ గ్రహించే బుద్ధిమంతులు నన్ను భక్తిభావంతో భజిస్తారు.
మచ్చిత్తా మద్గతప్రాణా బోధయంతః పరస్పరమ్ |
కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ || 9
అలాంటి భక్తులు మనసులూ, ప్రాణాలూ నాకే అర్పించి నిరంతరం నన్ను గురించి ఒకరికొకరు చెప్పుకుంటూ సంతోషం, పరమానందం పొందుతారు.
తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకమ్ |
దదామి బుద్ధియోగం తం యేన మాముపయాంతి తే || 10
నామీదే మనసు నిత్యం నిలిపి ప్రేమపూర్వకంగా నన్ను సేవించే వాళ్ళకు బుద్ధియోగం ప్రసాదిస్తాను. ఆ జ్ఞానంతో వాళ్ళు నన్ను చేరగలుగుతారు.
తేషామేవానుకంపార్థమహమజ్ఞానజం తమః |
నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వతా || 11
ఆ భక్తులను అనుగ్రహించడం కోసమే నేను వాళ్ళ హృదయాలలో వుండి, అజ్ఞానం వల్ల కలిగిన అంధకారాన్ని, ప్రకాశిస్తున్న జ్ఞానమనే దీపంతో రూపుమాపుతాను.
అర్జున ఉవాచ:
పరం బ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భవాన్ |
పురుషం శాశ్వతం దివ్యమాదిదేవమజం విభుమ్ || 12
ఆహుస్త్వామ్ ఋషయః సర్వే దేవర్షిర్నారదస్తథా |
అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే || 13
అర్జునుడు: నీవు పరబ్రహ్మవనీ, పరంధాముడవనీ, పరమపవిత్రుడవనీ, శాశ్వతుడవనీ, దివ్యపురుషుడవనీ, ఆదిదేవుడవనీ, జన్మలేనివాడవనీ, అంతటా వ్యాపించినవాడవనీ సకల ఋషులూ, దేవర్షి అయిన నారదుడూ, అసితుడూ, దేవలుడూ, వ్యాసుడూ చెబుతున్నారు. స్వయంగా నీవూ నాకు అలాగే చెబుతున్నావు.
సర్వమేతదృతం మన్యే యన్మాం వదసి కేశవ |
న హి తే భగవన్ వ్యక్తిం విదుర్దేవా న దానవాః || 14
కేశవా ! నీవు నాకు చెప్పిందంతా సత్యమని నా సంపూర్ణవిశ్వాసం. దేవతలూ, దానవులూ కూడా నీ నిజస్వరూపం ఎరుగరు.
స్వయమేవాత్మనా௨త్మానం వేత్థ త్వం పురుషోత్తమ |
భూతభావన భూతేశ దేవదేవ జగత్పతే || 15
పురుషోత్తమా ! నీవు సమస్త భూతాలకూ మూలకారణుడవు; అధిపతివి; దేవతలందరకూ దేవుడవు; జగత్తుకంతటికీ నాథుడవు. నిన్ను గురించి నీవే స్వయంగా తెలుసుకుంటున్నావు.
వక్తుమర్హస్యశేషేణ దివ్యా హ్యాత్మవిభూతయః |
యాభిర్విభూతిభిర్లోకానిమాంస్త్వం వ్యాప్య తిష్ఠసి || 16
ఏ మహిమలవల్ల నీవు సకలలోకాలలో వ్యాపించివున్నావో ఆ దివ్య మహిమలన్నిటిగురించీ చెప్పడానికి నీవే తగినవాడవు.
కథం విద్యామహం యోగిన్, త్వాం సదా పరిచింతయన్ |
కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్ మయా || 17
యోగీశ్వరా ! నిరంతరం స్మరిస్తూ నిన్నెలా నేను తెలుసుకోవాలి? ప్రభూ ! నిన్ను ఏయే భావాలతో నేను ధ్యానించాలి?
విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్దన |
భూయః కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే௨మృతమ్ || 18
జనార్దనా ! నీ యోగమహిమ గురించీ, లీలావిభూతిగురించీ వివరంగా నాకు మళ్ళీ చెప్పు. నీ అమృత వాక్యాలను వినేకొద్దీ తనివి తీరడం లేదు.
శ్రీ భగవానువాచ:
హంత తే కథయిష్యామి దివ్యా హ్యాత్మవిభూతయః |
ప్రాధాన్యతః కురుశ్రేష్ఠ నాస్త్యంతో విస్తరస్య మే || 19
శ్రీ భగవానుడు: అర్జునా ! నా దివ్య వైభవాలను గురించి అలాగే చెబుతాను. నా విభూతులకు అంతం లేనందువల్ల ముఖ్యమైన వాటినే వివరిస్తాను.
అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః |
అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవ చ || 20
అర్జునా ! సమస్తజీవుల హృదయాలలో వుండే ఆత్మను నేనే. సర్వ భూతాల ఉత్పత్తి, స్థితి, ప్రళయకారణమూ నేనే.
ఆదిత్యానామహం విష్ణుః జ్యోతిషాం రవిరంశుమాన్ |
మరీచిర్మరుతామస్మి నక్షత్రాణామహం శశీ || 21
నేను ఆదిత్యులలో విష్ణువును; జ్యోతులలో కిరణాలు కలిగిన సూర్యుణ్ణి; మరుత్తులనే దేవతలలో మరీచి అనే వాయువును; నక్షత్రాలలో చంద్రుణ్ణి.
వేదానాం సామవేదో௨స్మి దేవానామస్మి వాసవః |
ఇంద్రియాణాం మనశ్చాస్మి భూతానామస్మి చేతనా || 22
వేదాలలో సామవేదాన్ని ; దేవతలలో ఇంద్రుణ్ణి; ఇంద్రియాలలో మనస్సును; భూతాలలో చైతన్యాన్ని నేనే.
రుద్రాణాం శంకరశ్చాస్మి విత్తేశో యక్షరక్షసామ్ |
వసూనాం పావకశ్చాస్మి మేరుః శిఖరిణామహమ్ || 23
నేను ఏకాదశ రుద్రులలో శంకరుణ్ణి; యక్షులలో, రాక్షసులలో కుబేరుణ్ణి; అష్టవసువులలో అగ్నిని; పర్వతాలలో మేరువును.
పురోధసాం చ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిమ్ |
సేనానీనామహం స్కందః సరసామస్మి సాగరః || 24
పార్థా ! పురోహితులలో ముఖ్యుడైన బృహస్పతిని నేనని తెలుసుకో. సేనాధిపతులలో కుమారస్వామిని నేను. సరస్సులలో నేను సముద్రుణ్ణి.
మహర్షీణాం భృగురహం గిరామస్మ్యేకమక్షరమ్ |
యజ్ఞానాం జపయజ్ఞో௨స్మి స్థావరాణాం హిమాలయః || 25
మహర్షులలో నేను భృగువును; మాటలలో ఓంకారాన్ని; యజ్ఞాలలో జపయజ్ఞాన్ని; కదలని పదార్థాలలో హిమాలయ పర్వతాన్ని.
అశ్వత్థః సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారదః |
గంధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో మునిః || 26
అన్ని వృక్షాలలో అశ్వత్థవృక్షాన్ని; దేవర్షులలో నారదుణ్ణి; గంధర్వులలో చిత్రరథుణ్ణి. సిద్ధులలో కపిలమునిని.
ఉచ్చైఃశ్రవసమశ్వానాం విద్ధి మామమృతోద్భవమ్ |
ఐరావతం గజేంద్రాణాం నరాణాం చ నరాధిపమ్ || 27
గుర్రాలలో అమృతంతో పుట్టిన ఉచ్చైశ్శ్రవాన్ననీ, ఏనుగులలో ఐరావతాన్ననీ, మనుషులలో రాజుననీ నన్ను తెలుసుకో.
ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుక్ |
ప్రజనశ్చాస్మి కందర్పః సర్పాణామస్మి వాసుకిః || 28
ఆయుధాలలో నేను వజ్రాయుధాన్ని; ఆవులలో కామధేనువును; సంతాన కారణమైన మన్మథుణ్ణి; సర్పాలలో వాసుకిని.
అనంతశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహమ్ |
పితౄణామర్యమా చాస్మి యమః సంయమతామహమ్ || 29
నాగులలో ఆదిశేషుణ్ణి; జలదేవతలలో వరుణుణ్ణి నేను. పితృదేవతలలో ఆర్యముణ్ణి; శాసించేవాళ్ళలో యముణ్ణి నేను.
ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహమ్ |
మృగాణాం చ మృగేంద్రో௨హం వైనతేయశ్చ పక్షిణామ్ || 30
నేను రాక్షసులలో ప్రహ్లాదుణ్ణి; లెక్కించేవాళ్ళలో కాలాన్ని; మృగాలలో సింహాన్ని; పక్షులలో గరుత్మంతుణ్ణి.
పవనః పవతామస్మి రామః శస్త్రభృతామహమ్ |
ఝుషాణాం మకరశ్చాస్మి స్రోతసామస్మి జాహ్నవీ || 31
పవిత్రం చేసేవాటిలో గాలిని నేను; ఆయుధధారులలో రాముణ్ణి; జలచరాలలో మొసలిని; నదులలో గంగా నదిని.
సర్గాణామాదిరంతశ్చ మధ్యం చైవాహమర్జున |
అధ్యాత్మవిద్యా విద్యానాం వాదః ప్రవదతామహమ్ || 32
అర్జునా ! సమస్త చరాచరసృష్టికి ఉత్పత్తి, ఉనికి, అంతమూ నేనే. విద్యలలో అధ్యాత్మవిద్యను; వాదించేవాళ్ళలోని వాదాన్ని నేను.
అక్షరాణామకారో௨స్మి ద్వంద్వః సామాసికస్య చ |
అహమేవాక్షయః కాలో ధాతా௨హం విశ్వతోముఖః || 33
అక్షరాలలో ‘అ’ కారాన్ని నేను; సమాసాలలో ద్వంద్వ సమాసాన్ని; నాశనం లేని కాలాన్ని; అన్ని దిక్కులకూ ముఖాలు కలిగిన బ్రహ్మను.
మృత్యుః సర్వహరశ్చాహముద్భవశ్చ భవిష్యతామ్ |
కీర్తిః శ్రీర్వాక్చ నారీణాం స్మృతిర్మేధా ధృతిః క్షమా || 34
సర్వాన్నీ సంహరించే మృత్యువును; కలగబోయే వస్తువులకు మూలాన్ని; స్త్రీలలోని కీర్తి, సంపద, వాక్కు, జ్ఞాపకశక్తి, మేధ, ధైర్యం, ఓర్పు నేనే.
బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ ఛందసామహమ్ |
మాసానాం మార్గశీర్షో௨హమృతూనాం కుసుమాకరః || 35
నేను సామవేదగానాలలో బృహత్సామాన్ని; ఛందస్సులలో గాయత్రిని; మాసాలలో మార్గశిరాన్ని, ఋతువులలో వసంతాన్ని.
ద్యూతం ఛలయతామస్మి తేజస్తేజస్వినామహమ్ |
జయో௨స్మి వ్యవసాయో௨స్మి సత్త్వం సత్త్వవతామహమ్ || 36
మోసగాళ్ళలో జూదాన్ని నేను; తేజోవంతులలో తేజస్సును; విజేతల విజయాన్ని; కృషిసలిపేవాళ్ళ కృషిని; బలవంతుల బలాన్ని నేను.
వృష్ణీనాం వాసుదేవో௨స్మి పాండవానాం ధనంజయః |
మునీనామప్యహం వ్యాసః కవీనాముశనా కవిః || 37
యాదవులలో వాసుదేవుణ్ణి; పాండవులలో అర్జునుణ్ణి నేను; మునులలో వ్యాసుణ్ణి; సూక్ష్మబుద్ధి కలిగినవాళ్ళలో శుక్రాచార్యుణ్ణి.
దండో దమయతామస్మి నీతిరస్మి జిగీషతామ్ |
మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహమ్ || 38
దండించేవాళ్ళలో దండనీతిని; జయించ కోరేవాళ్ళ రాజనీతిని; రహస్యాలలో మౌనాన్ని; జ్ఞానవంతులలో జ్ఞానాన్ని నేను.
యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున |
న తదస్తి వినా యత్స్యాత్, మయా భూతం చరాచరమ్ || 39
అర్జునా ! సకలభుతాలకూ మూలకారణాన్ని నేను. ఈ చరాచర ప్రపంచంలోని వస్తువులలో ఏదీ నేను లేకుండా లేదు.
నాంతో௨స్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప |
ఏష తూద్దేశతః ప్రోక్తో విభూతేర్విస్తరో మయా || 40
పరంతపా ! నా దివ్యవిభూతులకు అంతం లేదు. అయినప్పటికీ క్లుప్తంగా నీకు నా విస్తారమైన విభూతులను వివరించాను.
యద్యద్విభూతిమత్సత్త్వం శ్రీమదూర్జితమేవ వా |
తత్తదేవావగచ్ఛ త్వం మమ తేజో௨0శసంభవమ్ || 41
ఈ లోకంలో ఐశ్వర్యవంతమూ, శోభాయుతమూ, ఉత్సాహభరితమూ అయిన ప్రతివస్తువూ నా తేజస్సులోని ఒక అంశం నుంచే కలిగిందని గ్రహించు.
అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున |
విష్టభ్యాహమిదం కృత్స్నమేకాంశేన స్థితో జగత్ || 42
అర్జునా ! అంతేకాకుండా నా విభూతి వివరాలన్నీ తెలుసుకోవడం వల్ల నీకు ప్రయోజనమేమీలేదు. ఈ సమస్త జగత్తునూ నాలోని ఒక్క అంశంతోనే నిండి నిబిడీకృతమై వున్నానని మాత్రం తెలుసుకో.
ఇలా ఉపనిషత్తులు, బ్రహ్మవిద్య, యోగశాస్త్రం, శ్రీకృష్ణార్జున సంవాదం అయిన శ్రీమద్భగవద్గీతలోని "విభూతియోగం" అనే పదవ అధ్యాయం సమాప్తం.