శ్రీ గీతామాహాత్మ్యం
ధరోవాచ
భగవన్! పరమేశాన! భక్తిరవ్యభిచారిణీ!
ప్రారబ్ధం భుజ్యమానస్య కథం భవతి హే ప్రభో || 1
భూదేవి: భగవంతుడా! పరమేశ్వరా! ప్రభూ! ప్రారబ్ధం అనుభవించేవాడికి అచంచలమైన భక్తి ఎలా కలుగుతుంది?
శ్రీ విష్ణురువాచ
ప్రారబ్ధం భుజ్యమానో௨పి గీతాభ్యాసరతస్సదా |
సముక్త స్స సుఖీ లోకేకర్మణా నోపలిప్యతే || 2
శ్రీమహావిష్ణువు: భూదేవీ! ప్రారబ్ధం అనుభవిస్తున్నా నిరంతరం గీతను అభ్యసించేవాడు లోకంలో ముక్తి పొంది, సుఖపడతాడు; కర్మలకు బద్ధుడు కాడు.
మహాపాపాది పాపాని గీతాధ్యానం కరోతి చేత్ |
క్వచిత్ స్పర్శం న కుర్వంతి నళినీదళ మంభసా || 3
తామరాకును నీరు అంటనట్లే గీతాపారాయణం చేసేవాడిని మహాపాపాలు కూడా ఏ మాత్రమూ అంటవు.
గీతాయాః పుస్తకం యత్ర యత్ర పాఠః ప్రవర్తతే |
తత్ర సర్వాణి తీర్థాని ప్రయాగదీని తత్ర వై || 4
గీతాగ్రంథం వున్నచోట, గీతాపఠనం జరిగేచోట ప్రయాగలాంటి తీర్థాలన్నీ వుంటాయి.
సర్వేదేవాశ్చ ఋషయో యోగినః పన్నగాశ్చయే |
గోపాలా గోపికావా௨పి నారదోద్ధవపార్షదైః
సహాయో జాయతే శీఘ్రం యత్ర గీతా ప్రవర్తతే || 5
గీతాపారాయణం జరిగేచోటకు సర్వదేవతలు, ఋషులు, యోగులు, నాగులు, గోపాలురు, గోపికలు, విష్ణుభక్తులైన నారదుడు, ఉద్ధవుడు మొదలైన వారు వచ్చి తోడ్పడతారు.
యత్ర గీతావిచారశ్చ పఠనం పాఠనం శ్రుతమ్ |
తత్రాహం నిశ్చితం పృథ్వి! నివసామి సదైవ హి || 6
భూదేవీ! గీతను చర్చించడం, చదవడం, బోధించడం, వినడం జరిగే ప్రదేశంలో నేను నిరంతరం నివసిస్తుంటాను.
గీతాశ్రయో௨హం తిష్ఠామి గీతా మే చోత్తమం గృహమ్ |
గీతాజ్ఞానముపాశ్రిత్య త్రీన్లోకాన్పాలయామ్యహమ్ || 7
నాకు ఆశ్రయమూ, ఉత్తమనివాస మందిరమూ గీతాశాస్త్రమే. గీతాజ్ఞానాన్ని బట్టే నేను మూడులోకాలనూ పరిపాలిస్తున్నాను.
గీతా మే పరమా విద్యా బ్రహ్మరూపా న సంశయః |
అర్థమాత్రాక్షరా నిత్యా స్వనిర్వాచ్య పదాత్మికా || 8
నా పరమవిద్య అయిన గీత నాశరహితం, శాశ్వతం, వర్ణనాతీతం. అది బ్రహ్మస్వరూపం, అర్ధమాత్రాస్వరూపం అనడంలో అనుమానం లేదు.
చిదానందేన కృష్ణేన ప్రోక్తా స్వముఖతో௨ర్జునమ్ |
వేదత్రయీ పరానందా తత్త్వార్థజ్ఞాన మంజసా || 9
చిదానందరూపం కలిగిన శ్రీకృష్ణపరమాత్మ అర్జునుడికి స్వయంగా చెప్పిన ఈ గీత మూడువేదాలసారం; పరమానంద స్వరూపం. తనను ఆశ్రయించిన వాళ్ళకిది తత్వజ్ఞానాన్ని తొందరగా కలగజేస్తుంది.
యో௨ష్టాదశ జపేన్నిత్యం నరో నిశ్చలమానసః |
జ్ఞానసిద్ధిం స లభతే తతో యాతి పరం పదమ్ || 10
నిర్మలమైన మనసుతో నిత్యం గీత పద్దెనిమిది అధ్యాయాలనూ పారాయణం చేసేవాడు జ్ఞానసిద్ధి, దానిమూలంగా పరమపదమూ పొందుతాడు.
పాఠే௨సమర్థస్సంపూర్ణే తదర్ధం పాఠమాచరేత్ |
తదా గోదానజం పుణ్యం లభతే నాత్ర సంశయః || 11
గీతను పూర్తిగా చదవలేనివాళ్ళు దానిలో సగమైనా చదివితే గోదానంవల్ల కలిగే పుణ్యఫలం తప్పకుండా దక్కుతుంది.
త్రిభాగం పఠమానస్తు గంగాస్నానఫలం లభేత్ |
షడంశం జపమానస్తు సోమయాగఫలం లభేత్ || 12
గీతలో మూడవభాగం—ఆరు అధ్యాయాలు పారాయణం చేసేవాళ్ళకు గంగాస్నానంవల్ల కలిగే ఫలమూ, ఆరవభాగం—మూడు అధ్యాయాలు పఠించేవాళ్ళకు సోమయాగం చేయడం ద్వారా లభించే ఫలమూ ప్రాప్తిస్తాయి.
ఏకాధ్యాయం తు యో నిత్యం పఠతే భక్తిసంయుతః |
రుద్రలోకమవాప్నోతి గణోభూత్వావసే చ్చిరమ్ || 13
భక్తితో నిత్యమూ ఒక అధ్యాయాన్ని చదివేవాడు రుద్రలోకం చేరి, అక్కడ ప్రమథగణాలలో ఒకడిగా చిరకాలం జీవిస్తాడు.
అధ్యాయ శ్లోకపాదం వా నిత్యం యః పఠతే నరః |
స యాతి నరతాం యావత్ మనుకాలం వసుంధరే || 14
భూదేవీ! ఒక అధ్యాయంలోని నాలుగో భాగమైనా ప్రతీరోజూ పారాయణం చేసేవాడు ఒక మన్వంతరకాలం మానవజన్మ పొందుతాడు.
గీతయాః శ్లోకదశకం సప్త పంచ చతుష్టయమ్ |
ద్వౌ త్రీనేకం తదర్ధం వా శ్లోకానాం యః పఠేన్నరః || 15
చంద్రలోకమవాప్నోతి వర్షాణామయుతం ధ్రువమ్ |
గీతాపాఠసమాయుక్తో మృతో௨మానుషతాం వ్రజేత్ || 16
గీతలలోని శ్లోకాలు –పది, ఏడు, ఐదు, నాలుగు, మూడు, రెండు, ఒకటికాని, ఆఖరుకి అర్ధశ్లోకంకాని అనుదినం పఠించేవాడు పదివేల సంవత్సరాలు చంద్రలోకంలో సుఖజీవనం సాగిస్తాడనడంలో సందేహం లేదు. గీతాపారాయణం చేస్తూ మరణించేవాడికి దేవత్వం కలుగుతుంది.
గీతాభ్యాసం పునః కృత్వా లభతే ముక్తిమత్తమామ్ |
గీతేత్యుచ్చారసంయుక్తో మ్రియమాణో గతిం లభేత్ || 17
గీతాధ్యయనం మళ్ళీమళ్ళీ చేసే మానవుడు ఉత్తమమైన పరమపదం పొందుతాడు. గీతను స్మరిస్తూ ప్రాణాలు విడిచిపెట్టేవాడికి ఉత్తమగతి లభిస్తుంది.
గీతార్థశ్రవణాసక్తో మహాపాపయుతో௨పి వా |
వైకుంఠం సమవాప్నోతి విష్ణునా సహ మోదతే || 18
గీతార్థాన్ని వినడంలో ఆసక్తి కలిగినవాడు—ఎలాంటి మహాపాపి అయినప్పటికీ వైకుంఠానికి వెళ్ళి అక్కడ విష్ణువుతో పాటు ఆనందం అనుభవిస్తాడు.
గీతార్థం ధ్యాయతే నిత్యం కృత్వా కర్మాణి భూరిశః |
జీవన్ముక్తస్స విజ్ఞేయో దేహాంతే పరమం పదమ్ || 19
నిత్యమూ అనేక కర్మలు ఆచరిస్తున్నా గీతార్థాన్ని ధ్యానించేవాడు జీవన్ముక్తుడై మరణానంతరం మోక్షం పొందుతాడు.
గీతామాశ్రిత్య బహవో భూభుజో జనకాదయః |
నిర్ధూతకల్మషా లోకే గీతా యాతాః పరంపదమ్ || 20
గీతాశాస్త్రాన్ని ఆశ్రయించే ఈ లోకంలో జనకుడు లాంటి రాజఋషులు ఎంతో మంది పాపవిముక్తి పొంది, పరమపదం చేరుకోగలిగారు.
గీతయాః పఠనం కృత్వా మాహాత్మ్యం నై వ యః పఠేత్ |
వృథా పాఠో భవేత్తస్య శ్రమ ఏవ హ్యుదాహృతః || 21
గీతాపఠనం చేశాక మాహాత్మ్యం చదవనివాడి పారాయణం వృధాప్రయాస మాత్రమే.
ఏతన్మాహాత్మ్యసంయుక్తం గీతాభ్యాసం కరోతి యః |
స తత్ఫలమవాప్నోతి దుర్లభాం గతిమాప్నుయాత్ || 22
మాహాత్మ్యంతోసహా గీతాపారాయణం చేసేవాడికి పైన చెప్పిన ఫలంతోపాటు ఉత్తమగతి కూడా లభిస్తుంది.
సూత ఉవాచ
మాహాత్మ్యమేతద్గీతయాః మయా ప్రోక్తం సనాతనమ్ |
గీతాన్తే చ పఠేద్యస్తు యదుక్తం తత్ఫలం లభేత్ || 23
సూతుడు: శౌనకాది మహర్షులారా ! సనాతనమైన గీతామాహాత్మ్యాన్ని ఇలా మీకు తెలియజేశాను. గీతాపారాయణం చేశాక దీన్ని చదివినవాడికి పైన చెప్పిన ఫలం దక్కుతుంది.
ఇలా శ్రీ వరాహపురాణంలోని “శ్రీ గీతామాహాత్మ్యం” సమాప్తం.
No comments:
Post a Comment