మూడుతరాల బానిసత్వం
తొలితరం బానిసత్వం ఆఫ్రికన్లకు పరిమితమయ్యింది. ఆఫ్రికా ఖండంలోని నల్లజాతి ప్రజలను అన్యాయంగా, దౌర్జన్యంగా బంధించి అమెరికా తీసుకుపోయి, అక్కడ వారిని సంతలో పశువులను అమ్మినట్లుగా అమ్మితే, కొన్నవారు వారికి ఏమీ చెల్లించకుండా కేవలం బ్రతకడానికి (చావకుండా ఉండటానికి) ఇంత తిండి పెడుతూ, ఎదురు తిరిగితే తీవ్రంగా శిక్షిస్తూ, వారితో జీవితాంతం వెట్టి చాకిరీ చేయించుకునేవారు. తమ యజమాని చెప్పిన పనిని చేయడం తప్ప వారికి ఎలాంటి హక్కులు ఉండేవి కావు.
ఇంతటి అమానుషమైన బానిస వ్యవస్థను రద్దుచేయాలనే డిమాండ్ చివరికి అమెరికాలో అంతర్యుద్ధానికి (Civil War) దారితీస్తే, అబ్రహాం లింకన్ ఈ వ్యవస్థను రద్దుచేసి, అమెరికాలోని నల్లజాతివారందరికీ విముక్తిని ప్రసాదించాడు. అమెరికాలో ఇప్పుడు మనం చూస్తున్న నల్లవారిలో ఎక్కువమంది వారి సంతతే.
నల్లజాతీయుల బానిస వ్యవస్థ రద్దవడంతో తెల్లవారి దేశాలలో, వారి వలసలలో (Colonies) శ్రామికుల కొరత ఏర్పడింది. ఆ కొరతను పూడ్చడానికి మలితరం బానిసత్వం మొదలైనది. దాని పేరే ఒప్పంద శ్రామిక (Contract Labour) వ్యవస్థ. భారతదేశం లాంటి వలస పాలిత దేశాలు దీనికి వేదిక అయ్యాయి.
తెల్లవారి దేశాలలో, వారి వలసలలో పనిచేయడానికి నిర్బంధ విధానంలో కాకుండా, ఒక ఒప్పందాన్ని (Contract) కుదుర్చుకుని, వారిని ఆయాదేశాలకు తీసుకుపోయి పనిచేయించుకునేవారు. నల్లజాతి వారిలా కాకుండా, వీరికి మాత్రం చేసినపనికి ప్రతిఫలం చెల్లించేవారు. భారతదేశంలాంటి దేశాలలోని పేదప్రజల సగటు ఆదాయం కన్నా అది ఎక్కువగా ఉండటంతో, చాలామంది పేదప్రజలు ఒప్పంద కార్మికులుగా మారి, ఆయా దేశాలకు వలసవెళ్ళి, కాలక్రమంలో అక్కడే స్థిరపడిపోయారు.
రెండవ ప్రపంచ యుద్ధానంతర పరిణామాలలో వలసలన్నీ స్వాతంత్ర్యాన్ని పొందడంతో ఈ వ్యవస్థ కూడా దానంతటదే కనుమరుగైపోయింది. ఇప్పుడు వివిధ దేశాలలో మనం చూస్తున్న భారతజాతి ప్రజలలో ఎక్కువమంది ఆ ఒప్పంద కార్మికుల సంతతే.
ఒప్పంద కార్మిక వ్యవస్థ అంతరించిన పిమ్మట మూడవతరం బానిసలు తలయెత్తారు. వారే Willing Employees. వీరిని ఎవరూ బలవంత పెట్టరు..., ఎవరూ వీరితో ఒప్పందం చేసుకోరు. తమంతట తామే ...అధిక సంపాదన కొరకూ, ఉన్నత జీవన ప్రమాణాలకొరకూ ఇష్టపూర్వకంగా తరలివెళతారు.
ఇది కాలక్రమంలో పెరిగి పెరిగి, ఇప్పుడు పెద్దయెత్తున కొనసాగుతున్నది. వీరు ప్రపంచంలోని అన్ని దేశాలనుండి తలయెత్తినా ముఖ్యంగా చైనా, భారత్ లాంటి ఆసియా దేశాల నుండి అధిక సంఖ్యలో ఉన్నారు. వీరు తమ తమ దేశాలలోనే చదువు పూర్తి చేసుకొని, ఉద్యోగం నిమిత్తం అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా మొదలైన ధనిక దేశాలకు వలస వెళ్ళతారు. వీరిలో కొందరు తిరిగి వస్తారు; అధిక సంఖ్యాకులు మాత్రం అక్కడే స్థిరపడతారు.
ఈ 3G Slavery ఇంకెంత కాలం కొనసాగుతుందో, ఎప్పుడు అంతరిస్తుందో కాలమే చెప్పాలి.